ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పిల్లల ఆహారభద్రతపై అలక్ష్యమా?

ABN, Publish Date - Aug 17 , 2024 | 05:35 AM

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన పోషక ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా సెంట్రలైజ్డ్‌ కిచెన్‌లు ఏర్పరచాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేగాక విద్యార్థులకు మధ్యాహ్నం భోజనంతో పాటు ఉదయాన్నే అల్పాహారం కూడా అందించడానికి ఏర్పాటు చేస్తున్నదని పత్రికలు వెల్లడించాయి.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన పోషక ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా సెంట్రలైజ్డ్‌ కిచెన్‌లు ఏర్పరచాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేగాక విద్యార్థులకు మధ్యాహ్నం భోజనంతో పాటు ఉదయాన్నే అల్పాహారం కూడా అందించడానికి ఏర్పాటు చేస్తున్నదని పత్రికలు వెల్లడించాయి. అల్పాహారం అందించడం హర్షించదగినదే, కానీ కేంద్రీకృత వంటగది మాత్రం నిరుపయోగం. దీనిని అమలు చేస్తే బడి పిల్లలకు సమతౌల్య ఆహారం అందుతుందనేది సందేహాస్పదమే. అంతేకాకుండా పిల్లల్లో ఇప్పటికే ఉన్న పౌష్టికాహార లోపం ఎక్కువయ్యే అవకాశం ఉంది. బళ్ళల్లో మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీల్లో సమగ్ర శిశు సంక్షేమ పథకం(ఐసిడిఎస్‌), పౌష్టికాహారంపై ఇప్పటికే వచ్చిన సర్వే రిపోర్టులు చాలావరకు ఈ విషయాలను ప్రస్తావించాయి.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో దాఖలైన ఆహారభద్రత కేసు గురించి, కోర్టు ఇచ్చిన ఆదేశాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2001లో పియుసిఎల్‌ ఆహార హక్కును ప్రతి వ్యక్తి చట్టపరమైన హక్కుగా గుర్తించాలని సుప్రీంకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలు చేసింది. రాజ్యాంగంలో జీవించే హక్కు ఆర్టికల్‌ 21, ఆహార హక్కుతో ముడిపడి ఉందని చట్టబద్ధమైన హక్కుగా గుర్తించి, రాజ్యాంగపరంగా ఈ హక్కును గుర్తించాలని వాదించింది. ఈ పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం 28 నవంబర్‌ 2001లో తాత్కాలిక ఆదేశాలు జారీ చేస్తూ ఆహారభద్రతకు సంబంధించిన తొమ్మిది పథకాలను లీగల్‌ హక్కులుగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాలను పూర్తిస్థాయిలో అమలుపరచాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తొమ్మిది పథకాలలో మూడు ముఖ్యమైనవి ప్రజా పంపిణీ వ్యవస్థ, మధ్యాహ్న భోజన పథకం(ఎండీఎం), సమగ్ర శిశు సంక్షేమ పథకం (ఐసిడిఎస్‌), ఎండిఎం, ఐసిడిఎస్‌ పిల్లలు, బడిపిల్లల పౌష్టికాహారానికి సంబంధించినవి. 1975లో ప్రారంభించిన ఐసిడిఎస్‌ తల్లికీ గర్భవతులకు, శిశువులకు ఆరోగ్యం, పౌష్టికాహారం అందించడానికి చేసిన పథకం. నవంబర్‌ 28, 2001లో కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఐసిడిఎస్‌ దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి.

ప్రస్తుతం మధ్యాహ్న భోజనంపై ప్రభుత్వ నిర్ణయం.. మధ్యాహ్న భోజనం, ఆహార పంపిణీని ప్రైవేటైజ్‌ చేయడం కోర్టు ఆదేశాలకు పూర్తిగా విరుద్ధం. మధ్యాహ్న భోజన పథకం 1960లో ప్రారంభం అయింది. బడి పిల్లలకు ఉచిత ఆహారం ఇవ్వడమే ఈ పథకం. నవంబర్‌ 28, 2001లో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల తర్వాత దేశంలో పలు రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేశారు. బళ్ళల్లో పిల్లల సంఖ్య పెరగడాన్ని బట్టి ఈ పథకం ఎంత అవసరమో తెలుస్తోంది.

ఆకలితో తరగతిలో పాఠాలు వినడం వల్ల చదువులు మెరుగుపడవని, అంతేగాక పౌష్టికాహార లోపంతో పిల్లల ఆరోగ్యం మెరుగుపడదని, వీటిని సరిదిద్దడానికి మధ్యహ్న భోజనం ఎంత అవసరమో ఈ ఉత్తర్వులు తెలిపాయి. అంతేగాక బళ్ళలో కలిసి తినడం వల్ల పిల్లల్లో కులవివక్ష అరికట్టడానికి, లింగ వివక్షను తొలగించడానికి, స్త్రీలకు పని కల్పించడానికి, పౌష్టికాహార అవసరాన్ని బోధించడానికి (న్యూట్రిషన్‌ ఎడ్యుకేషన్‌), అన్నిటికంటే ఎక్కువగా పేదపిల్లల ఆకలి తీర్చడానికి మధ్యాహ్న భోజనం తప్పనిసరి అని కోర్టు ఉత్తర్వులను అన్ని వర్గాలు హర్షించాయి. ఏప్రిల్‌ 20, 2004లో కోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర పాలిత ప్రాంతాలలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ సహకారాన్ని పొందుతున్న బళ్ళల్లో 300 కాలరీలు, 8–12 గ్రాముల ప్రోటీన్లు కలిగిన, తాజాగా వండి పెట్టిన భోజనం అందించాలని సూచించింది. అంతేగాక పిల్లల నుండి గాని, తల్లిదండ్రుల నుంచి గాని డబ్బులు తీసుకోవడానికి వీల్లేదు. వంటవాళ్లు, మిగతా పని వాళ్లును ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వాళ్లను నియమించాలని సూచించింది. శుభ్రమైన వంటగదులు, మరుగుదొడ్లు, తాగునీరు, నాణ్యమైన సరుకులు ఇస్తూ ఎప్పటికప్పుడు భోజన సదుపాయాలను మెరుగుపరచాలని పథకాన్ని పదవ తరగతి వరకు అందించాలని సూచించింది. ప్రభుత్వ పాఠశాలలకు, అంగన్‌వాడీలకు వెళ్లే పిల్లలు పేద వర్గాలకు, బడుగు కులాలకు చెందినవారు. పౌష్టికాహార లోపం వీరిలో ఎక్కువగా ఉండడం సహజం. చాలా వరకు పిల్లలు ఆకలితో పొద్దున్నే ఏమీ తినకుండా బడికి వెళతారు. అందుకే ఈ రెండు పథకాలు (ఐసిడిఎస్‌, మధ్యాహ్న భోజనం) సమగ్రంగా అమలు చేయాలి.


ఆహారాన్ని ప్రైవేటు కాంట్రాక్టర్లకు ఇవ్వకూడదని; స్థానికంగా వంటగదులను ఏర్పాటు చేసి, పరిసరాలను శుభ్రంగా ఉంచి, తాజాగా వండిన ఆహారాన్ని అందించాలని; స్థానికంగా దొరికే కూరగాయలు, గుడ్లు, చిరుధాన్యాల వంటివి తప్పనిసరిగా ఉపయోగించాలని; వంటగదులు, మంచినీరు, మరుగుదొడ్లు తప్పనిసరిగా ఉండాలని ముఖ్యంగా కోర్టు చెప్పింది. కోర్టు ఆదేశాలు, పౌష్టికాహార నిపుణులు సూచనలు అమల్లో పెట్టాలంటే ప్రభుత్వం తప్పనిసరిగా వనరులను, తగినంత బడ్జెట్‌ను కేటాయించాలి. ఆంధ్రప్రదేశ్‌ సలహాదారులుగా రిపోర్ట్‌లు పంపడంతో పాటు అమలు తీర్పుపై లోపాలను ప్రస్తావించింది. ఎనిమిది వెనుకబడిన జిల్లాలలో 32 ఊళ్లలో ఆహారభద్రత పథకాల అమలుపై ఒక సర్వే చేసి రిపోర్ట్‌ తయారు చేసింది. ఆదిలాబాద్‌, ఖమ్మం, అనంతపూర్‌, కడప, నల్గొండ, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, వరంగల్‌ జిల్లాల్లో 32 ఊళ్లల్లో మార్చ్‌ 2012 నుంచి డిసెంబర్‌ 2012 వరకు జరిగింది. రిపోర్టులో ఉన్న కొన్ని విషయాలు– వంటగదులు, మరుగుదొడ్లు లేకపోవడం, నాసిరకం సరుకులు, పనివాళ్లకు వేతనాలు సరిగా అందకపోవడం ఇప్పటికీ ఈ పరిస్థితులు మారలేదు. 2014లో తెలంగాణ ఏర్పడ్డ తరువాత కొన్ని మార్పులు వచ్చినా, పథకాల అమలుతీరులో పెద్దగా మార్పు రాలేదు.

వెనుకబడ్డ జిల్లాల్లో పథకాల అమలు తీర్పుపై స్థానిక పథకాల నిర్వాహకులు చెప్పిన విషయాలు ఇప్పటికీ వర్తిస్తాయి. 67 అంగన్‌వాడీలలో ఎక్కడా టాయిలెట్స్‌, తాగునీటి వసతులు లేవు. చాలా కేంద్రాలలో సరైన నీళ్లు, వంట గదులు లేవు. ఐసిడిఎస్‌ను సరైన పద్ధతిలో నిర్వహించకపోవడం వల్ల ఇప్పటికీ 46% పిల్లల్లో పౌష్టికాహార లోపం, తక్కువ బరువు ఉన్నాయి. మధ్యాహ్న భోజన పథకంలో సమస్యలు చాలా వరకు ఒకే రకంగా ఉన్నాయి. సరైన వంటగదులు లేకపోవడం, శుభ్రమైన పరిసరాలు, తాగునీటి కొరత ఉన్నాయి.

అయితే దళిత మహిళలు వంట చేస్తే ఇతర కులాల పిల్లలు తినకపోవడం కూడా కొన్ని బళ్లల్లో కనిపించింది. పిల్లలకు ఇచ్చే గుడ్లు నాలుగు నుంచి ఒకటి, రెండిటికి పడిపోయాయి. భోజనానికై ఇచ్చే డబ్బులు సరిపోవటం లేదు, వసతులు సరిగ్గా లేకపోవడం, పనిచేస్తున్న వంట వాళ్లకు, సహాయకులకు జీతాలు సరిగా అందకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ అంగన్‌వాడీల్లో పని చేస్తున్న స్త్రీలు ఏదో విధంగా వంట చేసి పిల్లలకు ఆహారం అందజేస్తున్నారు. అంగన్‌వాడీల్లో, మధ్యాహ్న భోజనం పథకంలో అవినీతి ఉన్నదని, శుభ్రమైన భోజనం అందించడం లేదని, కేంద్రీకృత వంట గదులను ఏర్పాటు చేసి ప్రైవేటీకరణ చేయడం ఈ పథకాల ఉద్దేశాలకు, కోర్టు ఇచ్చిన అదేశాలకు వ్యతిరేకం.

ప్రస్తుతం అక్షయపాత్ర నాలుగు కేంద్రీకృత వంటగదుల ద్వారా 1,60,169 పిల్లలకు, 1,856 బళ్ళలో భోజనం పంపిణీ చేస్తున్నది. అక్టోబర్‌ 2008లో హైదరాబాద్‌లో కేంద్రీకృత వంటగదిని ప్రారంభించింది. 2017లో నార్సింగిలో, 2018 వరంగల్‌లో, 2019 నవాబ్‌పేట్‌లో స్థాపించింది. వీటిలో భోజనం మధ్య రాత్రి తయారు చేసి పంపిణీ చేయడంతో కొన్నిసార్లు అది పాడయిపోయి పిల్లలు తినడం లేదు. అంతేకాక ఈ మధ్య వచ్చిన రిప్టోర్టుల ద్వారా ఈ సంస్థలో అవినీతి కూడా జరుగుతోంది.

హరే రామ హరే కృష్ణ, ఇస్కాన్‌ సహకారంతో సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ ద్వారా ఆహారం ఒకచోట వండి దాన్ని పంపిణీ చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం తలపెట్టడం కూడా సమస్యా పూరితం. అక్షయపాత్ర, ఇస్కాన్‌, హరే రామ హరే కృష్ణ పౌండేషన్‌ గుడ్లు ఇవ్వకపోవడం వల్ల పౌష్టికాహార లోపం పూరించడం సాధ్యం కాదు. నిపుణుల సూచన ప్రకారం ప్రోటీన్‌, మాంసాహారం పిల్లలకు అవసరం. ఆరు రోజులు గుడ్లు ఇచ్చినట్లయితే పౌష్టికాహారం లోపాన్ని పూరించవచ్చు. ఉదయాన్నే అల్పాహారంగా ఉడకబెట్టిన గుడ్లని ఇవ్వవచ్చు. ఆహారాన్ని సాత్విక భోజనంగా ఇవ్వడం సరైనది కాదు. పౌష్టికాహారాన్ని నిపుణుల సూచన ప్రకారం ఇవ్వాలి. సమతౌల్యమైన, తాజాగా వండిన ఆహారానికి ప్రత్యామ్నాయం లేదు. అయితే ప్రభుత్వం వనరులు ఇచ్చి, ఆహార పథకాలపై కేటాయించిన బడ్జెట్‌ను పెంచాలి. మధ్యాహ్న భోజనంపై విస్తృత సామాజిక తనిఖీ చేపట్టి పిల్లల సంక్షేమానికి, విద్యకు అత్యవసరమైన రెండు పథకాలు– మధ్యాహ్న భోజనం, సమగ్ర శిశు సంక్షేమం– వీలైనంతవరకు లోపరహితంగా అమలుపరచాలి. న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు, పౌష్టికాహార నిపుణులు ఇచ్చిన సలహాలు కచ్చితంగా పాటించాలి.

ప్రొ. రమా మేల్కొటె

Updated Date - Aug 17 , 2024 | 05:35 AM

Advertising
Advertising
<