ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వెనకడుగు వద్దు!

ABN, Publish Date - Nov 09 , 2024 | 07:01 AM

వాతావరణ మార్పుపై మానవ పోరాటానికి ఉద్దేశించిన సభ్యదేశాల మహాసదస్సు (కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌–కాప్‌) సోమవారం నుంచి అజర్‌బైజాన్‌ రాజధాని బాకులో ఆరంభమవుతోంది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఏటా జరిగే ఈ సదస్సుకు ముందు ఏవో అద్భుతాలు

వాతావరణ మార్పుపై మానవ పోరాటానికి ఉద్దేశించిన సభ్యదేశాల మహాసదస్సు (కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌–కాప్‌) సోమవారం నుంచి అజర్‌బైజాన్‌ రాజధాని బాకులో ఆరంభమవుతోంది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఏటా జరిగే ఈ సదస్సుకు ముందు ఏవో అద్భుతాలు జరిగిపోతాయన్న భ్రమ కలుగుతూనే ఉంటుంది. దేశాల నాయకులు, పారిశ్రామికవేత్తలు, పర్యావరణవేత్తలు, ఉద్యమకారులు, మరోపక్క మాడిపోతున్న, ములిగిపోతున్న దేశాల నుంచి వచ్చే నిరసనకారులతో ఓ పదిరోజులపాటు అజర్‌బైజాన్‌ కళకళలాడబోతోంది. వేడెక్కుతున్న ధరిత్రిని కాప్‌ సదస్సు కాపాడుతుందని, కాస్తంత మనసుపెట్టి, నిర్దిష్టమైన నిర్ణయాలతో మనిషి మనుగడకు మార్గం చూపుతుందన్న నమ్మకం ఏటా ఎంతోకొంత ఉండేది. కానీ, ఈ సదస్సుకు కొద్దిరోజుల ముందు అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్‌ ఎన్నికై, ఆ కాస్త ఆశని కూడా ఈ మారు ప్రపంచానికి మిగలనివ్వలేదు.

పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పు వంటి మాటలు ట్రంప్‌కు నచ్చవు. అవన్నీ పర్యావరణవేత్తలుగా చెప్పుకుంటున్నవారు చేస్తున్న శుష్కమైన వాదనలని ఆయన నమ్మకం. ధరిత్రి వేడెక్కడం, ప్రకృతికోపించడం వంటి మాటలు నమ్మితే తనబోటి, తోటి పారిశ్రామికవేత్తలకు ఎంత నష్టమో ఆయనకు తెలుసు. పర్యావరణ పరిరక్షణకోసం తపిస్తున్నవారికీ, భూమిని కాపాడుకోవడానికి కృషిచేస్తున్నవారికీ ఆయన ఎన్నిక ఒక ప్రమాదకర హెచ్చరిక. వాతావరణమార్పు మీద ట్రంప్‌ తన తొలివిడత పాలనలో ఎంతటి వ్యతిరేక వైఖరి తీసుకున్నారో తెలిసిందే. పారిస్‌ ఒప్పందం అమెరికా శత్రువని ఆయన ప్రకటించాడు. భారత్‌, చైనా వంటి దేశాలను ఇష్టారాజ్యంగా శిలాజ ఇంధనాలను వాడుకోనిచ్చి, అమెరికాకు మాత్రమే ఈ డాక్యుమెంట్‌ ఉరితాళ్ళు వేస్తున్నదని విమర్శించాడు. అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా, దానికి అన్యాయం చేస్తున్న ఈ ఒప్పందంనుంచి వైదొలగాలని నిర్ణయించాడు. డ్రిల్‌...డ్రిల్‌..డ్రిల్ అన్న ఒకే ఒక్క నినాదంతో ఆయన తన విధానం ఏమిటో తేల్చేశాడు. ఆ తరువాత జో బైడెన్‌ అధికారంలోకి రాగానే ఆ నిర్ణయాన్ని తిరగదోడిన మాట వాస్తవమే కానీ, తాను మళ్ళీ అధికారంలోకి రాగానే తిరిగి అదే పని చేస్తానని ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించాడు. ఇరాన్‌తో పాశ్చాత్య దేశాలు చేసుకున్న అణు ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌ కోసం కాలదన్ని ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టేసిన ట్రంప్‌, పారిస్‌ ఒప్పందాన్ని మళ్ళీ కాదనడం ఖాయం. క్లైమేట్‌ ఫైనాన్స్‌ అంటే అమెరికా కష్టపడి సంపాదించిన సొమ్మును వేరొకరి చేజేతులా ధారపోయడమని ఆయన నిర్వచనం.


అభివృద్ధి చెందుతున్న దేశాలకు నిధులు సమకూర్చడం, నష్టాలను భర్తీచేయడం, ఉద్గారాలను నియంత్రించుకోవడం వంటి పలు అంశాల్లో గత ఏడాది దుబాయ్‌ సదస్సులో అడుగు ముందుకుపడింది. గతాన్ని సమీక్షించుకోవడం మీద అది శ్రద్ధపెట్టినందువల్ల, భవిష్యకార్యాచరణ చర్చ విస్తృతంగా జరిగింది. మూడుదశాబ్దాల కాప్‌ సదస్సుల చరిత్రలో శిలాజ ఇంధనాలు అన్న పదం సంయుక్త ప్రకటనలో చేరడం అదే తొలిసారి. 2050కల్లా వాటి వినియోగాన్ని దశలవారీగా వదులుకుంటూ సున్నా చేయాలని సంకల్పం చెప్పుకుంది. పారిస్‌ సదస్సు తీర్మానించిన ప్రకారం భూ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయడానికి వీలుగా కర్బన ఉద్గారాలను వేగంగా తగ్గించుకోవాలని, 2050కల్లా తటస్థత సాధించాలని ఆ సదస్సు నిర్ణయించింది. తదనుగుణంగా వ్యూహాలు, విధానాలు రాసుకుంటానని అమెరికా కూడా హామీ ఇచ్చింది. ప్రధానంగా ధనికదేశాల దురాశే వాతావరణ మార్పులకు, తద్వారా పేదదేశాలకు సంభవించే నష్టాలకు కారణం కనక, వాటిని ఆదుకొనే నిధి విషయంలోనూ ఈ సదస్సు తొలిరోజునే ప్రశంసనీయమైన అడుగువేసింది. ‘లాస్‌ అండ్‌ డామేజ్‌’ నిధికి హామీపడిన మేరకు ధనికదేశాలు నిధులు సమకూర్చని మాట నిజమే కానీ, 2030కల్లా ఏటా వందబిలియన్‌ డాలర్లు సమకూర్చుకోవాలన్న కొత్త లక్ష్యం నెరవేరితే పేదదేశాలకు ఈ నిధి కచ్చితంగా మేలుచేస్తుంది. ధరిత్రిని రక్షించుకొనే విషయంలో అజర్‌బైజాన్‌ సదస్సులో మరిన్ని నిర్దిష్టమైన అడుగులుపడతాయని నమ్ముతున్న తరుణంలో, ట్రంప్‌ మరో రాకడ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. మరో నాలుగేళ్ళపాటు అమెరికా ఏ గట్టున ఉండబోతున్నదో ఎలాగూ తెలిసిపోయింది కనుక, యూరోపియన్‌ యూనియన్‌, చైనా, ఇండియా, అభివృద్ధి చెందుతున్న దేశాలు చేయీచేయీ కలిపి లక్ష్యాల సాధన దిశగా కృషిచేయడం అవసరం.

Updated Date - Nov 09 , 2024 | 07:01 AM