మణిపూర్ రోదన
ABN, Publish Date - Nov 19 , 2024 | 05:42 AM
ఇటీవల కుకీ మిలిటెంట్లు అపహరించుకుపోయిన ఆరుగురు వ్యక్తుల మృతదేహాలు నదిలో దొరకడంతో ఇంఫాల్ లోయలో అగ్గిరాజుకుంది. ఒక శరణార్థ శిబిరంనుంచి ఆ మీతీ కుటుంబాన్ని
ఇటీవల కుకీ మిలిటెంట్లు అపహరించుకుపోయిన ఆరుగురు వ్యక్తుల మృతదేహాలు నదిలో దొరకడంతో ఇంఫాల్ లోయలో అగ్గిరాజుకుంది. ఒక శరణార్థ శిబిరంనుంచి ఆ మీతీ కుటుంబాన్ని అపహరించుకుపోయిన కుకీ మిలిటెంట్లు ఎనిమిదినెలల పసికందునుంచి అమ్మమ్మ వరకూ అందరినీ అమానుషంగా హత్యచేశారు. రెండేళ్ళబాలుడి తల, చేతులు నరికివేసి అత్యంత ఉన్మాదంగా వ్యవహరించారు. ఈ దారుణఘటన మీతీలను ఆగ్రహోదగ్రులను చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ళమీద దాడులు చేశారు, వాటిని తగులబెట్టారు. ఏకంగా ముఖ్యమంత్రి నివాసంమీదే విరుచుకుపడ్డారు. ఇటీవల పదిమంది కుకీలను సీఆర్‌పీఎఫ్ జవాన్లు ఎన్‌కౌంటర్ చేయడంతో కుకీ–జో మిలిటెంట్లు ప్రతీకారంగా ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఓ వాదన. మీతీ మిలిటెంట్లనుంచి తమవారిని రక్షించుకోవడానికి వలంటీర్లుగా పనిచేస్తున్న కుకీలను సీఆర్పీఎఫ్ బలగాలు పనిగట్టుకొని చంపివేశాయన్నది వారి ఆరోపణ. కుకీ–జోమీ ఆదివాసుల్లో ఒకటైన హమర్ తెగకు చెందిన ఒక యువతిమీద మీతీ మిలిటెంట్లు అత్యాచారం జరిపి, చిత్రవధచేసి, సజీవంగా తగులబెట్టినందుకు ప్రతీకారంగా మీతి కుటుంబాన్ని హమర్ మిలిటెంట్లు చిత్రవధ చేసిచంపినట్టు కనిపిస్తోంది. మీతీలు, ఆదివాసీ తెగల మధ్య పాలకులు అడ్డుగోడలు కట్టేసిన తరువాత, మణిపూర్ నిత్యం రగులుతూనే ఉంది.
ఏడాదిన్నరగా మణిపూర్ తీవ్రమైన హింసనీ, బాధనీ చవిచూస్తోంది. విద్వేషపూరిత రాజకీయాలమీద ఆధారపడి పాలన చేయాలనుకుంటున్నవారు జాతుల మధ్య వైరాన్ని పెంచిపోషిస్తున్నారు. ప్రస్తుత పరిణామాలు కాస్తంత పెద్దవి కావచ్చునేమో కానీ, మణిపూర్‌లో మళ్ళీ హింస అంటూ వార్తలు నిత్యం వింటూనే ఉన్నాం. మీతీల మీద ఓ దారుణం జరిగి, వారు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నందువల్లనే కేంద్ర హోంమంత్రి మళ్ళీ మణిపూర్ గురించి ఆలోచిస్తున్నారని, ఇంతకాలమూ గిరిజనులమీద ఎన్ని అఘాయిత్యాలు జరిగినా ఢిల్లీకి పట్టలేదని కుకీ సంఘాలు విమర్శిస్తున్నాయి. తమపై దాడులకు పాల్పడుతున్న మిలిటెంట్ గ్రూపులను నిర్దాక్షిణ్యంగా అణచివేసి తమను కాపాడాలని మీతీల అభ్యర్థనమేరకు ఇప్పటికే వందలాదిమంది సైనికులు అక్కడ ఉన్నప్పటికీ, మరిన్ని అదనపు బలగాలను తరలించాలని కేంద్రం నిర్ణయించింది.
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో, బీరేన్‌సింగ్ ప్రభుత్వానికి ఇంతకాలమూ అండగా నిలబడిన రెండు పార్టీలు–ఇద్దరు ఎమ్మెల్యేలున్న కుకీ పీపుల్స్‌పార్టీ, ఏడుగురు ఎమ్మెల్యేలున్న నేషనల్ పీపుల్స్ పార్టీ– మద్దతు ఉపసంహరించుకున్నాయి. శాంతిస్థాపనలో బీరేన్ సింగ్ విఫలం చెందారని, ఆయన ఏలుబడిలో శాంతి దక్కదని తేలిపోయిందని ఎన్పీపీ అధినేత జూనియర్ సంగ్మా అంటున్నారు. కూటమినుంచి ఎప్పుడు తప్పుకోవాలన్నది ఆయన ఇష్టం కానీ, ఇంతకాలమూ బీరేన్‌మీద ఆయనకు అంత నమ్మకం ఉండటమే ఆశ్చర్యం. అరవైమంది సభ్యులున్న మణిపూర్‌లో సొంతబలం ముప్పైఏడున్న బీజేపీకి ఇలా ఏవో కొన్నిపార్టీలు కూటమిని వీడిపోయినా పెద్ద తేడా ఏమీ రాదు. కానీ, బీరేన్‌ను తప్పించాలన్న డిమాండ్ గతంతో పోల్చితే ఇటీవల సొంతపార్టీలోనే బాగా హెచ్చిన మాట వాస్తవం. కనీసం ఇరవైమంది బీజేపీ ఎమ్మెల్యేలు బీరేన్‌కు వ్యతిరేకంగా ఉన్నారని, జాతీయ అధ్యక్షుడికి కూడా వారు లేఖరాశారని, సంతకం చేసినవారిలో స్పీకర్ కూడా ఉన్నారని వార్తలు వచ్చాయి. ఇప్పటి హింస నేపథ్యంలో, మరిన్ని బలగాలను పంపుతూ కుకీ–జోమీ తెగలవారిని అదుపులో ఉంచడం, వారిలో ఆత్మరక్షణకోసం ఆయుధాలు పట్టినవారినీ, అసలైన మిలిటెంట్లనూ ఊచకోతకోయడం వినా, బిరేన్‌ను తప్పించాలన్న డిమాండ్‌కు బీజేపీ అధిష్ఠానం లొంగిరాకపోవచ్చు. బీరేన్‌ను తప్పించి, ఎవరిని కూచోబెట్టినా పరిస్థితుల్లో మార్పు వస్తుందని, ఈ ఉద్రిక్తతలు కొంతమేరకు తగ్గుతాయని బీజేపీ అధిష్ఠానానికి తెలియకపోదు. కానీ, జాతుల మధ్య చిచ్చుపెట్టి మానవహననానికి దారులు పరిచిన బీరేన్ లేకపోతే ఈ ఈశాన్యరాష్ట్రంలో వారు అనుకున్న ఎజెండాలు నెరవేరవు. ఎప్పుడు హింస జరిగినా, విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, మణిపూర్ చల్లారుతోందనీ, అగ్నికి ఆజ్యం పోయవద్దనీ హోంమంత్రి హితవు చెబుతూంటారు. ఆరునెలల క్రితం కాబోలు, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యల నేపథ్యంలో, మీతీ–కుకీ వర్గాల మధ్య వైమనస్యాలు తొలగించేందుకు ప్రత్యేక కృషి ఆరంభమవుతుందని ప్రకటించారు. కానీ, పరిస్థితుల్లో ఏ మార్పూ కనిపించడం లేదు. కశ్మీర్‌కు కూడా పోయి ఓట్లు అడిగినవారు మణిపూర్‌లో ఎందుకు కాలూనడంలేదో మనకు తెలియనిదేమీ కాదు.
Updated Date - Nov 19 , 2024 | 05:42 AM