ట్రంప్ గెలుపు సూచిస్తున్నదేమిటి?
ABN, Publish Date - Nov 09 , 2024 | 07:13 AM
మరో శక్తిమంతమైన నాయకుడు ఎన్నికయ్యాడు. ప్రపంచంలో అతి పురాతన ప్రజాస్వామిక వ్యవస్థ అయిన అమెరికాలో దేశాధ్యక్ష పదవీ ఎన్నికలో డోనాల్డ్ ట్రంప్ కచ్చితమైన, చరిత్రాత్మక విజయం సాధించారు. అమెరికాలో ఎన్నికల ప్రక్రియ న్యాయబద్ధతను ఎవరూ ప్రశ్నించరు, ప్రశ్నించలేరు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయిన డోనాల్డ్ ట్రంప్
మరో శక్తిమంతమైన నాయకుడు ఎన్నికయ్యాడు. ప్రపంచంలో అతి పురాతన ప్రజాస్వామిక వ్యవస్థ అయిన అమెరికాలో దేశాధ్యక్ష పదవీ ఎన్నికలో డోనాల్డ్ ట్రంప్ కచ్చితమైన, చరిత్రాత్మక విజయం సాధించారు. అమెరికాలో ఎన్నికల ప్రక్రియ న్యాయబద్ధతను ఎవరూ ప్రశ్నించరు, ప్రశ్నించలేరు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయిన డోనాల్డ్ ట్రంప్‌కు నియోజక గణం (ఎలెక్టోరల్ కాలేజీ) ఓట్లు 295 లభించగా ఆయన ప్రత్యర్థి, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కు 226 మాత్రమే దక్కాయి. ప్రజల ఓట్లు సైతం అత్యధికంగా ట్రంప్‌కే లభించాయి. ఆయనకు 72.5 మిలియన్ ఓట్లు లభించగా కమలా హారిస్‌కు 68.15 మిలియన్ ఓట్లు దక్కాయి. 2024 ఎన్నికల విజయాలతో రిపబ్లికన్ పార్టీ ప్రాబల్యం మరింతగా పెరిగింది. అమెరికా కాంగ్రెస్ ఎగువ సభ సెనేట్‌లో ఇప్పుడు తిరుగులేని మెజారిటీని రిపబ్లికన్ పార్టీ సాధించుకున్నది. అలాగే దిగువ సభ ప్రతినిధుల సభ కూడా రిపబ్లికన్‌ల నియంత్రణలోనే కొనసాగే అవకాశమున్నది. ఏ ప్రమాణం ప్రకారం చూసినా డోనాల్డ్ ట్రంప్‌కు, రిపబ్లికన్ పార్టీకి సమగ్ర, ఘనమైన విజయం లభించింది.
నవంబర్ 5కు ముందు కొన్ని నెలల నుంచి రోజువారీగా జరిగిన ఓటర్ల సర్వేలు, అధ్యక్ష ఎన్నికల అంతిమ ఫలితాన్ని అంచనా వేయడంలో ఘోరంగా విఫలమయ్యాయి. డోనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య తీవ్ర పోటీ ఉన్నదని, ఇరువురూ సమ ఉజ్జీలుగా ఉన్నారని, ఎవరు గెలుస్తారనేది కచ్చితంగా చెప్పలేమని సర్వేలు పదేపదే పేర్కొన్నాయి. అయితే అది శుద్ధ పొరపాటు అని రుజువయింది. అలాగే ‘స్వింగ్’ స్టేట్స్‌గా సుప్రసిద్ధమైన ఏడు రాష్ట్రాలలో ఓటర్ల మొగ్గు ఒకే వైపు–ట్రంప్‌కు అనుకూలంగా ఉన్నది. ఆ ఏడు ‘స్వింగ్’ రాష్ట్రాలలో ట్రంప్, కమలా హారిస్‌కు లభించిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి (రాష్ట్రం పేరు తరువాత ఉన్న అంకెల్లో మొదటిది ట్రంప్‌కు, రెండవది కమలాహారిస్‌కు లభించిన ఓట్లు) : అరిజోనా– 1,303,793, 1,167,898; జార్జియా–2,654,306, 2,538,986; మిషిగన్–2,799,713, 2,715,684; నేవడా–688,179, 647,247; నార్త్ కరోలినా–2,876,141, 2,685,451; పెన్సిల్వేనియా–3,473,325, 3,339,559; విస్కాన్సిన్–1,697,237, 1,668,757. నువ్వా నేనా అన్న రీతిలో సంభవించిన పోటీలో ఓట్ల లభ్యతలోని స్వల్ప వ్యత్యాసాలు బలమైనవి, సార్థకమైనవి.
అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా రూపొందించుకుందాం అన్న నినాదంతో డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారం చేశారు. అయితే ప్రచార పర్వంలో ఆయన ప్రసంగాలు స్త్రీలను కించపరిచేవిగాను, జాత్యహంకారాన్ని రెచ్చగొట్టేవిగాను, ప్రజలలో విభేదాలు, చీలికలు సృష్టించేవిగాను, ప్రత్యర్థులను అమితంగా దుర్భాషలాడినవిగా ఉన్నాయని అమెరికా అధ్యక్ష ఎన్నికల ఘటనలు, ప్రచార వైనాల స్వతంత్ర పరిశీలకులు, నిష్పాక్షిక మీడియా ప్రతినిధులు అంగీకరించారు. అయితే అమెరికా ప్రజలలో అత్యధికులు ట్రంప్ ప్రచార తీరుతెన్నులను ఏ మాత్రం పట్టించుకోనేలేదు. వలసలు (ఇమిగ్రేషన్), ద్రవ్యోల్బణం (ఇన్‌ఫ్లేషన్), పెచ్చరిల్లిన నేరాలు (క్రైమ్స్) ఇత్యాది అంశాలకు మాత్రమే ప్రాధాన్యమిచ్చారు. ఆ సమస్యల నుంచి ఎవరు తమను బయటపడవేయగలరని మాత్రమే వారు ప్రధానంగా ఆలోచించారు.
ద్రవ్యోల్బణాన్ని మినహాయిస్తే మిగతా రెండు మనం ‘బతుకుతెరువు’ అంశాలుగా పరిగణించేవి కావు. వాటిని మంచి జీవితాన్ని నిర్మించుకోవడంలో సాఫల్య వైఫల్యాలకు సంబంధించినవిగా అభివర్ణించవచ్చు. అమెరికాకు వలస వస్తున్న వారు ‘మనలాంటి వారు కారు’ అన్నది రిపబ్లికన్ల అభిప్రాయం. ఈ పరాయివారు శ్వేత జాతీయులైన అమెరికన్ క్రైస్తవ పౌరులను ముంచెత్తుతున్నారని, ఫలితంగా అమెరికా ప్రజలు అనేక ఆర్థిక ఇక్కట్లకు లోనవుతున్నారని అంటూ వలసకారులకు వ్యతిరేకంగా రిపబ్లికన్లు ముమ్మర ప్రచారం చేశారు. దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లినవారు (ప్రధానంగా లాటినో ఓటర్లు) సైతం కొత్త వలసకారుల నుంచి తమ మనుగడకు తీవ్ర ముప్పు వాటిల్లనున్నదని గట్టిగా భావిస్తున్నారు.
సరే ద్రవ్యోల్బణం ప్రతి దేశంలోనూ ప్రతి ఒక్కరికీ సమస్యలు సృష్టిస్తోంది. అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని 2.4 శాతానికి కట్టడి చేశారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధాన వడ్డీ రేటును తగ్గించడానికి సిద్ధంగా ఉన్నది (ద్రవ్యోల్బణం తక్కువగా ఉందనేందుకు ఇదొక సూచన). అయినప్పటికీ ద్రవ్యోల్బణంను రిపబ్లికన్ పార్టీ ఒక ప్రచార అస్త్రంగా చేసుకున్నది. అనేక దేశాలలో మాదిరిగానే అమెరికాలోను నేరాలు బాగా పెరిగిపోయాయి. జనాభా పెరుగుదల, పట్టణీకరణ, మాదక ద్రవ్యాలే నేరాల పెరుగుదలకు ప్రధాన కారణాలు. ఏ ప్రజాస్వామ్య దేశంలో అయినా ప్రతిపక్షాలు నేరాల పెరుగుదలను ఒక రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకోవడం కద్దు.
వలసలు, ద్రవ్యోల్బణం, నేరాల పెరుగుదలను డోనాల్డ్ ట్రంప్ తన రాజకీయ లబ్ధికి గరిష్ఠంగా ఉపయోగించుకున్నారు. కలహశీల ధోరణిలో అడ్డూ ఆపూ లేని రీతిలో ఈ సమస్యల విషయమై డెమొక్రాట్లను ఆయన తీవ్రంగా విమర్శించారు మొరటు భాషలో దుర్భాషలాడారు. అయినప్పటికీ అమెరికన్ ఓటర్లు ఆయన మొరటుతనం, ముతక విమర్శల పట్ల ఎటువంటి అభ్యంతరం, ఆక్షేపణ తెలుపకపోవడం నన్ను చాలా విస్మయానికి గురిచేసింది.
డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ఎందుకు పరాజయం పాలయ్యారో తరచి చూద్దాం. ఎన్నికల ప్రచారంలో ఆమె ప్రాధాన్యతతో ప్రస్తావించిన అంశాలు ఏవీ అత్యధిక ఓటర్ల మనసులు, హృదయాలలో ప్రతిధ్వనించనే లేదు. గర్భస్రావం, మహిళల హక్కులు, రాజ్యాంగ మాన్యత, జాతుల మధ్య సమానత్వం, మత సామరస్యం, కరుణశీలత, దయా స్వభావం మొదలైన వాటిని ఆమె ప్రస్తావించారు. ట్రంప్‌పై కమలా హారిస్ చేసిన పోరాటంలో ఈ విలువలు ఓడిపోయాయి. వాటి పట్ల రిపబ్లికన్ పార్టీ అభ్యర్థికి కనీస గౌరవం కూడా లేదు.
ప్రపంచ వ్యాప్తంగా అసంఖ్యాక ప్రజలను కలవరపెడుతున్న వివిధ అంశాలు అమెరికా ఎన్నికల ప్రచారంలో కనీస ప్రాధాన్యం కూడా పొందలేదు! మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయెల్ దురాగతాలకు 44 వేల మంది పాలస్తీనియన్లు హతమవడం (వీరిలో మహిళలు, బాలలే అత్యధికంగా ఉన్నారు, ఐక్యరాజ్యసమితి సిబ్బంది కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు), ఉక్రెయిన్ భూభాగాలను రష్యా దురాక్రమించిన విషయం పెద్దగా ప్రస్తావనకే రాలేదు. తైవాన్‌ను ఆక్రమించుకునేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలను అమెరికా ప్రజలు పూర్తిగా మరచిపోయినట్లుగా కనిపిస్తోంది అమెరికా భూభాగాలపై దాడి చేసేందుకు వీలైన ఖండాంతర క్షిపణుల ప్రయోగ పరీక్షలను ఉత్తర కొరియా విజయవంతంగా నిర్వహించిన విషయాన్ని ఇరు పార్టీల అభ్యర్థులూ మరచిపోయినట్టున్నారు. పలు దేశాలలో అంతర్యుద్ధాలు, ప్రజాస్వామిక దేశాలుగా పిలవడబడుతున్న దేశాలలో పౌర స్వేచ్ఛల అణచివేతను అభ్యర్థులు గానీ, ఓటర్లు గానీ పట్టించుకోనే లేదు. ఈ అంతర్జాతీయ ఉపద్రవాలను అలా ఉంచితే తాము ఓటు వేస్తున్న (అంతిమంగా గెలిచిన) అభ్యర్థిని ఒక దోషిగా న్యాయస్థానం నిర్ధారించిందని, శిక్ష ఖరారు కావచ్చనే వాస్తవాన్ని కూడా అమెరికన్ ఓటర్లు పూర్తిగా విస్మరించారు.
ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు అమెరికా ఓటర్లను ఎలా ప్రభావితం చేశాయి? అమెరికాను ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా రూపొందించిన స్వేచ్ఛా వాణిజ్య విధానాలు, తక్కువ సుంకాలు, గుత్తాధిపత్య వ్యతిరేక చట్టాల ఉపసంహరణ గురించి వారు ఏ మాత్రం పట్టించుకోనే లేదు. డోనాల్డ్ ట్రంప్ విజయానికి అమితంగా ఆనందపడిన కార్పొరేట్ శక్తులు చమురు, ఔషధాల తయారీ, అధునాతన సాంకేతికతలకు సంబంధించిన బహుళ జాతి కంపెనీలే సుమా!
అమెరికా ఓటర్లు అంతిమంగా తాము ముందే ఏర్పరచుకున్న ఇష్టాయిష్టాల, పాక్షికాభిప్రాయాల ప్రకారమే ఓటు వేశారు. పురుష ఓటర్లు ట్రంప్‌ను ఎక్కువగా ఇష్టపడ్డారు. యువ ఓటర్లు (18–29 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు) ట్రంప్‌నే ఎంచుకున్నారు. కార్మిక శ్రేణులకు చెందిన ఓటర్లూ ట్రంప్‌నే ఇష్టపడ్డారు. పట్టభద్రులు కాని ఓటర్లు ట్రంప్‌కే ప్రాధాన్యమిచ్చారు. లాటినో ఓటర్లు (మెక్సికన్లు, ప్యూరిటోరికన్లు, క్యూబన్లు) ట్రంప్‌నే ఎంచుకున్నారు. ఒక పచ్చి నిజాన్ని నిర్మొగమాటంగా చెప్పి తీరాలి. పైన ప్రస్తావిత ఓటర్లు అందరూ కమలా హారిస్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు. కారణమేమిటి? ఆమె జెండర్, కలర్ ప్రధాన కారణం. జెండర్ రీత్యా మహిళ, వర్ణం (కలర్) రీత్యా నల్ల జాతి స్త్రీ కదా కమలా హారిస్.
ప్రపంచ ఏకైక అగ్రరాజ్యం అమెరికా. మరి ఆ దేశాధ్యక్ష పదవీ ఎన్నికల ఫలితం ఇతర దేశాలలోని ఎన్నికలను ప్రభావితం చేస్తుందా? చేయగలదు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఉపయోగించిన మొరటు భాష, ప్రజలలో విభేదాలు చీలికలు సృష్టించిన వ్యాఖ్యల వైనాన్ని అనుకరించేందుకు ట్రంప్ విజయం ఇతర దేశాలలోని నాయకులను పురిగొల్పవచ్చు. ట్రంప్ ప్రచార నమూనా ఒక ఒరవడి అయితే అది ప్రజాస్వామ్యానికి ఘోర పరాజయం అవుతుంది, సందేహం లేదు.
అమెరికా అధ్యక్ష పదవీ ఎన్నికల ఫలితం ఇతర దేశాలలోని ఎన్నికలను ప్రభావితం చేస్తుందా? చేయగలదు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఉపయోగించిన మొరటు భాష, ప్రజలలో విభేదాలు చీలికలు సృష్టించిన వ్యాఖ్యల వైనాన్ని అనుకరించేందుకు ట్రంప్ విజయం ఇతర దేశాలలోని నాయకులను పురిగొల్పవచ్చు. ట్రంప్ ప్రచార నమూనా ఒక ఒరవడి అయితే అది ప్రజాస్వామ్యానికి ఘోర పరాజయం అవుతుంది, సందేహం లేదు.
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,
కాంగ్రెస్ సీనియర్ నాయకులు)
Updated Date - Nov 09 , 2024 | 07:13 AM