అవసాన దశలో గ్రంథాలయాలు!
ABN, Publish Date - Nov 19 , 2024 | 05:48 AM
ఉభయ తెలుగు రాష్ట్రాలలోని గ్రంథాలయాల పరిస్థితి చూస్తుంటే అవి అవసాన దశలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. గ్రంథలయాలు శాశ్వతంగా మూతపడే అవకాశం కూడా ఉంది. వేలాది కోట్ల
ఉభయ తెలుగు రాష్ట్రాలలోని గ్రంథాలయాల పరిస్థితి చూస్తుంటే అవి అవసాన దశలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. గ్రంథలయాలు శాశ్వతంగా మూతపడే అవకాశం కూడా ఉంది. వేలాది కోట్ల రూపాయల విలువైన గ్రంథాలయ భవనాలు, గ్రంథాలు, ఫర్నిచర్ ఇతర వస్తువులు నిస్తేజంగా పడియున్నాయి. కొంతమంది పెద్దలు తమ ఆస్తిని తమ సంతానంతో సమానంగా గ్రంథాలయాలకూ పంచారు అనే విషయం జగద్వితం.
1984లో ఎన్టీరామారావు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత రూ.2 కిలో బియ్యం ప్రచారం నిమిత్తం మండలానికి ఒక గ్రంథాలయం స్థాపించారు. భవనాలు కూడా నిర్మించారు. ఆ విధంగా గ్రంథాలయాల సంఖ్య పెరిగి కొంతవరకు సీఎల్‌ఎస్‌ఎస్‌సీ, బీఎల్‌ఎస్‌సీ పాసైన నిరుద్యోగులకు భుక్తి కల్పించారు. ఆ కాలంలో గ్రంథాలయాలకు మంచి ఊపు వచ్చింది.
గ్రంథాలయ ఉద్యోగుల జీతభత్యాలు ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఉండేవిధంగా 1970వ దశకంలో ముఖ్యమంత్రి వెంగళరావు ఏర్పాటు చేసియున్నారు. అప్పటి వరకు గ్రంథాలయ సెస్సు, ప్రభుత్వ గ్రాంటు మీదే ఆధారపడి గ్రంథాలయాలు, వాటి సిబ్బంది ఆధారపడి ఉండేవారు.
సుమారు 15 నుండి 20 సంవత్సరాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు గ్రంథాలయ సెస్సును జిల్లా గ్రంథాలయాలకు జమచేయడం లేదు. కేవలం ప్రభుత్వం ఇచ్చే గ్రాంటుమీదే ఉద్యోగస్థులు, పెన్షనర్స్ బ్రతుకుతున్నారు. మరో ఆదాయం లేదు.
గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్‌లో నేడు రూ. 1000 కోట్ల గ్రంథాలయ సెస్ బకాయిలు పేరుకొనిపోయినవి. ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ వంటి నగరాలు గ్రంథాలయాల సెస్‌ను ఆయా జిల్లాల సంస్థలకు జమచేయడం లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, ఏలూరు, కాకినాడ, మచిలీపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వంటి నగరాలు కూడా సుమారు రూ. 1000 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. 80 మునిసిపాలిటీలు మరో రూ. వెయ్యికోట్ల వరకు బకాయిలు ఉన్నాయి.
ఇవన్నీ ఆంధ్ర, తెలంగాణలో ఉన్న జిల్లా గ్రంథాలయాల సంస్థలకు 010 జీఓ ద్వారా జమైతే వెనుతిరిగి చూడవలసిన పనిలేదు. సుమారు నాలుగువేల కోట్ల రూపాయలు, వాయిదాల మీద కట్టినా, దఫదఫాలుగా కట్టినా గ్రంథాలయోద్యమం బ్రతికి బట్టకడుతుంది. గ్రంథాలయ సెస్సు కట్టాలనే జీఓ ఉన్నా కట్టకపోతే తగిన ప్రతిచర్యలు లేక గ్రంథాలయాల ఆర్థిక పరిస్థితి దిగజారుచున్నది.
జిల్లా గ్రంథాలయ సంస్థలలో సిబ్బంది కరువై రెండు గ్రంథాలయాలకు ఒక ఉద్యోగి (వారానికి మూడురోజులు) పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలోని 100 గ్రంథాలయాల్లో గతంలో 230 మంది పనిచేయగా ప్రస్తుతం 50 మంది పనిచేస్తున్నారు. మరికొంత మంది రిటైర్డ్ అయితే కొత్త రిక్రూట్‌మెంట్ లేదు. కొత్త గ్రంథాలయాలు లేవు. ఇలానే కొనసాగితే భావిభారత పౌరులకు చేతిలో పుస్తకం అనేది ఉండదు.
–గంధం అప్పారావు, గ్రంథాలయ ఉద్యోగుల సంఘం మాజీ కార్యదర్శి
Updated Date - Nov 19 , 2024 | 05:48 AM