ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దిగ్విజయోస్తు

ABN, Publish Date - Jul 26 , 2024 | 03:13 AM

విశ్వ క్రీడా సంరంభానికి వేళ అయింది. పారిస్‌ వేదికగా ఒలింపిక్‌ క్రీడలు ప్రారంభమవుతున్నాయి. 1896లో ఫ్రాన్స్‌కు చెందిన పియరీ డీ కోబర్టిన్‌ కృషితో ఏథెన్స్‌ వేదికగా మొదలైన ఆధునిక ఒలింపిక్స్‌...

విశ్వ క్రీడా సంరంభానికి వేళ అయింది. పారిస్‌ వేదికగా ఒలింపిక్‌ క్రీడలు ప్రారంభమవుతున్నాయి. 1896లో ఫ్రాన్స్‌కు చెందిన పియరీ డీ కోబర్టిన్‌ కృషితో ఏథెన్స్‌ వేదికగా మొదలైన ఆధునిక ఒలింపిక్స్‌ ప్రపంచ యుద్ధాల కారణంగా మూడుసార్లు మినహా అప్రతిహతంగా సాగుతూ ఆబాలగోపాలాన్ని అలరిస్తున్నాయి. మానవాళిని వణికించిన కరోనా సమయంలోనూ ఓ ఏడాది వాయిదా పడిందేగానీ రద్దు కాలేదు. వేసవి ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వడం ఫ్రాన్స్‌కిది మూడోసారి. 1900, 1924లలో పోటీలు జరిగాయి. సరిగ్గా శతాబ్దం తర్వాత మళ్లీ ఇప్పుడు వేడుకకు సిద్ధమైంది. 206 దేశాలకు చెందిన సుమారు 10,500 మంది క్రీడాకారులు 32 క్రీడాంశాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో ఉన్నారు. పారిస్‌ క్రీడలకు అక్కడి ప్రభుత్వం భారీ స్థాయిలో 45 వేలమంది పోలీసు, మిలిటరీ బలగాలను రంగంలోకి దించింది. క్రీడల్లో సేవలందించేందుకు మిగతా దేశాలనుంచి 45 వేల మంది వాలంటీర్లు రానున్నారు.


ఈ 17 రోజుల పండుగకు భారత్‌ నుంచి 117 మందితో కూడిన బృందం పారిస్‌కు బయల్దేరింది. 2021లో జరిగిన టోక్యో క్రీడల్లో 122 మందితో వెళ్లిన మన బృందం ఏడు పతకాలు సాధించుకొచ్చింది. ఒలింపిక్‌ క్రీడల చరిత్రలో ఇన్ని పతకాలు మనం ఎన్నడూ సాధించింది లేదు. మొత్తంగా చూస్తే ఈ పోటీల్లో మన స్థానం 48. ఈసారి కనీసం పది పతకాలైనా కొల్లగొడతారని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. జావెలిన్‌ వీరుడు నీరజ్‌ చోప్రా మరోసారి స్వర్ణ భేరీ మోగిస్తాడని అంతా ధీమాగా ఉన్నారు. ఏదైనా సంచలనం జరిగి జావెలిన్‌తోపాటు మరొక్క స్వర్ణం మనకు దఖలు పడితే అవధుల్లేని ఆనందమే. లిఫ్టర్‌ మీరాబాయి చాను, బాక్సర్లు నిఖత్‌ జరీన్‌, లవ్లీనా బోర్గోహైన్‌, బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో సాత్విక్‌ జోడీ, పీవీ సింధు, రెజ్లర్‌ అంతిమ్‌ పంగల్‌, పురుషుల హాకీ జట్టు నుంచి పతకాలు లభించవచ్చునన్నది ఓ అంచనా. ఒలింపిక్స్‌లో 1920లో తొలిసారిగా బరిలోకి దిగింది మొదలు మనం ఇప్పటివరకూ సాధించిన పతకాల సంఖ్య 35. వీటిలో హాకీలోనే 12 మెడల్స్‌ ఉన్నాయంటే, ఇతర క్రీడాంశాల్లో మనం ఎంత వెనుకబడి ఉన్నామో అర్ధమవుతుంది. 1952 హెల్సెంకి క్రీడల్లో కేడీ జాదవ్‌ కుస్తీలో కాంస్యం సాధించే వరకూ మనకు వ్యక్తిగత పతకమే లేదు.


తెలుగు రాష్ర్టాల నుంచి ఈసారి ఎనిమిది మంది పతకాల పరుగులో ఉన్నారు. వీరిలో ఆరుగురు అమ్మాయిలే. పీవీ సింధు, సాత్విక్‌ సాయిరాజ్‌, యర్రాజి జ్యోతి, దండి జ్యోతికశ్రీ, బొమ్మదేవర ధీరజ్‌, నిఖత్‌ జరీన్‌, ఆకుల శ్రీజ, ఇషా సింగ్‌ నుంచి పతకాలు ఆశిస్తున్నారు.

ఆధునిక ఒలింపిక్స్‌ మొదలైనప్పటినుంచీ ఇప్పటిదాకా అమెరికాదే ఆధిపత్యం. నువ్వా నేనా అన్నట్టు రష్యా, చైనా దేశాలు దాని వెన్నంటే ఉంటున్నాయి. గత క్రీడల్లో అమెరికా జట్టు పతకాల పట్టికలో చైనా కంటే ఒక్క స్వర్ణం మాత్రమే ఎక్కువ సాధించింది. ఇక డోపింగ్‌ కారణంగా 202౧ క్రీడల నుంచి, ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా ఈసారి ఒలింపిక్స్‌ నుంచి రష్యాను నిషేధించారు. దీంతో వారంతా రష్యా ఒలింపిక్‌ కమిటీ జెండాకింద ఆడుతున్నారు. 1896 నుంచి 2021 వరకూ పతకాలపై అమెరికా ఒకరకంగా దండయాత్రే చేస్తోంది. మొత్తం 2600 పతకాలతో అగ్రపీఠంపై ఉంది.


గతం సంగతలావుంచితే పారిస్‌లో పలువురు ప్రపంచస్థాయి అథ్లెట్లు మోహరించారు. అమెరికా జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌, కెన్యా మారథాన్‌ రన్నర్‌ కిప్చొగె, అమెరికాకు చెందిన 100, 200 మీటర్ల రన్నర్‌ నోవా లైల్స్‌, స్వీడన్‌ పోల్‌వాల్ట్‌ ఆటగాడు డుప్లాటిస్‌, టెన్నిస్‌ దిగ్గజాలు రఫెల్‌ నడాల్‌, జొకోవిచ్‌, బాస్కెట్‌బాల్‌ స్టార్‌ లెబ్రాన్‌ జేమ్స్‌, జమైకా స్ర్పింటర్‌, మూడుసార్లు ఒలింపిక్‌ చాంపియన్‌ షెల్లీ ఆన్‌ ఫ్రేజర్‌, ఈత కొలను రాణి కేటీ లెడెకీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. రెప్పపాటులో తారుమారయ్యే ఫలితాలు, ప్రపంచ రికార్డులు, ఉత్కంఠభరిత పోరాటాల సమాహారమైన మహా సంగ్రామానికి అంతా సిద్ధమైంది. అంతర్జాతీయ ఆటగాళ్ల అత్యుత్తమ ప్రతిభాపాటవాలను ఆస్వాదిస్తూనే, భారత బృందం పతక వేటలో గత రికార్డుల్ని పటాపంచలు చేయాలని ఆకాంక్షిద్దాం.

Updated Date - Jul 26 , 2024 | 03:14 AM

Advertising
Advertising
<