తీరం దాటిన ప్రళయం!
ABN, Publish Date - Sep 03 , 2024 | 05:06 AM
అయ్యో ఎంత ఘోరం ఈ తుఫాను విధ్వంసకాండ... తెలుగునేల గుండెల్లో ప్రకృతి విసిరిన జలఖడ్గం సుజలాం... సుఫలాం.. ముక్కలైన వాక్యాలు నేడు ఖండిత హృదయమై...
అయ్యో ఎంత ఘోరం
ఈ తుఫాను విధ్వంసకాండ...
తెలుగునేల గుండెల్లో
ప్రకృతి విసిరిన జలఖడ్గం
సుజలాం... సుఫలాం..
ముక్కలైన వాక్యాలు
నేడు ఖండిత హృదయమై...
భరతమాత
కనుచూపు మేరా నీటి ఎడారి
కనువిప్పు లేని మనిషి బికారి
కన్నీటి వరదలో
మునిగిన పేదరికం
నేలరాలిన చేలు
వెన్ను విరిగిన రైతన్నలు
తినే తిండి ఉండే గుడిసె
కట్టుకునే బట్ట గొడ్డు గోదా
సర్వం గంగార్పణం
రామ్ తేరి గంగా మైలీ
ఆకుపచ్చని సముద్రంలో
అల్పపీడన ద్రోణి
కన్నీటి ద్వీపంలో గ్రామాలు
నీటి మంటల్లో కాలుతూ...
ఆకలి ఎలుగెత్తి పిలుస్తూంటే
ఆకాశంనుంచి రాలే
ఆహారపొట్లాలకై
ఎదురుచూస్తూ... సామాన్య జనం
మనిషితనమే ముంపుకు గురై..
అడవులను నరికేస్తూ
చెరువుల దురాక్రమణలో
చెరుపు చేసిన అధికారం
ఈ నీతితప్పిన స్వార్థ జగాన
నెపం ఎవరిపైన వేద్దాం?
ఏ నీటి సంగ్రామంలో నైనా
బలయ్యేది బడుగుజీవులే కదా
లోకమే కాదు కాలమూ
కలుషితమైన నేపథ్యంలో.
విషతుల్యమైన పర్యావరణం
నెత్తుటి జెండా ఎగురేస్తూ...
నీరైనా కన్నీరైనా
తీరం దాటితే ప్రళయమే!!
ఇప్పుడిక్కడ
నీట మునిగిన నేలతల్లికి
చేయుత నిచ్చేందుకు
ఆపన్న హస్తాలు కావాలి
మనిషిభాష తెలిసిన వారెవరైనా
దయచేసి అనువదించండి
అందరం మానవహారమై
కలసికట్టుగా కదలిరావాలి అని
ఎలుగెత్తి చాటండి
ఎగిరే జాతీయ జెండాలుగా...
–సరికొండ నరసింహరాజు
Updated Date - Sep 03 , 2024 | 05:06 AM