ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బౌలర్లు మంచి కెప్టెన్లు కాలేరా?

ABN, Publish Date - Nov 30 , 2024 | 05:52 AM

జస్ప్రీత్‌ బుమ్రా నాయకత్వంలో టీమ్‌ ఇండియా పెర్త్‌ నగరంలో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. బౌలర్‌గా, కెప్టెన్‌గా బుమ్రా

జస్ప్రీత్‌ బుమ్రా నాయకత్వంలో టీమ్‌ ఇండియా పెర్త్‌ నగరంలో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. బౌలర్‌గా, కెప్టెన్‌గా బుమ్రా అపూర్వ ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు. చాలా సంవత్సరాల క్రితం అనిల్‌ కుంబ్లేకు టీమ్‌ ఇండియా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని సూచిస్తూ నేను ఒక వ్యాసాన్ని రాశాను. ‘ది హిందూ’లో 26 జూలై 1998న ‘డు బౌలర్స్‌ మేక్‌ గుడ్‌ కెప్టెన్స్‌?’ అనే శీర్షికతో అది ప్రచురితమయింది. పెర్త్‌లో బుమ్రా బౌలింగ్‌ నైపుణ్యం, కెప్టెన్సీ సామర్థ్యం చూసిన తరువాత నాకు ఆ వ్యాసం గుర్తుకు వచ్చింది.

ఒక క్రీడాకారుడి –అతడెంత ఆరితేరిన ఆటగాడు అయినప్పటికీ– పక్షాన అలా వాదించడమనేది నా స్వభావానికి విరుద్ధం. అయితే బ్యాటర్లు మాత్రమే ఉత్తమోత్తమ కెప్టెన్లు కాగలరని క్రికెట్‌ జగత్తులో విస్తృతంగా ఉన్న ఒక విశ్వాసాన్ని త్రోసిపుచ్చేందుకే నేను ఆ వ్యాసాన్ని రాశాను. కెప్టెన్‌ సొంత జట్టు ఫీల్డ్‌లో ఉన్నప్పుడు కెప్టెన్సీకి మరింత ప్రాధాన్యముంటుంది. బౌలర్లు, ఫీల్డర్లను మార్చడంలో బ్యాటర్లు దృష్టిని కేంద్రీకరించి నిష్పాక్షిక నిర్ణయాలు తీసుకోగలరనే అభిప్రాయం సర్వత్రా ఉంది. బౌలర్లు తమ టీమ్‌కు నేతృత్వం వహిస్తున్నప్పుడు వారు అండర్‌ బౌలింగ్‌ లేదా ఓవర్ బౌలింగ్ (సాధారణంగా ఓవర్ బౌలింగ్‌) చేస్తారని భావించడం కద్దు.

బ్యాటర్‌–కెప్టెన్ల అనుకూల వాదనలకు చారిత్రక ఆధారాలు సైతం దృఢంగా ఉన్నాయి. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో అసాధారణ విజయాలు సాధించిన ప్రశస్త కెప్టెన్లు అందరూ బ్యాటర్లే అన్న వాస్తవాన్ని 1998 నాటి నా వ్యాసంలో నేను అంగీకరించాను. డొనాల్డ్‌ బ్రాడ్‌మన్‌, క్లైవ్‌ లాయడ్‌ లే కాకుండా లెన్‌ హట్టన్‌, ఫ్రాంక్‌ వర్రెల్‌, అలెన్‌ బోర్డర్‌ (ఆస్సీ స్కిప్పర్‌గా స్టీవ్‌ వా అనితర సాధ్యంగా ఆడి తన జట్టుకు ఘన విజయాల చరిత్రను సృష్టించక ముందు)లు ఉత్కృష్ట టీమ్‌ లీడర్స్‌గా జగద్విఖ్యాతులయ్యారు. అయితే బౌలర్లు సైతం టీమ్‌ లీడర్స్‌గా ఘన చరిత్ర సృష్టించారని నేను వాదించాను. ఆస్ట్రేలియాకు చెందిన రిచియె బెనౌడ్‌, ఇంగ్లాండ్‌కు చెందిన రే ఇల్లింగ్‌ వర్త్‌లు తమ తమ టీమ్‌లను చరిత్రాత్మక గెలుపు బాటలలో నడిపించడమే అందుకు ఉదాహరణలు.


సరే, నేను ఆ వ్యాసాన్ని రాసిన కాలంలో టీమ్‌ ఇండియా కెప్టెన్‌గా అజరుద్దీన్‌ తన క్రికెట్‌ జీవితం చివరి దశలో ఉన్నారు. అజరుద్దీన్‌ నిష్క్రమించిన అనంతరం అనిల్‌ కుంబ్లే ఆయనకు యోగ్యమైన వారసుడు అవుతారని నేను ఆ వ్యాసంలో వాదించాను. కేవలం క్రికెటింగ్‌ ప్రతిభ ఉన్నవాడే కాకుండా నిశిత మేధ ఉన్న ఆటగాడు అనిల్ కుంబ్లే అని నేను అభిప్రాయపడ్డాను. రంజీ ట్రోఫీలో కర్ణాటక టీమ్‌ ప్రశస్త విజయానికి కుంబ్లే కెప్టెన్సీ విశేషంగా దోహదం చేసిందని నేను పేర్కొన్నాను. వికెట్లను పడగొట్టడంలో బెనౌడ్‌కు అలన్‌ డేవిడ్‌సన్‌ మరో బౌలర్‌ సహకారం ఉండేది. ఇల్లింగ్‌వర్త్‌కు జాన్‌ స్నో, డెరెక్‌ అండర్‌ వుడ్ లాంటి బౌలర్లు తోడ్పడేవారు. అనిల్‌ కుంబ్లే అలాగే జవగల్‌ శ్రీనాథ్‌పై ఆధారపడవచ్చు. భారత్‌కు ప్రపంచ కప్‌ను సాధించిన టీమ్‌ ఇండియాకు సారథ్యం వహించింది బౌలర్‌ కపిల్‌దేవ్‌ అన్న వాస్తవం అవిసర్మరణీయమైనది కాదూ?

పావు శతాబ్దికి పూర్వం ప్రచురితమైన ఆ వ్యాసంలో నేను ఇంకా ఇలా పేర్కొన్నాను: ‘బౌలర్లు మంచి కెప్టెన్లు కాలేరన్న అపోహకు కారణమేమిటి? క్రికెట్‌ క్రీడలో బౌలర్ల హోదాలో క్రింది స్థాయికి చెందినదనే భావనలో భాగమే ఆ అపోహ. క్రికెట్‌ క్రీడాకారులలో ప్రజాదణ అధికంగా పొందుతున్నది బ్యాటర్లే. క్రికెట్‌ అభిమానులకు, క్రికెట్‌ టోర్నమెంట్స్‌ వ్యవహారాలకు బాధ్యత వహించే వారికి ఆ వాస్తవం బాగా తెలుసు’. ఇంకా ఇలా రాశాను: ‘క్రికెటింగ్‌కు సంబంధించిన ఇతర విషయాలు అన్నీ సమరీతిలో ఉంటే బౌలర్లు సైతం ప్రశస్త కెప్టెన్‌లుగా రాణించగలరు. శ్రీనాథ్‌ రంగంలో ఉండి, తన బౌలింగ్‌ ప్రతిభను ఉత్కృష్టంగా కొనసాగిస్తున్నంత వరకు ప్రత్యర్థి పక్షాన్ని పూర్తిగా చిత్తు చేయడం కుంబ్లేకు పెద్ద కష్టసాధ్యమైన పని కాబోదు. సమయం వచ్చినప్పుడు కుంబ్లేకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే విషయాన్ని తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. బౌలర్లు ప్రభావశీల కెప్టెన్లు కాలేరన్న నిరాధార నమ్మకంతో కుంబ్లేకు కెప్టెన్సీని నిరాకరించకూడదు’.

నేను క్రికెట్‌ అభిమానినే కానీ క్రికెట్‌ వ్యవహారాల నిర్వాహకులను ప్రభావితం చేయగలిగేవాడిని కాను కదా. ఈ కారణంగానే నా ప్రతిపాదన పరిశీలనకు నోచుకోలేకపోయింది. నేను ఆ వ్యాసం రాసి ఏడాది గడవక ముందే అజరుద్దీన్‌ కెప్టెన్సీ నుంచి నిష్క్రమించారు. ఆయన స్థానంలో సచిన్ టెండూల్కర్‌ వచ్చారు. సచిన్‌ గతంలో కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించారు. అయితే ఆ కెపెన్సీలో ఎలాంటి ప్రత్యేకత లేకపోయింది. ఎనిమిది టెస్ట్‌ మ్యాచ్‌ల అనంతరం సచిన్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో గంగూలీ వచ్చారు. వివిధ భారతీయ నగరాలలో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లలో టీమ్‌ ఇండియాకు ప్రశస్త విజయాలు సాధించిపెట్టిన చరిత్ర గంగూలీకి ఉన్నది. అయితే ఆయన బ్యాటింగ్‌ సామర్థ్యం క్షీణముఖం పట్టడంతో కెప్టెన్సీ బాధ్యతను రాహుల్‌ ద్రావిడ్‌కు అప్పగించారు.

అజరుద్దీన్ అన్నిటి కంటే ముందుగా బ్యాటర్‌. అనితరసాధ్యమైన బ్యాటింగ్‌ ప్రతిభ ఆయన సొంతం. టీమ్ ఇండియా కెప్టెన్‌గా ఆయన వారసులు ముగ్గురూ–సచిన్‌, గంగూలీ, ద్రావిడ్‌– స్కిప్పర్లు. వికెట్లు పడగొట్టడం, మ్యాచ్‌లు గెలుచుకునేందుకు ఆ ముగ్గురూ అనిల్‌ కుంబ్లేపై ఆధారపడినవారే.

అజరుద్దీన్ రిటైర్‌ అయిన తరువాత కెప్టెన్సీ అవకాశానికి కుంబ్లే 83 టెస్ట్‌ మ్యాచ్‌ల దాకా వేచి ఉండవలసివచ్చింది. 2007లో పాకిస్థాన్‌పై టీమ్ ఇండియాకు సారథ్యం వహించేందుకు కుంబ్లేకు ప్రప్రథమంగా అవకాశం లభించింది. నిజానికి అంతకు ముందు సంవత్సరాలలోను కుంబ్లేను కెప్టెన్‌గా నియమించి ఉన్నట్టయితే ఆయన ఎటువంటి విజయాలు సాధించి ఉండేవారో కదా? మ్యాచ్‌లు గెలవగలిగే సామర్థ్యంలో సచిన్‌కు లభించిన గౌరవమే కెప్టెన్‌గా కుంబ్లేకూ లభించింది. ఫీల్డ్‌లో గంగూలీ మాదిరిగా కుంబ్లే కూడా దూకుడుగా వ్యవహరించేవారు, ద్రావిడ్‌ వలే ఆయన కూడా సంపూర్ణంగా టీమ్‌కు కట్టుబడిన ఆటగాడు. నేను, మరికొంత మంది ఆశించినట్టు 1999లోనే కుంబ్లే కెప్టెన్‌ అయి ఉన్నట్టయితే దాదాపు ఒక దశాబ్ద కాలం పాటు ఆ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉండే అవకాశం ఆయనకు లభించి ఉండేది.

మొత్తం మీద టీమ్‌ ఇండియా కెప్టెన్‌గా కుంబ్లే స్వల్పకాలం మాత్రమే ఉన్నారు. 2008లో పెర్త్‌లో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌ ఆయన కెప్టెన్సీ చరిత్రలో ఒక ఘనమైన రికార్డు. 2024 పెర్త్‌ టెస్ట్‌ వలే ఆనాడు కూడా టీమ్‌ ఇండియా దాదాపు ఓటమి అంచుకు చేరి అనూహ్యంగా విజయం సాధించింది. అంతకు ముందు సిడ్నీలో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా ఓడిపోయింది. అంపైరింగ్‌లో జరిగిన పొరపాట్లు కూడా ఆ సిడ్నీలో ఓటమికి కారణమయ్యాయి. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో అనిల్‌ కుంబ్లే నైరాశ్యంలో ఉన్న తన జట్టు సభ్యులను ఉత్సాహపరిచి పెర్త్‌లో విజయానికి నడిపించారు. అసాధారణమైన విజయమది.

2024లో సైతం స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతుల్లో ఘోరంగా ఓడిపోయిన భారత్‌ జట్టు ఆస్ట్రేలియాలో ఆ దేశ జట్టుపై గెలవడం అసాధ్యమని క్రికెట్‌ అభిమానులు అందరూ తీర్మానించుకున్నారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, బ్యాటర్‌ శుభ్‌మన్‌గిల్‌ లేకపోవడం కూడా టీమ్‌ ఇండియాకు విజయావకాశాలు ఏ మాత్రం లేవనే అభిప్రాయానికి తావిచ్చింది. అయితే మొదటి రోజు చివరి దశలో భారత్‌ కెప్టెన్‌, ప్రతిభావంతుడైన బౌలర్‌ ఆస్ట్రేలియన్ బ్యాటింగ్‌ వెన్ను విరిచాడు. ఆ తరువాత రెండు రోజులు భారత ఆటగాళ్లు ప్రశస్తంగా ఆడి ప్రత్యర్థులను నిలువరించి తిరుగులేని విజయం సాధించారు.

పెర్త్‌లో బౌలర్‌ కెప్టెన్‌ జస్ప్రీత్‌ బుమ్రా తన జట్టుకు నెరపిన అసాధారణ సారథ్యం విస్తృతంగా ప్రశంసలు పొందింది. ఆటలోనేకాదు, మ్యాచ్‌ ముగిసిన అనంతరం విలేఖర్ల సమావేశంలో బుమ్రా ప్రవర్తించిన తీరు కూడా అందరినీ ఆకట్టుకున్నది. సందేహం లేదు బుమ్రా అసాధారణ ప్రజ్ఞావంతుడు. పరిణత వ్యక్తి. రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌కు సమీపిస్తున్నందున ఆయన తరువాత కెప్టెన్సీ బాధ్యతలను బుమ్రాకు అప్పగించాలని ఇప్పటికే పలువురు సూచించారు. రోహిత్‌కు ప్రత్యామ్నాయంగా రిషబ్‌ పంత్‌ను కొంతమంది ప్రతిపాదించారు. బౌలర్‌ –కెప్టెన్లపై ఉన్న అపోహల కారణంగానే ఇటువంటి ప్రతిపాదనలకు ఆస్కారమేర్పడుతుంది. అయితే పెర్త్‌లో టీమ్‌ ఇండియాకు బుమ్రా అందించిన సమర్థ నాయకత్వాన్ని చూసిన తరువాత, రోహిత్‌ శర్మ వారసుడు ఎవరనేది మరి ఆలోచించనవసరం లేదు.


2008లో పెర్త్‌లో టీమ్‌ ఇండియా విజయం సాధించినప్పుడు కెప్టెన్‌ కుంబ్లే వయసు 37 సంవత్సరాలు. ఆ సంవత్సరాంతంలోగానే ఆయన టెస్ట్‌ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయ్యారు. 2024లో పెర్త్‌లో టీమ్‌ ఇండియా విజయానికి కారకుడైన బుమ్రా ఇంకా 31వ వసంతంలోకి ప్రవేశించలేదు. రోహిత్‌ శర్మ రేపో మాపో క్రికెట్‌ నుంచి నిష్క్రమించనున్నారు. బుమ్రాకు టెస్ట్‌ క్రికెట్‌లో నాలుగు లేదా ఐదు సంవత్సరాల పాటు అవకాశాలు ఉన్నాయి.

ఒకనాడు కుంబ్లే వలే బుమ్రా కూడా భారతదేశ అగ్రగామి స్ట్రైక్‌ బౌలర్‌. కుంబ్లేకు వలే బుమ్రా కూడా వికెట్లను తీసుకునే సహచర ఆటగాళ్ల సహాయ సహకారాలు సమృద్ధిగా ఉన్నాయి. వారిలో అశ్విన్‌, జడేజా, షమీ ప్రముఖులు. ఈ ముగ్గురూ బుమ్రా కంటే వయస్సులో పెద్దవారు. ఒకటి రెండేళ్లలో క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయ్యేవాళ్లే. అయితే సిరాజ్‌, కుల్దీప్‌లు బుమ్రా కంటే చిన్నవాళ్లు. హర్షిత్‌ రాణా వలే పెర్త్‌లో తమ ప్రతిభాపాటవాలను చూపిన యువ బౌలర్లు ఉన్నారు. ఇది బుమ్రాకు శుభసూచకం. ఆయన నిస్సందేహంగా టీమ్‌ ఇండియాకు ప్రశస్తమైన బౌలర్‌–కెప్టెన్‌ కాగలరు.

బ్యాటర్లు మాత్రమే ఉత్తమోత్తమ కెప్టెన్‌లు కాగలరనేది ఒక పాక్షిక సత్యం మాత్రమే. బౌలింగ్‌లో ఉద్దండులు అయిన ఆస్ట్రేలియన్‌ బెనౌడ్‌, బ్రిటిష్‌ ఇల్లింగ్‌వర్త్‌, మన కపిల్‌దేవ్‌ తమ టీమ్‌లను గెలుపు బాటలో నడిపించలేదూ? 2008లో పెర్త్‌లో ఓటమి అంచుకు చేరిన భారత జట్టు అసాధారణ విజయం సాధించడానికి బౌలర్‌ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే, 2024లో పెర్త్‌లోనే ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా జయకేతనం ఎగురవేయడానికి జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌ నైపుణ్యం, కెప్టెన్సీ పటిమ కారణం కాదూ?

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - Nov 30 , 2024 | 05:52 AM