దేవుడు మెచ్చే కార్యం అవయవదానం
ABN, Publish Date - Aug 03 , 2024 | 01:36 AM
అనారోగ్యంతో ఉన్నపుడుగానీ ఆరోగ్యం విలువ అర్థం కాదు. ఆధునిక ఆహారపు అలవాట్లూ, జీవనవిధానమూ మానవశరీరంలో కలిగిస్తున్న విధ్వంసం భయపెట్టే స్థాయిలో ఉంది. కొవిడ్ తర్వాత చిన్న వయసువారు
అనారోగ్యంతో ఉన్నపుడుగానీ ఆరోగ్యం విలువ అర్థం కాదు. ఆధునిక ఆహారపు అలవాట్లూ, జీవనవిధానమూ మానవశరీరంలో కలిగిస్తున్న విధ్వంసం భయపెట్టే స్థాయిలో ఉంది. కొవిడ్ తర్వాత చిన్న వయసువారు సైతం గుండెపోటుకు గురవడం, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు వంటి ప్రధాన అవయవాలు దెబ్బతినడం.. వైద్యశాస్త్ర వర్గాలను సైతం కలవర పెడుతున్నాయి. అవయవాల మార్పిడి అవసరం రానురానూ పెరుగుతోంది. ఆధునిక వైద్యశాస్త్ర పరిజ్ఞానం వల్ల అవయవ మార్పిడి సులభతరం అవుతూ వస్తోంది. దేశంలో అవయవ మార్పిడి చేసే వైద్యనిపుణులు పెరిగారు. ఆసుపత్రులు పెరిగాయి. మార్పిడికి అవసరమైన అవయవాల లభ్యత మాత్రం పెరగలేదు. అవయవాల అమరికకై ఎదురు చూస్తున్నవారి సంఖ్య లక్షల్లో ఉండగా, దాతలు వేలల్లోనే ఉన్నారు. రకరకాల కారణాలతో చనిపోతున్నవారి నుంచి అవయవాలు సేకరించగలిగితే వేలాదిమందికి తిరిగి ప్రాణం పోయవచ్చు.
అవయవదానం పట్ల తగిన అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం. వివిధ ప్రమాదాల్లో చనిపోతున్నవారి నుంచి, బ్రెయిన్‌డెడ్ అయిన వారి నుంచి సేకరించే అవయవాలు అనేక ప్రాణాలను నిలుపగలవు. కానీ, కుల, మత పరమైన నమ్మకాలు, విశ్వాసాలు అవయవదానానికి అడ్డుగా మారుతున్నాయి. అవయవదానం ద్వారా చనిపోయినా జీవించవచ్చనే అభిప్రాయాన్ని ప్రజల్లో నాటుకునేలా చేయాల్సిన అవసరం చాలా ఉంది.
అవయవదానంపై విశేష పరిశోధనలకు కృషి చేసినందుకు రొనాల్డ్ లీ హెర్రిక్‌కి 1990లో నోబెల్ బహుమతి ప్రకటించారు. ఆ స్ఫూర్తిని గుర్తు చేయడానికే ప్రపంచ అవయవదాన దినోత్సవంగా ఆగస్టు 3న జరుపుకుంటున్నారు. మనదేశంలో తొలి గుండె మార్పిడి జరిగిన 1994 ఆగస్టు 3ను జాతీయ అవయవదాన దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ అయ్యింది.
ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ అవయవదాన ఒప్పంద పత్రాలు ఇవ్వవచ్చు. భవిష్యత్తులో ఏ కారణం చేత అయినా మరణం సంభవిస్తే, తమ శరీరంలో కళ్లు సహా ఉపయోగపడే అవయవాలను సేకరించి అవసరమైనవారికి వినియోగించవచ్చు అనే ప్రమాణ పత్రం అది. 1997లోనే నేను ఈ పవిత్ర కార్యక్రమం కుటుంబ సహకారంతో పూర్తి చేసాను. 27 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ అవయవదానంపై సమాజంలో పెద్దగా చైతన్యం పెరగకపోవడం ఆందోళనపరుస్తోంది. వయసురీత్యానో, ఆరోగ్య సమస్యలతోనో, ఎదురుచూడని ప్రమాదాలలోనో చనిపోయిన వారు మొత్తం శరీరాన్నీ, లేదా మొత్తం అవయవాలనూ దానం చేయవచ్చు. చనిపోయిన తర్వాత కూడా, మరికొంతమందిలో, కొన్నేళ్లపాటు బ్రతికుంటారు. అవయవ దానానికి వయసుతో నిమిత్తం లేదు. గుండె, మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, క్లోమగ్రంధి (పేంక్రియాస్) వంటి అవయవాలు దెబ్బతిన్నవారు మరణానికి చేరువ అవుతూ, శారీరకంగా, ఆర్థికంగా చితికిపోతూ ఉంటారు. ఇటువంటి స్థితిలో ఉన్నవారికి అవయవ మార్పిడి పునర్జన్మను ఇస్తుంది. మరీ పసివయసు పిల్లలు అవయవాల సమస్యతో కళ్ల ముందే కృశించిపోతూ ఉంటే తల్లిదండ్రులు అనుభవించే నరకం చెప్పనలవిగానిది. ఈ నరకబాధ నుంచి విముక్తి కలిగించగలగడం కన్నా పుణ్యం ఏముంటుంది? ఏ దేవుడైనా మెచ్చే కార్యమే ఇది.
అవయవదాన చైతన్య కార్యక్రమం పెద్ద ఎత్తున జరగాలి. నేషనల్ ఆర్గాన్, టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (ఎన్.ఒ.టి.టి.ఒ.), మోహన్ ఫౌండేషన్, నర్మద కిడ్నీ ఫౌండేషన్ వంటి సంస్థలకు అవయవదాన ఒప్పంద విల్లు పత్రాలను ఇవ్వవచ్చు. సమీపంలోని ఏ ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించినా ఇందుకు సంబంధించిన వివరాలు తెలుస్తాయి. కేన్సర్, ఎయిడ్స్, కుటుంబ నియంత్రణ వంటి కార్యక్రమాలకు ఇచ్చినంత ప్రాధాన్యాన్ని ప్రభుత్వం అవయవదాన కార్యక్రమానికి కూడా ఇవ్వాలి. ప్రచారం ఉధృతంగా సాగాలి. ప్రాథమిక స్థాయిలోనే అవయవదానం ప్రాధాన్యాన్ని, అవసరాన్ని పిల్లలకు కలిగేలా పాఠ్యాంశాల్లో భాగం చేయాలి. ఇదో మానవీయ కార్యమనే నమ్మకం కలిగించాలి. వ్యాపార ప్రకటనల్లో దర్శనమిచ్చే క్రికెటర్లు, నటులు, ప్రముఖులు, స్వచ్ఛందంగా అవయవదానపు ప్రకటనల్లో కనిపించాలి. ప్రభుత్వ ఉద్యోగులు, జీతభత్యాలను అందుకుంటున్న రాజకీయ నాయకులు అవయదానాలకు ముందుకు రావాలి. తాము అవయవదానానికి సిద్ధపడి ఒప్పంద పత్రాలు ఇచ్చామని ప్రకటించాలి. ఇందువల్ల సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తారు.
– డాక్టర్ కెజె రావు
సామాజిక కార్యకర్త
(నేడు జాతీయ అవయవదాన దినోత్సవం)
Updated Date - Aug 03 , 2024 | 01:36 AM