ఓలి రాజకీయం
ABN, Publish Date - Dec 04 , 2024 | 01:36 AM
నేపాల్ ప్రధాని ఖడ్గప్రసాద్ శర్మ ఓలి ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి కంకణం కట్టుకున్నందుకు ఆయనను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమితంగా....
నేపాల్ ప్రధాని ఖడ్గప్రసాద్ శర్మ ఓలి ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి కంకణం కట్టుకున్నందుకు ఆయనను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమితంగా ప్రశంసించారు. రెండుదేశాలు పలు కీలక ఒప్పందాలమీద సంతకాలు చేశాయి. ఓలీ నేపాల్ ప్రధాని కావడం ఇది నాలుగోసారి అయినప్పటికీ, మొన్న జూలైలో నేపాలీ కాంగ్రెస్‌తో చేతులు కలిపి, ప్రచండను గద్దెదించి, మళ్ళీ ఆ పదవిలో కూచున్న తరువాత ఆయన తొలివిదేశీపర్యటన ఇదే. నేపాల్ ప్రధానిగా ఎవరు బాధ్యతలు స్వీకరించినా, తొలి విదేశీపర్యటన భారతదేశంలో జరపడం ఓ సంప్రదాయం. ఓలి దానిని కాదని, తొలిగా చైనాలో కాలూని, దానితో దీర్ఘకాలిక, వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవడం భారతదేశానికి గట్టి హెచ్చరిక.
ఓలి చైనా పర్యటన సందర్భంగా ఉభయదేశాధినేతలు ఒకరినొకరు కీర్తించుకున్నారు, ద్వైపాక్షిక బంధాన్ని మరింత దృఢతరం చేసుకోవాలని సంకల్పం చెప్పుకున్నారు. నదులు, నదీనదాలు, పర్వతశిఖరాలకు చెరోవైపూ ఉంటూ పంచుకుంటున్న మనం స్నేహాన్ని, సంతోషాన్ని కూడా పంచుకోవాలని, ఇచ్చిపుచ్చుకొనేరీతిలో వ్యవహరించాలని రెండుదేశాలు అనుకున్నాయట. నేపాల్‌ను ఆర్థికంగా నిలబెట్టే విషయంలో చైనా వెనకడగువేయబోదన్న గట్టి హామీ కూడా ఓలిశర్మకు లభించింది. పర్యటనకు ఒకరోజు ముందుగానే, చైనానుంచి నేపాల్‌కు వేర్వేరు పేర్లతో, ఖాతాలతో ఓ పాతికమిలియన్ డాలర్ల ప్రాజెక్టులు దక్కాయి. ఓలి పర్యటనలో అనేక భారీ నిర్మాణాలకు సంబంధించి ఒప్పందాలు జరిగాయని, వైద్యం, వాణిజ్యం, వ్యవసాయం ఇత్యాది రంగాల్లో సహకారం నిమిత్తం అవగాహనలు చేసుకున్నారని, మరిన్ని వరాలు దక్కుతాయని వార్తలు వస్తున్నాయి. నేపాలీ టెలివిజన్‌కూ చైనా అధికారికమీడియాకూ మధ్య కూడా ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయట.
జూలైలో ఓలి మళ్ళీ ప్రధాని అయినప్పుడే, ఆయన ఈ మారు తన అధికారాన్ని బలోపేతం చేసుకోవడం కోసం చైనాకు మరింత సన్నిహితమవుతారన్న విశ్లేషణలు వెలువడ్డాయి. సెప్టెంబరులో ఐక్యరాజ్యసమితి సదస్సు సందర్భంగా భారతప్రధాని నరేంద్రమోదీతో ఓలి భేటీ అయ్యారు. దీనికి ముందు నేపాల్ విదేశాంగమంత్రి మనదేశానికి వచ్చారు. భారత్‌లో పర్యటించాల్సిందిగా ఓలిని మనపాలకులు ఆహ్వానించకపోవడంతో, చైనా వెళ్ళాలన్న నిర్ణయానికి వచ్చారట. ఆయన ప్రధాని కావడంతోనే, భారత్–నేపాల్ బంధం బలహీనపడితే, అనంతర పరిణామాలతో అవి మరింత దిగజారాయి. నేపాల్‌లో చైనా పెట్టుబడుల విషయంలోనే కాక, భారత్–నేపాల్ ప్రాజెక్టుల్లో సైతం చైనా పరోక్ష ప్రమేయం పెరుగుతున్నదని భారత్ ఆగ్రహిస్తోంది. చైనా నిర్మించిన విమానాశ్రయాలనుంచి ఇతరదేశాలకు పోయే విమానాలను భారతదేశం తన గగనతలంమీద అనుమతించాలన్న నేపాల్ అభ్యర్థనకు భారత్ సరేననడం లేదు. ఇటువంటి పలు అంశాలు ఓలిరాకతో మరింత వేడెక్కాయి. ఆయనను మనం ఆహ్వానించకపోవడం మారిన వాతావరణానికి ప్రబల నిదర్శనం.
బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్‌లో భాగస్వామినవుతానని 2019లో చైనా అధ్యక్షుడు పర్యటించిన సందర్భంగా నేపాల్ గట్టిహామీ ఇచ్చిన విషయాన్ని ఇప్పుడు ఓలి పార్టీ (యూనిఫైడ్ మార్క్సిస్టు–లెనినిస్ట్) నాయకులు గుర్తుచేస్తున్నారు. అప్పుడు అవగాహన కుదర్చుకున్నవన్నీ ఆచరణసాధ్యం చేయడానికి ఓలి ఈ పర్యటన చేస్తున్నారట. 2017లో బీఆర్‌ఐలో చేరికూడా నేపాల్ ఈ విషయంలో పెద్దగా అడుగుముందుకు వేయలేకపోయింది.
అలాగే, చైనా నిర్మిత పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయం అప్పును తీర్చగలిగే స్థితిలో నేపాల్ లేదు కనుక దానిని గ్రాంటుగా మార్చమన్న ఓ అభ్యర్థన ఆయన ఎజెండాలో ఉందట. భారత్ అభ్యంతరాలతో అంతర్జాతీయ విమానాల రాకపోకలు అనుకున్నంతగా లేక ఈ విమానాశ్రయం నష్టాల్లోకి జారుకున్న విషయం తెలిసిందే. చైనాతో చేయి కలిపి నిండామునిగిన శ్రీలంక అనుభవం కళ్ళముందు ఉన్నది కనుక, ఓలి దూకుడును నియంత్రించేందుకు నేపాల్‌లోని మిగతాపక్షాలు ప్రయత్నించవచ్చు. కానీ, తన తొలివిదేశీ పర్యటనకు చైనాను ఎంచుకోవడం ద్వారా ఆయన భారతదేశాన్ని మరింత దూరం చేసుకున్నారు. భారత వ్యతిరేక ఎజెండాతో అధికారంలోకి వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు కూడా మొదట ఇదే తరహాలో వ్యవహరించి, ఆ తరువాత సయోధ్యయత్నాలు ఆరంభించారు. ఓలి ఎంతకాలం అధికారంలో ఉంటారో తెలియదు కానీ, ఆయన కారణంగా నేపాలీ ప్రజలకు దూరంకాకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన బాధ్యత భారత్ మీద ఉంది.
Updated Date - Dec 04 , 2024 | 03:32 AM