ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ధనమదం!

ABN, Publish Date - Jul 10 , 2024 | 03:04 AM

ముంబైలోని వర్లీలో మద్యంమత్తులో బీఎండబ్ల్యూకారును అతివేగంగా నడిపి ఒక మహిళను చంపివేసిన మిహిర్‌ షా అనే వ్యక్తిని మంగళవారం పోలీసులు అరెస్టుచేశారు...

ముంబైలోని వర్లీలో మద్యంమత్తులో బీఎండబ్ల్యూకారును అతివేగంగా నడిపి ఒక మహిళను చంపివేసిన మిహిర్‌ షా అనే వ్యక్తిని మంగళవారం పోలీసులు అరెస్టుచేశారు. మూడురోజులుగా పరారీలో ఉన్న అతడిని పట్టుకోవడానికి ఏకంగా పదకొండు పోలీసు బృందాలు రాష్ట్రాన్ని జల్లెడపట్టాల్సివచ్చిందట. ఈ ధనిక యువకుడు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌షిండే వర్గానికి చెందిన రాజేష్‌ షా అనే నాయకుడి కుమారుడు కావడంవల్లనే అరెస్టులో ఇంత తాత్సారం జరిగిందని, ప్రమాదం సమయంలో మద్యం తాగివున్న రుజువులు నాశనం చేయడానికి పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఈ జాప్యం చేశారన్నది విపక్షనేతల ఆరోపణ. ఈ కేసులోనే కాదు, భవిష్యత్తులోనూ ఈ తరహా హిట్‌ అండ్ రన్‌ కేసుల విషయంలో తాను కఠినంగా వ్యవహరిస్తానని, పోలీసుల పనిలో ఎవరిజోక్యమూ లేకుండా చూస్తానని ముఖ్యమంతి్ ఏక్‌నాథ్‌ షిండే ప్రజలకు హామీ ఇస్తున్నారు.


ఇటువంటి ఘటనలను రోడ్డు ప్రమాదాలుగా కాక, ధనమదంతో చేసిన హత్యలుగా అభివర్ణించడం సముచితంగా ఉంటుందేమో. అతి ఖరీదైన, అధిక అశ్వశక్తిగల కార్లు కొనడం, వాటిని విపరీతమైన వేగంతో నడిపి సామాన్యుల ప్రాణాలు తీయడం ఇటీవల తరచుగా జరుగుతోంది. దీనికి మద్యం మత్తుకూడా తోడైనప్పుడు ఎదుటివారి ప్రాణాలు తృణప్రాయమైపోతాయి. వొర్లి ఘటన మనసు కలచివేస్తుంది. ఆదివారం ఉదయం ఐదున్నర సమయంలో నిందితుడు మద్యం మత్తులో కారు అతివేగంగా నడుపుతూ ముందువెళుతున్న స్కూటీని ఢీకొట్టాడు. దీంతో స్కూటీపై ఉన్న దంపతుల్లో భర్త పక్కకు ఎగిరిపడి తీవ్రంగా గాయపడ్డాడు. కానీ, కారుముందుభాగంలో చిక్కుకుపోయిన నలభైఐదేళ్ళ కావేరీ నక్వాను నిందితుడు కిలోమీటరున్నర వరకూ ఈడ్చుకుపోవడంతో ఆమె శరీరం ఛిద్రమై మరణించింది. కారు ఆపమని వేడుకుంటూ భర్త కేకలు వేస్తున్నప్పటికీ వారు లక్ష్యపెట్టలేదు. సంఘటనస్థలానికి చాలా దూరంలో ఆపి, సదరు నిందితుడు, అతడి డ్రైవర్‌ కలసి ఆమె శరీరాన్ని కారునుంచి విడదీశారు. ఆ తరువాత డ్రైవింగ్‌ సీటులో ఉన్న మిహిర్‌ షా స్థానంలోకి పక్కనే ఉన్న డ్రైవర్‌ వచ్చి కూర్చున్నాక కారు మరోమారు కావేరీ నక్వా శరీరంమీద నుంచి పోనిచ్చి అక్కడనుంచి తప్పించుకున్నారు.

తమ స్కూటీని గుద్దిన వెంటనే మిహిర్‌ షా కారు ఆపివుంటే తన భార్య కచ్చితంగా జీవించేదని భర్త గట్టిగా చెబుతున్నాడు. చాలా దూరం కారువెనుక అరుస్తూ, ఏడుస్తూ పరిగెత్తినా మిహిర్‌ మనసు కరగలేదని, ఒక్క క్షణం కారును ఆపివుంటే సరిపోయేదని అతడు అంటున్నాడు.


నిందితుడిని ఇంతకాలమూ దాచిన వారందరినీ పోలీసులు అరెస్టుచేశారు కానీ, మిహిర్‌ అరెస్టులో ఈ సుదీర్ఘజాప్యం వల్ల కేసు బలహీనపడుతుందన్న భయాలైతే ఉన్నాయి. ప్రమాదానికి ముందు అతడు బార్‌లో నలుగురు స్నేహితులతో గడపడం, వేలాది రూపాయలు బిల్లు చెల్లించడం వంటి ఆధారాలున్నప్పటికీ, ప్రమాదం జరిగినప్పుడు మిహిర్‌ షా తాగివున్నాడని, ఆ సమయంలో అతడి శరీరంలో ఇంతమొత్తం ఆల్కహాల్‌ ఉన్నదనే విషయాలు రుజువుచేయడం కష్టంకావచ్చు. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న డ్రైవర్, తానే యాక్సిడెంట్‌ చేశానని దబాయించినపక్షంలో అది అబద్ధమని రుజువుచేయడం కూడా పోలీసులకు కష్టం కావచ్చు.


ఈ దారుణానికి సంబంధించి ఇప్పుడు వినబడుతున్న కథనాలు, పోలీసుల వాదనలూ రేపు న్యాయస్థానాల్లో నిలుస్తాయన్న నమ్మకమేమీలేదు. రెండునెలల క్రితం పూణేలో ఇదే తరహాలో జరిగిన పోర్షే కారు ప్రమాదం దేశాన్ని కుదిపేసింది. రెండుకోట్ల ఖరీదైన లగ్జరీ కారును మద్యం మత్తులో రెండువందలయాభై కిలోమీటర్ల వేగంతో నడుపుతూ ఒక మైనర్ బాలుడు చేసిన ఈ అకృత్యానికి ఇద్దరు యువ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు దుర్మరణం పాలైనారు. రియలెస్టేట్ వ్యాపారి అయిన తండ్రి ఇంకా రిజిస్ట్రేషన్‌ కూడా కాని ఆ కారును కొడుకు చేతుల్లో పెడితే, ఆ మైనర్‌ కుర్రాడు బార్‌లో పూటుగా తాగి ఈ ఘోరానికి కారకుడైనాడు. ఇద్దరిని ఇలా హత్యచేసినప్పటికీ, ఇంకా పిల్లవాడే కనుక ఓ మూడువందల పదాల్లో వ్యాసం రాయించి, జువనైల్‌ బోర్డు బెయిల్‌ మంజూరు చేయడం, ఆ బెయిల్‌ వచ్చేలోగా ఆ కుర్రవాడికి పోలీసులు రాచమర్యాదలు చేయడం వంటి పరిణామాలు సమాజాన్ని దిగ్ర్భాంతికి గురిచేశాయి. ప్రజాగ్రహానికి జడిసి నాయకులూ పోలీసులూ ఆ తరువాత గట్టిగా వ్యవహరించక తప్పలేదు. ఆశ్చర్యకరంగా జువనైల్‌ బోర్డు కూడా తన మనసు మార్చుకుంది. ధనికులు తమ ఖరీదైన కార్లతో సామాన్యుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్న ఘటనలు వేగంగా పెరుగుతున్నాయి. ధనబలం, నిర్లక్ష్యం, ఇతరుల ప్రాణాలపట్ల లెక్కలేనితనంతో పాటు, డబ్బుతో దేనినైనా సాధించగలమన్న ధైర్యం ఈ తరహా ఘటనలకు దోహదం చేస్తున్నమాట నిజం.

Updated Date - Jul 10 , 2024 | 03:04 AM

Advertising
Advertising
<