ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వెలిగిన విపక్షం

ABN, Publish Date - Jul 17 , 2024 | 04:53 AM

లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన ఇండియా కూటమికి ఇటీవలి ఉప ఎన్నికల విజయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. ఏడురాష్ట్రాల్లో 13స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పదింటిని ఇండియా కూటమి...

లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన ఇండియా కూటమికి ఇటీవలి ఉప ఎన్నికల విజయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. ఏడురాష్ట్రాల్లో 13స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పదింటిని ఇండియా కూటమి కైవసం చేసుకుంది. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో చెరో రెండు స్థానాలతో మొత్తం నాలుగుస్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకుంటే, పశ్చిమబెంగాల్‌లో మొత్తం నాలుగింటినీ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎగరేసుకుపోయింది. పంజాబ్‌లో జలంధర్‌ వెస్ట్‌ని ఆమ్‌ ఆద్మీపార్టీ, తమిళనాడులోని విక్రవందిని డీఎంకె గెలుచుకుంటే, హిమాచల్‌, మధ్యప్రదేశ్‌లలో చెరొకస్థానంతో మొత్తం రెండుసీట్లను మాత్రమే బీజేపీ సాధించుకుంది. బిహార్‌లో మిగిలిన ఆ ఒక్క స్థానం ఓ స్వతంత్ర అభ్యర్థికి పోయింది.


లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ చేతుల్లో ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో తుడిచిపెట్టుకుపోయిన నెలన్నరకాలంలోనే నాలుగు అసెంబ్లీ స్థానాలను సంపాదించడం కాంగ్రెస్‌కు శక్తినిస్తుంది. మరీ ముఖ్యంగా, మొత్తం నాలుగు లోక్‌సభ సీట్లనూ తన నాయకత్వంలో ఓడిపోయినందుకు గాను పార్టీ అధిష్ఠానంనుంచి తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్న హిమాచల్‌ ముఖ్యమంత్రి సుఖ్‌వీందర్‌ సింగ్‌ సుక్కూకు ఈ ఉప ఎన్నికల ఫలితాలు ఉపశమనాన్నిస్తాయి. ముగ్గురు ఇండిపెండెంట్లు రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో జరిగిన ఈ ఉపఎన్నికల్లో రెండింటిని గెలుచుకోవడంతో ఆయన ప్రభుత్వం ఇప్పుడు సుస్థిరంగా ఉంది. ఈ ముగ్గురితో పాటు ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటువేయడంతో సుక్కూ ప్రభుత్వం ఇటీవల సంక్షోభంలోకి జారుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ అభిషేక్‌ మనుసింఘ్వీ ఓడిపోవడంతో ఆ ఎమ్మెల్యేలపై అనర్హతవేటుపడింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఈ ఆరుస్థానాలకు జరిగిన పోలింగ్‌లో నాలుగింటిని కాంగ్రెస్‌ గెలుచుకుంది. తాజా విజయంతో సుక్కూ ప్రభుత్వానికి ఇక ఢోకాలేనట్టే. మధ్యప్రదేశ్‌లో ఒక స్థానాన్ని బీజేపీకి కోల్పోయినప్పటికీ, ఉత్తరాఖండ్‌లో ప్రసి‌ద్ధ పుణ్యక్షేత్రం బదరీనాథ్‌ను గెలుచుకోవడం కూడా కాంగ్రెస్‌కు ఊరటనిచ్చే అంశం. అక్కడి ఎమ్మెల్యే బీజేపీలోకి ఫిరాయించినప్పటికీ, ఆ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంది. మతానికి సంబంధించి తనపై బీజేపీ చేస్తున్న విమర్శలను ప్రజలు నమ్మడం లేదని కాంగ్రెస్‌ గట్టిగా చెప్పుకోవచ్చు. పంజాబ్‌ పార్లమెంటరీ ఎన్నికల్లో పదమూడింటిలో మూడు మాత్రమే గెలుచుకున్న ఆప్‌కు కూడా ఇది మంచి పరిణామమే. ఈ పార్టీనుంచి పోయి బీజేపీలో చేరిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేను ఓడించడం ద్వారా ఆప్‌ నైతికంగా పైచేయి సాధించింది.


ఇక, తృణమూల్‌, డీఎంకే తమ రాష్ట్రాల్లో సాధించిన విజయాలు ఆ పార్టీలను మరింత బలోపేతం చేస్తాయి. మూడుస్థానాలను బీజేపీనుంచి స్వాధీనం చేసుకొని, రాష్ట్రంలో తనకు తిరుగులేదని టీఎంసీ ఈ ఫలితాల్లో చాటిచెప్పింది. లోక్‌సభ ఎన్నికల్లో ఆశించినస్థాయిలో సీట్లు సాధించలేక, కనీసబలానికి కూడా ఓ అడుగుదూరంలో నిలిచిపోయిన భారతీయ జనతాపార్టీకి ఈ ఫలితాలు మరింత నిరాశకలిగిస్తాయి.

సార్వత్రక ఎన్నికల అనంతరం అతిసమీపకాలంలో జరిగిన ఈ ఉపఎన్నికల్లోనూ ఫలితాలు అదేరీతిలో ఉండటం విశేషం. పూర్తిగా స్థానిక అంశాలే కారణమని ఇదమిత్థంగా చెప్పలేని రీతిలో, దేశంలోని ఏడు రాష్ట్రాలకు ఈ ఫలితాలు విస్తరించి ఉన్నాయి. బీజేపీ మీద ప్రజాగ్రహం జాతీయ స్థాయిలోనే కాక, అసెంబ్లీ స్థాయిలో కూడా బలంగా ఉన్నదని, గతంలో నెగ్గిన స్థానాలను కూడా అది ఇప్పుడు కోల్పోవడం అందుకు నిదర్శనమని విపక్షాలు గట్టిగా అనగలుగుతున్నాయి. పైగా, అత్యధిక స్థానాలను కూటమి పార్టీలు నేరుగా బీజేపీతో పోటీపడి గెలుచుకోవడం, తమనుంచి చీలి, బీజేపీలో చేరినవారిని ఓటర్లు శిక్షించడం వాటికి ఆనందాన్నిస్తోంది.


కారణాలు ఏమైనప్పటికీ, పదమూడులో పదింటిని సంపాదించిపెట్టిన ఈ ఫలితాలు ఇండియా కూటమికి ఎన్డీయేమీద సభలోపలా బయటా పోరాడే శక్తిని ఇస్తాయి. బీజేపీ కచ్చితంగా ఈ ఫలితాలను విశ్లేషించుకుంటుంది, పరిస్థితులను చక్కదిద్దుకొనేందుకు ప్రయత్నిస్తుంది. సంస్థాగత సామర్థ్యం, సమర్థ నాయకత్వం, నైపుణ్యం దానికి ఉన్నాయి. మరికొద్దినెలల్లో బిహార్‌, మహారాష్ట్ర, హర్యానా, తదితర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. జమ్మూకశ్మీర్‌లో సైతం ఎన్నికలుంటాయని కేంద్రం అంటోంది. రాబోయే రోజుల్లో భారతీయ జనతాపార్టీని నిలువరించాలంటే విపక్షకూటమి మరింత చాకచక్యంగా, బీజేపీ వ్యతిరేక ఓటుచీలకుండా, ఐకమత్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

Updated Date - Jul 17 , 2024 | 04:53 AM

Advertising
Advertising
<