Land : రెవెన్యూ భూ వివాదాలకు మంగళం
ABN, Publish Date - Dec 07 , 2024 | 12:54 AM
భూమి అంటే అమ్మతో సమానం. మధ్యతరగతి రైతు కుటుంబాలు తమకు ఉన్న సొంత స్థలాన్ని, పొలాన్ని అమ్మలా చూసుకుంటాయి. ఏదైనా కష్టమొస్తే తినడమైనా మానుకుంటారు కానీ, సొంత స్థలాన్ని
భూమి అంటే అమ్మతో సమానం. మధ్యతరగతి రైతు కుటుంబాలు తమకు ఉన్న సొంత స్థలాన్ని, పొలాన్ని అమ్మలా చూసుకుంటాయి. ఏదైనా కష్టమొస్తే తినడమైనా మానుకుంటారు కానీ, సొంత స్థలాన్ని పొలాన్ని అమ్ముకొని దర్జాగా ఉండొచ్చు అనే ఆలోచన రైతులు చేయరు. అలాంటి రైతులు, పేద మధ్య తరగతి కుటుంబాల మధ్య భూ సమస్యలు వస్తే సివిల్ కోర్టుల చుట్టూ తిరిగి సమస్యను పరిష్కరించుకునేవారు. ఇది 2019కి ముందు మాట. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐదేళ్లు రైతులు, పేద మధ్యతరగతి ప్రజలకు చెందిన భూ సమస్యలపై కోర్టుల చుట్టూ కాకుండా అధికార పార్టీ నాయకుల ఇళ్ల చూట్టూ తిరగాల్సిన పరిస్థితిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కల్పించారు. కారణం జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలే.
భూ రీ సర్వే పేరుతో, వైఎస్ఆర్ జగనన్న భూ రక్ష, 22 ఏ జాబితాలో నిషేధిత భూముల తొలగింపు, 20 ఏళ్లు దాటిన అసైన్డ్ భూములను విక్రయించుకోవచ్చునని (పార్టీ నాయకుల కోసం) కొత్త కొత్త వింత వింత నిర్ణయాలతో జగన్మోహన్‌రెడ్డి, అయన అనుయాయులు రైతులు, పేద ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేశారు. నాయకులు వాళ్లే, అధికారులూ వాళ్ల మనుషులే ఇక చేసేది ఏమీ లేక రైతులు బాధను దిగమింగుకుని నిమ్మకుండిపోయారు. ఇప్పుడు పేద ప్రజలకు ఊపిరి పీల్చుకునేలా కూటమి ప్రభుత్వం ధైర్యం ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే భూ ప్రక్షాళన మొదలు పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అసైన్డ్ భూముల రక్షణకు ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తీసుకువచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు భూములను కబ్జా చేస్తే 10 నుంచి 14 ఏళ్ల దాకా జైలుశిక్ష విధించడంతో పాటు కేసు తీవ్రతను బట్టి జరిమానాను కూడా ప్రతిపాదించారు. కబ్జా చేసిన భూములను తిరిగి వెనక్కి తీసుకొని, అసలైన యజమానులకు దక్కేలా చట్టపరమైన చర్యలను ప్రతిపాదించారు. ఈ ఒక్క నిర్ణయంతో రైతులు, పేద ప్రజలు వారివారి భూ సమస్యలు, వివాదాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం మొదలు పెట్టారు. ఒకటి రెండు కాదు ఏకంగా 68 వేల ఫిర్యాదులు కేవలం భూ వివాదాలకు సంబంధించినవే ఉన్నాయంటే... వైసీపీ నాయకులు ఎంత మంది రైతులు, పేద ప్రజల నుంచి ఎన్ని వేల ఎకరాలను కబ్జాలు చేశారో, దోచేశారో అర్థం చేసుకోవచ్చు.
దశాబ్దాలుగా లేని ఈ భూ రగడకు కారణాలేమిటి? ఎక్కడ పునాది, ఎక్కడ లోపం, ఏది పరిష్కారం? అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన తరువాతే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ప్రకటన చేశారు. సభ్యులంతా ఆ చట్టానికి ఆమోదం తెలిపే క్రమంలో... తన భూమిలో 40 సెంట్లు భూమి మాయం చేశారని అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రకటన చేయడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఒక ప్రజాప్రతినిధి భూమికే రక్షణ లేకపోతే... ఇక సామాన్యుల భూములు ఎలా దోచుకొని ఉంటారో కదా. బుచ్చయ్య చౌదరి అనుభవమే ఆ అక్రమాలకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడమే కాకుండా, భూముల రీ సర్వే నిలిపివేసి, గిరిజన రైతుల 4.15 లక్షల ఎకరాల ఆర్ఓఆర్ఎఫ్ భూములకు ఫార్మర్ రిజిస్ట్రీలో చోటు కల్పించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం వారికి మేలు చేసింది. జగన్ నియంతృత్వ పోకడలతో విసిగిపోయిన ప్రజలకు కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతో ఉపశమనం కల్పిస్తున్నాయి. ఇప్పటికే అనేక ప్రజా ప్రాయోజిత కార్యక్రమాలు ప్రారంభించిన ప్రభుత్వం భూ సమస్యలు, వివాదాలపై కూడా దృష్టి పెట్టింది. భూ రీ సర్వే, పాసు పుస్తకాల మార్పు, వైఎస్ఆర్ జగనన్న భూ రక్ష, జగన్మోహన్‌రెడ్డి ముఖచిత్రంతో ముద్రించిన పాసు పుస్తకాలు ముద్రించడం వంటి తప్పులతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భూ సమస్యలు పరిష్కారం కాక అనేక మంది రైతులు, ప్రజలు ప్రాణాలు విడిచిన సంఘటనలు చూశాం. ఎవరికి చెప్పాలో తెలియక, ఏ నాయకుడికి, ఏ అధికారికి చెప్పినా సమస్య పరిష్కారం కాక తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు. ఐదేళ్ల వైసీపీ హయాంలో రాష్ట్రంలో భారీ స్థాయిలో భూఆక్రమణలు జరిగాయి. వేల కోట్ల రూపాయల విలువ చేసే స్థలాలను వైసీపీ గ్యాంగ్ అప్పనంగా కొట్టేసింది. జనం గొంతు నొక్కేసి రికార్డులను ట్యాంపరింగ్ చేసి ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలను విచ్చలవిడిగా ఆక్రమించారు. రెవెన్యూ కార్యాలయాల్లో ఉండాల్సిన రికార్డులు ప్రైవేటు సంస్థల చేతుల్లో తరలించారు. వాగులు, వంకలు రోడ్డులు కేకుల్లా పంచుకొని పేదల నోళ్లు కొట్టి వేల కోట్లు ఆర్జించారు. వైసీపీ పాలనలో పెద్దఎత్తున భూదందాలు సాగాయి. భూ ఆక్రమణలు, అనుమతులు లేని లే అవుట్‌లు కోకొల్లలు. నియంతృత్వ పాలన పీడ విరగడై రైతులు, పేద ప్రజలకు వరంగా ప్రస్తుత ప్రభుత్వ పాలన సాగుతోంది. ఎన్నికల ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు భూ సమస్యలు, భూ వివాదాలకు సరైన పరిష్కారం చూపిస్తానని, పట్టా పాసు పుస్తకాలు పాత విధానంలోనే అందజేస్తామని హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే అధికారంలోకి రాగానే పట్టా పాసు పుస్తకాలు ప్రభుత్వ ముద్రతో ఉన్నవి అందజేశారు. ఇప్పుడు గ్రామ సభల ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు సిద్ధమైంది.
అసంబద్ధ రీ సర్వే వలన.. ప్రజల భూములు చిక్కుల్లో పడ్డాయి. ఒకరి పేరు మీద ఉన్న భూమి మరొకరు పేరు మీదకు ఎక్కించటం.. అక్రమ ఆన్లైన్ చేసుకోవడం జరిగింది. వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు పేదల భూములను కబ్జాలు చేశారు. పేదల భూములు కొట్టేసేందుకు 14 లక్షల ఎకరాలకు పైగా ఫ్రీ హోల్డ్ చేశారు. తమకు అనుకూలంగా ఉండే అధికారులు, సిబ్బందిని నియమించుకోని భూములు మాయం చేశారు. పల్లె, పట్టణాలు అనే తేడా లేకుండా విలువైన ప్రభుత్వ భూములు, వివాదాలలో ఉన్న స్థలాలను తమ అనుయాయులకు, తమకు అనుకూలంగా పనిచేసే అధికారుల చేత ధారాదత్తంగా రాయించుకున్నారు. చాలా చోట్ల రెవెన్యూ రికార్డులు తారుమారు చేసారు. ప్రభుత్వం మారిన కొన్ని రోజులకే తప్పులు ఎక్కడ భయటపడతాయో అని గ్రహించిన వైసీపీకి అనుకూలంగా పనిచేసిన అధికారులు వారి వారి సిబ్బంది చేత ప్రభుత్వ కార్యాలయాల్లో దస్త్రాలను... షార్ట్ సర్క్యూట్ కారణం చూపి తగలబెట్టించేస్తున్నారు. ఈ వ్యవహారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 20 ఏళ్లు దాటిన అసైన్డ్ భూములను విక్రయించుకొని దోచుకోవచ్చని నిబంధనలు తీసుకొచ్చి... రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేస్తున్నట్లు జగన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ముసుగులో వైసీపీ నాయకులు రైతులతో ఒప్పందం కుదుర్చుకొని భూములను వారి పేరిట మార్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ నేతల సూచనలతో గత ప్రభుత్వం 22–ఏ జాబితాలో నుంచి నిషేధిత భూములను తప్పించి అప్పనంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ అక్రమాల భరతం పట్టేందుకే చంద్రబాబు ప్రభుత్వం సంకల్పించి, కార్యాచరణకు పూనుకుంది. ప్రజలకు గత ప్రభుత్వం చేసిన నిర్వాకాన్ని వివరిస్తూనే... ఇలాంటి అత్యధికంగా వస్తున్న భూ సమస్యల ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రభుత్వం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహణకు చర్యలు చేపట్టింది.
ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా స్వీకరించిన వినతుల్లో 60 వేలకు పైగా వినతులు భూ సమస్యలపైనే వచ్చాయి. అందులో భాగంగా డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు గ్రామాల్లో సదస్సులు నిర్వహించి రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకు నిర్ణయం తీసుకుంది. అలాగే గ్రామాల్లో ఉన్న ప్రజల సమస్యలు పరిష్కారానికి.. అధికారులు వినతులు స్వీకరించి పరిష్కరించనున్నారు. గ్రామ సభల్లో భూ వివాదాలపై వచ్చిన ఫిర్యాదులను అధికారులు పరిశీలించి ప్రజలకు రసీదులు ఇస్తారు. ఈ రెవెన్యూ సదస్సులో అధికారులతో పాటు నేతలు కూడా పాల్గొని ప్రజల సమస్యల పరిష్కరించనున్నారు. గ్రామాల్లో దీర్ఘ కాలికంగా అపరిష్కృతంగా ఉన్న భూసమస్యల పరిష్కారానికి ఒక మంచి వేదిక మాదిరిగా రెవెన్యూ గ్రామ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూమిపై హక్కులో చిక్కులు లేకుంటేనే ప్రజలైనా, ప్రభుత్వమైనా ప్రగతి బాటలో ముందుకెళ్లడం సాధ్యమవుతుందని కూటమి ప్రభుత్వ విశ్వసిస్తోంది. భూ హక్కులోని చిక్కులను తొలగించడానికి మంచి చట్టాలు, సమర్థమైన భూ పాలన, సత్వరం సమస్యలను పరిష్కరించే భూ న్యాయ వ్యవస్థ ఉండాలని ఒకవైపు చట్టాలు చెయ్యడంతో పాటు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిచండం ముఖ్య భాగం. భూమి ఉన్నా రికార్డుల్లో లేకపొతే ఆ భూమిపై ఏ లబ్ధి పొందాలన్నా సాధ్యం కాదు. ప్రభుత్వ పథకాలు అందవు. పంటల బీమా దక్కదు. ఇదే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుడికి న్యాయం జరగాలని, మంచి పాలన అందించాలనే సంకల్పంతో పనిచేస్తుందనడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు.
భూమి ఉన్నా రికార్డుల్లో లేకపోతే ఆ భూమిపై ఏ లబ్ధి పొందాలన్నా సాధ్యం కాదు. ప్రభుత్వ పథకాలు అందవు. పంటల బీమా దక్కదు. ప్రతి లబ్ధిదారుడికి న్యాయం జరగాలని, మంచి పాలన అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. అందులో భాగమే గ్రామాల్లో జనవరి 8 వరకు నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు.
అనగాని సత్యప్రసాద్
రెవెన్యూ, రిజిస్ట్రేషన్ & స్టాంపుల శాఖ మంత్రి
Updated Date - Dec 07 , 2024 | 12:54 AM