గ్యాస్‌చాంబర్
ABN, Publish Date - Nov 16 , 2024 | 05:16 AM
గాలి నాణ్యత ముప్పైఐదున్న వయనాడ్‌నుంచి గ్యాస్‌చాంబర్‌లాగా ఉన్న ఢిల్లీలో ఇప్పుడే అడుగుపెట్టానంటూ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ ట్వీట్ చేశారు. అందులో బాధ ఉన్నదో, బాదుడు ఉన్నదో తెలియదు గానీ,
గాలి నాణ్యత ముప్పైఐదున్న వయనాడ్‌నుంచి గ్యాస్‌చాంబర్‌లాగా ఉన్న ఢిల్లీలో ఇప్పుడే అడుగుపెట్టానంటూ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ ట్వీట్ చేశారు. అందులో బాధ ఉన్నదో, బాదుడు ఉన్నదో తెలియదు గానీ, ఢిల్లీకాలుష్యం ఉచ్ఛస్థితికి చేరి అందరినీ భయపెడుతోంది. పెద్దలు బయటకు రావద్దని, పిల్లలు స్కూలుకుపోవద్దని, టీచర్లు ఆన్‌లైన్‌లోనే పాఠాలు చెప్పాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ప్రతీ ఏటా విద్యాసంస్థలకు సమ్మర్ హాలిడేస్ లాగా పొల్యూషన్ హాలిడేస్ కూడా ముందుగానే క్యాలండర్‌లో నిర్ణయించాల్సిన కాలం సమీపిస్తున్నదేమో. గ్రాప్–3 నిబంధనలను అమలులోకి తెచ్చి భవన నిర్మాణాలనుంచి వాహన వినియోగం వరకూ సమస్తమూ నియంత్రించే ప్రయత్నం సాగుతోంది. మార్నింగ్ వాక్ మానేసి చాలా రోజులైందనో, ఎదురుగా నిలబడినా తాజ్‌మహల్ కనిపించడం లేదనో సుప్రీంకోర్టు నుంచి సామాన్యుడివరకూ బాధపడుతున్నారు. ఢిల్లీలో దిగాల్సిన విమానాలు మరెక్కడో నేలవాలుతున్నాయి, దారికనిపించక రైళ్ళు రాజధానికి ఆలస్యంగా చేరుతున్నాయి. దేశాన్ని ఎక్కడికో తీసుకుపోతున్నామని చెబుతున్న పాలకులు, గాలినాణ్యత అథమస్థాయికి చేరి రికార్డులు రాస్తున్న రాజధానిని మాత్రం దాని ఖర్మానికి వదిలేశారు.
ఢిల్లీలో చాలాప్రాంతాలవారికి సరిగా ఊపిరి అందడంలేదు, కళ్ళు, ముక్కు మండిపోతూ, తీవ్రమైన తలనొప్పితో రాత్రిళ్ళు నిద్రపట్టడం లేదు. నివాసయోగ్యం కాని ప్రాంతంగా ఢిల్లీని ప్రకటించడం ఎంతో దూరంలో లేదని ఓ పర్యావరణ ప్రేమికుడు చేసిన వ్యాఖ్యలో అతిశయోక్తి ఉన్నదేమో కానీ, ఆ ఆగ్రహాన్ని అర్థంచేసుకోవాలి. పలు ప్రాంతాల్లో గాలి నాణ్యతా సూచీ నాలుగువందల యాభై దాటి ఐదువందలను తాకుతూండటం ఆశ్చర్యంతో పాటు బాధ కలిగిస్తుంది. పాలకులు, ప్రజలు కాస్తంత బాధ్యతగా వ్యవహరిస్తే, అత్యున్నతస్థాయి సాంకేతికతలు అందుబాటులో ఉన్న ఈ కాలంలో కాలుష్యంపై యుద్ధం అంతకష్టమేమీ కాదన్నమాట నిజం. ఇదేమీ అకస్మాత్తుగా ముంచుకొచ్చిన కరోనా వంటి రోగం కాదు. ఏటా, మరీముఖ్యంగా శీతాకాలంలో ఢిల్లీ ఇలా ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతూనే ఉంది. ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకంటూ కొన్ని వ్యవస్థలు, విధానాలు కూడా ఏర్పడ్డాయి. పొరుగురాష్ట్రాల్లో పంటవ్యర్థాలను తగలబెట్టడం, ఢిల్లీలో వాహన, పారిశ్రామిక కాలుష్యాలు కలగలసి పరిస్థితిని తీవ్రం చేస్తున్న విషయం తెలిసిందే. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్‌ప్లాన్ (గ్రాప్) వంటి పద్ధతులున్నా, ప్రాణాలమీదకు వచ్చిన పరిస్థితుల్లో, తాత్కాలిక ఉపశమన చర్యలకే ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.
గతంతో పోల్చితే ఢిల్లీ ఇప్పుడు శాశ్వత అత్యయికస్థితిని ఎదుర్కొంటోంది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏడాదిపాటూ చక్కని సమన్వయం కనుక ఉంటే, ఇలా శీతాకాలం సమీపించగానే ఉక్కిరిబిక్కిరి కావాల్సిన అవసరం ఉండదు. ఢిల్లీని కమ్మేస్తున్న పొగమంచుకు హర్యానా, పంజాబ్‌లలో రైతులు సరిగ్గా ఇదేకాలంలో పంటవ్యర్థాలను తగలబెట్టడం ఓ ముఖ్యకారణమవుతున్నప్పుడు అక్కడ ఏ పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయన్నదానితో సంబంధం లేకుండా, ఆ ప్రక్రియను నిలువరించడానికి ఒక నిర్దిష్టమైన ప్రయత్నం జరగాలి. కానీ, కేంద్రంలో, ఢిల్లీలో, హర్యానాలో, పంజాబ్‌లో అధికారంలో ఉన్న పార్టీలను బట్టి రాజకీయయుద్ధం సాగుతూంటుంది. ఒకప్పుడు పంజాబ్‌ను కూడా తప్పుబట్టిన ఆప్, ఇప్పుడు అక్కడ తమ ప్రభుత్వమే ఉన్నందున దానిని వెనకేసుకొస్తూ హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్‌లను విమర్శిస్తున్నది. పంటవ్యర్థాలను తగలబెట్టడం రైతులకు అత్యంత సులువైన, ఆర్థికభారం లేని, ఓ అలవాటైన మార్గం. వారిని దానినుంచి మళ్ళించాలంటే, నిలువరించాలంటే పలురకాలుగా ఆదుకోవాలి. అంతేగానీ, న్యాయస్థానం గట్టిగా విమర్శించగానే పెనాల్టీలు రెట్టింపుచేసి భయపెట్టాలనుకోవడం సరికాదు. వారికి ఆర్థికసాయం, యంత్రసౌకర్యం కల్పించనంతకాలం వ్యర్థాలు ఇలా తగలబడుతూనే ఉంటాయి. వాహన, పారిశ్రామిక కాలుష్యాలు, వివిధ నిర్మాణాలూ కూల్చివేతల విషయంలోనూ ఏడాదిపాటూ వర్తించే సమగ్రమైన విధానం ఉండాలి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వినియోగం విస్తృత ప్రజానీకానికి నిత్యకృత్యం కావాలి. కాలుష్యం ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ ఆదేశాలు అత్యంత బలహీనంగా అమలు కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. తాత్కాలిక ఉపశమన చర్యలకంటే నిర్దిష్టమైన దీర్ఘకాలిక విధానాలతోనే ఢిల్లీ కాలుష్యాన్ని కొంతమేరకు నియంత్రించగలం. ఏటా సర్వోన్నతన్యాయస్థానంతో చీవాట్లు తినడం ప్రభుత్వాలకు కూడా అప్రదిష్ఠ.
Updated Date - Nov 16 , 2024 | 05:16 AM