బీమాపై పన్నుబండ
ABN, Publish Date - Aug 07 , 2024 | 02:12 AM
జీవిత, ఆరోగ్యబీమా ప్రీమియంలపై చెల్లించే జీఎస్టీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి పక్షాలు మంగళవారం పార్లమెంట్‌భవనం ముందు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఏడు భాషల్లో రాసిన...
జీవిత, ఆరోగ్యబీమా ప్రీమియంలపై చెల్లించే జీఎస్టీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి పక్షాలు మంగళవారం పార్లమెంట్‌భవనం ముందు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఏడు భాషల్లో రాసిన ప్లకార్డులను పట్టుకొని, నినాదాలు చేస్తూ బీమా ప్రీమియంపై 18శాతంగా ఉన్న జీఎస్టీని టాక్స్ టెర్రరిజంగా అభివర్ణించాయి. కష్టకాలంలో ఆదుకుంటుందన్న ఆశతో సగటుమనిషి పైసాపైసా కూడబెట్టి ఏటా బీమా ప్రీమియం కడుతుంటే, దానిమీద కూడా ఇంతటి భారీస్థాయిలో జీఎస్టీ విధించడం కంటే అమానుషత్వం ఇంకేమైనా ఉంటుందా? అని విపక్షనేతలు విమర్శలు చేస్తున్నారు. జీవిత, ఆరోగ్యబీమాలను పూర్తిగా పన్నునుంచి మినహాయించాలని, ఆరోగ్యసమస్యలమీద అత్యధికంగా ఖర్చు చేస్తున్నది భారతీయులే కనుక, ఇంతటి అత్యవశ్యకమైన అంశంలో అధికజీఎస్టీలు సరికాదని వారంటున్నారు. మోదీ ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీతో ఏటా 24వేలకోట్ల రూపాయలు సంపాదిస్తోందని రాహుల్‌గాంధీ వాదన. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఒక్క ఆరోగ్యబీమా ప్రీమియంలపైనే ప్రభుత్వానికి 8263కోట్లు వసూలైందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌధరి లోక్‌సభకు తెలియచేశారు. జీఎస్టీ తొలగింపు డిమాండ్ బలంగా ఉన్నదని అంగీకరిస్తూనే ఏ నిర్ణయమూ చేయాల్సింది కేంద్రం, రాష్ట్రాలతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ మాత్రమేనని ఆయన తేల్చేశారు.
బీమాపై పన్ను పూర్తిగా తొలగించాలంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌కు రవాణామంత్రి నితిన్‌గడ్కరీ లేఖ రాయడంతో ఈ డిమాండ్‌కు మంచిఊతం వచ్చింది. నాగపూర్ డివిజనల్ ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘం అభ్యర్థనమేరకు ఈ లేఖరాస్తున్నట్టుగా చెబుతూనే, వారిని ఉటంకిస్తూనే ఆయన బీమాపై పన్ను సరికాదనీ, దానిని ఉపసంహరించుకోవాలని స్పష్టంగా కోరారు. జీవితబీమాపై పన్ను అంటే జీవితంలో అనిశ్చితిపై పన్నువేయడం, తన కుటుంబానికి భద్రతనిచ్చేందుకు యజమాని తీసుకొనే ఈ బీమాపై పన్ను ఉండకూడదు, ప్రస్తుత సమాజంలో ఎంతో అవసరమైన మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ కూడా సరికాదు అన్నారాయన. జీవిత, ఆరోగ్యబీమా పాలసీలు అత్యవశ్యకం అని ఉధృతంగా ప్రచారం చేస్తూనే వాటినుంచి భారీగా పన్నుపిండుకోవాలన్న ప్రభుత్వం పేరాశ బీమారంగాన్ని దెబ్బతీస్తున్నదని ఉద్యోగసంఘాల బాధ. ప్రపంచ సగటులో సగం మాత్రమే ఉన్న మనదేశంలో బీమా విస్తరణ ఉధృతంగా జరగాలని సంబంధిత కమిటీలు చెబుతున్నాయి. ఆయా వర్గాల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తుల సంఖ్య పెరగాలని, ప్రచారం ఉధృతంగా ఉండాలని కూడా అంటున్నాయి. కానీ, కరోనా అనంతరకాలంలో బీమా అవసరాన్ని జనం అధికంగా గుర్తించినా, ప్రీమియం రేట్లు ఏటా పదిహేనుశాతం వరకూ పెరిగిపోతూ, దానికి జీఎస్టీకూడా తోడై భారంగా పరిణమించాయి. చాలామంది ప్రీమియంలు కట్టలేక వదిలేస్తున్న నేపథ్యంలో, జీఎస్టీ తగ్గించాలన్న డిమాండ్ హెచ్చింది. దాదాపు మూడువందలమంది ఎంపీలకు అఖిలభారత బీమా ఉద్యోగుల సంఘం వినతిపత్రాలు సమర్పించింది. బడ్జెట్ సమావేశాల్లో కొందరు ఎంపీలు ఈ విషయం లేవనెత్తకపోలేదు కానీ, గడ్కరీ లేఖతో ఈ సమస్యకు విస్తృత ప్రాచుర్యం దక్కింది. అంతకంటే ముఖ్యంగా, ఆరెస్సెస్ మూలాలున్న ఈ నాయకుడు ఒక విధానపరమైన మార్పును డిమాండ్ చేస్తూ బహిరంగ లేఖ రాయడం ప్రజలకు ఆశ్చర్యం కలిగించింది, రాజకీయవర్గాల్లో విస్తృతచర్చకు దారితీసింది. ఇటీవల మరోమంత్రి ప్రహ్లాద్‌జోషీ కూడా ఆర్థికశాఖ సహాయమంత్రికి లేఖరాయడం విశేషమైన పరిణామం.
ప్రీమియంలమీద జీఎస్టీ ఎత్తివేయకపోతే రోడ్లమీదకు వస్తానని, ఉద్యమాలు చేస్తాననీ మమతాబెనర్జీ ఇటీవల హెచ్చరించారు. ఆమె పార్టీ ఎంపీ సభలో ప్రభుత్వాన్ని నిలదీశారు. లక్షలకోట్ల జీఎస్టీ వసూలవుతూ పెరుగుదల రేటు కూడా ఘనంగా ఉన్నస్థితిలో బీమామీద భారీగా పన్నువేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. లావాదేవీలు జరిగినప్పుడు పన్ను ఉండాల్సిందేనని గట్టిగా నమ్ముతున్న పక్షంలో అతి తక్కువ పన్ను స్లాబ్ ఐదుశాతంలోకి దీనిని తీసుకురావచ్చు. ప్రపంచంలో ఏ దేశంలోనూ బీమా ప్రీమియం మీద ఇంతపన్నులేదు. బంగారంపై మూడుశాతం, నగిషీ చెక్కిన డైమండ్లమీద 0.25శాతం పన్ను విధిస్తూ, ప్రజలు తమకుతాముగా కల్పించుకుంటున్న భద్రత, భరోసాలపై భారీ పన్నుతో విరుచుకుపడటం సముచితం కాదు.
Updated Date - Aug 07 , 2024 | 02:12 AM