ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జన నాయకుడు, దార్శనికుడు.. జగపతిరావు

ABN, Publish Date - Oct 19 , 2024 | 05:51 AM

నీతికి నిజాయితీకి మారుపేరు.. ముక్కుసూటి నేత.. ఎలాంటి సమస్యనైనా అలవోకగా పరిష్కరించే సత్తా ఉన్నవారు.. తుదిశ్వాస విడిచే వరకు పేదల కోసం నిరంతరం పరితపించారు.. ఎళ్లవేళలా వారి సంక్షేమం కోసం కృషి చేశారు. ప్రజా సమస్యలను తన సొంత పనిలా భావించేవారు. వాటి

నీతికి నిజాయితీకి మారుపేరు.. ముక్కుసూటి నేత.. ఎలాంటి సమస్యనైనా అలవోకగా పరిష్కరించే సత్తా ఉన్నవారు.. తుదిశ్వాస విడిచే వరకు పేదల కోసం నిరంతరం పరితపించారు.. ఎళ్లవేళలా వారి సంక్షేమం కోసం కృషి చేశారు. ప్రజా సమస్యలను తన సొంత పనిలా భావించేవారు. వాటి పరిష్కారానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టేవారు. అధికారులను పురమాయిస్తూ పేదలకు అండగా నిలిచేవారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించారు. ఎమ్మెల్యేగా పని చేసిన కాలంలో రాష్ట్రంలోనే కరీంనగర్‌ను ఒక మోడల్‌గా తీర్చిదిద్దారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కరీంనగర్ ప్రజలు ఇప్పటికీ టైగర్ అని పిలుస్తుంటారు.. ఆయన ఎవరో కాదు.. తెలంగాణ ఉద్యమకారుడు.. కరుడుగట్టిన కాంగ్రెస్‌వాది వెలిచాల జగపతిరావు. ఆయన ఏ పదవి చేపట్టినా ఒక ప్రణాళిక ప్రకారం క్రమశిక్షణతో పని చేస్తూ ఆ పదవికే వన్నే తెచ్చారు.

1935లో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామంలో జన్మించారు వెలిచాల జగపతిరావు. 1970 సంవత్సరం నుంచే ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. గుండి గోపాలరావుపేట గ్రామ సర్పంచ్‌గా పనిచేసి ఎనలేని సేవలందించారు. గుండి గ్రామ సహకార సంఘం చైర్మన్‌గా, గంగాధర సమితి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1972–77 వరకు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా అత్యుత్తమ సేవలందించారు. 1972లో జగిత్యాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1978–84 వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీగా పని చేశారు. 1989లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించినా, అధిష్ఠానం ఇవ్వకపోవడంతో, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యుడిగా, తెలంగాణ లెజిస్లేచర్‌ ఫోరం కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన జగపతిరావు కవిగా కూడా సుపరిచితులు. తెలంగాణ ఎట్లా వివక్షతకు గురవుతుందో గణాంకాలతో వివరిస్తూ పలు దిన పత్రికలకు ఆర్టికల్స్ రాశారు.


మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా పని చేసిన కాలంలో జగపతిరావు కరీంనగర్‌లో నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. కరీంనగర్‌లో మార్క్‌ఫెడ్ సంస్థకు ఆస్తులను కూడబెట్టేందుకు ప్రత్యేక కృషి చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థలు, కళాశాలలకు స్థలాలు, అనేక క్లబ్‌ల నిర్మాణానికి స్థలాల కోసం నిధులు కేటాయించిన ఘనత జగపతిరావుకే దక్కుతుంది. విద్యుత్ కష్టాలను తీర్చేందుకు దుర్షేడ్ వద్ద 220 కేవీ సబ్ స్టేషన్‌ను దూరదృష్టితో ఆనాడే ఏర్పాటు చేయించారు. జగపతిరావు ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల, బుగ్గారం, కరీంనగర్ స్థానాల నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి రెండుసార్లు గెలిచారు. మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా ఐదేళ్లు పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసి ఒకసారి గెలిచారు.

కరీంనగర్ నియోజవర్గంలో నాడు ప్రజలు తాగునీటి కోసం నానా కష్టాలు పడేవారు. వారి కష్టాలను దూరం చేయడానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఊరికో మంచినీటి ట్యాంకు నిర్మాణం చేపట్టాలని సంకల్పించారు జగపతిరావు. అలాగే వాడవాడలా పైపులైన్లు వేయించారు. ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇప్పించారు. దీంతో ప్రజలకు తాగునీటి కష్టాలు దూరం చేశారు. ఆయా గ్రామాల్లో ఇప్పటికీ మంచినీటి ట్యాంకులు చెక్కుచెదరకుండా ఉన్నాయి. అలాగే ప్రజల్లో కూడా జగపతిరావు పేరు చెక్కుచెదరకుండా ఉన్నది. అభివృద్ధి అంటే ఇలా ఉండాలని చూపించిన దార్శనికుడు.. దూరదృష్టితో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన నేత. నిత్యం ప్రజలు అభిమానించే నాయకుడిగా గుర్తింపు పొందారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతం వివక్ష, అవమానం, అణచివేతకు గురవుతున్నదనే భావన జగపతిరావులో ఉండేది. ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ స్టేట్‌ను కలిపే ముందు రాసుకున్న ఒప్పందాలు అమలు కాకపోవడంతో జగపతిరావు రగిలిపోయేవారు. పెద్ద మనుషుల ఒప్పందం, ఆరు సూత్రాలు, అష్ట సూత్రాలు వంటి ఒప్పందాలు అమలు కావాలంటే తెలంగాణ శాసనసభ్యులందరూ ఒకే వేదిక మీదకు రావాలని నిర్ణయించుకున్నారు. 1991లో తెలంగాణ శాసనసభ్యుల ఫోరం ఏర్పాటు చేశారు. ఫోరం కన్వీనర్‌గా జగపతిరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సభ్యుల సహకారంతో తెలంగాణ ప్రాంత హక్కులు, రక్షణ, నీళ్లు, నిధుల్లో వాటాల కోసం శాసనసభ లోపల, బయటా సమష్టిగా పోరాడారు. బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో తొలిదశ తెలంగాణ ఉద్యమం 1969లో విఫలమైన తర్వాత తెలంగాణ వాదం బలహీనపడకుండా తెలంగాణ శాసనసభ్యుల ఫోరం ప్రత్యేక కృషి చేసింది. సాగునీటి పంపకంలో తెలంగాణ పట్ల వివక్షను ఫోరం తీవ్రంగా నిరసించింది. నాడు ఇచ్చంపల్లి ప్రాజెక్టు కోసం తెలంగాణ శాసనసభ్యుల ఫోరం చేసిన పోరాట ఫలితంగానే దేవాదుల, నెట్టెంపాడు, తుపాకులగూడెం, కల్వకుర్తి ఎత్తిపోతల, శ్రీశైలం ఎడమ కాలువ, కరీంనగర్‌ వరద కాలువ పథకాలు మొదలయ్యాయి. పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండగా అనేకమార్లు తెలంగాణ వాటాలో వివక్షపై జగపతిరావు ప్రస్తావించేవారు.

జగపతిరావు కవి, సాహితీవేత్త. లోతైన అధ్యయనం చేసి, తన కవిత్వం.. రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ఎంతోమందికి జగపతిరావు మార్గదర్శిగా నిలిచారు. 2022 అక్టోబర్ 19వ తేదీన జగపతిరావు తుదిశ్వాస విడిచారు. ఏదైనా సాధించాలనే ఆలోచన వస్తే పట్టువదలని విక్రమార్కుడిగా ఆయన ముందుకు సాగేవారు. దీర్ఘకాలం పాటు ప్రజల మధ్యే మెదిలారు. వారి సంక్షేమమే లక్ష్యంగా తుదిశ్వాస విడిచే వరకు విశ్రమించని నేత. పేదల లీడర్‌గా, ‘టైగర్‌’గా పేరు గడించారు. సమాజంలో ఓ రాజకీయ నేత ఎలా ఉండాలో ఆచరణలో చూపిన మహనీయుడు. జగపతిరావు ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరాలి.. తెలంగాణ నలుదిక్కులా దీపకాంతులు వెదజల్లాలి.. ఆయన చూపిన మార్గం నేటి తరానికి అనుసరణీయం. ఇదే ఆ మహానేతకు మనం అర్పించే ఘన నివాళి.

గొట్టిముక్కుల బ్రహ్మచారి

సీనియర్ జర్నలిస్టు

(నేడు వెలిచాల జగపతిరావు వర్ధంతి)

Updated Date - Oct 19 , 2024 | 05:51 AM