చట్టసభల్లో మీ నడతను చరిత్ర గమనిస్తోంది!
ABN, Publish Date - Nov 21 , 2024 | 05:33 AM
న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో నేరుగా ప్రజాభీష్టాన్ని ప్రతిబింబించే ఏకైక వ్యవస్థగా భారత రాజ్యాంగంలో శాసన వ్యవస్థకు విశిష్ట స్థానం ఉంది. 1949 నవంబరు 26న రాజ్యాంగాన్ని ఆమోదించే
న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో నేరుగా ప్రజాభీష్టాన్ని ప్రతిబింబించే ఏకైక వ్యవస్థగా భారత రాజ్యాంగంలో శాసన వ్యవస్థకు విశిష్ట స్థానం ఉంది. 1949 నవంబరు 26న రాజ్యాంగాన్ని ఆమోదించే ముందు రాజ్యాంగ సభలో అధ్యక్షులు డాక్టర్ రాజేంద్రప్రసాద్ రాజ్యాంగపు మూల స్వరూపం గురించి మాట్లాడుతూ కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ప్రజాభీష్టం మేరకు నడచుకోవాల్సి ఉంటుందని, ఈ ప్రజాభీష్టం నిరంతరం చట్టసభల్లో ప్రజాప్రతినిధుల ద్వారాను, అడపదడపా నేరుగా సార్వత్రిక ఎన్నికల ద్వారాను వ్యక్తమవుతుందని అన్నారు. ఇదే స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్రాల మంత్రివర్గాలు ప్రజలు నేరుగా ఎన్నుకునే లోక్‌సభకు, ఆయా రాష్ట్రాల శాసనసభలకు జవాబుదారీగా ఉండాలని రాజ్యాంగపు అధికరణాలు 75(3), 164(2) నిర్దేశిస్తున్నాయి. సభలో మెజారిటీ ఉంది కదా అని ప్రభుత్వాలు ఇష్టానుసారం వ్యవహరించడానికి లేదని, చట్టసభకు జవాబు చెప్పుకోవలసి ఉంటుందని ఈ అధికరణాలు చెబుతున్నాయి. చట్టసభల్లో ప్రతి సభ్యుడికీ, ముఖ్యంగా ప్రతిపక్షానికి బలాన్నిచ్చే అధికరణాలివి. తదనుగుణంగా చట్టసభల నియమావళిలో సభ్యులకు, ప్రతిపక్షానికి ప్రభుత్వాన్ని నిలదీసే అధికారాన్నిచ్చే సాధనాలెన్నో పొందుపరచారు.
ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ సమావేశాలు జరుగుతున్న ఈ తరుణంలో స్వయానా ముఖ్యమంత్రి ఈ జవాబుదారీతనం గురించి మాట్లాడటం విశేషం. 16వ శాసనసభకు నూతనంగా ఎన్నికైన సభ్యులను ఉద్దేశించి నవంబరు 12న జరిగిన ఒక అవగాహన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ– ప్రతిపక్షం సభలో లేనంత మాత్రాన ప్రభుత్వం ఎవరికీ జవాబివ్వనక్కరలేదని భావించడం సరికాదని, ప్రతి సభ్యుడు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం పనితీరులో లోపాలుంటే ఎత్తి చూపడానికి సభను, సభ విధివిధానాలను సద్వినియోగం చేసుకోవాలని ఉద్బోధించారు. అప్పుడే ప్రజలకు మెరుగైన పాలన అందించగలమని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని నడుపుతున్న సభా నాయకుడు ‘నా ప్రభుత్వాన్ని నిలదీయండి’ అని సభ్యులందరికీ పిలుపునివ్వడం అరుదే కాదు, అసాధారణం కూడా. దశాబ్దాలుగా శాసనసభ్యుడిగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి సుపరిపాలనకు జవాబుదారీతనం ఎంత ముఖ్యమో అనుభవపూర్వకంగా ఆకళింపు చేసుకున్న ఒక రాజనీతిజ్ఞుడు చెప్పిన హిత వచనాలవి. ప్రజాస్వామ్యం ఆరోగ్యంగా, పటిష్టంగా ఉంటేనే ప్రజాహితం సురక్షితమన్న నమ్మకం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి మాటల్లో నిబిడీకృతమై ఉంది. ప్రశ్నించడం, చర్చించడం ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలని విశ్వసిస్తే తప్ప ఇలాంటి సందేశాలు వెలువడవు. ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ అమాత్యులు అప్రమత్తంగా ఉండాలని, సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సర్వదా సిద్ధంగా ఉండాలని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సభా ముఖంగా సూచించడం సభలో సత్సంప్రదాయాలు కొనసాగాలన్న అనుభవజ్ఞుల తపనకు అద్దం పడుతోంది.
‘సంపద సృష్టి’, ‘సంపద వ్యాప్తి’ గురించి తరచూ ప్రస్తావించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నవంబరు 12న అవగాహన కార్యక్రమంలో విభిన్న సందర్భంలో ఈ పద ప్రయోగం చేసి ఒక కొత్త కోణం జోడించారు. శాసనసభ్యుల నుద్దేశించి మాట్లాడుతూ ఆయన నేటి తరం శాసనసభ్యులు రాబోయే రోజుల్లో సమాజానికి ఆస్తిగా, సంపదగా తయారవ్వాలని పిలుపునిచ్చారు. తన అర్ధ శతాబ్ది రాజకీయ అనుభవాన్ని రంగరించి, ఆదర్శ శాసనసభ్యుడు ఎలా నడచుకోవాలో చంద్రబాబు నాయుడు కొత్త సభ్యులకు పాఠంలా చెప్పారు. ఉత్తమ సంప్రదాయాలు నెలకొల్పాలని, సమాజానికి ఆదర్శంగా నిలవాలని, ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అప్పుడే ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం పొందగలుగుతారని ఆనాడు ముఖ్యమంత్రి సోదాహరణంగా చేసిన ఉద్బోధ భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని కోరుకునే శాసనకర్తలందరికీ కరదీపిక. ముఖ్యమంత్రి సందేశం నైజీరియాకు చెందిన విశ్వవిఖ్యాత సాహితీవేత్త చిన్వా అచేబీ ప్రజాస్వామ్యం గురించి వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని పోలి ఉంది. ‘ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే విద్యావంతుల భాగస్వామ్యం; చైతన్యం, నైతికత మూర్తీభవించిన నాయకత్వం అవసరం’ అన్నారు అచేబీ.
ప్రభుత్వాన్ని నిలదీయడం, ప్రజా సమస్యలపై చర్చించి శాస్త్రీయ పరిష్కారాలు సూచించడం, చట్టాలు చేయడం – ఇవీ చట్ట సభల సభ్యుల ప్రధాన కర్తవ్యాలు. దురదృష్టవశాత్తు స్థానిక సంస్థలు, కార్యనిర్వాహక వ్యవస్థలోని ఇతర ప్రభుత్వ విభాగాలు సాధారణంగా నిర్వర్తించవలసిన విధులు చట్టసభల సభ్యులకు బదిలీ అవుతున్నాయి. చట్టసభల సభ్యులు సులువుగా ప్రజలకు అందుబాటులో ఉంటారు కనుక ప్రజల రోజువారీ సమస్యలు ఆలకించి, వాటి పరిష్కారానికి ఎక్కువ సమయం వెచ్చించ వలసి వస్తోంది. దీనివల్ల వారు శాసనకర్తలుగా తమ ప్రధాన కర్తవ్యాల నిర్వహణకు తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు.
తీవ్రమైన, తక్షణ సమస్యల పరిష్కారానికి సభ దృష్టిని, ప్రభుత్వం దృష్టిని ఆకర్షించడం ఒక ఎత్తు అయితే, దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే చట్టాలు చేయడం, విధానాల రూపకల్పనలో భాగస్వాములు కావడం మరొక ఎత్తు. ఇందుకు అంకితభావం, అప్రమత్తత, పరిశ్రమ, పరిశోధన ఎంతో అవసరం. ప్రచారకాంక్షతో సభలో నిబంధనలు ఉల్లంఘించే వారిని ఆ క్షణం గడిస్తే ఎవరూ గుర్తు చేసుకోరు. సభలో తగు సమయంలో, తగు రీతిలో, సందర్భోచితంగా స్పందిస్తూ, నియమాలను, సభాపతి ఆదేశాలను గౌరవిస్తూ పూర్తి సన్నద్ధతతో విధులు నిర్వర్తించేవారినే చరిత్ర గుర్తుంచుకుంటుంది. తెలుగునాట వావిలాల గోపాలకృష్ణయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి, కొణిజేటి రోశయ్య, చెన్నమనేని రాజేశ్వరరావు; జాతీయ స్థాయిలో హిరేన్ ముఖర్జీ, జార్జ్ ఫెర్నాండెజ్, మధు దండవతే, ఇంద్రజిత్ గుప్తా, సోమ్‌నాథ్ చటర్జీ, జైపాల్‌రెడ్డి లాంటి ఉత్తమ పార్లమెంటరీ వేత్తలు చట్టసభల్లో తమ పని తీరుతో చరిత్ర పుటల్లో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. నిజానికి వీరిలో ఎవరికీ అధికారికంగా ప్రతిపక్ష నాయకుడి హోదా లేదు. వారిలో కొందరి పార్టీలకు అప్పట్లో పార్లమెంటరీ గ్రూపులుగా సైతం గుర్తింపు లేదు. అయినా వారు తమ విధులు అద్భుతంగా నిర్వర్తించడానికి ఇవేవీ అడ్డు రాలేదు. రాజ్యాంగం పట్ల, ప్రజల పట్ల, సభ పట్ల వారికున్న నిబద్ధతే వారిని రాణింపజేసింది. బహుశా ఈ మహామహులను దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు నాయుడు శాసనసభ్యులు భావితరాలకు ఆస్తిగా, సంపదగా అవతరించాలని ఆకాంక్షించి ఉంటారు.
ఈ దఫా తొలిసారి ఎన్నికైన 84మంది శాసనసభ్యులకు ఇదొక సువర్ణావకాశం. శాసనసభ సమావేశాలు సజావుగా సాగుతున్నాయి. రోజువారీ పని గంటలు పెరిగాయి. ఇప్పటికే సభా నియమావళిలో సభ్యులకు అందుబాటులో ఉన్న సాధనాలెన్నో సభ్యులకు పరిచయమయ్యాయి. ప్రశ్నలు, స్వల్ప వ్యవధి ప్రశ్నలు, శూన్య కాలం, స్వల్ప కాలిక చర్చ, అత్యవసర ప్రస్తావనలు, సావధాన ప్రస్తావనలు, అర్ధ గంట చర్చ, మంత్రుల ప్రకటనలపై చర్చ, తాత్కాలిక బడ్జెట్, సాధారణ బడ్జెట్ ఆమోదం, పలు బిల్లుల ఆమోదం– ఇలా సభా ప్రక్రియలెన్నో నూతన సభ్యులు స్వల్ప వ్యవధిలోనే అవగతం చేసుకోగలిగారు. సభ్యులు సమావేశాలు జరిగేటప్పుడు ప్రతి రోజూ కార్యక్రమ పట్టిక చూడడం అలవాటు చేసుకుంటే చాలు, సమాజానికి ‘ఆస్తి’గా, ‘సంపద’గా అవతరించే అవకాశాలు అంది పుచ్చుకోవడం కష్టమేమీ కాదు. శాసనసభ ఏడాదికి కనీసం 70 రోజులు సమావేశం కావాలన్న స్పీకర్ సూచన అమలుకు నోచుకుంటే, ముఖ్యమంత్రి సందేశాన్ని సభ్యులు ఆచరణలో పెడితే యావద్దేశానికే ఆంధ్రప్రదేశ్ శాసనవ్యవస్థ ఆదర్శంగా నిలవగలుగుతుంది.
ప్రసన్న కుమార్ సూర్యదేవర
సెక్రటరీ–జనరల్, ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ
Updated Date - Nov 21 , 2024 | 05:33 AM