ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

యుద్ధం అంచున...!

ABN, Publish Date - Oct 03 , 2024 | 04:56 AM

ఇజ్రాయెల్‌ మీద ఇరాన్‌ ఆర్నెల్ల క్రితం చేసిన దాడికీ, ఇప్పుడు జరిగిన దానికీ తేడా స్పష్టం. ఏప్రిల్‌లో వందలాది క్షిపణులు, డ్రోన్లు ఇజ్రాయెల్‌ మీదకు పంపి అంతకుపక్షం రోజుల ముందు సిరియా రాజధాని...

ఇజ్రాయెల్‌ మీద ఇరాన్‌ ఆర్నెల్ల క్రితం చేసిన దాడికీ, ఇప్పుడు జరిగిన దానికీ తేడా స్పష్టం. ఏప్రిల్‌లో వందలాది క్షిపణులు, డ్రోన్లు ఇజ్రాయెల్‌ మీదకు పంపి అంతకుపక్షం రోజుల ముందు సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్‌ కాన్సులేట్‌ భవనంమీద క్షిపణి దాడితో రివల్యూషనరీ గార్డ్స్‌ అత్యున్నతస్థాయి కమాండర్లతో సహా పన్నెండుమందిని ఇజ్రాయెల్‌ చంపివేసినందుకు ప్రతీకారం తీర్చుకుంది. కానీ, ఆ దాడిలో ఇజ్రాయెల్‌కు జరిగిన నష్టం అతి స్వల్పం. కక్షతీర్చుకొనే తన లక్ష్యం నెరవేరిందని, ఆపరేషన్‌ ముగిసిందని ఇరాన్‌ వెంటనే ఓ ప్రకటన చేసింది. ఇది ప్రతీకాత్మక దాడేకానీ, ప్రతీకారం కాదని అందరికీ అర్థమైంది. తమ పొరుగుదేశాలకు ఈ దాడికి సంబంధించి డెబ్బయ్‌రెండు గంటల ముందస్తు సమాచారాన్ని అందచేశానని కూడా ఇరాన్‌ అప్పట్లో ప్రకటించింది. ఇజ్రాయెల్‌, దానిమిత్రదేశాలకు ఆత్మరక్షణకు తగినంత సమయమూ లభించింది, మరోపక్క ఇరాన్‌ తన శపథాన్ని నిలబెట్టుకున్నట్టూ అయింది. ముప్పైమూడేళ్ళ తరువాత ఇజ్రాయెల్‌మీద జరిపిన ఆ చర్యతో, ఎంత రెచ్చగొట్టినా ఇరాన్‌ నేరుగా ఇజ్రాయెల్‌మీద దాడికిదిగదన్న భ్రమలు కూడా తొలగిపోయాయి. ఆర్నెల్లక్రితంతో పోల్చితే ఇప్పటిదాడి తీవ్రమైనది.

ఈ మారు ఖరీదైన క్షిపణులను ఇరాన్‌ ఉపయోగించిందని, ఇజ్రాయెల్‌ రక్షణఛత్రాన్ని దాటిమరీ ఆ దేశాన్ని దెబ్బకొట్టాలన్న కసి అందులో ఉన్నదని విశ్లేషకులు అంటున్నారు. హిజ్బొల్లా సీనియర్‌ నాయకుడు హసన్‌ నస్రల్లాను హతమార్చడమే కాక, లెబనాన్‌లోకి ఇజ్రాయెల్‌ యుద్ధట్యాంకర్లు చొరబడుతున్న తరుణంలో ఈ దాడి జరిగింది. దీనికితోడు ఇరాన్‌ ప్రజలను దుర్మార్గులైన వారి పాలకులనుంచి అతిత్వరలోనే విముక్తి చేస్తానంటూ నెతన్యాహూ వీరోచిత వ్యాఖ్యలు కూడా చేశారు. ఇరాన్‌లో ఆవగింజంత ప్రదేశం కూడా తన ఆయుధానికి దూరంగా ఉండలేదని హెచ్చరికలు చేశారు. పశ్చిమాసియాలో ప్రతీ అంగుళం తన రాడార్‌లో ఉందన్నారు. హమాస్‌, హిజ్బొల్లాల తరువాత, ఇరాన్ పాలకుల పనిపట్టడమే లక్ష్యంగా నెతన్యాహూ అడుగులు పడుతుంటే సహనంగా ఉండటం అసాధ్యం. మొత్తానికి యుద్ధాన్ని విస్తరించాలన్న నెతన్యాహూ వ్యూహమైతే నెరవేరుతున్నట్టు ఉంది.


గతంలో ఇరాన్‌ దాడిచేసిన తరువాత అమెరికా చెప్పిన మేరకు ఇజ్రాయెల్‌ కూడా వెంటనే ప్రతీకారం తీర్చుకొనే పనిలో పడలేదు. ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నం. యాభైయేళ్ల తరువాత ఇజ్రాయెల్‌కు దక్కిన అవకాశాన్ని వదులుకోకూడదని, ప్రతీకారం పేరిట ఇరాన్‌ అణుస్థావరాలనుంచి చమురుకేంద్రాలవరకూ దేనినీ వదలకుండా సర్వమూ నేలమట్టం చేయాలని ఇజ్రాయెల్‌ కీలకనేతలంతా తీర్మానిస్తున్నారు, తదనుగుణంగానే పాలకులు కూడా సంసిద్ధత ప్రకటిస్తున్నారు. ఇరాన్‌కు రక్షణకవచంలాగా వ్యవహరించే హిజ్బొల్లా తీవ్రంగా దెబ్బతినివున్న ప్రస్తుత స్థితిలో ఇజ్రాయెల్‌కు ఇది మరింత సులభం. ప్రతీకారం తప్పదంటూ ఇజ్రాయెల్‌ పక్షాన అమెరికా దానిమిత్రదేశాలు ఇరాన్‌కు చేస్తున్న హెచ్చరికలను, తరలివెడుతున్న యుద్ధవిమానాలు, నౌకలను, ఇరాన్‌కు అనుకూలంగా రష్యా బరిలోకి దిగుతున్న సూచనలను గమనించినప్పుడు పరిస్థితి కట్టుతప్పుతున్న విషయం స్పష్టమవుతోంది. అమెరికా అధ్యక్షస్థానంలో నోరులేని బైడెన్ ఉండగానే తాను అనుకున్నది చేసుకుపోవాలని నెతన్యాహూ ఆలోచన. ఇజ్రాయెల్‌ మీద హమాస్‌ అమానుషదాడికి ప్రతీకారంగా ఆరంభించిన యుద్ధానికి ఏడాది పూర్తవుతున్న తరుణంలో దానిని అక్కడికే పరిమితం చేయాలని నెతన్యాహూ అనుకోవడం లేదు.

గాజాను దుంపనాశనం చేసి, హమాస్‌ను తీవ్రంగా దెబ్బతీసినప్పటికీ, బందీలుగా ఉన్న మిగతా ఇజ్రాయెలీలను హమాస్‌నుంచి విడిపించలేదన్న అప్రదిష్ట ఆయనకు తప్పడంలేదు. ఈ దశలో హిజ్బొల్లా అధినేతను మట్టుబెట్టిన తరువాత నెతన్యాహూకు ఇంట్లో కాస్తంత గౌరవం పెరిగిందని అంటారు. ఈ వేడిలోనే గాజా, లెబనాన్‌, యెమన్‌, సిరియా, ఇరాన్‌ వరకూ యుద్ధాన్ని విస్తరించి శత్రుసంహారం పూర్తికావించాలన్నది ఆయన ఆలోచన కావచ్చు. ఇజ్రాయెల్‌ సైనికస్థావరాలమీదా, మొసాద్‌ కార్యాలయంమీదా క్షిపణులు ప్రయోగించిన తరువాత, కక్ష తీరింది, ఇక చాలు అన్న అర్థంలో ఇరాన్‌ ఓ ప్రకటన చేసింది. కానీ, ఇరాన్‌ను ఎప్పుడు ఎలా దెబ్బతీయాలన్నది కాక, అది ఏ స్థాయిలో ఉండాలన్నదే ఇజ్రాయెల్‌ ఆలోచిస్తోందని వార్తలు వస్తున్నాయి. యుద్ధం విస్తరిస్తూ దౌత్యానికి తావులేని దిశగా పరిణామాలు వేగంగా మారుతున్న స్థితిలో మిగతా ప్రపంచం ముందుకు రావడం అవసరం.

Updated Date - Oct 03 , 2024 | 04:56 AM