వరద రాజకీయం
ABN, Publish Date - Aug 28 , 2024 | 01:34 AM
ఎడతెరిపిలేని వర్షాలతో బంగ్లాదేశ్‌లోని పలుప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. మరణాల సంఖ్య పాతికవరకూ ఉన్నప్పటికీ, అరవైలక్షలమంది ప్రజల జీవితాలను ఈ వరదలు ప్రభావితం చేశాయి...
ఎడతెరిపిలేని వర్షాలతో బంగ్లాదేశ్‌లోని పలుప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. మరణాల సంఖ్య పాతికవరకూ ఉన్నప్పటికీ, అరవైలక్షలమంది ప్రజల జీవితాలను ఈ వరదలు ప్రభావితం చేశాయి. రోడ్లు ధ్వంసమై రవాణావ్యవస్థ స్తంభించడంతో ఆహారసరఫరాలకు ఇబ్బంది ఏర్పడింది. నిత్యావసరాలు, తాగునీరు, మందులు అందక ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. వరద బీభత్సం తీవ్రంగా ఉన్నస్థితిలో మధ్యంతర ప్రభుత్వాధినేత మహ్మద్ యూనుస్ దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ వరదబాధితులను ఆదుకోవడానికి అన్ని చర్యలూ తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి ఆకస్మిక వరదలు ముంచెత్తకుండా పొరుగుదేశాలతో చర్చలు జరుపుతామని ప్రకటించారు. భారతదేశానికి చెందిన త్రిపుర రాష్ట్రంలోని దుంబూర్ డ్యామ్ గేట్లను అకస్మాత్తుగా తెరవడం వల్లనే బంగ్లాదేశ్‌లోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద పొటెత్తిందనే ప్రచారం విస్తృతంగా సాగిన నేపథ్యంలో, ఆయన నోటినుంచి అటువంటి ఆరోపణేమీ నేరుగా రాకున్నా ఈ పరోక్షప్రస్తావనకు ప్రాధాన్యం ఏర్పడింది. దుంబూర్ డ్యామ్ వల్లనే బంగ్లాదేశ్‌లో మునక అధికంగా జరిగిందన్న ప్రచారాన్ని భారత్ వెంటనే ఖండించింది. ఈ డ్యామ్ సామర్థ్యం, విడుదలైన నీరు వ్యాప్తిచెందగల వేగం, విస్తీర్ణం, ప్రభావం ఇత్యాది అంశాలతో మంచివివరణే ఇచ్చింది. అయినప్పటికీ, బంగ్లాదేశ్ సామాజిక మాధ్యమాల్లో వరదల వెనుక అనుమానాలు, కుట్రసిద్ధాంతాల ప్రచారాలు పూర్తిగా ఆగిపోలేదు.
గతవారం త్రిపురను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఐదురోజులపాటు సాధారణం కంటే మూడురెట్లు అధికంగా కుంభవృష్టి కురవడంతో రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. పాతికమంది మరణించారు, ఇరవైలక్షలమంది ప్రభావితులైనారు, లక్షన్నరమంది నిరాశ్రయులైనారు. త్రిపురకు పశ్చిమాన పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లోని జిల్లాల్లో కూడా ఇదే రకమైన కష్టం తలెత్తింది. అక్కడ కూడా వరదలు వచ్చాయి, చెరువులు తెగిపడ్డాయి. అయితే, మారిన రాజకీయవాతావరణం వల్ల కాబోలు, అక్కడి సామాజిక మాధ్యమాల్లో భారత్ మీద ఆరోపణలు ఊపందుకున్నాయి. డ్యామ్ గేట్లు తెరిచేసి, గుమ్టీ నదిద్వారా భారతదేశం కక్షపూరితంగా బంగ్లాదేశ్‌లో కృత్రిమవరదలను సృష్టించిందన్నది ఆ ప్రచారం సారాంశం. విశ్వాసం తగ్గుముఖం పట్టినప్పుడు ఇటువంటి విషప్రచారాలకు హద్దు ఉండదు. డ్యామ్‌గేట్లను ఎత్తివేయడం వెనుక ఏవో దురుద్దేశాలున్నాయన్న ఆరోపణలు సరికాదు కానీ, నిర్దిష్టమైన ఎత్తుకు నీరుచేరినప్పుడు గేట్లు ఆటోమేటిక్‌గా తెరుచుకొని నీరు విడుదలయ్యే ఏర్పాటయితే అక్కడ ఉంది. అయితే, డ్యామ్‌లో నీరు ప్రమాదకరమైన ఎత్తుకుచేరిందనీ, ఏ క్షణమైనా అది ఆటోమేటిక్‌గా ఖాళీ కావచ్చునన్న హెచ్చరిక మననుంచి బంగ్లాదేశ్‌కు చేరలేదని అంటారు. అందువల్ల, ఎంతో ముందునుంచే ఆ దేశంలోనూ తీవ్రమైన వర్షాలు, వరదపరిస్థితి ఉన్నప్పటికీ, త్రిపురలో గేట్లు ఎత్తివేయడంతోనే తమకు ఈ దుస్థితి ఏర్పడిందంటూ భారత్‌ను తప్పుబట్టడానికి వారికి అవకాశం కలిగింది. త్రిపురలోని ఎనిమిది జిల్లాలనూ వరద ముంచెత్తిన వాస్తవాన్ని పక్కనబెట్టి, ఒక జిల్లాలోని ఓ చిన్నడ్యామ్ కారణంగా ఈ ఘోరం జరిగిపోయిందంటూ బంగ్లాదేశ్‌లోని ఒక వర్గం మీడియా ఉద్దేశపూర్వకంగా ఈ ప్రచారం చేసిందని అంటారు. డ్యామ్ అధికారులు త్రిపుర ప్రభుత్వానికి తమవంతుగా ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేరవేస్తున్నప్పటికీ, అవి పొరుగుదేశానికి అందలేదన్న వాదనలూ ఉన్నాయి.
చెప్పాపెట్టకుండా గేట్లు తెరిచేసి, విపత్తును ఎదుర్కొనేందుకు ఏమాత్రం సమయం ఇవ్వకుండా భారతదేశం మమ్మల్ని ప్రమాదంలో పడవేసిందన్న రీతిలో బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ సలహాదారు ఇటీవల వ్యాఖ్యానించారు. అక్కడి కోటా వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించిన ఈ ఢాకా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు భారతదేశం సహాయనిరాకరణ చేస్తోందని కూడా ఆరోపిస్తున్నారు. ఆయన వేటిని మనసులో పెట్టుకొని ఈ మాటలన్నారో తెలియదు కానీ, రెండు దేశాల మధ్యా పరిష్కారం కాకుండా మిగిలిపోయిన నీటి తగువులు కూడా ఇకమీదట వేడెక్కవచ్చును. రెండు దేశాల మధ్యా దాదాపు యాభైనాలుగు నదులు సరిహద్దులకు అతీతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఇటువంటి పొరపొచ్చాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. బంగ్లాదేశ్‌లో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇది ఎంతో ముఖ్యం. ఇప్పటికే ఉన్న విధానాలను కచ్చితంగా అమలుచేయడం, మరింత పటిష్టపరచడం అవసరం. ఎప్పటికప్పుడు డేటా పంచుకోవడం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం అవసరం.
Updated Date - Aug 28 , 2024 | 01:34 AM