ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నైపుణ్యాలే ఉద్యోగాలకు కీలకం

ABN, Publish Date - Nov 16 , 2024 | 05:31 AM

ప్రపంచ వ్యాప్తంగా 2027 నాటికి 6.9 కోట్ల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని, అదే సమయంలో 8.3 కోట్ల ఉద్యోగాలు మాయమవుతాయని ఈ మధ్య ప్రపంచ ఆర్థిక నివేదిక అంచనా వేసింది. అంటే ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నవారికే ఉద్యోగ అవకాశాలు

ప్రపంచ వ్యాప్తంగా 2027 నాటికి 6.9 కోట్ల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని, అదే సమయంలో 8.3 కోట్ల ఉద్యోగాలు మాయమవుతాయని ఈ మధ్య ప్రపంచ ఆర్థిక నివేదిక అంచనా వేసింది. అంటే ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నవారికే ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నమాట. డిమాండ్‌కి తగిన సంఖ్యలో నిపుణులు దొరక్క అనేక సంస్థలు ఇబ్బందులు పడుతున్న సందర్భాలు లేకపోలేదు. సాంకేతిక నైపుణ్యం, వ్యక్తిగత కౌశలం మేళవించిన వారు మాత్రమే ఉద్యోగాలు దక్కించుకోగలుగుతున్నారు. వివిధ కంపెనీలు ప్రాంగణ నియామకాల్లో నైపుణ్యానికే పెద్దపీట వేస్తున్నాయి. వీటితో పోలిస్తే విద్యార్థులు పరీక్షల్లో సాధించిన మార్కులు, చేసిన ప్రాజెక్టులు, సిఫారసులను అవి పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు.

దేశవ్యాప్తంగా ఏటా కొత్తగా పట్టాలు పుచ్చుకుని దాదాపు 15 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉపాధి వేటలో పడుతున్నారు. వీరిలో చాలా మందికి ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు ఉండడం లేదనేది నిజం. భారతీయ యువతలో దాదాపు సగం మందికి వివిధ రంగాలకు అవసరమైన కనీస నైపుణ్యాలు కూడా లేవని యునెస్కో తన నివేదికలో పేర్కొన్నది. భారతదేశ నైపుణ్యాల నివేదిక- 2022 సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఇంజనీర్లకు సంబంధించిన జాతీయ ఉపాధి అవకాశాల నివేదిక–2019 అయితే దేశంలో వివిధ సాంకేతిక కోర్సులు పూర్తిచేసిన వారిలో 80 శాతం మంది విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థలో ఏ ఉద్యోగమూ చేయడానికి అర్హులు కారని తేల్చేసింది. ముఖ్యంగా ప్రపంచస్థాయి ఉద్యోగాలను అందిపుచ్చుకోవడానికి అవసరమైన డిజిటల్ నైపుణ్యాలు ఇంజినీరింగ్ విద్యార్థుల్లో కొరవడుతున్నాయని అది విశ్లేషించింది. దీనిని బట్టి ప్రజలకు, ముఖ్యంగా యువతరానికి, ఉన్నతస్థాయి విద్య, నైపుణ్యాలను అందించిన దేశాలు మాత్రమే మానవ వనరులను శక్తివంతమైన మూలధనంగా మలుచుకుని ఆర్థికశక్తిగా ఎదుగుతాయని అర్థమవుతుంది.

ఇండియాలో విభిన్న రంగాల్లో పది కోట్ల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నా- వాటిని చేజిక్కించుకోగలిగే నైపుణ్యం ఉన్న యువత కరువైందని అఖిల భారత సాంకేతిక విద్యామండలి గతంలోనే ఆవేదన వ్యక్తపరిచింది. జపాన్, జర్మనీ, బ్రిటన్, దక్షిణ కొరియా వాటి దేశాలు యాభై శాతానికి పైగా శ్రామిక శక్తికి వ్యవస్థాగతంగా మేలైన ఉపాధి శిక్షణ అందిస్తున్నాయి. దేశీయంగా అది ఐదు శాతానికి మించడం లేదు. అందుకే మన దగ్గర ఉన్నత విద్య అభ్యసించినవారు ఉన్నా వారూ చిన్నాచితకా పనులతో జీవితాలను భారంగా వెళ్లదీస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే– తుఫానులు, వరదల లాంటి ప్రకృతి విపత్తుల కంటే రాష్ట్రానికి పెనుముప్పు రాబోతున్నది నిరుద్యోగంతోనే. గత ప్రభుత్వ నిర్వాకం వలన రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది యువత ఉపాధి కోసం వివిధ రాష్ట్రాలకు తరలిపోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ‘‘నైపుణ్య కళాశాలల్లో అంతర్జాతీయ శిక్షణ ఇస్తాం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కోర్సులు రూపొందిస్తాం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేస్తాం, అందుకు తగినట్లు శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుంటాం’’ అంటూ నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖలో చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి. అంతర్జాతీయ ప్రమాణాలు అంటూ తన హయాంలో మాటలు మాత్రమే చెప్పిన మాజీ సీఎం జగన్‌రెడ్డి కనీసం నైపుణ్య కళాశాలలకు భవనాలనే నిర్మించలేక నిధులు లేవంటూ చేతులెత్తేశారు. మరోపక్క అంతకు ముందు టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాలను మూసివేసి నిరుద్యోగ యువతకు నైపుణ్యాన్ని దూరం చేశారు. 2016–-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం మూడేళ్ళలో 2,72,198 మందికి శిక్షణ ఇస్తే, వారిలో 64,444 మంది ఉద్యోగాలు సంపాదించారు. అదే జగన్‌రెడ్డి హయాంలో నాలుగున్నరేళ్లలో 2019–-24 మధ్య 83,273 మంది శిక్షణ పొందితే, 21,270 మంది మాత్రమే ఉద్యోగాలు సాధించారు. చంద్రబాబు గారు నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసిన తర్వాత 2016 నుండి 2019 వరకు ఏటా ఆంధ్రప్రదేశ్ దేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది. నైపుణ్య గణన గురించి గొప్పలు చెప్పిన జగన్ ప్రభుత్వంలో ఒక్కసారి కూడా ఏపీకి మొదటి స్థానం లభించిన దాఖలాలు లేవు. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తూ ఉపాధి అవకాశాలు కల్పించినందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థకు 2018లో జాతీయ పురస్కారం కూడా లభించింది. దీన్ దయాళ్ గ్రామీణ కౌశల్ కింద నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉపాధి కల్పించడంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. 2017–-18లో 17,292 మంది గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వగా 10,923 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు లభించాయి. అదే సమయంలో జిల్లాకు ఐదు చొప్పున ఎంపిక చేసి, 65 కళాశాలల్లో బీఎస్సీ వారికి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు అవసరమయ్యే శిక్షణ ఇచ్చారు. తర్వాత మరో 525 కళాశాలల్లో ఆంగ్ల భాష వ్యక్తీకరణ వంటి కోర్సులను నిర్వహించారు. వీటి మూలంగా 4,176 మందికి టీసీఎస్, ఇన్ఫోసిస్, క్యాప్ జెమినీ, విప్రో లాంటి సంస్థల్లో ఉద్యోగాలు లభించాయి. ఇది 2014–-19 మధ్య టీడీపీ సాధించిన ఘనత. ఆ తర్వాత వచ్చిన జగన్‌రెడ్డి ప్రభుత్వ నిర్వాకం వలన రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు లేక అల్లాడిపోయారు.

జీడీపీ మెరుపులకు సమాంతరంగా జన జీవితాల్లోనూ వెలుగులు నిండాలంటే- ఉపాధి సహిత అభివృద్ధి విధానాలను ప్రభుత్వాలు అనుసరించాలి. పాఠశాల స్థాయి నుంచే విద్యలో వృత్తి శిక్షణను అంతర్భాగం చేయాలి. తయారీ, ఆరోగ్య సేవలు, పునరుత్పాదక ఇంధన వనరులు, నిర్మాణం, రవాణా, చిల్లర విపణి, బీమా, పర్యాటకం, ఫొటోగ్రఫీ, బ్యాంకింగ్ రంగాల్లో భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు అందిరానున్నాయి. వాటిని ఒడిసిపట్టుకునే విధంగా నవతరాన్ని ముందుకు నడిపించాలి. వీటిలో మన యువతను తీర్చిదిద్దుకోవాలి. ఉద్యోగ మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించే విద్యను దేశ యువతకు అందించాలి. భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించే కృత్రిమ మేధ, రోబోటిక్స్, వర్చువల్ రియాలిటీ, డేటా సైన్స్ వంటి అధునాతన కోర్సులను ప్రవేశపెట్టాలి. నైపుణ్య విద్యకు పాఠశాల స్థాయిలోనే పునాది వేయాలి. ప్రపంచీకరణ యుగంలో నైపుణ్య శిక్షణే ఆర్థికాభివృద్ధికి సోపానం. ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి యువత వలసలు పోకుండా స్థానికంగానే ఉండి ఆర్థికంగా నిలదొక్కుకునే ఏర్పాటు చేస్తుండడం అభినందనీయం. ఈ క్రమంలో పరిశ్రమల అవసరాలు, యువత నైపుణ్యాల నడుమ అంతరాలను గుర్తించేందుకు కూటమి ప్రభుత్వం ‘నైపుణ్య గణన’కు సిద్ధమౌవుతుండడం ఆహ్వానించదగ్గ విషయం.

జీడీపీ మెరుపులకు సమాంతరంగా జన జీవితాల్లోనూ వెలుగులు నిండాలంటే- ఉపాధి సహిత అభివృద్ధి విధానాలను ప్రభుత్వాలు అనుసరించాలి. పాఠశాల స్థాయి నుంచే విద్యలో వృత్తి శిక్షణను అంతర్భాగం చేయాలి. ఉద్యోగ మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించే విద్యను దేశ యువతకు అందించాలి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి యువత వలసలు పోకుండా స్థానికంగానే ఉండి ఆర్థికంగా నిలదొక్కుకునే ఏర్పాటు చేస్తుండడం అభినందనీయం.

n కూసంపూడి శ్రీనివాస్

జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి

Updated Date - Nov 16 , 2024 | 05:31 AM