చరిత్ర చూసి చిహ్నాలు ఎంచాలి!
ABN, Publish Date - Jul 06 , 2024 | 04:53 AM
తెలంగాణ తొలి ప్రభుత్వమేమో తెలంగాణ తల్లిని చేతులలో బతుకమ్మ, మక్కంకి పట్టుకున్నట్లు చిత్రించింది. మక్కంకి తెలంగాణ ప్రాంతానికి ఇటీవల కాలంలో వచ్చిందని శాస్త్రజ్ఞుల ప్రాథమిక నిర్ధారణ. పల్లె ప్రజలు తరతరాల కాలం నుంచి ఇటీవలి కాలం వరకు మక్కంకి కంటే ఎక్కువగా జొన్నకంకిని తమ జీవన స్రవంతిలో భాగం
తెలంగాణ తొలి ప్రభుత్వమేమో తెలంగాణ తల్లిని చేతులలో బతుకమ్మ, మక్కంకి పట్టుకున్నట్లు చిత్రించింది. మక్కంకి తెలంగాణ ప్రాంతానికి ఇటీవల కాలంలో వచ్చిందని శాస్త్రజ్ఞుల ప్రాథమిక నిర్ధారణ. పల్లె ప్రజలు తరతరాల కాలం నుంచి ఇటీవలి కాలం వరకు మక్కంకి కంటే ఎక్కువగా జొన్నకంకిని తమ జీవన స్రవంతిలో భాగం చేసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ తల్లి తలపై కాకతీయ శైలి కిరీటాన్ని, దేహంపై కాకతీయ ఆభరణాలను, మూడవ–నాలుగవ చేతులలో అన్నం కుండ – గరిటె పట్టుకుని వడ్డిస్తున్నట్లుగా చిత్రీకరిస్తే చారిత్రక యుగాల ప్రజా–కళా వారసత్వాన్ని గౌరవించినట్లు అవుతుంది.
కాల గణన, ధర్మం, అధికారం, సామూహిక అస్తిత్వం, వ్యాపారం... వీటిని ప్రకటించేందుకు వరుసగా ఋషులు, మతపెద్దలు, రాజులు, సంఘ పెద్దలు, వ్యాపార దిగ్గజాలు ఆయా చారిత్రక యుగాలలో పలుచిహ్నాలను రూపొందించారు. వాటి ద్వారా ఆయా కాలాలకు చెందినవారి విశ్వాసాలు చిరకాలాలు వర్ధిల్లి వారసత్వ సంపదగా మన వరకూ అందివచ్చాయి.
చరిత్రకు తెలిసి మొట్టమొదట ఐదారు వేల సంవత్సరాల క్రితమే సింధూ నాగరికతా కాలంలో ఆనాటి ఋషులు భూభ్రమణం కారణంగా ఆకాశంలో చుక్కలు (నక్షత్రాలు) గమనం చేస్తున్నాయని భావించి ఆ చుక్కల సమూహాలను (వింత) పశువులు / జంతువుల రూపంలో ఊహించి వాటి చిత్రాలను చిహ్నాలుగా ముద్రికలపై గీశారు. అవి ఆయా కాలాల్లో పరిపాలించిన రాజర్షులకు అధికారిక చిహ్నాలు. అదే సింధూ నాగరికతా కాలం నాటికే మనుగడలో ఉన్న ప్రణవ నాద చిహ్నం ఓమ్ లేదా స్వస్తిక తరువాత కాలాలలో జైన మతానుయాయులకు, హిందూ మతస్థులకు పవిత్ర చిహ్నాలయ్యాయి. క్రీ.పూ. ఆరవ శతాబ్దంలో బౌద్ధులు ధర్మచక్రాన్ని తమ చిహ్నంగా గ్రహించారు.
తెలంగాణ విషయానికి వస్తే – దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలో పుట్టిన సాతవాహన సామ్రాజ్యంలో గణ రాజ్యాల చిహ్నాలైన జంతువుల చిహ్నాలతో పాటు పూర్ణకుంభం చిహ్నం ప్రముఖంగా వ్యాప్తిలోకి వచ్చి దక్కను రాష్ట్రాలలో వెయ్యేండ్లకు పైగా ప్రచారంలో ఉంది. సాతవాహనుల తర్వాత వచ్చిన రాజవంశాలు – ఇక్ష్వాకులు, విష్ణుకుండులు, చాళుక్యులు, కాకతీయుల వరకు – పూర్ణకుంభం చిహ్నాన్ని తమ శిల్పాలలో అవిచ్ఛిన్నంగా చెక్కించాయి. (కాబట్టే 1956 నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్ణకుంభాన్ని అధికారిక చిహ్నంగా స్వీకరించింది).
అయితే పూర్ణకుంభానికి సమాంతరంగా విష్ణుకుండులు (క్రీ.శ. 5 – 6 శతాబ్దాలు) లంఘిస్తున్న సింహాన్ని అధికారిక చిహ్నంగా తమ నాణేలపై, కోటగోడలపై చెక్కించారు. వారి తర్వాత అధికారం చేపట్టిన చాళుక్యులు (6 – 8 శతాబ్దాలు) వరాహాన్ని అధికారిక చిహ్నంగా పాటించారు. తమ మాతృ భూమిని వరాహ విషయం (పాలమూరు జిల్లా ప్రాంతం) అని, తమ నాణేలను వరహాలు అని పిలిచారు. వారి అనంతరం యావత్ తెలుగు దేశాన్ని పాలించిన కాకతీయులు (12 – 14 శతాబ్దాలు) లంఘిస్తున్న సింహం చిహ్నంతో పాటు ‘ఆవు–దూడ, ఖడ్గం’ల చిత్రాలను తమ శాసన స్తంభాలపై చెక్కించారు. లంఘిస్తున్న సింహం, ఖడ్గం అధికార/ రాజ దర్పాన్ని ప్రదర్శించగా ఆవు–దూడ పాడి పంటల అభివృద్ధి కాంక్షకు చిహ్నాలుగా నిలుస్తాయి. కాకతీయుల తర్వాత 14, 15 శతాబ్దాలలో తెలంగాణను పాలించిన పద్మనాయకులు భైరవుడ్ని తమ రాజ చిహ్నంగా తాము కట్టించిన కోటగోడలు, గుడి గోపురాల ముందు చెక్కించారు.
అనంతరం తెలుగు రాష్ట్రాలను పాలించిన కుతుబ్ షాహీలు (16, 17 శతాబ్దాలు) బలిష్ట గరుడ చిహ్నాన్ని తమ కోటగోడలపై చెక్కించారు. సామంత రాజులు లంఘిస్తున్న పులులు లేదా సింహాల శిల్పాలను తమ కోటగోడలు, భవంతులు, సనదులు అధికారిక పత్రాలపై చిత్రించుకున్నారు. మొత్తమ్మీద గడచిన రెండు వేల సంవత్సరాల కాలంలో తెలంగాణనేలిన రాజులందరూ అయితే తమ చిహ్నాల వీరత్వాన్ని లేదా దర్పాన్ని లేదా పాడిపంటల సమృద్ధి కాంక్షను ప్రకటించున్నారు.
పైన తెలిపిన చిహ్నాలు కాక సమాంతర కాలాలలో ప్రజలు, ఆయా మతాల పెద్దలు, కొందరు రాజులు కూడా ధర్మస్తంభం లేదా ధ్వజస్తంభాన్ని కూడా తమ విశ్వాస చిహ్నాలుగా ప్రచలితం చేశారు. బృహత్ శిలాయుగపు ప్రజలు రెండు మూడు వేల సంవత్సరాల కిందట పెద్ద పెద్ద నిలువు రాళ్ళను నిలిపారు. ఆ చిహ్నాలు వారి ఆవాస విశ్వాసాలను తెలియజేస్తాయి. జైన మతానుయాయులు మాన స్తంభాలను నిలిపారు. బౌద్ధులు తమ స్థూపాల పైన ఆయక స్తంభాలను, ధర్మ చక్ర స్థంభాలను నిలిపారు. ఇక్ష్వాకుల కాలం (క్రీ.శ. 3వ శతాబ్దం)లో ధేమసేన అనే రాజవైద్యుడు ఇలాంటి ధర్మచక్ర స్తంభాన్ని నిలిపి వేయించిన శాసనం ఇటీవల సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరిలో బయల్పడింది.
వేయేళ్ళ క్రితం ఖమ్మం జిల్లా ప్రాంతం చుట్టు పక్కల ప్రాంతాలను పాలించిన ముదిగొండ చాళుక్యులు బేతాళ ధ్వజం, రావణ ధ్వజాలను పూజించినట్లుగా వారి శాసనాలు ప్రస్తావించాయి. ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న కోయ గిరిజనులు ఇప్పటికీ ప్రపంచ ప్రసిద్ధమైన మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మల గద్దెలపైన దారు స్తంభాలనే ఆ తల్లుల చిహ్నాలుగా ఆరాధిస్తున్నారు. ఇప్పటికీ గోండు, కోలాం, నాయకపోడ్ తదితర గిరిజన తెగల పెద్దల ఇళ్ళ ముందు, వారి గుళ్ళల్లోనూ ధ్వజ స్తంభం ప్రముఖంగా కనిపిస్తుంది. ఇక గోండులు, వారి ఆశ్రిత తెగలైన పర్ధానులు, తోటీలు నాగోబా దేవున్ని ప్రధానంగా ఆరాధిస్తారు. అదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్‌లో ఏటా పెద్ద ఎత్తున జాతర జరుపుతారు. తెలుగు ప్రజలు కూడా నాటి నుంచి నేటి వరకు నాగ ప్రతిమలను ప్రతిష్ఠించడం, పూజించడం గమనార్హం. ప్రస్తుత ముఖ్యమంత్రి, మంత్రి మండలి మేడారం జాతరతోపాటు నాగోబా జాతరలో పాల్గొనడం, ఆ జాతరల చిహ్నాలకు రాష్ట్ర అధికారిక చిహ్నాలలో చోటు కల్పిస్తామనటం వారు రాష్ట్ర గిరిజన సాంస్కృతిక వారసత్వాలకు ఇచ్చే గౌరవ భావాన్ని తెలుపుతుంది.
ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం కాకతీయుల తోరణాన్ని ప్రధాన అధికారిక చిహ్నంగా గ్రహించింది. కానీ కాకతీయులేమో ఆవు–దూడలను, లంఘిస్తున్న సింహం (గజకేసరి) చిత్రాలను తమ అధికారిక/ రాజ చిహ్నాలుగా వాడారు. గజకేసరి చిత్రాన్ని గోండులు ఇప్పటికీ తమ జాతి అధికార చిహ్నంగా వాడుతుండడం గమనార్హం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు తల్లి విగ్రహాన్ని ప్రసిద్ధ తెలంగాణ చిత్రకారులు ఆచార్య కొండపల్లి శేషగిరిరావు తయారు చేస్తే ఆనాటి ఆంధ్ర ప్రాంత పెద్దలు ఆ విగ్రహం తన సౌష్టవాన్ని శృంగారభరితంగా వ్యక్తపరుస్తున్నదని పక్కన పడేశారు. దానితో ఆ విగ్రహాన్ని ఒకప్పుడు నిలిపి ఉంచిన ప్రదేశానికి ‘తెలుగుతల్లి ఫ్లైఓవర్’ అనే పేరు మాత్రమే ఇప్పటికీ మిగిలి ఉంది. వాస్తు నిర్మాణాలలో కూడా స్త్రీ వాస్తు నిర్మాణాలే అందంగా ఉంటాయని కళారాధనా తత్వం ఏ మాత్రం ఉన్నవారైనా అలాంటి నిర్మాణాలనే నిర్మించుకోవడానికి ఉత్సుకత చూపుతుంటారు. మహాకవులు కూడా అమ్మ తల్లులు, దేవతల అంగాంగ సౌష్టవాలను ఇతోధికంగా వర్ణించారు. వారి ఉద్దేశం అశ్లీల భావన కాదు; ఏ పిల్లలైనా తమ తల్లి అంద విహీనురాలు కాకుండా అందమైన ప్రేమమూర్తి అనే భావిస్తారని. ఈ నేపథ్యంలో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ కళాకారుడు ఆచార్య కొండపల్లి శేషగిరిరావు గారి కళాభినివేశాన్ని అగౌరవపరిచినట్లే అర్థమవుతుంది.
తెలంగాణ తొలి ప్రభుత్వమేమో తెలంగాణ తల్లిని చేతులలో బతుకమ్మ, మక్కంకి పట్టుకున్నట్లు చిత్రించింది. మక్కంకి తెలంగాణ ప్రాంతానికి ఇటీవల కాలంలో వచ్చిందని శాస్త్రజ్ఞుల ప్రాథమిక నిర్ధారణ. పల్లె ప్రజలు తరతరాల కాలం నుంచి ఇటీవలి కాలం వరకు మక్కంకి కంటే ఎక్కువగా జొన్నకంకిని తమ జీవన స్రవంతిలో భాగం చేసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ తల్లి తలపై కాకతీయ శైలి కిరీటాన్ని, దేహంపై కాకతీయ ఆభరణాలను, మూడవ–నాలుగవ చేతులలో అన్నం కుండ – గరిటె పట్టుకుని వడ్డిస్తున్నట్లుగా చిత్రీకరిస్తే చారిత్రక యుగాల ప్రజా–కళా వారసత్వాన్ని గౌరవించినట్లు అవుతుంది. కుండ – గరిటె స్థానంలో బోనమెత్తడాన్ని ప్రత్యామ్నాయ ఆలోచనగా స్వీకరించవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వపు అధికారిక చిహ్నం చిరకాలం నిలిచేలా ఉండాలంటే ప్రస్తుత ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ప్రజల కృషి, త్యాగాలు, ప్రజాస్వామ్య కామనలకు విలువివ్వడం సమంజసం. ఐతే పైన ప్రస్తావించినట్లు అనేక చారిత్రక కోణాలను కూడా విశ్లేషించి తుది నిర్ణయం తీసుకోవాలి. అందుకుగాను చరిత్రకారులు, మేధావుల కమిటీని ఒకదానిని నియమించి దాని సూచనల మేరకు అధికార చిహ్నాలను రూపొందిస్తే సకల జనామోదంగా ఉంటుంది.
డా. ద్యావనపల్లి సత్యనారాయణ
Updated Date - Jul 06 , 2024 | 04:54 AM