మొదటిసారి బిడ్డను చేతిలోకి తీసుకున్న అనుభూతి!
ABN, Publish Date - Sep 09 , 2024 | 05:52 AM
నేను ప్రచురించిన, నా పేరుతో వచ్చిన మొదటి పుస్తకం, సాహిత్యానికి సంబంధించిన పుస్తకం ‘అతడు – ఆమె: మనం’ అనే సాహిత్య విమర్శ పుస్తకం. ఆ పుస్తక రచన, ప్రచురణ అన్నీ ఆ రోజుల్లో అనుకోకుండా జరిగి పోయాయి. ఆ పుస్తకం 1983లో ప్రచురించాను. 1981, 82 సంవత్సరాలలో ఆంధ్రజ్యోతిలో ఉప్పల
నేను ప్రచురించిన, నా పేరుతో వచ్చిన మొదటి పుస్తకం, సాహిత్యానికి సంబంధించిన పుస్తకం ‘అతడు – ఆమె: మనం’ అనే సాహిత్య విమర్శ పుస్తకం. ఆ పుస్తక రచన, ప్రచురణ అన్నీ ఆ రోజుల్లో అనుకోకుండా జరిగి పోయాయి. ఆ పుస్తకం 1983లో ప్రచురించాను. 1981, 82 సంవత్సరాలలో ఆంధ్రజ్యోతిలో ఉప్పల లక్ష్మణరావు ఆత్మకథ ‘బతుకు పుస్తకం’ ధారావాహికంగా ప్రచురించారు. అందులో ఆయన తన నవల ‘అతడు – ఆమె’ గురించి నిరాశా జనకంగా రాశారు. ఆ పుస్తకానికి సరైన సమీక్షలు, విమర్శలు రాలేదని, సరైన చర్చ జరగలేదనీ దిగులు పడ్డారు. 82లో ‘బతుకు పుస్తకం’ పూర్తయ్యాక నేను కొందరు మిత్రులతో కలిసి బరంపురం వెళ్ళి లక్ష్మణరావు గారింట్లో నాలుగు రోజులున్నపుడూ ఆయన ‘అతడు – ఆమె’ను తెలుగు పాఠకులు, విమర్శకులు చర్చించలేదని అన్నారు. అది నాకు చాలా ఇష్టమైన నవల. దాని గురించి నేను ఎందుకు రాయకూడదూ అనుకున్నాను.
‘అతడు – ఆమె’ గురించి విమర్శ గానీ, ప్రశంస గానీ రాయాలంటే జాతీయోద్యమం గురించి, కమ్యూనిస్టు ఉద్యమపు తొలినాళ్ళ గురించి, స్త్రీ పురుష సంబంధాల గురించీ చాలా అధ్యయనం చేయాలి. అప్పుడు నేను లెక్చరర్‌గా పని చేస్తున్న వి.యస్.ఆర్ కళాశాలలో ఎంతో మంచి లైబ్రరీ ఉండేది. ఆరు నెలల పాటు ఆ లైబ్రరీలో కూచుని ‘అతడు – ఆమె: మనం’ రాయటం పూర్తి చేశాను. అంతలో బరంపురం నుంచి ‘బతుకు పుస్తకం’ ఆవిష్కరణ సభలో మాట్లాడమని పిలుపు వచ్చింది. ఆ సభలో గంట సేపు ‘అతడు – ఆమె’ నవల గురించి మాట్లాడాను. లక్ష్మణ రావు గారు పొంగిపోయారు. మరో మూడు నెలలకు ‘అతడు – ఆమె: మనం’ పుస్తకం ఆయన చేతిలో ఉంచి నమస్కరించాను. తన జీవిత కాలంలో ‘అతడు – ఆమె’ గురించి అంత మంచి, పెద్ద పుస్తకం చూడగలనని అనుకోలేదని లక్ష్మణరావు గారు చాలా సంతోషించారు. ఆయను సంతోషపెట్టానని నేనూ.
ఐతే పుస్తకం రాయటం నా చేతిలో పని – కానీ ప్రచురించటం ఎలా? నాకు అను భవం లేదు. పైగంబర కవిత్వం ప్రచురణ బాధ్యతలు సుగమ్ బాబు, దేవిప్రియ చూశారు. నా రాజకీయ రచన ‘సాంస్కృతిక విప్లవం – మావో’ పుస్తక ప్రచురణ కూడా నా ప్రమేయం లేకుండా జరిగింది. కానీ ‘అతడు – ఆమె: మనం’ రాసే నాటికి నేను తెనాలిలో చాలా ఒంటరితనంలో ఉన్నాను. డబ్బు సమస్య కాదు. పదేళ్ళ నుంచీ లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. కానీ ప్రింటింగ్ ఎవరు చేస్తారు? ఎవరు ఆ బాధ్యత తీసుకుం టారు? విజయవాడలో నేను ‘కరుణక్కా’ అని పిలిచే డాక్టర్ కరుణ గారు శ్రీశ్రీ విశ్వేశ్వరరావు గారి గురించి చెప్పినట్లు గుర్తు. ఆయన అప్పుడే ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు. నా పుస్తకమే మొదటి పుస్తకంగా ఆయన చేతిలోకి వెళ్ళింది. నాకు ప్రూఫ్ రీడింగ్, కవర్ పేజీ ముద్రణ ఇవేమీ తెలియవు. అన్నీ విశ్వేశ్వరరావు గారి బాధ్యతేనని చెప్పాను.
ఆయన పుస్తకాన్ని ముద్రించి నా చేతిలో పెట్టారు. అప్పటికి నాకు ఇద్దరు పిల్లలున్నా, మొదటిసారి బిడ్డను చేతిలోకి తీసుకున్న అనుభూతి– ఆ పుస్తకం చదివి కరుణక్క ఎంత మంచి ఉత్తరం రాసిందో! డాక్టర్ హేమా పరిమి ఎంత ప్రేమగా ఆలింగనం చేసుకుందో. చదివినవారంతా ప్రశంసల వర్షం కురిపించారు. కృష్ణాబాయి గారు ‘‘దీనికే నీకు పిహెచ్‌డి డిగ్రీ ఇవ్వొచ్చు’’ అన్నారు. అదంతా నవల గొప్పదనమేగాని నా గొప్పదనం కాదని నాకు తెలుసు. ఆ పుస్తకం ఎన్నో ముద్రణలు పొందింది, ఇప్పటికీ మార్కెట్‌లో ఉంది. అందులో కొంత భాగాన్ని ‘అతడు – ఆమె’ను పునర్ముద్రించినపపుడు ఆ నవల ‘వెనక మాట’గా ప్రచురించారు విశాలాంధ్రవారు. అన్ని విధాలా నాకు సంతోషాన్నీ, చిన్నపాటి గర్వాన్నీ కలిగించిన పుస్తకం నా మొదటి పుస్తకమే. ఆ తర్వాతంతా వివాదాలమయమే నా సాహిత్య జీవితం.
అప్పుడు తెలియదుగానీ ‘interdiciplinary’ పద్ధతిలో సాహిత్య విమర్శ తెలుగులో మొదలుపెట్టింది ఆ పుస్తకమే నని ఇపుడనిపిస్తుంది.
ఒక చిన్న పిడకల వేట– ఆ పుస్తకంలో లోపాలు చూపాలనే పట్టుదలతో ఒక విప్లవ మేధావి అన్నట్టుగా నాకు విజయవాడ మిత్రులు చెప్పారు. నేను ఆ పుస్తకంలో ఒక గొప్ప సన్నివేశాన్ని వివరిస్తూ ‘‘అది చదువుతున్నపుడు లక్ష్మణరావుగారి పాదాలకు నమస్కరించాలనిపిస్తుంది’’ అని ఉద్వేగంగా రాశాను. నన్ను నేను నిలువరించుకోలేక రాసిన మాట అది. విమర్శలో అది కూడదేమో– కానీ విమర్శ ఉద్వేగం గురించి రాలేదు. ‘‘పాదాలకు నమస్క రింటం ఫ్యూడల్. ఓల్గా దానిని ప్రోత్సహిస్తుందా,’’ అని అన్నారట. అది విని నేను మిత్రులతో మరి గద్దర్ అమర వీరులకు ‘‘పాద పాదాన పరి పరి దండాలు’’ అని పాడటం, మనందరం ఉద్వేగంగా వినటం ఇదంతా ఫ్యూడలే కదా అన్నాను. అందరం నవ్వుకున్నాం. నిజమే
కొన్ని పాత వ్యక్తీకరణలు అంత త్వరగా వదిలించుకోలేం
Updated Date - Sep 09 , 2024 | 05:52 AM