ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మురుగు మాటలు

ABN, Publish Date - Oct 04 , 2024 | 12:31 AM

మురికినోళ్లను ఫినాయిల్‌తో కడుక్కోవాలని తెలంగాణ అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరికొకరు సలహా ఇచ్చుకుంటున్నారు. ఇంత నీచమైన భాష మాట్లాడతారా అంటూ ప్రశ్నిస్తూనే, అదే నీచమైన...

మురికినోళ్లను ఫినాయిల్‌తో కడుక్కోవాలని తెలంగాణ అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరికొకరు సలహా ఇచ్చుకుంటున్నారు. ఇంత నీచమైన భాష మాట్లాడతారా అంటూ ప్రశ్నిస్తూనే, అదే నీచమైన భాషలో సవాళ్లు విసురుతున్నారు. మూసీనదిని అంటారు కానీ, రాజకీయ శ్రేణులలోనే మురుగునీరు ఉరకలెత్తుతున్నది. శుద్ధి అంటూ చేసుకోవలసి వస్తే, వింటున్న చూస్తున్న ప్రజానీకమే తమ ఆరోగ్యం కోసం ఆ పని చేసుకోవాలి.

కొంతకాలం కిందట తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఇట్లా ఉండేవి కావు. కనీసం, రాజకీయ భాష ఇంత దుర్భాషగా ఉండేది కాదు. మనసుల్లో ఏమి ఉన్నా, జనాంతికంగా ఏమి మాట్లాడినా, వేదికలెక్కినప్పుడు, చట్టసభల్లోను, బహిరంగ స్థలాల్లోనూ పద్ధతిగా మాట్లాడాలని ఒక పట్టింపు ఉండేది. బహుశా, దాన్నే సంస్కారం అని అంటారు. ఎందుకో, ఆ మర్యాదలు తగ్గిపోతూ వచ్చాయి. రాజకీయ ప్రత్యర్థిని విమర్శించడం కాదు, అతను లేదా ఆమె మతాన్ని, కులాన్ని, కుటుంబాన్ని అందరినీ తమ హీన వ్యక్తీకరణల్లోకి లాగడానికి ఇవాళ ఎవరికీ సంకోచాలు ఉండడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో పోయిన ప్రభుత్వ హయాంలో, నాటి అధికారపార్టీ తరఫున ఇద్దరు ముగ్గురు బూతునిపుణులు ఉండేవారు. వాళ్ల పని, అనర్గళంగా వ్యక్తిగతంగా బూతులు తిట్టడమే. సామాజిక మాధ్యమాలలో మాత్రం అక్కడ అధికార పార్టీ, ప్రతిపక్షం అని తేడా ఏమీ లేదు. అందరూ, పోటాపోటీ బూతు వీరులే! రాష్ట్ర అవతరణ తరువాత, తెలంగాణ ముఖ్యమంత్రే, సరిహద్దులు లేని భాషను అధికారభాష చేశారు. అదేమంటే ఇదే ఉద్యమభాష, ప్రాంతపు భాష అంటూ ఉద్యమాన్ని, ప్రాంతాన్ని బదనాం చేశారు. అయితే, కేసీఆర్ భాష పరుషంగాను, కఠినంగాను ఉండేది కానీ, బూతులు ఉండేవి కావు. అమర్యాదగా ఉండేది కానీ, అసభ్యమని చెప్పలేము. కేసీఆర్ అనంతర ప్రభుత్వంలో తెలంగాణ కూడా కొత్త ప్రమాణాలను చేరుకుంది. రెండు రాష్ట్రాల్లోనూ తెలుగువారందరి రాజకీయభాష ఇప్పుడు ఒకే బూతు మాండలికంలోకి దిగింది.


సామాజిక మాధ్యమాలలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్నికల సమయం నుంచి హోరాహోరీ పోరాటం చేస్తున్నాయి. వైరల్ కావడమే ముఖ్యం, జనం నోళ్లలో నానడమే ముఖ్యం. పద్ధతీ పాడూ లేని వేదికల మీద ఎదుటివాళ్ల మీద ఎగబడడమే వ్యూహం. పరాకాష్టకు చేరిన ఆ హీనభాష, క్రమంగా అధికారిక వేదికల మీదికి కూడా ప్రవహించింది. అధికారపార్టీ ముఖ్యనేతలు, ప్రతిపక్షాల అధినేతలు ఇప్పుడు బాహాటంగా విసురుకునే సవాళ్లు, చేసే ఆరోపణలు ఏ పరిమితులనూ పాటించవు. వాటి వాటి సామాజిక మాధ్యమాలకైతే ఇక పట్టపగ్గాలు లేవు. ఈ నేపథ్యంలో భాగమే రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మీద బీఆర్ఎస్ అభిమానులో కార్యకర్తలో మొదలుపెట్టిన ట్రోలింగ్‌. అదొక జులాయి వ్యాఖ్యే అయినా, ఆ జులాయితనం క్షమార్హం కానిది, ఒక స్త్రీ మీద, సీనియర్ రాజకీయ మహిళ మీద, నిన్నటి దాకా తమతో ఉన్న సహచర పార్టీనేత మీద అటువంటి వ్యాఖ్య ఏ మాత్రం సహించలేనిది. అటువంటి క్షీణత తమ పార్టీలోకి ప్రవేశిస్తున్నందుకు బీఆర్ఎస్ కించపడాలి, పార్టీ శ్రేణులలో బలపడుతున్న సంస్కారరాహిత్యాన్ని ఒకసారి సమీక్షించుకోవాలి.


తన మీద జరిగిన అసభ్యతాదాడికి కొండా సురేఖ ప్రతిస్పందన, ఆమెమీద సానుభూతిని కాక, వ్యతిరేకతను ఆహ్వానించింది. కారణం, ఆమె కూడా అదే తరహా సంస్కారంతో స్పందించారు. గాయపడిన మనసుతో ఆమె రాజకీయ ప్రత్యర్థి మీద చేసిన ఆగ్రహ ప్రకటనను అర్థం చేసుకోవచ్చు. కానీ, బాధ్యత కలిగిన ప్రజానాయకురాలిగా ఆమె తన ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడమూ అవసరం. అట్లా ఉండకపోవడమే కాక, ఈ రాజకీయ సంవాదంతో ఏ సంబంధమూ లేని వ్యక్తిని, వ్యక్తులను వ్యక్తిగత అంశాల ప్రస్తావనతో, కించపరిచారు. అవమానకరమైన ఆపాదనలు చేశారు. స్త్రీ అయి ఉండి, స్త్రీల విషయంలో చూపవలసిన సహానుభూతిని విస్మరించారు. వ్యక్తిగత గోప్యత తప్పనిసరిగా గౌరవించవలసిన విలువ అన్నది మరచిపోయారు. సురేఖ వ్యాఖ్యలను సమాజం హర్షించలేదు. తీవ్ర వ్యతిరేకతను చూసి ఆమె వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.


సురేఖపై జరిగిన ట్రోలింగ్‌ను ఖండించి, బీఆర్ఎస్ నేతలు మాటవరసకైనా తాము ఇటువంటి ధోరణులను అంగీకరించబోమని ప్రకటించారు. సురేఖ మాటల్లో వ్యక్తమైన విలువలను తాము అంగీకరించబోమని, ఆమె చేసింది తప్పు అని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఇంతవరకు చెప్పలేదు. చెప్పి ఉంటే, ఆమెను మందలించి ఉంటే ఎంతో గౌరవంగా ఉండేది. సురేఖ కూడా తన మాటలను వెనుకకు తీసుకున్నారు తప్ప, క్షమాపణ అడగలేదు. అడిగి ఉంటే ఎంతో హుందాగా ఉండేది.

రాజకీయ సంవాదాన్ని తీవ్రమైన, పరుషమైన, అసభ్యమైన విలువలతో, ‍భాషతో నింపితే, ఉభయపక్షాల్లోనూ స్త్రీలే బాధితులు అవుతారు. తెలుగు ప్రజలు ఇంతటి తక్కువరకం రాజకీయాలను ఇష్టపడకూడదు. గట్టిగా తమ వ్యతిరేకతను చెప్పాలి.

Updated Date - Oct 04 , 2024 | 12:31 AM