ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దెబ్బకు దెబ్బ!

ABN, Publish Date - Oct 30 , 2024 | 05:14 AM

ఇరాన్‌ క్షిపణి దాడికి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసిన ఇజ్రాయెల్‌ అధినేత బెంజమీన్‌ నెతన్యాహూ మూడువారాల తరువాత దానిని నెరవేర్చారు. శనివారం తెల్లవారుజామున, ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాలమీద...

ఇరాన్‌ క్షిపణి దాడికి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసిన ఇజ్రాయెల్‌ అధినేత బెంజమీన్‌ నెతన్యాహూ మూడువారాల తరువాత దానిని నెరవేర్చారు. శనివారం తెల్లవారుజామున, ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాలమీద వందలాది విమానాలతో ఇజ్రాయెల్‌ విరుచుకుపడింది. అక్టోబర్ 1న రెండువందల మిసైళ్ళు ప్రయోగించి, ఇజ్రాయెల్‌ను గతంలో కంటే గట్టిదెబ్బే కొట్టిన ఇరాన్‌కు, ఘాటుగా, ధీటుగా జవాబు చెప్పాలన్న ఒత్తిడి నెతన్యాహూ మీద బలంగా ఉంది. ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టులాంటి చమురు కేంద్రాలను సర్వనాశనం చేయాలని, అణుకేంద్రాలను కూల్చడానికి ఇంతకుమించిన తరుణం ఉండబోదని నెతన్యా‌హూకు మద్దతు ఇస్తున్న మిత్రపక్షాలు వీరంగం వేశాయి. అత్యంత క్లిష్టమైన ప్రాంతాల్లో, నలుదిక్కులా విసిరేసినట్టు ఉన్న ఇరాన్‌ అణుస్థావరాలను దెబ్బతీయడం ఇజ్రాయెల్‌కు కష్టమే కానీ, ఇజ్రాయెల్‌ ప్రతీకారంలో చమురుస్థావరాలు ప్రధానంగా దెబ్బతింటాయని అప్పట్లో విశ్లేషణలు వెలువడ్డాయి.


అయితే, ఎంతో ఆలస్యంగా ప్రతీకారం తీర్చుకున్నప్పటికీ, ఇజ్రాయెల్‌ ఇప్పటి దాడి రక్షణరంగ నిపుణులకు సైతం ఆశ్చర్యం కలిగించింది. కొద్దిమంది సైనికులు తప్ప, ప్రధానంగా పౌరులకు ప్రమాదం వాటిల్లకుండా అనేక గంటలపాటు సాగిన ఈ దాడిలో సైనికస్థావరాలు, ఆయుధాగారాలు బాగా దెబ్బతిన్నాయి. చమురు క్షేత్రాలు, అణుక్షేత్రాల జోలికి ఇజ్రాయెల్‌ పోలేదు. కానీ, క్షిపణి తయారీలో వాడే ఇంధనం ఉత్పత్తి కేంద్రాన్ని ధ్వంసం చేసింది, మిసైల్‌, డ్రోన్‌ తయారీ కేంద్రాలు నాశనమైనాయి. ఇజ్రాయెల్‌ దాడులను తిప్పికొట్టామని, నష్టం నామమాత్రమని ఇరాన్‌ అంటున్నప్పటికీ, ఇజ్రాయెల్‌ దెబ్బకు ఇరాన్‌ మరో రెండేళ్ళవరకూ తన అణుకార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోలేదని కొన్ని విశ్లేషణలు అంటున్నాయి. ఇరాన్‌ గగనతల రక్షణవ్యవస్థ ఎంత బలహీనంగా ఉన్నదో ఈ దాడి తేల్చేసింది. చేతకాక కాదు, ఒక హెచ్చరికగా మాత్రమే ఈ దాడి చేశానని ఇజ్రాయెల్‌ చెప్పదల్చుకున్న విషయం సుస్పష్టం. కానీ, దెబ్బకు దెబ్బ అనే ఈ విషవలయం ఇప్పట్లో ఆగేది కాదు. ఈ ప్రకటిత దాడి పశ్చిమాసియాను మరింత ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టేసింది.


ఇరాన్‌కు శక్తిలేదని కాదు కానీ, అమెరికా అండ, అమ్ములపొదిలో అత్యాధునికమైన ఆయుధాలూ ఉన్న ఇజ్రాయెల్‌తో పోరాడటం ఇరాన్‌కు అంతసులువు కాదు. ఇరాన్‌ను ఆంక్షలతో చుట్టేసి, ఆర్థికంగా నలిపేసి, సొంతంగా హెలికాప్టర్ విడిభాగాలను కూడా తయారుచేసుకోనివ్వని అమెరికా, మరోపక్క ఇజ్రాయెల్‌కు ఎఫ్‌–35 వంటి అధునాతన యుద్ధవిమానాలు ప్రసాదించిన విషయం తెలిసిందే. అమెరికాతో పాటు పశ్చిమ దేశాలన్నీ ఇజ్రాయెల్‌కు కొమ్ముకాస్తుంటే, ఇరాన్‌ పక్షాన రంగంలోకి దిగేందుకు దాని మిత్రదేశాలని అంటున్న చైనా, రష్యాలు సైతం సందేహిస్తున్నాయి. అయినా, ఇటీవల ఇజ్రాయెల్‌ తనకు చేసిన వరుస అవమానాలకు ఇరాన్‌ స్పందించింది. జూలైలో హమాస్‌ పొలిటికల్‌ చీఫ్‌ ఇస్మాయెల్ హనియేను టెహ్రాన్‌లో హత్యచేయడం, మరుసటి నెల హిజ్బొల్లా అధినేత హసన్‌ నస్రల్లాను చంపేయడం వంటి చర్యల ద్వారా ఇరాన్‌ను ఇజ్రాయెల్‌ అవమానించింది, సవాల్‌ విసిరింది. దీనికి ప్రతిగా క్షిపణిదాడులు జరుపుతూ ఇది సంకేతాత్మక చర్య మాత్రమేనని, ఇక చాలునని ఇరాన్‌ ఓ మాటన్నది. అంతమాత్రాన ఇజ్రాయెల్‌ తిరిగి ప్రతీకారం తీర్చుకోకుండా ఉండదు కానీ, ఎంతగా దెబ్బతిన్నప్పటికీ, ఎంతోకొంత తిరిగి దెబ్బతీయగలస్థితిలో ఇరాన్‌ ఉంటుందన్న విషయాన్ని మిగతా ప్రపంచం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇరాన్‌ తలుచుకుంటే అంతర్జాతీయ చమురు సరఫరా వ్యవస్థ సైతం దెబ్బతినిపోవచ్చు. ఇప్పటివరకూ సాగిన పోరాటంలో ఇజ్రాయెల్‌దే పైచేయి అయినమాట నిజం. పాశ్చాత్యదేశాల ఆర్థిక, ఆయుధ సహకారంతో అది ఏకకాలంలో అనేకమంది శత్రువులతో యుద్ధం చేస్తోంది, పైచేయి సాధించింది. గాజాలో ఆరంభమైన యుద్ధాన్ని హమాస్‌, హిజ్బొల్లా, హౌతీల మీదుగా ఇరాన్‌ వరకూ విస్తరించింది. శత్రుశేషం ఉండనివ్వనంటూ ఇజ్రాయెల్‌ ఏడాదికి పైగా సాగిస్తున్న యుద్ధాన్ని ఇలా నిరవధికంగా కొనసాగనివ్వడం ప్రమాదం. ఈ నెల 17న హమాస్‌ అధినేత యాహ్యా సిన్వర్‌ మరణించగానే, ఇజ్రాయెల్‌ ఇక ఈ శుభవార్తతో యుద్ధం ఆపివేయాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఓ మాటన్నారు. కానీ, అటు హమాస్‌, ఇటు ఇజ్రాయెల్‌ పాతపాటే పాడుతూ యుద్ధాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తరువాతైనా ఈ పరిస్థితిలో మార్పువస్తే బాగుండును.

Updated Date - Oct 30 , 2024 | 05:14 AM