ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కన్వర్‌యాత్ర: ‘సుప్రీం’ జోక్యం సమ్మతం కాదు

ABN, Publish Date - Aug 03 , 2024 | 01:28 AM

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 250 కిలోమీటర్ల మేర సాగే కన్వర్‌ యాత్రలో కోట్లాది భక్తులు పాల్గొంటారు. గత ఏడాది మాంసాహారం విక్రయించే కొందరు వ్యాపారులు కావడి యాత్ర నిర్వహించే మార్గాల్లో గందరగోళం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 250 కిలోమీటర్ల మేర సాగే కన్వర్‌ యాత్రలో కోట్లాది భక్తులు పాల్గొంటారు. గత ఏడాది మాంసాహారం విక్రయించే కొందరు వ్యాపారులు కావడి యాత్ర నిర్వహించే మార్గాల్లో గందరగోళం సృష్టించారు. అందుకే ముందు జాగ్రత్తగా ప్రభుత్వం వ్యాపారుల నేమ్ బోర్డు తప్పనిసరి చేసింది. భక్తులకు స్వచ్ఛమైన శాకాహారం ఎక్కడ లభిస్తుందో సూచించేలా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు ఉత్తర్వులు తీసుకురావడం ప్రతి హిందువు స్వాగతిస్తున్నాడు. కన్వర్ యాత్ర దారిలో నేమ్ బోర్డు తగిలించాలన్న ఉత్తర్వులు మతపరమైనవి కావు, ఈ విషయంలో ఎవరూ భుజాలు తడుముకోవాల్సిన పనిలేదు.

హిందువులు అత్యంత పవిత్రంగా నిర్వహించే కావడి (కన్వర్) యాత్రపై జరుగుతున్న వివాదం రాజకీయ దుమారాన్ని దాటి సుప్రీంకోర్టు తలుపు తట్టింది. భక్తుల విశ్వాసాలు, సంప్రదాయాలతో పనిలేదన్నట్లు, కేవలం రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని తీర్పు చెబితే చాలు అనే ధోరణిలో సుప్రీం కోర్టు కూడా వ్యవహరించడం సమ్మతం కాదు. ఓ న్యాయమూర్తి మాట్లాడుతూ ‘నేను కేరళలో ఓ ముస్లిం నిర్వహించే రెస్టారెంట్‌కు వెళ్లాను. అక్కడి భోజనం నాకు నచ్చింది’ అని తీర్పు చెప్పారు. అయితే, ఇక్కడ ముస్లిం రెస్టారెంట్‌లో సాధారణ ప్రజలు భోజనాలు చేయడం వేరు, పరమ పవిత్రంగా దీక్షలో ఉంటూ, పూజలు చేస్తూ, ప్రసాదాలు స్వీకరించడం వేరు అనే విషయం సుప్రీంకోర్టు గ్రహించకపోవడం గమనార్హం.


నియమనిష్ఠలతో ఉంటూ, పద్ధతుల ఆధారంగా భోజనాలు చేయడం, ప్రసాదం స్వీకరించడం కావడి భక్తుల ఆచారం. రుచికరమైన భోజనాలు చేయాలి, కడుపు నిండా తిని బ్రేవ్ అని, బయటకు రావడం కాదు. కాబట్టి, అసలు విషయం వదిలి ఏవేవో మాట్లాడటం సమంజసం కాదు.

నీ పేరు చెప్పేందుకు నీకున్న అభ్యంతరం ఏంటని ప్రశ్నిస్తే, మైనార్టీలపై దాడులకు దిగుతున్నారన్న అసంబద్ధ వాదనతో ఎదురుదాడి చేయడం దుర్మార్గం. హిందువులకు శ్రావణమాసం పరమ పవిత్రమైనది. నీసు (మాంసాహారం) ముట్టుకోకుండా నిష్ఠతో పూజలు చేయడం, ఉపవాస దీక్షతో భగవంతుడిని కొలవడం అనాదిగా వస్తున్న ఆచారం. ప్రపంచంలోని హిందువులందరూ ఒక్కో తీరుగా భగవంతుడిని కొలుస్తారు. అయితే నేడు ఆ ఆచార వ్యవహారాలపైనే దాడులు చేసేందుకు రాజకీయ నాయకులు, మానవ హక్కుల రూపంలో ఉన్న హిందూ వ్యతిరేకులు కట్టకట్టుకుని హిందూ ధర్మంపై దౌర్జన్యం చేస్తున్నారు. ఏడాదికోసారి ప్రతి శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి, నిష్ఠతో శివుడిని కొలిచేందుకు కావడి యాత్ర తీస్తుంటే, వారి దీక్షకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారు. పవిత్రమైన భోజనం, పరిశుద్ధ ఆహారం పూజలో భాగమని.. మాంసాహార ప్రియులు వండే ఆహారంతో పూజ ఫలం చెడుతుందని భక్తులు మొత్తుకుంటుంటే ఏమాత్రం పట్టించుకోకపోవడం హిందువుల మనోభావాలకు గొడ్డలిపెట్టు. హోటల్ పేరు ఏదైనా, వంట చేసేవాడు, వడ్డించేవాడు ఎవరైనా సరే వారు పెట్టింది తినాలి అంటూ ఓ వైపు కోర్టులు గద్దిస్తుంటే, మరోవైపు రాజకీయ నాయకులు కావడి యాత్ర భక్తులపై గాండ్రింపులకు దిగుతున్నారు. ఇది చాలదు అన్నట్లు.. సోనుసూద్ అనే నటుడి మాటలు మరీ వెటకారంగా ఉన్నాయి. ‘శబరి ఎంగిలి రాముడు తినలేదా..? ముస్లింల ఎంగిలి మీరు తింటే తప్పేంటీ..?’ అని పుండుపై కారం చల్లుతున్నాడు. పరోక్షంగా ముస్లింల ఎంగిలి తినాలి అని హెచ్చరిస్తున్నాడు. హిందువులు ఏం తినాలి, ఎలా పూజించాలి, ఎవరి వద్ద వస్తువులు కొనాలి వంటివి కూడా రాజకీయ నాయకులు, కోర్టులు నిర్ణయించడం అసంబద్ధం. హిందువుల హక్కులు, స్వేచ్ఛను హరించే ఈ తీర్పు ఏమాత్రం సమ్మతం కాదు.

‘‘అసలు విషయం ఇక్కడ హిందూ ముస్లిం కాదు, మా పవిత్రత. శుభ్రమైన శాకాహార భోజనం కావాలి. భోజనం అనే కన్నా ప్రసాదం అంటే ఇంకా బాగుంటుంది. దీక్షలో ఉన్నప్పుడు నిష్ఠతో తయారుచేసిన ఆహారాన్ని ప్రసాదంగా భుజించడం హిందువుల సంప్రదాయం’’ అని కావడి యాత్రికుల వాదన. కానీ అవన్నీ ఏమీ లేవు, మీరు ఇక్కడే భోజనం చేయండి.. అదంతా బాగుంది అంటూ హిందువులను భయభ్రాంతులకు గురి చేయడం ఆశ్చర్యకరం.


ఏడాదిక్రితం ఉగాది సమయంలో శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అసలు ఘర్షణ ఎందుకంటే, హిందువులు కానివారు శ్రీశైలంలో వ్యాపారం చేస్తున్నారు. రూ.20 వాటర్ బాటిల్‌ను రూ.25కు అమ్ముతున్నారు. అదేంటీ..? 20 రూపాయలే కదా..అని భక్తులు అడిగితే.. ఇది ఇంతే, అంటూ గద్దించారు. విసుగు చెందిన భక్తులు వేరే దుకాణానికి వెళ్ళారు. దీంతో వ్యాపారులు గొడవకు దిగారు. ‘‘కొంటె మా దగ్గరే కొనాలి. చెప్పినంత చెల్లించాలి’’ అంటూ హుకుం జారీ చేశారు. భక్తులు వినలేదు. ఈ కారణంగా హైందవేతర వ్యాపారులంతా కలిసి భక్తులపై దాడి చేశారు, భయాందోళనలు సృష్టించి భక్తుల వాహనాలను ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు ఇంకా మరువనే లేదు. పైగా దాడి ఘటన సమర్థించుకుంటూ, దాడికి గురైనవారు కర్ణాటక భక్తులు అంటూ ప్రాంతాల వారీగా విభజన తీసుకువచ్చారు. కర్ణాటక అయినా, ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, ఉత్తరప్రదేశ్ అయినా భక్తులు భక్తులే. ఈరోజు సుప్రీంకోర్టును ఆశ్రయించిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా, విద్యావేత్త అపూర్వానంద్, కాలమిస్ట్ ఆకార్ పటేల్, పౌరహక్కుల రక్షణ సంఘాలు, సంస్థలు ఆ రోజు ఎందుకు స్పందించలేదో తెలియజేయాలని హిందూ సమాజం డిమాండ్ చేస్తోంది. హిందువులు కలియుగ దైవంగా భావించి ఆరాధించే తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో అన్యమతస్తుల ప్రచారం, ఆలయ పవిత్రతను దెబ్బతీసే కుట్రలపై స్పందించేందుకు పెద్దలకు సమయం ఉండదు. ఏడుకొండలను మూడు కొండలుగా విభజన చేస్తాననే ప్రకటనపై నోరు మెదపరు. అసలు శ్రీశైలంతో పాటు అనేక హిందూ పుణ్యక్షేత్రాలలో ఇతరుల దుకాణాలకు అనుమతులు ఎవరు ఇచ్చారో జవాబు దొరకదు.

కన్వర్ యాత్రలో భాగంగా శివనామ స్మరణ చేస్తూ, సాత్విక ఆహారం భుజించి యాత్రలో పాల్గొనడం ఆనవాయితీ. ఏడాదంతా తమ కుటుంబానికి శుభాలు కలగాలని నిష్ఠతో కావడి మోస్తూ.. గంగాజలాన్ని తీసుకువచ్చి శివలింగాలకు అభిషేకం చేయడం సంప్రదాయం. శ్రీరాముడు, రావణాసురుడు, పరశురాముడు కూడా కావడి యాత్ర నిర్వహించారు. ఈ పవిత్రమైన మాసంలో గంగాజలంతో అభిషేకం చేస్తే శివుడు ప్రసన్నమై, కోరికలు ఫలించి, శుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం. కానీ వారి విశ్వాసాలకు భంగం కలిగించేలా కోర్టులు, రాజకీయనేతలు తలో రీతిలో హిందూ విశ్వాసులపై దాడికి దిగడం క్షమార్హం కాదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 250 కిలోమీటర్ల మేర సాగే యాత్రలో దాదాపు 5 కోట్ల మంది భక్తులు పాల్గొంటారు. గతేడాది మాంసాహారం విక్రయించే కొందరు వ్యాపారులు కావడి యాత్ర నిర్వహించే మార్గాల్లో కావాలని గందరగోళం సృష్టించారు. భక్తుల విశ్వాసాలకు విఘాతం కలిగించి యాత్రను అపవిత్రం చేసే విధంగా వ్యవహరించారు. పూజను, యాత్ర పవిత్రతను దెబ్బతీసే కుట్రలు చేశారు. అందుకే ముందు జాగ్రత్తగా ప్రభుత్వం వ్యాపారుల నేమ్ బోర్డు తప్పనిసరి చేసింది. భక్తులకు స్వచ్ఛమైన శాకాహారం ఎక్కడ లభిస్తుందో సూచించేలా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు ఉత్తర్వులు తీసుకురావడం ప్రతి హిందువు స్వాగతిస్తున్నాడు. కన్వర్ యాత్ర దారిలో నేమ్ బోర్డు తగిలించాలన్న ఉత్తర్వులు మతపరమైనవి కావు, ఈ విషయంలో ఎవరు భుజాలు తడుముకోవాల్సిన పనిలేదు. తన పేరు తాను చెప్పుకోవడానికి గర్వపడాలి కాని, దాచి దాచిపెట్టాల్సిన అవసరం లేదు.

పగుడాకుల బాలస్వామి

ప్రచార ప్రసార ప్రముఖ్, విశ్వహిందూ పరిషత్

Updated Date - Aug 03 , 2024 | 01:31 AM

Advertising
Advertising
<