మాస్కోలో మోదీ
ABN, Publish Date - Jul 11 , 2024 | 02:10 AM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడోసారి అధికారం చేపట్టాక, తన తొలివిదేశీ పర్యటనకు ఇరుగుపొరుగుదేశాలను కాక, రష్యాను ఎంచుకున్నారు. ఈమారు ఆయన మన చిరకాల ఆప్తమిత్రదేశంలో తొలిగా కాలూనడం బాగున్నది కానీ...
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడోసారి అధికారం చేపట్టాక, తన తొలివిదేశీ పర్యటనకు ఇరుగుపొరుగుదేశాలను కాక, రష్యాను ఎంచుకున్నారు. ఈమారు ఆయన మన చిరకాల ఆప్తమిత్రదేశంలో తొలిగా కాలూనడం బాగున్నది కానీ, అందుకు ఆయన ఎంచుకున్న సమయం కొన్ని సమస్యలు తెచ్చిపెట్టింది. ప్రధాని మోదీపర్యటన ఉభయదేశాల సంబంధాలను మరో దశకు తీసుకుపోయిన మాట వాస్తవం. ప్రపంచరాజకీయాలను ప్రభావితం చేసే పర్యటనగా దీనిని అభివర్ణిస్తూ, రష్యా విడుదల చేసిన సుదీర్ఘ ప్రకటన చూసినప్పుడు ఆ దేశం ఎంత సంతోషించిందో అర్థమవుతుంది.
రష్యాలో భారతప్రధాని ఉన్న సమయంలో, ఉక్రెయిన్ రాజధాని కీవ్ మీద రష్యా అమానుషమైన దాడి చేసింది. జూన్ 8న జరిగిన దాడుల్లో నలభైఐదుమందికి పైగా మరణించారు. ఓ పిల్లల ఆస్పత్రిమీద జరిగిన దాడి రష్యాను అప్రదిష్టపాల్జేసింది. ఈ అకృత్యానికి తాను కారణం కాదని, ఉక్రెయిన్ మిసైల్ విఫలం చెందినందువల్లే ఈ దారుణం జరిగిందని రష్యా దబాయించింది కానీ, రెండేళ్ళుగా రష్యా యుద్ధరీతులను గమనిస్తున్నవారికి అందులో నిజానిజాలు తెలియకపోవు. డెబ్బయ్ ఐదేళ్ళక్రితం అమెరికా ప్రోద్బలం మేరకు ఆవిర్భవించిన ‘నార్త్ అట్లాంటిక్ ట్రీటీ (నాటో)’ కూటమి వజ్రోత్సవ సమావేశాలు వాషింగ్టన్‌లో మొదలవుతున్న నేపథ్యంలో, రష్యా అంత తీవ్రస్థాయిలో ఈ జూన్ 8 దాడులకు తెగబడిందని అంటారు. ఆ సమావేశంలో సభ్యదేశాలన్నీ ఉక్రెయిన్‌కు అందించాల్సిన దీర్ఘకాలిక సాయం, చేయాల్సిన న్యాయం గురించి చర్చించడంతో పాటు, ఏటా నలభైబిలియన్ డాలర్ల మిలటరీ సాయం గురించి నిర్ణయం తీసుకోవలసి ఉంది. మరోపక్కన అదేరోజు, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ వార్సాలో పర్యటిస్తూ, పోలెండ్‌తో ఒక మహత్తర రక్షణ ఒప్పందాన్ని కుదర్చుకున్నారు. ఉక్రెయిన్ గగనతలంలోకి వచ్చిన రష్యా డ్రోన్లను, క్షిపణులకు కూల్చివేసేందుకు నాటో సభ్యదేశంగా పోలెండ్‌కు ఈ ఒప్పందం అధికారాన్నిస్తోంది.
ఈ రెండు పరిణామాలమీదా రష్యా తన ఆగ్రహాన్ని, నిరసనను ఈ వైమానికదాడుల ద్వారా ప్రకటించిన సందర్భంలోనే ప్రధాని నరేంద్రమోదీ ఆ దేశంలో పర్యటించడం విశేషం. పౌరస్థావరాలమీద దాడులతో రష్యా తన దుర్మార్గాన్ని ప్రదర్శించిన ఈ సందర్భాన్ని, మోదీ పర్యటనను కలగలిపి ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎంతో తెలివిగా వాడుకున్నారు. ధ్వంసమైన ఆస్పత్రి ఫోటోలను ట్విటర్‌లో పోస్టుచేస్తూ అతిపెద్ద ప్రజాస్వామ్యదేశాధినేత ఓ అత్యంత క్రూరుడైన నేరగాడిని ఆలింగనం చేసుకున్న ఆ ఘటన అంటూ పుతిన్–మోదీ ఆలింగనం దృశ్యాన్ని ఉటంకించారు. రష్యా– ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి తెరవెనుక ఎటువంటి యత్నాలు జరుగుతున్నాయో తెలియదు కానీ, మోదీ పర్యటన ఆ శాంతియత్నాలకు తీవ్ర విఘాతమని జెలెన్‌స్కీ ఆక్షేపించారు.
రష్యాతో యుద్ధం మొదలైన తరువాత జెలెన్‌స్కీ భారతదేశాన్ని నేరుగా తప్పుబట్టడం ఇదే తొలిసారి. గతనెలలో స్విట్జర్లాండ్ ఆధ్వర్యంలో ఒక శాంతి సదస్సు జరిగినప్పుడు భారతదేశం నామమాత్రంగా ఓ చిన్నస్థాయి అధికారిని పంపి సంయుక్త ప్రకటనమీద సంతకం చేయడానికి కూడా నిరాకరించిన విషయం తెలిసిందే. ఆదినుంచీ ఈ యుద్ధం విషయంలో రష్యాను విమర్శించేందుకు భారతదేశం ఎన్నడూ సిద్ధపడలేదు. ఐక్యరాజ్యసమితిలో రష్యా వ్యతిరేక తీర్మానాల సందర్భంలో కూడా ఓటింగ్‌కు గైర్హాజరైంది. కానీ, అమెరికా తదితర పాశ్చాత్యదేశాల అహాన్ని సంతృప్తిపరచాల్సి వచ్చినప్పుడల్లా యుద్ధనీతి గురించి, సామాన్యుల ప్రాణాలపరిరక్షణగురించి, దేశ సార్వభౌమత్వం గురించి నాలుగుమాటలు అంటూండటం ఉన్నదే.
ఇప్పుడు పుతిన్–మోదీ గాఢాలింగనంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చిన నేపథ్యంలో, రష్యా అధ్యక్షుడితో మోదీ మరో నాలుగుమాటలు గట్టిగా చెప్పినట్టుగా భారతవిదేశాంగశాఖ కార్యదర్శి ప్రకటన తెలియచేస్తోంది. పిల్లల ఆస్పత్రిపై జరిగిన దాడిని ఖండించడం, పసిపిల్లలు బలికావడంమీద ఆవేదన వెలిబుచ్చడం, సమస్యకు పరిష్కారం చర్చలే తప్ప యుద్ధక్షేత్రం కాదని పునరుద్ఘాటించడం ఇత్యాదివి అనేకం అందులో ఉన్నాయి. సమస్యకు చర్చల ద్వారానే ముగింపు పలకాలి, అందుకు భారతదేశం తనవంతు సాయం చేయడానికి సిద్ధంగా ఉంది అని మోదీ అన్నప్పుడు పుతిన్ ఎంతో శ్రద్ధగా విన్నారట. యుద్ధానికి తెరదించేందుకు వీలుకల్పించే కొన్ని ఆసక్తికరమైన మార్గాలు ఈ చర్చల సందర్భంగా ముందుకు వచ్చాయనీ, సంక్షోభ నివారణకు మోదీ చేస్తున్న ప్రయత్నాలపట్ల పుతిన్ కృతజ్ఞతలు తెలియచేశారని కూడా వార్తలు వచ్చాయి. ఉక్రెయిన్ యుద్ధం ఆరంభమైన తరువాత రష్యాలో మోదీ కాలూనడం ఇదే తొలిసారి. ఈ పర్యటన ఆ యుద్ధం ముగింపుదిశగా ఉపకరిస్తే అంతకంటే సంతోషించాల్సిందేమీ లేదు.
Updated Date - Jul 11 , 2024 | 02:10 AM