ఈ వివాదాలకు అంతమెక్కడ?
ABN, Publish Date - Dec 07 , 2024 | 12:58 AM
చాలా చట్టాల రూపకల్పనను నేను మొదటి నుంచి చివరివరకు పర్యవేక్షించడం జరిగింది. ముసాయిదా బిల్లు చిన్నదిగా, స్ఫుటంగా, స్పష్టంగా ఉండాలని న్యాయమంత్రిత్వ శాఖ న్యాయశాస్త్ర నిపుణులకు గట్టిగా
చాలా చట్టాల రూపకల్పనను నేను మొదటి నుంచి చివరివరకు పర్యవేక్షించడం జరిగింది. ముసాయిదా బిల్లు చిన్నదిగా, స్ఫుటంగా, స్పష్టంగా ఉండాలని న్యాయమంత్రిత్వ శాఖ న్యాయశాస్త్ర నిపుణులకు గట్టిగా సూచించేవాణ్ణి. ‘ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టం–1991’ నా ప్రమేయమున్న చట్టాలలో ఒకటి. అది చాలా చిన్న చట్టం. 8 సెక్షన్లు మాత్రమే అందులో ఉన్నాయి. ఆ చట్టానికి ఒక లక్ష్యమున్నది. ఆ లక్ష్యం స్ఫుటంగా ఉన్నది: ఆగస్టు 5, 1947న ఒక ప్రార్థనాస్థలం మతపరమైన స్వభావాన్ని స్తంభింపజేయడం అంటే యథాతథంగా ఉండేలా చేయాలని నిర్దేశించింది. ఆ చట్టం చాలా స్పష్టంగా ఉంది. ‘అయితే’లు, ‘అయినా’లు, ‘కానీ’ లకు లేదా అయినప్పటికీ’ ఇత్యాది మినహాయింపులు, అభ్యంతరాలకు తావివ్వనిదిగా ఉన్నది. మరీ ముఖ్యంగా ఆ చట్టం పూర్తిగా ‘పక్షపాత రహితం’గా ఉన్నది. పూర్వ భావనలు, అవిచారితాభిప్రాయాలను ప్రోత్సహించేదిగా లేదు.
ఆ చట్టంలోని సెక్షన్ 3, సెక్షన్ 4 (1)ని ప్రతి ఒక్కరూ చదవాలని నేను కోరుతున్నాను. సెక్షన్ 3: ప్రార్థనా స్థలాల మతపరమైన స్వభావాన్ని మార్చడంపై నిషేధం. ఒక మతపరమైన ప్రార్థనా స్థలం లేదా మతపరమైన ప్రార్థనా స్థలంలోని ఒక విభాగాన్ని వేరే మతానికి లేదా అదే మతానికి చెందిన వేరే సంప్రదాయానికి చెందిన ప్రార్థనా స్థలంగా ఎవరూ మార్చకూడదు. సెక్షన్ 4: ఒక ప్రార్థనాస్థలం మతపరమైన స్వభావాన్ని మార్చడానికి సంబంధించి అన్ని అప్పీళ్లు, దావాలు లేదా ఇతర న్యాయవిచారణ కార్యకలాపాలు చట్టం ప్రారంభమైన తరువాత ముగుస్తాయి. తాజా అప్పీళ్లను దాఖలు చేయడం అనుమతించడబదు. ఆగస్టు 15, 1947న ఒక ప్రార్థనాస్థలం మతపరమైన స్వభావం ఎలా ఉన్నదో, ఆ రోజున ఉన్న రీతిలోనే కొనసాగుతుంది. అయితే (అయోధ్యలో ఉన్న) రామజన్మభూమి–బాబ్రీ మసీదుగా దేశ ప్రజలకు సుపరిచితమైన ప్రార్థనా స్థలాన్ని మాత్రం ఈ చట్టం నుంచి మినహాయించారు. ఆ ప్రార్థనా స్థలంపై అప్పటికే సుదీర్ఘకాలంగా న్యాయ వివాదం కొనసాగుతుండడమే ఆ మినహాయింపునకు కారణం.
ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టం లక్ష్యం, ఉద్దేశం, స్ఫూర్తి, పరిధికి విస్తృతంగా ప్రజామోదం లభించింది. సామాన్య విద్యావంతులు, న్యాయశాస్త్ర నిపుణులు ఆ చట్టాన్ని హర్షామోదాలతో స్వాగతించారు. ఆ చట్టం తన లక్ష్యాన్ని సాధించిందని నేను అభిప్రాయపడుతున్నాను. వివిధ ప్రార్థనా స్థలాలకు సంబంధించిన పలు వివాదాలపై ఎటువంటి జగడాలు లేకుండా మూడు దశాబ్దాల పాటు ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి. ఒక దేవాలయం ఒక దేవాలయంగా ఉండాలని, ఒక మసీదు ఒక మసీదుగా ఉండాలని, ఒక చర్చి ఒక చర్చిగా ఉండాలని, ఒక గురుద్వారా ఒక గురుద్వారాగా ఉండాలని, ఇంకా ఇతర మతాల ప్రార్థనా స్థలాలు ఆగస్టు 15, 1947న ఎలా ఎలా ఉన్నాయో అలాగే యథాతథంగా ఉండాలనే విషయాన్ని దేశ పౌరులు చాల వరకు అంగీకరించారు.
దురదృష్టవశాత్తు ప్రార్థనా స్థలాల (కొత్త నిబంధనలు) చట్టం అమలవుతున్న తీరు తెన్నులపై సమగ్ర సమాచారం లేదు. PRISM పార్లమెంటు కార్యకలాపాల పరిశోధనా సంస్థ)ను వాకబ్ చేయగా ఆ చట్టం కింద జరిగిన అరెస్ట్‌లు, విధింపబడిన శిక్షల గురించి పార్లమెంటులో మూడు సందర్భాలలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు నాడు అధికారంలో ఉన్న ప్రభుత్వం చప్పిడి సమాధానాలు మాత్రమే ఇచ్చిందని తెలియజేసింది. మొత్తం మీద కేంద్రంలో వరుసగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఆ చట్టం పనిచేస్తున్న తీరుపై నిరపాయకరమైన నిరక్ష్యం చూపారని చెప్పవచ్చు.
న్యాయస్థానాలు రంగప్రవేశం చేశాయి. అక్టోబర్ 28, 2020న దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఒక రిట్ పిటిషన్ దాఖలయింది. ప్రార్థనాస్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టం–1991లోని సెక్షన్లు 2, 3, 4 సెక్షన్లను నిష్ర్పయోజనకరమైనవిగాను, రాజ్యాంగవిరుద్ధమైనవిగాను ప్రకటించాలని ఆ రిట్ పిటిషన్ విజ్ఞప్తి చేసింది. పిటీషన్‌దారు అందుకు చూపిన కారణమేమిటి? అనాగరిక దురాక్రమణదారులు న్యాయసమ్మతం కాని రీతిలో ‘ప్రార్థనా స్థలాల’ను తమవిగా చెల్లబాటు చేయడానికి ప్రయత్నిస్తున్నందున 1991 చట్టంలోని 2, 3, 4 సెక్షన్లను రద్దు చేయాలి. ఇదీ ఆ పిటీషనర్ వాదన.
సెక్షన్ 3, సెక్షన్ 4 ఆ చట్టంలోని కీలక భాగాలు. అవి లేకుంటే ఆ చట్టంలో ఏమీ ఉండదు. అది అసలు అనవసరం. భారత రాజ్యాంగం అధికరణలు 14, 15, 21, 25, 26, 29ని ఆ రెండు సెక్షన్లు ఉల్లంఘిస్తున్నాయనే వాదనతో సుప్రీంకోర్టులో సెక్షన్ 3, సెక్షన్ 4ను సవాల్ చేశారు. ఆ ‘ప్రార్థనా స్థలాలు’ అనాగరిక దురాక్రమణ దారులు చట్టవిరుద్ధంగా స్వాయత్తం చేసుకున్నవని పిటీషనదారు పేర్కొనడం గమనార్హం. ఏ మత ప్రజల తరపున తాను ఈ పిటిషన్ దాఖలు చేసింది, ఏ మత సమూహాన్ని లక్ష్యంగా చేసుకుని ఆ పిటీషన్‌ను వేసింది కూడా పిటీషన్‌దారు స్పష్టంగా పేర్కొన్నాడు. మరింత స్పష్టంగా చెప్పాలంటే ‘హిందువుల, జైనుల, బౌద్ధుల, సిక్కుల’ మత ప్రదేశాలను చట్టబద్ధంగా ఆయా మతస్థులకు పునరుద్ధరించాలని ఆ పిటీషన్‌దారు అభ్యర్థించాడు. అక్టోబర్ 28, 2020 నుంచి ఆ రిట్ పిటీషన్ పెండింగ్‌లో ఉన్నది.
2023లో సుప్రీంకోర్టు ఒక స్పెషల్ లీవ్ పిటీషన్ (ఎస్‌ఎల్‌పి)ను విచారణకు స్వీకరించింది. వారణాసిలోని అంజుమన్ ఇంతెజామియ మసీద్ నిర్వహణా కమిటీ ఆ పిటిషన్‌ను దాఖలుచేసింది. ఆగస్టు 3, 2023న అలహాబాద్ హైకోర్టు జారీ చేసిన ఒక ఆదేశాన్ని ఆ ఎస్‌ఎల్‌పి సవాల్ చేసింది. జ్ఞాన్‌వాపి మసీదు ఉన్న స్థలాన్ని సర్వే చేయాలని భారత పురావస్తు శాఖ (ఎఎస్‌ఐ)ను జిల్లా జడ్జి ఆదేశించారు. ఈ ఆదేశానికి వ్యతిరేకంగా వారణాసిలోని అంజుమన్ మసీదు నిర్వహణదారుల అప్పీల్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టి వేసింది. హైకోర్టు నిర్ణయాన్ని అంజుమన్ మసీదు నిర్వహణదారులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆగస్టు 4, 2023న సుప్రీంకోర్టు జారీ చేసిన ఒక ఉత్తర్వు ఇలా పేర్కొంది: ‘హైకోర్టు అభిప్రాయంతో విభేదించలేక పోతున్నాం. రాజ్యాంగ అధికరణ 136 కింద మా న్యాయాధికారాలను వినియోగించుకుంటూ ఆ నిర్ణయానికి వచ్చాం.. సొలిసిటర్ జనరల్ వాదనలను నమోదు చేశాం. ఈ కేసులో న్యాయప్రక్రియ అంతా ఎఎస్‌ఐ అనుసరించే పద్ధతులపై ఆధారపడి ముగుస్తుంది’.
సుప్రీంకోర్టు ఉత్తర్వు అనేక ఉపద్రవాలకు ఆస్కారం కల్పించింది. చిక్కులకు దారితీస్తోంది. 2022లో సివిల్ దావా (18) వేసిన వారి ఉద్దేశాలపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరపలేదు. ఆ దావా వేసినవారి అభ్యర్థన: జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలోని ఉన్న దేవతామూర్తులకు పూజలు, ఇతర క్రతువులు నిర్వహించే హక్కు తమకు ఉందని, కనుక ఆ మసీదులో పూజలకు తమను అనుమతించాలి. ఒక మసీదులో ఉన్నాయంటున్న హిందూ దేవతా మూర్తులకు పూజలు నిర్వహించేందుకు తమను అనుమతించాలన్నదే దావా వేసిన వారి అభ్యర్థన అన్నది స్పష్టం. వారి విజ్ఞప్తిని అంగీకరించి, అక్కడ ఉన్నాయంటున్న హిందూ దేవతా మూర్తులకు పూజలు నిర్వహించేందుకు అనుమతి నివ్వడమంటే ఆ మసీదును, కనీసం పాక్షికంగా అయినా ఒక దేవాలయంగా మార్చడమే అవుతుంది. మరి ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టం–1991లోని సెక్షన్ 3, సెక్షన్ 4 ప్రకారం అటువంటి అనుమతినివ్వడమంటే ఆ మసీదును హిందూ దేవాలయంగా మార్చడమే అవుతుంది!
2022లో సివిల్ దావా 18 వేసిన వ్యక్తుల ఉద్దేశాన్ని, వారు కోరిన విధంగా జ్ఞాన్‌వాపి మసీదులో పూజలకు అనుమతినిస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడలేమా? అర్థం చేసుకోలేమా? సామాన్య విద్యావంతులకూ అదేమంత కష్టం కాదు. సుప్రీంకోర్టు రాజ్యాంగ అధికరణ 141 కింద తన అధికారాలను వినియోగించుకుని ఆ దావాలో ‘న్యాయప్రక్రియ పూర్తి చేసి ఉండాల్సింది’ అని నేను అభిప్రాయపడుతున్నాను. దావా 18ని దాఖలు చేయడానికి అనుమతించి, మూడు దశాబ్దాలుగా అందరూ గౌరవిస్తున్న ప్రార్థనా స్థలాల (కొత్త నిబంధనలు) చట్టం–1991 ప్రకారం ఆ దావాను కొట్టివేసి ఉండవల్సింది. దురదృష్టవశాత్తు దేశ సర్వోన్నత న్యాయస్థానం అలా చేయలేదు. సరే, ఇప్పుడు మథురలోని ఈద్గా మసీదు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్ మసీదు, ఢిల్లీలోని కుతుబ్ మీనార్ కట్టడం, అజ్మీర్ (రాజస్థాన్) లోని దర్గాపై వివాదాలు ముసురుకుంటున్నాయి. వీటన్నిటికీ ఆస్కారమిచ్చింది జ్ఞాన్‌వాపి ఉత్తర్వు కాదూ? జ్ఞాన్‌వాపి ఉత్తర్వు పర్యవసనాలు భారత ప్రజాస్వామ్యానికి అప్రతిష్ఠాకరమైన ఎడిఎమ్ జబల్పూర్ కేసులో వలే ఉండవచ్చు.
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,
కాంగ్రెస్ సీనియర్ నాయకులు)
Updated Date - Dec 07 , 2024 | 12:58 AM