అసందర్భ వ్యాఖ్యలు
ABN, Publish Date - Sep 28 , 2024 | 04:49 AM
బాలివుడ్ నటి, భారతీయ జనతాపార్టీ పార్లమెంట్ సభ్యురాలు కంగనా రనౌత్ ఇతరులమీద చేస్తున్న విమర్శల ప్రభావం ఏపాటిదో తెలియదు కానీ, తన
బాలివుడ్ నటి, భారతీయ జనతాపార్టీ పార్లమెంట్ సభ్యురాలు కంగనా రనౌత్ ఇతరులమీద చేస్తున్న విమర్శల ప్రభావం ఏపాటిదో తెలియదు కానీ, తన దూకుడు వ్యాఖ్యలతో పార్టీకి మాత్రం నష్టం చేస్తున్నారు. రద్దయిన సాగుచట్టాలను తిరిగి తీసుకురావాలంటూ ఆమె చేసిన కొన్ని వరుస వ్యాఖ్యలమీద గురువారం హర్యానా బీజేపీ ప్రతినిధి విరుచుకుపడిన తీరు చూసినప్పుడు, ఈ హిమాచల్ ప్రదేశ్ మండీ ఎంపీ వ్యాఖ్యలతో హర్యానా రైతులకు బాగా మండిందని స్పష్టంగా అర్థమవుతుంది. హర్యానాని కాంగ్రెస్ వశం చేసుకోవడానికి మీరొక్కరు చాలు అని పార్టీ అభిమాన నెటిజన్లు ఆమెను వెంటాడుతున్నారు. పదిరోజుల్లో హర్యానాలో ఎన్నికలు ఉండగా ఆమె ఈ వ్యాఖ్యలతో ఏడాదిపాటు సాగిన సాగుచట్టాలవ్యతిరేక ఉద్యమాన్ని రైతులకు మళ్ళీ గుర్తుచేశారు. ఆ కాలంలో బీజేపీ పెద్దలంతా తమపట్ల ఎంత అమానుషంగా వ్యవహరించారో, ఎంతగా చులకనచేశారో రైతులకు గుర్తుకొచ్చి ఉంటుంది. మూడు వ్యవసాయచట్టాల విషయంలో పాలకుల అలనాటి కాఠిన్యానికి కంగన ఓ బలమైన ప్రతీక కనుక బీజేపీ ఇంతగా భయపడటం సహజం.
గతంలో బీజేపీ అధినాయకులు సదరు చట్టాలపై వెలిబుచ్చిన అభిప్రాయాలకు, ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు భిన్నమైనవేమీ కావు. ఆర్థికంగా బలంగా ఉన్న కొన్ని రాష్ట్రాలకు చెందిన కొద్దిమంది రైతులు మాత్రమే ఈ మూడుచట్టాలను వ్యతిరేకిస్తున్నారని, దేశవ్యాప్త రైతుల ప్రయోజనాలను రైతుల ముసుగులో ఉన్న కొన్ని దుష్ట శక్తులు బలిపెడుతున్నాయని వారు అప్పట్లో వాదించారు. ఖలిస్తానీ తీవ్రవాదులు ఉద్యమంలో వచ్చిచేరారన్న విమర్శలు సైతం చేశారు. రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో మకాం వేసుకొని, ఎండకు ఎండుతూ వానకూ తడుస్తూ పోరాడుతూంటే సమస్త వ్యవస్థలూ సహాయ నిరాకరణ చేశాయి, విరుచుకుపడ్డాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపూర్‌లో కేంద్రమంత్రి కుమారుడు రైతులమీదకు తన కారుపోనిచ్చి కొందరి ప్రాణాలు తీసిన ఘటన దేశాన్ని కుదిపేసింది. రైతుల నిరసనను కేంద్రపాలకులు తమపై తిరుగుబాటుగా, భావిస్తున్నారనేందుకు ఇటువంటి అనేక ఉదాహరణలు ఆ కాలంలో ఉన్నాయి. ఆ పోరాటాన్ని అణచివేసేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో, ముంచుకొస్తున్న పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో ఓటమి భయంతో ఆ చట్టాలను రద్దుచేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.
కేంద్రం వాటిని ఉపసంహరించుకున్నప్పటికీ, ఏడాదిపాటు సాగిన ఆ పోరాటాన్ని రైతులు గుర్తుంచుకుంటారు. ఆ కాలంలో నిరసనకారులను ఉగ్రవాదులుగా, దానిని ఖలిస్తానీ ఉద్యమంగా అభివర్ణించిన కంగనా రనౌత్ వంటివారిని మరీనూ. అప్పటి అవమానాలను ఎన్నేళ్ళయినా మరిచిపోరనడానికి ఈ ఏడాది జూన్‌లో కంగనమీద చండీగఢ్ విమానాశ్రయంలో ఒక సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ చేసిన దాడి ఓ ఉదాహరణ. సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం అలాగే కొనసాగితే భారత్‌లోనూ బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు తలెత్తేవని కంగన మరో వ్యాఖ్యచేశారు. మళ్ళీ సాగుచట్టాల ఊసుతెచ్చి, పార్టీ ఒత్తిడిమేరకు వెనక్కుతీసుకొని, ఆమె క్షమాపణలు కోరుతూండవచ్చు, అది ఆమె వ్యక్తిగత అభిప్రాయమంటూ పార్టీ కూడా చేతులుదులుపుకొనే ప్రయత్నం చేస్తుండవచ్చు. కానీ, మూడోమారు అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీకి జాట్లు ఇప్పటికే దూరమైనారని విశ్లేషణలు వెలువడుతున్నాయి. మహిళా మల్లయోధుల ఉద్యమం పట్ల కేంద్రప్రభుత్వ వైఖరి కూడా ఇందుకు దోహదం చేసింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కంగన వ్యాఖ్యల ప్రభావం ఏ మేరకు ఉంటుందన్నది వేరే విషయం. కానీ, గతంలో బీజేపీ ప్రతినిధి ఒకరు ఓ టీవీ చర్చలో మహమ్మద్ ప్రవక్తమీద దూకుడు వ్యాఖ్యలు చేసి దౌత్యసమస్యలు తెచ్చిపెట్టిన ఉదాహరణ కూడా ఉన్నది కనుక కంగనవంటివారిని కంట్రోల్‌లో ఉంచడం అందరికీ మంచిది.
Updated Date - Sep 28 , 2024 | 04:49 AM