ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రైతుకు పట్టం కట్టిన ప్రభుత్వం

ABN, Publish Date - Aug 10 , 2024 | 05:31 AM

వ్యవసాయ కుటుంబంలో పుట్టి, వ్యవసాయ రంగ సాధక బాధకాలను అనుభవంతో తెలుసుకున్న వ్యక్తిత్వంతో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలన

వ్యవసాయ కుటుంబంలో పుట్టి, వ్యవసాయ రంగ సాధక బాధకాలను అనుభవంతో తెలుసుకున్న వ్యక్తిత్వంతో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలన సాగిస్తున్నారు. తెలంగాణ సామాజిక వ్యవస్థ నిర్మాణం, భౌగోళిక వాతావరణంపై అవగాహన కలిగిన రేవంత్‌రెడ్డి రైతుకు లబ్ధి చేకూరేవిధంగా ప్రభుత్వ విధివిధానాలను రూపొందించారు. వాటికి అనువుగానే ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జూలై 25న రూ.2,91,191 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకి పెద్దపీట వేశారు. కుటుంబ సభ్యులంతా శ్రమించే చిన్న రైతులు, కుటుంబమంతా శ్రమిస్తూ ఉన్నా చాలినంత భూమిలేని సన్నకారు రైతుల చేతిలో 87శాతం సాగు భూమి ఉంది. వీరికి వ్యవసాయం ఒక పండగ అయ్యేలా ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్‌లో అనేక ఉద్దీపనలను ఇచ్చింది.

2030 వరకు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాలని ఐక్యరాజ్యసమితి నిర్దేశించింది. ఈ లక్ష్యాలలో పేదరికాన్ని, ఆకలిని రూపుమాపటం, చక్కటి ఆరోగ్య జీవనం, నాణ్యమైన విద్య, లింగ సమానత్వం సాధన వంటివి అగ్రశ్రేణి లక్ష్యాలు. వీటిలో మొదటి రెండు లక్ష్యాల సాధనకు వ్యవసాయ రంగ అభివృద్ధి కీలకం. ఈ బడ్జెట్‌లో వ్యవసాయ శాఖకు రూ.26,831 కోట్లను కేటాయించారు. సాగు నీటికి రూ.26,885 కోట్లను కేటాయించారు. మూడో ప్రపంచ దేశాలకు అభివృద్ధికి దిక్సూచీగా, ప్రేరణగా నిలిచే రైతు భరోసా పథకంతోపాటు, ఆపదలో ఆదుకోవడానికి రైతు బీమా పథకం, విప్లవాత్మక రుణమాఫీతో రైతు హృదయ దివిటీగా చరిత్రలో ప్రత్యేక స్థానం పొందారు రేవంత్‌రెడ్డి. ల్యాబ్ టు ల్యాండ్ వెలుగులో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో రైతు వేదికలను అనుసంధానించారు. జీవవైవిద్యంతో కూడిన పంటల సాగుకు, విత్తనోత్పత్తికి కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దనున్నారు. గత పదేళ్ళ పాలనలో జరిగిన మంచిని, అభివృద్ధిని, లోపాలను, వైఫల్యాలను సాపేక్ష దృష్టితో సమీక్షించి మరిన్ని జనహిత పథకాల రూపకల్పన చేస్తున్నారు.


సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో మూడవది అన్ని వయసుల వారికీ ఆరోగ్యకరమైన జీవనం. తెలంగాణాలోని ఐదు వేలకు పైగా ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో భారత ప్రజారోగ్య ప్రమాణాల సంస్థ నిర్దేశించిన నిబంధనల వెలుగులో సదుపాయాలను కల్పించారు. ఇందుకు బడ్జెట్‌లో రూ.11,468కోట్లు కేటాయించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచారు. విద్యా వైద్య సంస్థలలో అండర్‌ గ్రాడ్యుయేట్, పోస్ట్‌ గ్రాడ్యుయేట్ సీట్లను పెంచారు. టీచింగ్ స్టాఫ్ నియామకాలు చేపడుతున్నారు. సుస్థిరాభివృద్ధి నాలుగవ లక్ష్యమైన నాణ్యతగల విద్యను అందించడం కోసం ఈ బడ్జెట్‌లో రూ. 21,389 కోట్ల నిధులను కేటాయించారు. విద్యకు ప్రాతిపదిక సూచీలైన 7-–14 ఏండ్ల మధ్య అక్షరాస్యతలో 90.56 శాతాన్ని, 15–24 ఏండ్ల మధ్య 86.97 శాతాన్ని సాధించి, జాతీయ సగటు కంటే ఎక్కువగా తెలంగాణ సాధించిన ప్రగతిని మరింత ముందుకు తీసుకుపోయేందుకు కృషి చేస్తున్నారు.

సుస్థిరాభివృద్ధి ఐదవ లక్ష్యం లింగ సమానత్వం. ఈ దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం మహిళా జన జీవితాలలో అనూహ్య మార్పును తీసుకువచ్చింది. ఉచిత రవాణాతో శ్రామిక రంగంలో మహిళల వాటా పెరిగింది. ఉచిత రవాణకు రూ.723 కోట్ల నిధులను ఇచ్చారు. గృహజ్యోతి, సబ్సిడీ సిలెండర్‌లతో మహిళా జీవితాలలో వెలుగును నిండింది. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖకు రూ.2,736 కోట్ల నిధులను ఇచ్చారు. అంగన్‌వాడిలలో ప్రీప్రైమరీ తరగతులకు రూపకల్పన చేసారు.

తెలంగాణా జనాభాలో వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ జాతులు, మతపరమైన మైనారిటీలు 85శాతం ఉన్నారు. ఈ వర్గాల ఉన్నతి కోసం సామాజిక సమతుల్యత కోసం బడ్జెట్‌లో రూ.33వేల కోట్లు ఇచ్చారు. చారిత్రక నగరి హైదరాబాద్‌ అభివృద్ధి కోసం పలు రూపాలలో పలు పథకాలకు రూ.18 వేల కోట్ల నిధులు ఇచ్చారు. విపత్తుల నష్టనివారణ కోసం ‘హైడ్రా’ సంస్థను ఏర్పాటు చేసారు. మున్సిపాలిటీల కోసం రూ.15,594కోట్లు కేటాయించారు.

ప్రజా ఎజెండాయే తన ఆత్మగా భావిస్తూ, జాతీయోద్యమ, నవ భారతాన్ని ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ తాత్వికతను నింపుకుని, రేవంత్‌రెడ్డి తెలంగాణకు సుపరిపాలను అంది‍స్తున్నారు. భారత ప్రథమ ప్రధాని నెహ్రూ ఆగస్ట్ 15, 1947నాడు ఎర్రకోట మీద చేసిన చారిత్రాత్మక ప్రసంగం ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’లో ‘‘దేశానికి, సమాజానికి సేవ చేయడమంటే పేదరికం, అజ్ఞానం, అనారోగ్యం, అవకాశాలలో అసమానతను అంతం చేయడమే’’ అన్నారు. ఈ వారసత్వ కొనసాగింపునకు ఈ బడ్జెట్ ఎంతో దోహదం చేస్తుంది.

– అస్నాల శ్రీనివాస్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం

Updated Date - Aug 10 , 2024 | 05:31 AM

Advertising
Advertising
<