ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘కగార్ అంతిమ యుద్ధం’తో శాంతి నెలకొంటుందా?

ABN, Publish Date - Oct 26 , 2024 | 04:51 AM

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అడవులపై క్రమంగా పట్టు సాధిస్తున్నామని భారత సైనిక, భద్రతా బలగాల అధిపతులు చెబుతున్నారు. తాజాగా అబూజ్‌మడ్ కొండల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 32 మంది చనిపోయారు. వెంటనే ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అడవులపై క్రమంగా పట్టు సాధిస్తున్నామని భారత సైనిక, భద్రతా బలగాల అధిపతులు చెబుతున్నారు. తాజాగా అబూజ్‌మడ్ కొండల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 32 మంది చనిపోయారు. వెంటనే ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్ష సమావేశం జరిపారు. 2026 నాటికి మావోయిస్టు సమస్య రూపుమాపడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. దేశంలో మావోయిస్టు సమస్య లేకుండా చేయడమే ప్రస్తుత లక్ష్యమని ఇప్పటికే అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే.

అభివృద్ధికి మావోయిస్టులు అడ్డుపడుతున్నారని భారత పాలకులు అంటున్నారు. మావోయిస్టు పార్టీ మాత్రం– ఆదివాసులను ఒక్కటి చేయగలిగాం, బయటి సమాజంలో వారికి గుర్తింపును తేగలిగాం; అడవులను పరిరక్షిస్తున్నాం, వ్యవసాయాన్ని అభివృద్ధి చేశాం; విద్య, వైద్యం మెరుగుపడింది, శుభ్రత పెరిగింది; ప్రజలు సంతోషంగా బతకగలుగుతున్నారు. మైనింగ్ మాఫియా భూతాలపై పోరుకు గిరిజనులను ఏకం చేస్తున్నాం... అని చెబుతోంది. ఛత్తీస్‌గఢ్ అడవి తల్లి ఒడిలో సమిష్టి వ్యవసాయ క్షేత్రాలున్నాయి.. వాటిని సాగు చేసేందుకు జనం నిర్మించిన చెరువులు ఉన్నాయి! అక్షరం ముక్క రాని గోండు బిడ్డలకు చదువు నేర్పేందుకు పాఠశాలలున్నాయి! పల్లెల్లో ప్రబలే రోగాల చికిత్సకు సంచార వైద్యశాలలున్నాయి.

ఒకవైపు పట్టణాలు, మైదాన ప్రాంతాలు ప్రభుత్వ బలగాల ఆధీనంలో ఉంటే.. అటవీ గ్రామాలన్నీ మావోయిస్టుల గైడెన్స్‌లో స్వయంపాలన జనతన సర్కార్లు కొనసాగుతున్నాయి. దాదాపు పదివేల చదరపు కిలోమీటర్ల ప్రాంతం గెరిల్లా స్థావరాలుగా ఉంది.


కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు సమాధాన్ పేరుతో 2017 నుంచి 2022 వరకు దాడిని కొనసాగించాయి. డిసెంబర్ 2022లో కేంద్ర హోం శాఖ మాడ్ విముక్తి కార్యచరణ పథకాన్ని రూపొందించి, 2024 పార్లమెంటరీ ఎన్నికల వరకు నిర్మూలిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే గత రెండు సంవత్సరాలుగా అర్బన్ నక్సల్ పేరిట పట్టణాల్లో హక్కుల కార్యకర్తలపై, ప్రగతిశీల రచయితలు, కవులు, కళాకారులపై ఎన్ఐఏ దాడులను తీవ్రం చేసింది. కేంద్ర హోంశాఖ సమీక్ష చేసి 2024 జనవరిలో మావోయిస్టులపై ఆఖరి యుద్ధం... ‘కగార్’ ఆపరేషన్ (నిర్ణయాత్మక యుద్ధం) ప్రకటించింది. ఈ దాడి ప్రధాన కేంద్రీకరణ మాడ్ ప్రాంతాన్ని మావోయిస్టుల నుంచి విముక్తి చేయడం. అందులో భాగంగానే సెంట్రల్ రీజియన్, ఈస్టర్న్ రీజయన్లలోని మావోయిస్టు పార్టీ బలమైన కేంద్రాలన్నింటిపై దాడులు కొనసాగుతున్నాయి.

ఒడిశాలో ఉన్న మూడు బిఎస్ఎఫ్ బెటాలియన్లను మాడ్ ప్రాంతానికి తరలించి, ఆరు చోట్ల ఫార్వర్డ్ ఆపరేషన్ బేస్ క్యాంపుల్ని ఏర్పాటు చేసారు. ఒక్కో క్యాంపులో 500 బలగాలున్నాయి. రాజ్ నందగావ్, నారాయణ్‌పుర్, కొండగావ్ జిల్లాల్లో 8 ఐటీబీపీ బెటాలియన్ల నుంచి మొదట ఒక బెటాలియన్‌ను, ఆ తర్వాత మరో రెండు బెటాలియన్లను మాడ్‌పై మోహరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బలగాలపై ఆధారపడి డ్రోన్లతో, అధునాతన ఆయుధాలతో, నూతన టెక్నాలజీతో ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రా, ఒడిస్సా బోర్డర్లతో కూడిన దాదాపు 92,300 చదరపు కిలోమీటర్ల పరిధిలోని దండకారణ్యంలో దాడి చేస్తున్నారు. ఇక్కడ 50 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో రెండు నుంచి మూడు కోట్ల మూలవాసులున్నారు. ఇక్కడ ప్రజల మీద భారత ప్రభుత్వం యుద్ధం చేస్తోంది. దీనిని వారు కూడా యుద్ధంతోనే ఎదుర్కొంటున్నారు. ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన బలగాలు, సైనిక శిక్షణ పేరిట సైన్యం, ఇప్పటికే అర్ధ సైనిక బలగాలు దిగి యుద్ధాన్ని తీవ్రం చేస్తున్నాయి. విసిగి వేసారి చివరకు మావోయిస్టుల గైడెన్స్‌లో స్వయంపాలనకు పూనుకుంటే మాత్రం వెంటనే భద్రతా బలగాల పేర వాయుసేన, సైనిక పాఠశాల పేరున సైన్యాన్ని దించి డ్రోన్లతో బాంబింగ్ చేస్తూ బలప్రయోగం చేసే ఎత్తుగడ ఫలిస్తుందా?

రెండు ప్రపంచ యుద్ధాల తరువాత ప్రపంచ దేశాలన్నీ అంగీకరించిన 1949 జెనీవా ఒప్పందం ప్రకారమైనా భారత ప్రభుత్వం నడుచుకోవాలి. ఇటీవల ఎకనామిక్ పొలిటికల్ వీక్లీ తన నెలవారీ రివ్యూలో బస్తర్ అడవుల్లో భారత ప్రభుత్వం జెనీవా ఒప్పందాలను మించి హింసకు పాల్పడుతోందని పేర్కొన్నది. అక్కడ ఏం జరుగుతోందో జర్నలిస్టులకు, పౌర సమూహాలకు, డాక్టర్లకు పర్యటించి తెలుసుకునే హక్కు ఉన్నదని అంతర్జాతీయ న్యాయసూత్రాలు చెబుతున్నాయి. కానీ వాటిని భారత పాలకులు పాటించాలి కదా!


భారత రాజ్యంగం ఇచ్చిన సంవిధానం ద్వారా పార్లమెంట్, శాసనసభల ద్వారా చట్టాలు చేసి ఈ దేశ అంతర్గత భద్రత కోసమే చేపట్టిన గ్రీన్‌హంట్ అయిన పహార్.. కగార్ పేరుతో ఆఖరి యుద్ధమని నిర్ణయాత్మక దాడికి దిగుతూ అన్నంలో విషంపెట్టి పడిపోయిన వాళ్లను కాల్చి చంపడం, వాళ్లకు అన్నం పెట్టారని సమాచారం ఇస్తున్నారని గ్రామాలకు గ్రామాలను తీసుకుపోయి చంపడం, జైళ్లలో నిర్బంధించడం అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రకారం కూడా యుద్ధ నేరమే. అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి పోయే జర్నలిస్టులను, హక్కుల సంఘాలను ఎందుకు పోతున్నారో రికార్డు రాసుకుని పంపించవచ్చు. ఇవేవీ పాటించకుండా అక్కడి జనాన్ని చంపడం, దొరికిన మహిళలను సామూహిక అత్యాచారాలు చేయడం ఏమి యుద్ధనీతి?

మావోయిస్టుల నిర్మూలన గురించి మాట్లాడుతున్న భారత పాలకులు ఈ ప్రపంచం నుంచి ప్రతి భావజాలాన్ని, ఈ దేశం నుంచి నిరుద్యోగాన్ని, ఆకలి చావులను, పేదరికాన్ని, సకల అసమానతలకు కారణమైన దోపిడీ–పీడనల నుంచి విముక్తి చేయడమెలాగో ఆలోచన చేస్తే బాగుంటుంది. ఒకవేళ ఈ పాలకులకు చేతకాకపోతే మావోయిజం మరో పేరుతో ఈ దేశంలో అభివృద్ధి చెందుతుంది.

ఈ యుద్ధం రాజ్యాంగ వ్యతిరేకమని హక్కుల సంఘాలు, మేధావులు, బుద్ధిజీవులు ఘోషిస్తున్నారు. ఇక్కడ యుద్ధ రంగంలో ఉన్న భారత అర్ధ సైనిక బలగాలకు, అక్కడి జనతన సర్కార్ (ప్రజాప్రభుత్వం)లోని పౌరులకు ఎటువంటి రిలేషన్ ఉండాలన్న దానిపై చర్చ జరగాలి. జనతన సర్కార్‌లను భారత పాలకులు, ప్రభుత్వం ఎలా గుర్తిస్తుందనేది జాతీయవాదం పేరుతో వస్తున్న ప్రశ్నలు. అసలు జనతన సర్కార్ అనేది భారతదేశంలో నక్సల్‌కు సంబంధించిన ఏరియా కాదు. శతాబ్దాలుగా కడు దీనావస్థలో బతుకుతున్న ఆదివాసులను ఏనాడూ పట్టించుకోని ప్రభుత్వాలు, వాళ్లు ఉద్యమిస్తే మాత్రం యుద్ధప్రాతిపదికన స్పందిస్తున్నాయి. కూలి రేట్లు పెంచాలని, కాంట్రాక్టర్ల దౌర్జన్యాలు అరికట్టాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని ఎన్నోసార్లు సభలు పెట్టినా, ర్యాలీలు తీసినా, బంద్‌లు నిర్వహించినా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. అక్కడి ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఏర్పాటు చేసుకున్న తమ ప్రజా ప్రభుత్వాలను రక్షించుకునేందుకు యుద్ధంలో భాగం అవుతున్నారు. దానికి మావోయిస్టు పార్టీ గైడెన్స్ ఉంటే ఉండవచ్చు. రాజ్యాంగం ప్రకారమైనా అది 5వ షెడ్యూల్ ఏరియా, పెస చట్టం, ఆదివాసీల రక్షణకు ఇచ్చిన హక్కులను భారత రాజ్యమే పాటించకుండా, అక్కడి ఖనిజ సంపదను మల్టీ నేషన్ కంపెనీలకు రాసిచ్చింది. దానిపై వారు పోరాడుతున్నారు.

భారత రాజ్యాంగం ప్రకారం పాలకులు, ప్రభుత్వాలు నడుచుకోవాలి. భారతదేశాన్ని కాపాడుకునేందుకే ఈ యుద్ధానికి దిగామని, ఇది అంతర్గత భద్రత సమస్య అని చెబితే... అక్కడి జనం ఏం కోరుకుంటున్నారు? అక్కడి గిరిజన యువకుల ఆకాంక్షలేంటి? వారు ఆయుధం పట్టడానికి దారి తీసిన పరిస్థితులేమిటి? ఆయుధం వదలాలంటే వారు కోరుతున్న మార్గం ఏమిటో చర్చించాలి. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ విధానాలకు ప్రత్యామ్నాయ మార్గంలో జనతన సర్కార్‌లు నడుస్తున్నాయని అంటున్నారు కదా! ఇందుకు కారణమైన మావోయిస్టులను శాంతి చర్చలకు ఆహ్వానించాలి. ప్రతి వ్యక్తికి కూడు–గుడ్డ–భూమి, బతికేందుకు ఉపాధి చూపించడమే స్వావలంబన కాదా? మావోయిస్టుల ఎజెండా ఇదే కనుక వెంటనే కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలకు చొరవచూపాలని దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు కోరుతున్నారు. అందుకు ఎం.ఎల్, వామపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ, వైసీపీ, టీడీపీ, డెమొక్రటిక్ పార్టీలు కూడా ఆలోచించి, కేంద్రంలో ఉన్న ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, దేశంలో జరుగుతున్న రక్తపాతాన్ని ఆపాలి. శాంతి వాతావరణం నెలకొల్పాలి.

మావోయిస్టుల నిర్మూలన గురించి మాట్లాడుతున్న భారత పాలకులు ఈ ప్రపంచం నుంచి ప్రతి భావజాలాన్ని, ఈ దేశం నుంచి నిరుద్యోగాన్ని, ఆకలి చావులను, పేదరికాన్ని, సకల అసమానతలకు కారణమైన దోపిడీ–పీడనల నుంచి విముక్తి చేయడమెలాగో ఆలోచన చేస్తే బాగుంటుంది. ఒకవేళ ఈ పాలకులకు చేతకాకపోతే మావోయిజం మరో పేరుతో ఈ దేశంలో అభివృద్ధి చెందుతుంది.

బండి దుర్గాప్రసాద్

జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త

Updated Date - Oct 26 , 2024 | 04:51 AM