ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నెతన్యాహూ కొత్త ఎత్తు

ABN, Publish Date - Jun 28 , 2024 | 03:45 AM

లెబనాన్‌లో ఉన్న తమ పౌరులను వెంటనే వెనక్కురావాల్సిందిగా జర్మనీ, నెదర్లాండ్స్‌ తాజాగా హెచ్చరికలు జారీ చేశాయి. ఇప్పటికే కెనడా సహా మరికొన్ని దేశాలు తమవారికి ఇదేతరహా సూచనలు చేసిన...

లెబనాన్‌లో ఉన్న తమ పౌరులను వెంటనే వెనక్కురావాల్సిందిగా జర్మనీ, నెదర్లాండ్స్‌ తాజాగా హెచ్చరికలు జారీ చేశాయి. ఇప్పటికే కెనడా సహా మరికొన్ని దేశాలు తమవారికి ఇదేతరహా సూచనలు చేసిన విషయం తెలిసిందే. అనేక పాశ్చాత్యదేశాల దౌత్యకార్యాలయాలు తమ పౌరులను ఏయే మార్గాల్లో లెబనాన్‌నుంచి తరలించవచ్చునో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయట. ఇజ్రాయెలీలను ప్రశాంతంగా ఉంచే ఉద్దేశంలో బెంజమీన్‌ నెతన్యాహూ లేడు. గాజాని దుంపనాశనం చేసిన ఆయన ఇప్పుడు అక్కడ కాస్తంత తగ్గి, తన బలగాన్ని లెబనాన్‌ సరిహద్దులకు తరలించి, హిజ్బొల్లాతో పూర్తిస్థాయి యుద్ధం చేయాలని అనుకుంటున్నాడు. నెతన్యాహూకు పటిష్ఠమైన యుద్ధవ్యూహం ఉన్నదని, అది వరుసపెట్టి ఎవరో ఒకరితో యుద్ధాలు చేస్తూండటమేనన్న ఓ సరదా వ్యాఖ్య నూటికి నూరుపాళ్ళూ నిజం. నిరంతర యుద్ధంతోనే తనకు రాజకీయంగా మనుగడ సాధ్యపడుతుందని ఆయనకు తెలుసు.


ఇరాన్‌ ఎలాగూ ఊరుకోదు. హిజ్బొల్లాతో యుద్ధంలో లెబనాన్‌లోకి నెతన్యాహూ సైన్యాలు చొరబడేందుకు ప్రయత్నించినపక్షంలో ఇరాన్‌ ప్రవేశంతో ఆ యుద్ధం మరింత తీవ్రమవుతుంది, సరిహద్దులు దాటిపోతుంది. దీనికితోడు, హమాస్‌తో పోల్చితే హిజ్బొల్లా ఆయుధశక్తి, సంఖ్యాబలం మరింత అధికం. ఈ సంస్థ దగ్గర ఉన్న వివిధ రకరకాల క్షిపణులు, రాకెట్లు అధునాతనమైనవి. గాజా యుద్ధం ఆరంభమైనప్పటినుంచి ఇజ్రాయెల్‌ సరిహద్దు ప్రాంతాల్లో హిజ్బొల్లా జరుపుతున్న దాడులు తీవ్రంగా ఉన్నాయి. సరిహద్దు గ్రామాలు, పట్టణాలను ఇజ్రాయెలీలు వదిలిపోవాల్సివచ్చింది. ఈ నేపథ్యంలో, ఇప్పుడు ఇజ్రాయెల్‌ తన బలగాలన్నింటినీ కూడగట్టి గట్టిగా యుద్ధం చేసినపక్షంలో హిజ్బొల్లా తన ఆయుధశక్తినంతటినీ వాడుతుంది, మద్దతుగా ఇరాన్‌ను తెచ్చుకుంటుంది. 2006లో హిజ్బొల్లాతో యుద్ధంలో ఇజ్రాయెల్‌ పెద్దగా సాధించిందేమీ లేదు.

గాజాలో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన మరుక్షణంనుంచి ఇజ్రాయెల్‌మీద హిజ్బొల్లా దాడులు ఆగిపోతాయి. కానీ, హమాస్ అంతమే తన పంతమని అంటూ నెతన్యాహూ కాల్పుల విరమణను, శాంతి ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నాడు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఆమోదించిన ప్రతిపాదనను ఇటీవలే తిరగ్గొట్టిన ఆయన మరోపక్క కొత్త యుద్ధం గురించి మాట్లాడుతున్నాడు. హమాస్ అధీనంలో ఉన్న ఇజ్రాయెలీ బందీలను విడిపించే విషయంలో ఆయన శ్రద్ధపెట్టడం లేదని సంబంధిత కుటుంబాలవారు ఆగ్రహిస్తున్నారు. ఎన్నటికీ ఆగని యుద్ధంతో విసిగిపోయిన వేలాదిమంది ఇజ్రాయెలీలు రోడ్లమీదకు వచ్చి నెతన్యాహూకు వ్యతిరేకంగా ప్రదర్శనలు, నిరసనలు నిర్వహిస్తున్నారు. ఆయన రాజీనామా చేయాలని, కొత్తగా ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. దేశంలో చాలా చోట్ల అల్లర్లు, విధ్వంసం జరిగినందువల్ల కాబోలు, కాల్పుల విరమణ విషయంలో ఆయన ఆ తరువాత కాస్తంత మెత్తబడినప్పటికీ, చాలా మెలికలు పెట్టారు. బందీల అప్పగింత పూర్తయ్యేవరకూ కాల్పుల విరమణ అమల్లో ఉంటుంది తప్ప అదేమీ శాశ్వతం కాదన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించడంతో హమాస్‌ దానిని కొట్టిపారేస్తూ తన డిమాండ్లను పునరుద్ఘాటించింది.


యుద్ధం ఆగినపక్షంలో ఎన్నికలు జరిగి, తన కూటమి ప్రభుత్వం పడిపోతుంది, అవినీతి కేసులు వెంటాడతాయి కనుక ఆ పరిస్థితులు రాకుండా నెతన్యాహూ తెలివిగా హిజ్బొల్లాను రెచ్చగొడుతున్నట్టు ఉంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎడతెగని గాజాయుద్ధం బైడెన్‌ను ఇరుకునపెడుతున్న తరుణంలో, నెతన్యాహూ కొత్త ఎత్తు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. లెబనాన్‌లోకి ఇజ్రాయెల్‌ బలగాలు చొరబడినపక్షంలో ఆ యుద్ధానికి నియమాలు, నిబంధనలు, హద్దులు, అదుపులు ఉండబోవని హిజ్బొల్లా నాయకుడు హసన్ నస్రుల్లా హెచ్చరించారు.

హమాస్‌తో ఇలా ఎంతకాలం యుద్ధం చేసినప్పటికీ, దానిని మహా అయితే తాత్కాలికంగా బలహీనపరచవచ్చునే కానీ, నాశనం చేయడం అసాధ్యమని ఐడీఎఫ్‌ నెతన్యాహూకు నివేదించినట్టుగా వార్తలు వచ్చాయి. హమాస్‌తో పోల్చితే అనేకరెట్లు శక్తిమంతమైన హిజ్బొల్లాతో యుద్ధానికి దిగి, అటు ఇరాన్‌ను, ఇటు అమెరికా తదితర దేశాలను నెతన్యాహూ ఉచ్చులోకి లాగే ఆలోచన చేస్తున్నారు. ఈ విషయంలో నెతన్యాహూ మెడలు వంచాల్సిన బాధ్యత అమెరికామీద ఉన్నది. ఇజ్రాయెల్‌–హిజ్బొల్లా యుద్ధాన్ని అమెరికా కోరుకోవడం లేదని, ఆ పరిస్థితి రాకుండా నిలువరించే ప్రయత్నాలు విశేషంగా జరుగుతున్నాయన్న వార్తలు నిజమైన పక్షంలో సంతోషించాల్సిందే.

Updated Date - Jun 28 , 2024 | 03:45 AM

Advertising
Advertising