ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కొత్త లోక్‌సభ

ABN, Publish Date - Jun 25 , 2024 | 02:53 AM

పద్దెనిమిదవ లోక్‌సభ సమావేశాల ఆరంభం నాటి దృశ్యాలు చూసినప్పుడు రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడే కళ్ళకు కడుతున్నది. లోక్‌సభ కొలువుతీరడానికి ముందే ప్రధానిమోదీ 1975లో ఇందిర విధించిన ఎమర్జెన్సీని...

పద్దెనిమిదవ లోక్‌సభ సమావేశాల ఆరంభం నాటి దృశ్యాలు చూసినప్పుడు రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడే కళ్ళకు కడుతున్నది. లోక్‌సభ కొలువుతీరడానికి ముందే ప్రధానిమోదీ 1975లో ఇందిర విధించిన ఎమర్జెన్సీని గుర్తుచేస్తూ, దానిని రాజ్యాంగంమీద ఎన్నటికీ చెరగని మచ్చగా అభివర్ణిస్తూ, దేశానికి అటువంటి కళంకాలు రాకుండా నడుచుకుంటామంటూ రాజ్యాంగంపై చర్చనీ, మళ్ళీ ఓ రచ్చనీ లేవదీశారు. మోదీ ఏలుబడిలో దేశం ఓ వందసార్లు అప్రకటిత అత్యయికస్థితి ఎదుర్కొందని విమర్శించిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే, విపక్షానికి అందివచ్చిన నీట్‌ ఆయుధాన్ని ప్రయోగించారు. విపక్షాలమీద విరుచుకుపడటమే తప్ప లక్షలాదిమందిని ఇబ్బందుల పాల్జేసిన నీట్‌, నెట్‌ ఇత్యాది వైఫల్యాలమీద మోదీ నోరువిప్పరన్నది ఆయన వ్యాఖ్యల సారాంశం. సభలోపల విద్యామంత్రి ధర్మేంద్రప్రధాన్‌ ప్రమాణం చేస్తున్నప్పుడు నీట్‌ పేపర్‌ లీక్‌మీద విపక్షసభ్యులు నినాదాలు చేయడం, మోదీ, అమిత్‌షాలు ప్రమాణం చేస్తున్నప్పుడు రాహుల్‌గాంధీ తదితర విపక్షనేతలు రాజ్యాంగం ప్రతిని చూపించడం, పార్లమెంట్‌ వెలుపల వీరంతా సంఘటితంగా ఆ ప్రతులను చూపుతూ నినాదాలు చేయడం వంటివి ఈ సమావేశాలు ఏ అంశాల చుట్టూ తిరుగుతాయో సూచిస్తున్నాయి. తన ఏలుబడిలో కాంగ్రెస్‌ రాజ్యాంగాన్ని ఎంతగా బలహీనపరిచిందో ప్రజలకు తెలియచెప్పడానికి బీజేపీ దేశవ్యాప్త కార్యక్రమాలు చేపట్టబోతున్నదట.


ఎన్నడూ మొదటివరుసలో కూర్చోవడానికి ఇష్టపడని రాహుల్‌గాంధీ ఇప్పుడు ముందుకు రావడంతోపాటు అఖిలేశ్‌ ఆయన పక్కనే ఉండటం విపక్షం సమధికోత్సాహానికి నిదర్శనం కావచ్చు. మంగళవారం రాహుల్‌ ప్రమాణస్వీకారం సందర్భంగా ఎటువంటి దృశ్యాలు చూస్తామో తెలియదు కానీ, ప్రొటెమ్‌ స్పీకర్‌ విషయంలో బీజేపీ అనవసరపు పట్టుదలకు పోయి ఆదిలోనే అగ్గిరాజేసినమాట వాస్తవం. అత్యంత సీనియర్‌ సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమించే సంప్రదాయానికి భిన్నంగా బీజేపీ సభ్యుడు భర్తృహరి మెహతాబ్‌ను ఎంపికచేయడం ద్వారా బీజేపీ ఘర్షణకు పునాదులు వేసింది. ఈ నిర్ణయాన్ని రాజ్యాంగంమీద దాడిగా విపక్షం అభివర్ణిస్తోంది. ఎనిమిదిసార్లు గెలిచివచ్చిన తమ ఎంపీ కొదికున్నిల్‌ సురేష్‌ను కాదనడం ద్వారా అధికారపక్షం దళితసమాజాన్ని అవమానించిందని కాంగ్రెస్‌ విమర్శిస్తే, మధ్యలో ఓడిన సురేష్‌కంటే ఏడుసార్లు వరుసగా నెగ్గుకొచ్చిన తమ భర్తృహరి గొప్పవాడని బీజేపీ సమర్థించుకుంది. ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయించి, మహా అయితే ఓ రెండురోజుల్లో ముగిసిపోయే ఓ పాత్ర విషయంలో బీజేపీ ఇంత మొండిగా వ్యవహరించనక్కరలేదు. తమ చర్యను సమర్థించుకోవడానికి తమకు అనుకూలంగా ఉన్న గతకాలపు నిర్ణయాలను కొన్నింటిని అది గుర్తుచేస్తున్నది. తాత్కాలిక స్పీకర్‌నే శాశ్వతం చేయబోతున్నారన్న ప్రచారాన్ని అటుంచితే, స్పీకర్‌గా మోదీ ఎవరిని నిర్ణయించినా గెలిపించుకోగలిగే సంఖ్యాబలం ఆ కూటమికి ఉన్నందున కనీసం ఈ ముందుదశలో బీజేపీ ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో వ్యవహరిస్తే సరిపోయేది. ఒడిశా విజయం అధికారపక్షాన్ని నేలమీద నిలబడనివ్వడం లేదు. ఇప్పుడున్నవారో, వేరెవరో మోదీ మనసులో ఉన్నందున భర్తృహరిని ఇలా తాత్కాలికంగా సంతృప్తిపరుస్తున్నారని మరొకవాదన.


సుదీర్ఘకాలంగా సభలో ఉంటున్న సీనియర్‌ సభ్యుడిని ఆ కుర్చీలో కూచోబెట్టి, మిగతా తంతుని పూర్తిచేయించే గౌరవసంప్రదాయాల విషయంలో బీజేపీ భిన్నంగా వ్యవహరించడం వెనుక ఒక విస్పష్టమైన సందేశం ఉంది. విపక్షాలతో ఏమాత్రం రాజీపడబోవడంలేదని, సయోధ్య సాధ్యపడదని చెప్పదల్చుకున్నట్టు కనిపిస్తోంది. సంఖ్యరీత్యా తాము తగ్గినా, విపక్షం పెరిగి తమతో కాస్తంత సమమైనా తమలో ఏ మార్పూ ఉండబోదని ఇస్తున్న సందేశం కావచ్చు. విపక్షంతోనే కాదు, అసమ్మతి గొంతులతో, విమర్శకులతో కూడా గతంలో మాదిరిగానే వ్యవహరిస్తానని ఇటీవల అరుంధతీరాయ్‌పై ఊపా కేసు ద్వారా బీజేపీ తెలియచేసింది. కేజ్రీవాల్‌కు బెయిల్‌ రాకుండా చేయడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ న్యాయవ్యవస్థ మెట్లన్నీ ఎక్కుతోంది, శక్తిమేర పోరాడుతోంది.


పదిహేడవ లోక్‌సభనుంచి దేశం అత్యంత భయానకమైన దృశ్యాలు చూసింది. విపక్షసభ్యులను తీవ్రంగా అవమానించడం, అనుచితంగా ప్రవర్తిస్తూ హేయమైన భాషవాడటం, సుదీర్ఘకాలం సస్పెండ్‌ చేయడం, సభలో తమను ప్రశ్నిస్తున్నవారినీ, తమకు నచ్చనివారినీ ఎంచుకొని మరీ తప్పుడు మార్గాల్లో అనర్హత వేటువేయడం ప్రజలు చూశారు. అత్యంత కీలమైన బిల్లులను కూడా ప్రభుత్వం చర్చలేకుండా ఏకపక్షంగా నెగ్గించుకోవడం, అధికారపక్షానిదే పైచేయికావడమూ జరిగింది. రాజ్యాంగం ప్రకారం ఉండాల్సిన డిప్యూటీ స్పీకర్‌ కూడా ఇంతకాలమూ లేకపోయారు. కొత్త లోక్‌సభ గతానికి భిన్నంగా ప్రజలపక్షాన మరింత సమర్థంగా పనిచేయాలని అందరూ ఆశిస్తున్న తరుణంలో, ఆరంభంలోనూ అడుగులు ఆ దిశగాపడకపోవడం, ఆ సూచనలేవీ లేకపోవడం విచారకరం.

Updated Date - Jun 25 , 2024 | 02:53 AM

Advertising
Advertising