ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శాంతి ఎప్పటికి?

ABN, Publish Date - Jul 27 , 2024 | 05:36 AM

గాజా సంక్షోభం విషయంలో ఇక ఎంతమాత్రం మౌనంగా ఉండలేననీ, అక్కడి దయనీయమైన పరిస్థితులను చూస్తూ ఊరుకోలేనని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ గురువారం వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమీన్‌ నెతన్యాహూ అమెరికన్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఓ కఠినమైన, తీవ్రమైన ప్రసంగం చేసిన తరువాత,

గాజా సంక్షోభం విషయంలో ఇక ఎంతమాత్రం మౌనంగా ఉండలేననీ, అక్కడి దయనీయమైన పరిస్థితులను చూస్తూ ఊరుకోలేనని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ గురువారం వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమీన్‌ నెతన్యాహూ అమెరికన్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఓ కఠినమైన, తీవ్రమైన ప్రసంగం చేసిన తరువాత, అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులతో భేటీ అయ్యారు. ఆయనతో చర్చల సందర్భంగా తాను వీలైనంతవెంటనే హమాస్‌తో కాల్పుల ఒప్పందానికి రావాల్సిందిగా సూచించానని, గాజాలో పెరుగుతున్న మరణాలపై ఆందోళన వ్యక్తంచేశానని కమల తెలియచేశారు. ఎట్టిపరిస్థితుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఖరారుచేసుకోవాలని గట్టిగా చెప్పానని ప్రకటించారు. నెతన్యాహూతో ఇలా చెప్పా, అలా అన్నా అంటూ ఆమె మీడియాముందు చేసిన వ్యాఖ్యలు నిజానికి ఆయనతో అన్నవాటికంటే తీవ్రంగా ఉన్నాయని కొందరు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా, గత తొమ్మిదినెలలుగా గాజాలో దయనీయమైన, అమానవీయమైన పరిస్థితులు చూస్తున్నామంటూ వాటి వర్ణనలు, వ్యాఖ్యలు తీవ్రంగా, లోతుగా ఉండటం విశేషం. డెమోక్రాటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ఆమె ఖరారుకావడం ఖాయమని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆమె వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఉంటుంది. హమాస్‌పై తమ పోరు కొనసాగుతుందని, దానిని పూర్తిగా తుడిచిపెట్టేవరకూ, తమకు తుదివిజయం లభించేవరకూ యుద్ధం ఆగదని అమెరికన్‌ కాంగ్రెస్‌ను ఉద్దేశించి నెతన్యాహూ ఎంతో ఆవేశంగా ప్రసంగించిన విషయం తెలిసిందే.

యుద్ధానికి వెంటనే ముగింపుపలకాలని నెతన్యాహూతో భేటీకి ముందు మీడియాతో మాట్లాడుతూ డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా అన్నారు. కానీ, ట్రంప్‌ కంటే కమలాహారిస్‌ మాటలు నెతన్యాహూ ప్రభుత్వాన్ని ఎక్కువగా కలవరపెట్టినట్టుగా కనిపిస్తోంది. గాజాలో ఘోరాలు జరిగిపోతున్నాయని ఆమె అనడం వల్ల శత్రువుకు అమెరికా–ఇజ్రాయెల్‌ మధ్య దూరం పెరిగిన సందేశం వెడుతుందని, బందీల విడుదల వెనకడుగువేసే ప్రమాదం ఉన్నదని ఇజ్రాయెల్‌ వ్యాఖ్యానించింది. బైడెన్‌ ప్రభుత్వం అప్పుడప్పుడు ఇజ్రాయెల్‌ను తప్పుబడుతూ, హెచ్చరిస్తూ, మారణకాండమీద ఆందోళన వెలిబుచ్చుతూ దానికి అందించాల్సిన సాయాన్ని మాత్రం నిరంతరాయంగా అందిస్తున్న విషయం తెలిసిందే.

రేపు అమెరికాలో ఎవరు అధికారంలోకి వచ్చినా, ఇజ్రాయెల్‌ విషయంలో సమూలమైన విధానమార్పులు ఉంటాయన్న భ్రమలు అక్కరలేదు. నెతన్యాహూ అమెరికా ప్రయాణంలో ఉండగానే గాజాపట్టీ అన్నిదిక్కుల్లోనూ ఇజ్రాయెల్‌ దాడులుచేసింది. గతంలో అనేక రోజుల పాటు మారణహోమం సాగించి వదిలిపెట్టిన ఖాన్‌ యూనిస్‌ నగరంమీద ఇప్పుడు మళ్ళీ విరుచుకుపడుతోంది. గతంలో ఆస్పత్రులను సైతం ధ్వంసం చేసి, రోగులను సజీవంగా పాతిపెట్టిన ఈ నగరం మీద మరోమారు దాడిచేసి నలభైఎనిమిది గంటల్లోనే యాభైమందిని పొట్టనబెట్టుకుంది. హమాస్‌ ఉగ్రవాదులు కందకాల్లో దాక్కున్నారని, సాధారణ పౌరులతో కలగలసిపోయారని వాదిస్తూ సామాన్యులను ఊచకోతకోయడం ఇజ్రాయెల్‌ యథేచ్ఛగా కొనసాగిస్తున్నది. అమెరికా అండదండలు దండిగా ఉన్నందున అంతర్జాతీయ సంస్థలు, వేదికలకు అది వెరవడం లేదు. భద్రతామండలి తీర్మానాలంటే భయంలేదు. ఐక్యరాజ్యసమితి హెచ్చరించినప్పుడు, ఆవేదన వెలిబుచ్చినప్పుడు ఆ సంస్థ అధినేత ఉగ్రవాదులతో అంటకాగుతున్నారంటూ ఇజ్రాయెల్‌ అత్యంత కఠినమైన ప్రతివిమర్శలు చేస్తోంది. తనను ప్రశ్నించినవారంతా ప్రపంచశాంతికి శత్రువులు, ఉగ్రవాదానికి మిత్రులు అంటోంది. నలభైవేలమందిని చంపి, లక్షలమందిని తరిమివేసిన ఇజ్రాయెల్‌ వైఖరిని తప్పుబడుతూ, శరణార్థులు తలదాచుకున్న స్థావరాలమీద సైనికదాడులు ఆపాలని, ఆహారసరఫరాలను అనుమతించాలని అంతర్జాతీయ న్యాయస్థానం గతంలో వెలువరించిన తీర్పు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దశాబ్దాలుగా పాలస్తీనాభూభాగాలను ఇజ్రాయెల్‌ ఆక్రమించుకొని ఉండటం చట్టవిరుద్ధం, దీనిని సాధ్యమైనంత వెంటనే సరిదిద్దాలి అంటూ అంతర్జాతీయ న్యాయస్థానం ఈనెల 19న వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌ వీటిని బేఖాతరుచేయవచ్చునేమో కానీ, ప్రజాభిప్రాయం దానికి వ్యతిరేకంగా ఉన్నదనీ, గాజాదుస్థితిపట్ల ప్రపంచవ్యాప్తంగా సానుభూతి పెరుగుతున్నదని అన్ని దేశాలూ గుర్తించాలి. అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఇజ్రాయెల్‌ను దారికి తేవాల్సిన బాధ్యత ఐక్యరాజ్యసమితిమీద ఉన్నది. ప్రతీ సభ్యదేశం ఆ కర్తవ్యంలో భాగస్వామి కావలసిందే.

Updated Date - Jul 27 , 2024 | 05:36 AM

Advertising
Advertising
<