ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అవే తప్పులు మళ్లీ మళ్లీ చేస్తే, అదే ఫలితం!

ABN, Publish Date - Aug 22 , 2024 | 05:54 AM

ఓటమితో ఉన్న సమస్య ఏమిటంటే, అందులో జరిగే నష్టం కంటె అవమానం ఎక్కువ బాధిస్తుంది. ఓడిపోయినవారు తొందరగా సమాధానపడలేరు. నవీన్ పట్నాయక్ లాంటి గంభీరులు అరుదు. తమ తప్పేమీ

ఓటమితో ఉన్న సమస్య ఏమిటంటే, అందులో జరిగే నష్టం కంటె అవమానం ఎక్కువ బాధిస్తుంది. ఓడిపోయినవారు తొందరగా సమాధానపడలేరు. నవీన్ పట్నాయక్ లాంటి గంభీరులు అరుదు. తమ తప్పేమీ లేదని, ప్రజలను ప్రత్యర్థులు మభ్యపెట్టారని కొందరు బుకాయిస్తారు. అంతా మంచే చేసినా ఇట్లా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని మరి కొందరు అమాయకత్వాన్ని అభినయిస్తారు. సగం ఓటములతో మరో సమస్య. చావు తప్పి కన్ను లొట్టపోయిన తీరులో గెలుపులు దక్కుతాయి కొందరికి. తామేదో ఘనవిజయం సాధించినట్టు వారు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంటారు.

నష్టమో కష్టమో ఓటమో జరిగిపోయినప్పుడు, ఆ తరువాత అయినా వెనక్కి తిరిగి చూసుకోవాలి. అద్దం ముందు నిలబడి అంతరాత్మతో మాట్లాడాలి. పారిన నీటికి కరకట్ట కట్టలేము కానీ, రేపటి తప్పును నివారించుకోవచ్చు. గుణపాఠం అంటే అదే. అనుభవజ్ఞులు తక్కువ తప్పులు చేయడం, ఎదురుదెబ్బలను నిబ్బరంగా కాచుకోవడం అందువల్లనే.

కొందరు పాఠాలు నేర్చుకోవడంలోనూ తప్పులు చేస్తారు. ప్రజలను బాగా కష్టపెట్టి ఒక నాయకుడు పదవి పోగొట్టుకున్నాడనుకోండి. తగినంత కష్టపెట్టలేదు కాబట్టే, అలుసు తీసుకుని ఓడించారనీ, ఈ సారి అధికారం వస్తే, జనం అసలే కిక్కురుమనలేకుండా తొక్కిపెట్టాలనీ పాఠం నేర్చుకుంటే ఎట్లా ఉంటుంది? బొటాబొటి విజయంతో, అరువు బలంతో మూడోసారి కేంద్రంలో అధికారం దక్కించుకున్న జాతీయపార్టీ, పాపం, పాఠాలు నేర్చుకుందామనే చూస్తోందట, కానీ, ఆ పార్టీకి ఆశీస్సులు అందించే పీఠాధిపతులు, మతపెద్దలు కొందరు విలోమ పాఠాలు నేర్పుతున్నారట. ‘‘మునుపు మెత్తగా ఉన్నావు కాబట్టే, నిన్ను జనం మొత్తారు, ఇప్పుడు కఠినంగా ఉండు, జనం దారికి వస్తారు’’ అంటూ నాయకుడికి చెబుతున్నారట. ఆయన వింటాడో లేదో తెలియదు.


ఏ తప్పులు, ప్రగల్భాలు, అహంకారాలు బీఆర్ఎస్‌ను, కేసీఆర్‌ను గద్దె దించాయో, అవే అవలక్షణాలను కాంగ్రెస్, రేవంత్‌రెడ్డి పుణికి పుచ్చుకుంటే, ఇక ప్రజలకు దొరికిన ‘మార్పు’ ఏమిటి? ఊరూరా న్యూయార్క్‌ను, సింగపూర్‌ను, డల్లాస్‌ను ఏర్పాటు చేస్తామని గొప్పలు పోయిన కేసీఆర్‌ మాటలను కొందరు నిజమనుకున్నారు, చాలామంది హేళన చేశారు. మరి ఇప్పుడు, ఆ నగరాల నామస్మరణ కొత్తగా తిరిగి వినిపిస్తున్నది! చినుకు పడితే ఊరుచెరువయ్యే మహానగరానికి మోక్షం లేదు కానీ, నాలుగో నగరం పేరిట, గాలిమేడలు లేస్తున్నాయి! 30వేల కోట్ల రుణమాఫీయే ముక్కుతూ మూల్గుతూ చేస్తున్నప్పుడు, లక్షల కోట్ల ప్రాజెక్టులతో భారీ ప్రాజెక్టులు ఎట్లా సాధ్యం?

బీజేపీతో కలిసి బీఆర్ఎస్‌ను చెడుగుడు ఆడుకోవాలని కాంగ్రెస్ అనుకోవడం బాగానే ఉంది. కానీ, ఒకవేళ, బీఆర్ఎస్‌ అణగారిపోయిందా, తరువాతి కబళం తానేనని, బీజేపీ తలచుకుంటే కాలం చెల్లిన కేసులు కూడా నిద్రలేస్తాయని రేవంత్‌రెడ్డి గుర్తించి, జాగ్రత్తపడాలి.


వాళ్లు చెప్పిన విలువలేమిటో తెలియదు కానీ, పోయిన రెండు దఫాలుగా అనుసరిస్తూ వస్తున్న కొన్ని పద్ధతులను మాత్రం జాతీయ అధికారపార్టీ మరింత ఉధృతంగా ముందుకు తీసుకువెడుతోంది. రెండు ప్రాంతీయ పార్టీల భుజాల మీద తాను నిలబడ్డానని మరచిపోయి, ప్రతిపక్ష, ప్రాంతీయ పార్టీల రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆయుధాలు ఎక్కుపెడుతూ ఉన్నది. ప్రజల వాస్తవ, దైనందిన సమస్యలను పట్టించుకుని, ఆ దిశగా ఏవైనా దిద్దుబాటు చర్యలు తీసుకోవలసింది పోయి, పాత బాణీలోనే చాణక్య రాజకీయాలు నడుపుతోంది.

ముందున్న గండం, లేదా, అవకాశం, మహారాష్ట్ర ఎన్నికలు. వాటి తేదీలు ప్రకటించలేదు కానీ, ఈలోగా, హర్యానా, కశ్మీర్ ఎన్నికల ప్రక్రియ మొదలయింది. వీటిలో గణనీయమైన విజయాలు సాధిస్తే, ఎన్‌డీఏలో బీజేపీ వాటా పెరుగుతుంది. ఇతరుల మీద ఆధారపడే అవసరం తగ్గుతుంది. ఆ మేరకు, మద్దతు ఇస్తూ సాయపడుతున్న పార్టీల పలుకుబడి కూడా తగ్గుతుంది. అది బీజేపీకి చాలా అవసరం. పార్లమెంటు ఎన్నికలలో మహారాష్ట్రలో బాగా ఎదురు దెబ్బ తగిలింది. హర్యానాలో బాగానే బలహీనపడింది. పాఠం నేర్చుకుని పురోగమించాలనుకునే పార్టీ ఏమిచేయాలి? ప్రజల అసంతృప్తులను ఉద్దేశించి పనిచేయాలి. కానీ, వెనుకటి గుణం ప్రకారం, ఉద్వేగాలను ప్రయోగించడమనే అడ్డదారినే ఎంచుకుంటోంది.

ఆవేశరాజకీయాలను ఆశ్రయించాలన్నా అవకాశాలు రావాలి కదా, వస్తాయి, వచ్చాయి కూడా. ఒకటి, బంగ్లాదేశ్ పరిణామాలు. అక్కడ షేక్ హసీనా ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రమై, విద్యార్థుల ఆందోళనలు ఉధృతమై, కీలక రాజకీయ పరిణామాలు సంభవించాయి. షేక్ హసీనా భారత్‌కు పారిపోయి వచ్చిన తరువాత, జరిగిన సంఘటనలలో ఉద్యమకారులు, వారిపేరిట అరాచకశక్తులు విధ్వంసాలకు పాల్పడ్డారు. బంగ్లాదేశ్‌లోని మైనారిటీలైన హిందువుల మీద, వారి ఆస్తుల మీద, దైవ‍స్థలాల మీద దాడులు జరిగాయి. వాటిలో అవామీలీగ్ మద్దతుదారులుగా జరిగిన దాడులు, మతపరమైన దాడులు కూడా ఉన్నాయి. సహజంగానే, అది భారత సమాజానికి ఆందోళన కలిగిస్తుంది. దౌత్యపరంగా ఒత్తిడి తేవడం, విజ్ఞప్తులు చేయడం మినహా భారత ప్రభుత్వం కూడా ఏమీ చేయలేకపోయింది. కానీ, తొందరలోనే బంగ్లాలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. వెంటనే శాంతిభద్రతలు చక్కబడలేదు కానీ, భయపడినంత దీర్ఘకాలం పట్టలేదు. బంగ్లాదేశ్ పరిణామాల విషయంలో జాతీయ అధికారపార్టీ, దానికి పూర్తి మద్దతు ప్రకటించే ఆంగ్ల, హిందీ మీడియా, బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు. భారతదేశంలోని హిందువులు బంగ్లాదేశ్‌లోని సాటి మతస్థుల భద్రత విషయంలో తీవ్ర భయాందోళనలకు గురిఅయ్యేట్టు మితిమీరిన ప్రచారం చేశాయి. వారి ప్రసారాల్లో వాస్తవం అసలే లేదని కాదు, కానీ, విపరీత వ్యాఖ్యానాలే ఎక్కువ. పోనీ, బంగ్లాలో రాజకీయ అస్థిరతను చక్కబరచడంలో భారత్‌కు ఏదైనా అవకాశం దొరికిందా, బంగ్లా హిందువులకు భద్రత కల్పించడంలో ఏదైనా సొంత చొరవ సాధ్యపడిందా అంటే అదీ లేదు. జాతీయ మీడియా ప్రచారం చేసినట్టు, అమెరికా ప్రాబల్యమో, చైనా తెరవెనుక మంత్రాంగమో పనిచేశాయి, సాధారణ స్థితివైపు బంగ్లాదేశ్ నెమ్మదిగా నడుస్తున్నది.


బంగ్లాదేశ్ గిట్టుబాటు కాకపోయినా, బెంగాల్ ద్వారా రాజకీయ లాభం బాగానే సాధ్యపడేట్టు ఉంది. మహిళా డాక్టర్, ఆస్పత్రి ఆవరణలోనే ఎదుర్కొన్న చిత్రహింస దారుణమైనది, అమానుషమైనది. ఆ దుర్మార్గాన్ని చెప్పడానికి భాష సరిపోదు. నిర్భయ సంఘటన తరువాత మగోన్మాదం తగ్గిందీ లేదు, స్త్రీల భద్రత విషయంలో యంత్రాంగాల సున్నితత్వం పెరిగిందీ లేదు. కోల్‌కతా సంఘటన తరువాత దేశవ్యాప్తంగా వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు భయభ్రాంతులయ్యారు. మహిళాసంఘాలతో సహా పౌరసమాజం అంతా ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. హైకోర్టు కల్పించుకుని కేసును సీబీఐకి ఇచ్చింది. సుప్రీంకోర్టు సొంతంగా ఈ దురంతం మీద విచారణ జరుపుతోంది. నేరాన్ని కప్పిపుచ్చడానికి, నేరం మీద నిరసనను అణచివేయడానికి మమతాబెనర్జీ ఎందుకంత క్రూరమైన చర్యలు చేపట్టారో తెలియదు. సందేశ్ కాళీ ఘోరాలను క్షమించి గెలిపించారు కానీ, ఈ నేరపూరిత నిర్లక్ష్యానికి మమత మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. అయితే, బీజేపీ, దాని అనుచర సమాచార సాధనాలు కోల్‌కతా సంఘటన మీద మోగిస్తున్న రణభేరిలో నిజాయితీ ఉన్నదా అన్న సందేహం కలిగితీరుతుంది. ప్రతిపక్ష రాష్ట్రం కాకపోతే, ఇంత గగ్గోలు చేసేవారా? కట్టెదుట నేరాలు జరుగుతుంటే కళ్లు మూసుకోవడం బీజేపీకి మాత్రం కొత్తదా? మణిపూర్ విషయంలో ఏమి జరిగింది? వినేశ్ ఫోగాట్ విషయంలో ఏమి చేశారు? మరి మహారాష్ట్రలో ఠానే జిల్లా బద్లాపూర్‌లో చిన్నారులపై జరిగిన లైంగిక హింస మీద కవరేజ్ ఎక్కడ? దాని మీద కేంద్రప్రభుత్వం కలవరపడదేమి? అక్కడ అస్మదీయ ప్రభుత్వం ఉన్నందుకే గొంతు లేవడం లేదా?

సిద్దరామయ్య మీద కేసు సంధించారు. గవర్నర్లను ఎడాపెడా వాడుకోవడంలో కేంద్రప్రభుత్వం ఆరితేరిపోయింది. కర్ణాటక ముఖ్యమంత్రి కడిగిన ముత్యమనీ, సుద్దపూసని అనుకోనక్కరలేదు, కానీ, దేశంలోని బీజేపీ ముఖ్యమంత్రులనేకుల కంటె మెరుగైన నాయకుడే. రాజకీయ నేతల మీద కేసులు పెట్టడానికి అవినీతి తీవ్రతో, విస్తృతో కారణం కానక్కరలేదు, ప్రతిపక్ష రాష్ట్రం అయితే చాలు. కేరళలో కూడా 2015 నాటి ఒక పాత కేసు ప్రాణం పోసుకుంటున్నది. రాష్ట్రాలను వేటాడే ఈ ధోరణి విషయంలో చంద్రబాబు, నితిశ్ కుమార్ నిరసన తెలిపినా తెలపకున్నా, తమ జాగ్రత్తలలో తాముండడం మాత్రం అవసరం. అవసరార్థం ఇప్పుడు అణకువ చూపిస్తున్నా, బలం పుంజుకున్నాక, బీజేపీ పెద్దన్న హజం చూపించదని ఏమీ లేదు. తన బలహీన విజయం గురించి పొరపాటు పాఠాలు తీసుకుంటే దాని ఫలితం బీజేపీయే అనుభవిస్తుంది. తమ ఘన విజయంలో ఇమిడి ఉన్న బాధ్యతను, అవకాశాలను, ప్రమాదాలను చంద్రబాబు గ్రహించి, మెళుకువతో ఉండాలి.

గెలిచిన పార్టీ కూడా ఓడిన పార్టీ అనుభవం నుంచి నేర్చుకోవాలి. తెలంగాణలో బీఆర్ఎస్‌ స్వయంకృతాపరాధాన్ని తెలుసుకోకుండా, ప్రజలదే తప్పు అని హుంకరిస్తున్నది. మరి బీఆర్ఎస్‌ ఓటమి నుంచి కాంగ్రెస్ ఏమి నేర్చుకున్నది? ఏ తప్పులు, ప్రగల్భాలు, అహంకారాలు బీఆర్ఎస్‌ను, కేసీఆర్‌ను గద్దె దించాయో, అవే అవలక్షణాలను కాంగ్రెస్, రేవంత్‌రెడ్డి పుణికి పుచ్చుకుంటే, ఇక ప్రజలకు దొరికిన ‘మార్పు’ ఏమిటి? ఊరూరా న్యూయార్క్‌ను, సింగపూర్‌ను, డల్లాస్‌ను ఏర్పాటు చేస్తామని గొప్పలు పోయిన కేసీఆర్‌ మాటలను కొందరు నిజమనుకున్నారు, చాలామంది హేళన చేశారు. మరి ఇప్పుడు, ఆ నగరాల నామస్మరణ కొత్తగా తిరిగి వినిపిస్తున్నది! చినుకు పడితే ఊరుచెరువయ్యే మహానగరానికి మోక్షం లేదు కానీ, నాలుగో నగరం పేరిట, గాలిమేడలు లేస్తున్నాయి! 30వేల కోట్ల రుణమాఫీయే ముక్కుతూ మూల్గుతూ చేస్తున్నప్పుడు, లక్షల కోట్ల ప్రాజెక్టులతో భారీ ప్రాజెక్టులు ఎట్లా సాధ్యం?

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా మూడు నెలలు కూడా కాలేదు. ఎన్నికల వాగ్దానాలకు సంబంధించి, అక్కడ కూడా ఎన్నో సందేహాలు, ప్రశ్నలు ఉన్నాయి కానీ, ప్రజలు వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు. కొత్త ప్రభుత్వాల మీద ప్రజలకు ఎంతకాలానికి అసంతృప్తి మొదలవుతుంది అంటే ఒకే సమాధానం రావడం కష్టం. ఎటువంటి పాలన మీద విరక్తి చెంది కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు అన్నదాని మీద కొంత, కొత్త పాలనలో కనిపించే సానుకూల సూచనల మీద మరికొంత ప్రజలు పెట్టే గడువు ఆధారపడి ఉంటుంది. జగన్ ప్రభుత్వమంత కాకపోయినా, రెండు దఫాల పాలనలో కేసీఆర్‌ ఏలుబడి కూడా తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. దాన్ని తొలగించాక వచ్చిన కొత్త పాలనకు ప్రజలు గడువు ఇస్తున్నారు కానీ, తొమ్మిదినెలలు దాటింది కదా, కొంత పెదవి విరుపు మొదలయింది. కరెంటు పోయి వచ్చినప్పుడల్లా కేసీఆర్‌ను జనం తలచుకుంటున్నారని చెబుతున్నారు! ఆ సందర్భాలు రోజుకు పది పదిహేను సార్లు వస్తున్నట్టున్నాయి! అవినీతి అనో, అక్రమాలనో ఆరోపణలు పెద్ద ఎత్తున రావడం లేదు, కాకపోతే, పాలన మీద ఇంకా పట్టురాలేదని మాత్రం జనం బాగానే చెప్పుకుంటున్నారు!

బీజేపీతో కలిసి బీఆర్ఎస్‌ను చెడుగుడు ఆడుకోవాలని కాంగ్రెస్ అనుకోవడం బాగానే ఉంది. కానీ, ఒకవేళ, బీఆర్ఎస్‌ అణగారిపోయిందా, తరువాతి కబళం తానేనని, బీజేపీ తలచుకుంటే కాలం చెల్లిన కేసులు కూడా నిద్రలేస్తాయని రేవంత్‌రెడ్డి గుర్తించి, జాగ్రత్తపడాలి.

Updated Date - Aug 22 , 2024 | 05:54 AM

Advertising
Advertising
<