అంతుచిక్కని రాజకీయం
ABN, Publish Date - Dec 03 , 2024 | 06:05 AM
ప్రభుత్వం ఏర్పడిన తరువాత నిత్యం కాట్లాడుకొనేకంటే, వెన్నుపోట్లతో ప్రజాతీర్పును వక్రీకరించడం కంటే, ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో పదవులు చక్కగా పంచుకొని, బలమైన ప్రభుత్వాన్ని...
ప్రభుత్వం ఏర్పడిన తరువాత నిత్యం కాట్లాడుకొనేకంటే, వెన్నుపోట్లతో ప్రజాతీర్పును వక్రీకరించడం కంటే, ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో పదవులు చక్కగా పంచుకొని, బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని, నాలుగుకాలాలు ఏలుకోవడమే ఉత్తమం. అయినా, మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం ఏర్పాటుకు ఏకంగా పదిరోజులు పైనే పడుతూండటం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. గత ఐదేళ్ళ వెన్నుపోటు రాజకీయాల అనుభవం రీత్యా కాబోలు, బీజేపీ అతి జాగ్రత్తగా, మర్యాదగా వ్యవహరిస్తోంది. అత్యధికస్థానాలు గెలుచుకొని కూడా మరీ ఇంత వినయం ఎందుకని పార్టీ నాయకులే ఆశ్చర్యపోయే రీతిలో పెద్దలు నడుస్తున్నారు. ఏక్‌నాథ్ శిందే ఒత్తిళ్ళు, అలకల వల్లనే ప్రభుత్వం ఏర్పాటులో ఇంతటి జాప్యం జరుగుతోందన్నది కాదనలేని నిజం. సోమవారం మహాయుతి నాయకుల సమావేశం మరోమారు రద్దయింది. శిందే అందుబాటులో లేని కారణంగా ఇలా జరగడం గత నాలుగురోజుల్లో ఇది రెండోసారి. పాపం ఆయనకు ఒంట్లో బాగుండడం లేదట. శిందే కోరుతున్నదానిని కాదనడానికి, మెడలు వంచడానికి బీజేపీ ఎందుకు వెనకడగువేస్తోందో, సాధారణ జనానికి అంతుచిక్కని మరో వ్యూహం ఏమైనా ఇందులో ఉన్నదో తెలియదు.
ఎవరు ముఖ్యమంత్రి అన్నది తేల్చుకోకుండానే, ప్రమాణస్వీకారోత్సవాన్ని మాత్రం బాగా ముందుగానే నిర్ణయించుకున్నారు. ఐదవతేదీ ప్రమాణం చేయబోయేవారెవ్వరో నాలుగున నిర్ణయమవుతుంది. నిర్మలా సీతారామన్, విజయ్‌రూపానీ సమక్షంలో బీజేపీ శాసనసభాపక్షనేతగా దేవేంద్ర ఫడణవీస్ ఎన్నిక, సీఎంగా ఆయన పేరు ప్రకటన జరిగిపోతాయని వార్తలు వస్తున్నాయి. ఫడణవీస్ తరఫున శిందేను పలకరించి, పరామర్శించి వచ్చిన గిరీశ్ మహాజన్ ఆయన అలకబూనలేదన్న విషయాన్ని మీడియాకు మరీ ప్రత్యేకంగా విన్నవించారు. డిప్యూటీ సీఎంతో పాటు, హోంశాఖ కూడా తనకే కావాలని శిందే పట్టుబడుతున్నారనీ, కావస్తే మరో రెండు తీసుకోగానీ, హోం మాత్రం ఇచ్చేది లేదని బీజేపీ అన్నందుకు శిందే ఆగ్రహించారని వార్తలు వెలువడుతున్న తరుణంలో, తనకు అసలు మంత్రిపదవే అక్కరలేదని జూనియర్ శిందే చేసిన వ్యాఖ్యకు ఎంతోకొంత విలువైతే ఉంది.
ఫడణవీస్ కాక, మరొకరు తెరమీదకు వస్తారన్న ఊహాగానాలేమీ లేవు కానీ, శిందే ఎందుకు తగ్గడం లేదన్నది ప్రశ్న. సామాన్యుడిలాగా ఉంటాను కనుక, ప్రజలు మళ్ళీ తననే ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని ఓ పక్క అంటూనే, మోదీ మాటకు కట్టుబడతానని మాట ఇచ్చిన ఆయన, ఆ తరువాత పట్టుబిగించిన విషయం తెలిసిందే. 288మంది ఎమ్మెల్యేలున్న సభలో బీజేపీకి 132 వచ్చిన తరువాత కూడా శిందేయే మళ్ళీ సీఎం అని ఆయన పార్టీచెప్పుకుంటూ బిహార్‌లో నితీశ్ ప్రభుత్వాన్ని ఉదాహరించింది. ఎవరెన్ని గెలిచినా, మళ్ళీ మీ నాయకుడే సీఎం అని బీజేపీ తమకు ఎన్నికలముందు హామీ ఇచ్చిందని కూడా శిందేసైన్యం వాదించింది. ఫలితాలు వెలువడిన నాలుగురోజులకు దిగివచ్చి, నేను అడ్డంకికాబోను అని ప్రకటించిన శిందే, సీఎం పదవిలో రాజీపడినా హోం మాత్రం వదలడం లేదు. నిన్నటివరకూ తాను సీఎంగా ఉన్నప్పుడు, డిప్యూటీ సీఎం ఫడణవీస్ దగ్గర హోం ఉన్నందున, ఇప్పుడు కూడా అదేన్యాయం అమలు కావాలి కదా అన్నది మంచి ప్రశ్న. కానీ, ఉద్ధవ్‌పార్టీని చీల్చి, అగాఢీ ప్రభుత్వాన్ని నిలువునా కూల్చినప్పుడు బీజేపీ తాను పక్కకు తప్పుకొని, అనూహ్యంగా శిందేను ముఖ్యమంత్రిగా కూచోబెట్టడానికీ, ఇప్పటి అవసరాల్లోనూ, సంఖ్యాబలాల్లోనూ ఎంతో తేడావుంది.
శిందే ప్రోద్బలం మేరకు శివసేన ఎమ్మెల్యేలు రాత్రికిరాత్రి విమానాలు ఎక్కి ఇతరప్రాంతాలకు తరలిపోతున్న విషయం అప్పట్లో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రేకు తెలియరాలేదని, హోంశాఖ ఎన్సీపీ చేతుల్లో ఉండటం ఇందుకు కారణమని అప్పట్లో విశ్లేషణలు వచ్చాయి. ఆ సంగతి అటుంచితే, విపక్షాలతో సహా సమస్తపార్టీలనూ, రాష్ట్రరాజకీయాలను నియంత్రించగలిగే శక్తిమంతమైన హోం చేతుల్లో ఉండటానికీ, కేవలం డీప్యూటీ సీఎం అనిపించుకోవడానికీ ఎంతో తేడా ఉన్నదని శిందే అభిప్రాయం. ఏక్‌నాథ్ శిందేలను సృష్టిస్తాం అని విపక్షపార్టీలను చీటికీమాటికీ బెదిరించే బీజేపీకి, ఆ పదవి అతడి చేతికి పోతే ఏమి జరుగుతుందోనన్న వెరపు ఉండటం సహజం. అజిత్‌పవార్ వెంటనే ఫడణవీస్‌కు మద్దతు ప్రకటించి ఆటలో మంచి ఎత్తు వేశారు. అంతిమంగా శిందే సర్దుకుపోవచ్చునేమో కానీ, ఆరంభంలో రేగిన ఈ అనుమానాలు రేపటి రాజకీయాన్ని ప్రభావితం వేసే ప్రమాదమైతే ఉంది.
Updated Date - Dec 03 , 2024 | 06:05 AM