వెలుగు నీడలు
ABN, Publish Date - Nov 13 , 2024 | 03:11 AM
భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ 41 సంవత్సరాల వయస్సులోపే హైకోర్టు జడ్జి అయిన ప్రతిభామూర్తి. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొంది, నవంబర్ 2022లో...
భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ 41 సంవత్సరాల వయస్సులోపే హైకోర్టు జడ్జి అయిన ప్రతిభామూర్తి. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొంది, నవంబర్ 2022లో భారత ప్రధానన్యాయమూర్తి అయ్యారు. ఇటీవలి దశాబ్దాలలో రెండేళ్ల పదవీకాలం పొందిన ప్రధాన న్యాయమూర్తులలో ఆయనే మొదటివారు. జడ్జిగా, చీఫ్ జస్టిస్‌గా ఉన్న ఎనిమిదేళ్ల కాలంలో ఆయన 1200కు పైగా ధర్మాసనాలలో సభ్యుడు. దాదాపు 600 తీర్పులను స్వయంగా రాశారు. తొలినాటి తీర్పులలో పౌరుల వైయక్తిక హక్కులకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యం, బహిరంగ వేదికలపై వెలువరించిన ఉపన్యాసాలు ఆయనకు ‘ఉదారవాద ధర్మ యోధుడు’గా పేరు ప్రతిష్ఠలు సమకూర్చాయి. సీజేఐగా, కార్యనిర్వాహక వర్గం నుంచి పూర్తి స్వతంత్రతతో సుప్రీంకోర్టు వ్యవహరించేలా చేయగలరని అందరూ ఆశించారు. అయితే పదవీ విరమణ నాటికి జస్టిస్ చంద్రచూడ్ ‘కొత్త మితవాద ఉదారవాది’ అనే అప్రతిష్ఠను మూటగట్టుకున్నారు. ముఖ్యంగా అయోధ్య వివాదం, అధికరణ 370 రద్దు కేసులలో ఆయన తీర్పులు విస్తృతామోదం పొందలేకపోయాయి. న్యాయకోవిదులు, ప్రజానీకం చంద్రచూడ్ న్యాయపాలన పట్ల అసంతృప్తికి లోనయ్యారు.
న్యాయవిహిత నిర్ణయాలు తీసుకోకపోవడం కాదు, తీసుకునేందుకు పూనుకోకపోవడమే విషాదం. ఎన్నికల సంఘంలాంటి రాజ్యాంగ సంస్థల స్వతంత్ర ప్రతిపత్తిని పునరుద్ధరించేందుకు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల బుల్‌డోజర్ దురాగతాలను నిరోధించేందుకు, పౌరులపై చట్ట విరుద్ధ నిఘా నిలిపివేసేందుకు, జమ్మూకశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించేందుకు, మహారాష్ట్రలో ప్రజాస్వామ్య విరుద్ధంగా కూల్చివేసిన ప్రభుత్వానికి చట్టబద్ధత పునరుద్ధరించేందుకు, ఎన్నికల ప్రక్రియలో ప్రజల విశ్వసనీయతను పెంపొందించేందుకు జస్టిస్ చంద్రచూడ్ సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదని చెప్పక తప్పదు. ఆయన న్యాయ పర్యవేక్షణలో వేలాది సామాజిక కార్యకర్తలు, పాత్రికేయులు, ప్రభుత్వ విధానాలపై భిన్నాభిప్రాయాలు కలవారు విచారణ లేకుండా, కనీసం బెయిల్ పొందే వెసులుబాటు కూడా లేకుండా జైళ్లలో మగ్గిపోతున్నారు. ఎనభై ఏళ్లు పైబడిన స్టాన్‌స్వామి మరణం, 90 శాతం అవిటితనంతో బాధపడుతున్న ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా మృతి జైళ్లలో ఖైదీలు ఎటువంటి అమానుష పరిస్థితులలో కునారిల్లిపోతున్నారో విశదం చేస్తున్నాయి. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 370 అధికరణను ప్రభుత్వం రద్దు చేయడాన్ని సమర్థించింది. కశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తిని తొలగించడాన్ని ఆక్షేపించినప్పటికీ దాని పునరుద్ధరణకు ధర్మాసనం ఆదేశించలేదు కనుకనే ఈ కేసులో న్యాయమూర్తులు న్యాయానికి విఘాతం కలిగించారని దుష్యంత్ దవే వంటివారు గట్టిగా అభిప్రాయపడ్డారు. కశ్మీర్ ప్రత్యేకప్రతిపత్తిని రద్దుచేస్తామని 2014లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ఆ పార్టీ ప్రభుత్వం అమలుపరిచేందుకు చంద్రచూడ్ ఇతర న్యాయమూర్తులు సహకరించారన్నది విమర్శకుల అభిప్రాయం. ఇక అయోధ్యకేసులో తీర్పు వెలువరించిన ధర్మాసనంలో (అప్పటికింకా ఆయన సీజేఐ కాలేదు) చంద్రచూడ్ సభ్యుడు. ఆ తీర్పును ఆయనే రాశారన్నది ఒక బహిరంగ రహస్యం. ఆ తీర్పు ఒక వైరుధ్యాల పుట్ట అని దవే విమర్శించారు. చట్టాలు, న్యాయసూత్రాల ప్రాతిపదికన కాకుండా అధికసంఖ్యాక వర్గ ప్రజల మతపరమైన భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకుని న్యాయనిర్ణయం జరిగిందన్నది ఆరోపణ. దీనికితోడు, ఈ తీర్పుకు సంబంధించి ఇటీవల చంద్రచూడ్ చేసిన ఒక వ్యాఖ్య ఆయన ప్రతిష్ఠను మరింత మసకబార్చింది. రామజన్మభూమి కేసు విచారణ సందర్భంలో తాను దేవుణ్ణి ప్రార్థించానని, ఆ ప్రార్థన ఫలితంగానే ఆ కేసుకు ఒక పరిష్కారం లభించిందని ఆయన అన్నారు. రాజ్యాంగం కంటే కానరాని ఒక అమూర్తమూర్తికి ప్రాధాన్యమివ్వడమేమిటని ఆ వ్యాఖ్యపై విమర్శలు వెల్లువెత్తాయి ఈ ఏడాది వినాయక చవితి పండుగ సందర్భంగా తన నివాసానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించడం కూడా చంద్రచూడ్ న్యాయనిబద్ధతను ప్రశ్నార్థకం చేసింది. హిందువుగా గుర్తింపు పొందేందుకు ఆయన బాహాటంగా చేస్తున్న ప్రయత్నాలను రాజ్యాంగ విలువలను సంరక్షించుకునేందుకు ఆరాటడుతున్నవారు హర్షించలేకపోతున్నారు. ‘న్యాయ వ్యవస్థ అధికారం కేసులను పరిష్కరించడంలో గానీ, శిక్షలు విధించడంలో గానీ, కోర్టు ధిక్కారానికి పాల్పడిన వారిని దండించే పద్ధతిలో గానీ లేదు; న్యాయనిర్ణయాలు, న్యాయపాలనలో సగటు మనిషి నమ్మకం, విశ్వాసం, భరోసాలో ఉందన్నది అమెరికా నాల్గవ ప్రధాన న్యాయమూర్తి జాన్ మార్షల్ అభిప్రాయం. ఆ ప్రకారంగా సీజేఐ చంద్రచూడ్ తన విధ్యుక్త ధర్మనిర్వహణలో విఫలమయ్యారని ఆరోపణ.
ఏ న్యాయమూర్తీ పరిపూర్ణ ధర్మమూర్తి కాడు, కాలేడు. చంద్రచూడ్ సైతం ఇందుకు మినహాయింపు కాదు. న్యాయపాలనలో ఆయన చేపట్టిన కొన్ని మంచి చర్యలనూ ప్రస్తావించవలసిందే. న్యాయవ్యవస్థలో ఈ–న్యాయస్థానాల పద్ధతిని సమర్థంగా నిర్వహించడం, విస్తరింపచేయడం ద్వారా స్వాతంత్ర్యానంతర భారత న్యాయవ్యవస్థలో ఆయన ఒక విప్లవాన్ని తీసుకువచ్చారు. న్యాయమూర్తిగా ఆయన నెలకొల్పిన ప్రమాణాలు ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గవి. ఆయన తీర్పులు నిశిత విశ్లేషణలతో తర్కబద్ధంగా సరళరీతిలో సామాన్య విద్యావంతులు సైతం చదవగలిగేవిగా ఉంటాయి. న్యాయవాదనలు విశ్లేషణాత్మక మేధకు ప్రతిబింబాలు. సరళ, సుందర, శక్తిమంతమైన భాషలో తీర్పులు రాయడంలో జస్టిస్ కృష్ణ అయ్యర్‌తో చంద్రచూడ్‌ను పోల్చుతారు. మౌలిక చింతకుడు అయిన చంద్రచూడ్ భారత న్యాయవ్యవస్థ పునాదులను మార్చివేసేందుకు సమకట్టి ఆ కృషిలో ఎన్నో తప్పులు చేశారు.
Updated Date - Nov 13 , 2024 | 03:11 AM