ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pharmacity : ‘ఫార్మాసిటీ’ చుట్టూ కొత్త మాయ!

ABN, Publish Date - Aug 22 , 2024 | 05:49 AM

రాజకీయ నాయకుల రంగులు మారుతుంటాయి. అది తెలియక, వెర్రి జనం నమ్ముతుంటారు. నాలిక చివర నుంచి వచ్చిన వాగ్దానాలు నిజం అనుకుని నమ్మి ఓట్లు వేస్తుంటారు. అయితే మా రంగారెడ్డి జిల్లాలో మాత్రం

రాజకీయ నాయకుల రంగులు మారుతుంటాయి. అది తెలియక, వెర్రి జనం నమ్ముతుంటారు. నాలిక చివర నుంచి వచ్చిన వాగ్దానాలు నిజం అనుకుని నమ్మి ఓట్లు వేస్తుంటారు. అయితే మా రంగారెడ్డి జిల్లాలో మాత్రం జరిగినది మామూలు మోసం కాదు, తడి గుడ్డతో గొంతు కోసినట్టయ్యింది. ‘‘ఫార్మా సిటీ వద్దురా, వ్యవసాయం ముద్దురా’’, అని నినదించి, ఒక్క తాటిపైకి వచ్చి, అప్పటి బీఆర్‌‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకి ‘‘మేమున్నాం మీకు, మీ భూములని మేము కాపాడుతాం’’ అని వత్తాసు పలికిన కాంగ్రెస్ నాయకులందరూ ఈ రోజు మడమ తిప్పి మాట మార్చారు.

ఆనాడు స్వయానా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ధర్నా చౌక్ సభలో, మా కుర్మిద్ద అనసూయమ్మ చేతిలో చెయ్యేసి, ‘‘నువ్వు చాకలి అయిలమ్మ లెక్క పోరాటం చేస్తున్నావ్ అక్క, నీ భూమి పోకుండా నేను కాపాడుతా’’ అని మాట ఇచ్చారు. ఇంక పాదయాత్ర చేస్తున్నప్పుడు, కల్వకుర్తి వద్ద కలవటానికి వచ్చిన రైతుల్లో, తాటిపర్తి రైతు కుందారపు నారాయణ, తన ఉద్వేగాన్ని ఆపుకోలేక, ‘‘మమ్మల్ని కాపాడే దేవుడవు నీవే, అహో రేవంత్‌రెడ్డి’’ అని పద్యం అందుకుని, అతన్ని కౌగిలించుకుని ఏడ్చాడు. ఆ రోజు తీసిన ఫోటో రేవంత్‌రెడ్డి ప్రచారానికి బాగా పనికివచ్చింది. ఆ తర్వాత జరిగిన ప్రతి మీటింగ్‌లో ఆ ఫోటోతో హోర్డింగులు పెట్టారు. కుర్మిద్ద, మేడిపల్లి గ్రామాల్లో మీటింగులు పెట్టినప్పుడు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ‘‘కాంగ్రెస్ పార్టీ పేదలకిచ్చిన అసైన్డ్ భూములు కేసీఆర్ బలవంతంగా గుంజుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫార్మా సిటీ రద్దు చేసి, రైతుల భూములు తిరిగి ఇచ్చేస్తాం’’ అన్నారు. తీసుకున్న భూమి సంగతి దేవుడెరుగు, ఇప్పుడు భూములు ఇవ్వమని కోర్టు నుంచి స్టే తెచ్చుకున్న రైతుల భూములకే ఎసరు పెడుతున్నారు. సీతక్క కూడా కుర్మిద్ద భూములలో ‘‘ఫార్మా సిటీ వద్దురా, వ్యవసాయం ముద్దురా’’ అంటూ రైతులతో కలిసి పాదయాత్ర చేశారు. ఇక ఇక్కడి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి అయితే, తన నియోజకవర్గంలో ఉన్న కడ్తాల్ మండలంలో ఒక్క ఎకరా భూమి కూడా తీస్కోనియ్యలేదు. మరి ఇప్పుడు మెగాసిటీ కోసం కడ్తాల్ మండలంలో కూడా భూమి తీస్కుంటాం అంటున్నారు. కాని అయన నుంచి ఎటువంటి స్పందనా లేదు.


శాసనసభ ఎన్నికల ముందు, ఎందుకైనా మంచిదని, ‘‘నేను ఎమ్మెల్యేగా గెలిస్తే, ఫార్మా సిటీ రద్దు చేయిస్తాను, ఫార్మా సిటీ కోసం జరుగుతున్న భూసేకరణ రద్దు చేయిస్తాను’’ అని హామీ పత్రం మాకు ఇయ్యండి అని రైతులు ఒక హామీ పత్రం పైన సంతకం చెయ్యండని ఎమ్మల్యే అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి గారిని కోరారు. ‘‘నేను పార్టీ అధిష్ఠానాన్ని అడగాలి’’ అని ఆయన అన్నారు. ఆ పత్రం పైన సంతకం కాలేదు. మాకు ఫార్మా సిటీ రద్దు, భూసేకరణ రద్దు చేస్తాం అని మేనిఫెస్టోలో పెట్టాలి అని రైతులు డిమాండ్ చేసారు. అతి కష్టం మీద, ‘‘ఇబ్బందికర ఫార్మా సిటీని రద్దు చేస్తాం’’ అని మాత్రం మేనిఫెస్టోలో పెట్టారు. భూసేకరణ విషయం పెట్టలేదు. అప్పుడే అనుమానం రావాల్సి ఉంది. కానీ భూములు నిలుస్తాయన్న నమ్మకంతో రైతులే ఇల్లిల్లు తిరిగి, కాంగ్రెస్ గెలిస్తే మన భూములు కాపాడతారు అని చెప్పి, ఓట్లు వేయించి కాంగ్రెస్‌ని గెలిపించారు. గెలిచిన వెంటనే రేవంత్‌రెడ్డి ‘‘ఫార్మా సిటీని రద్దు చేస్తున్నాం’’ అని ప్రకటించారు. జనం అయన ఫోటోకి పాలాభిషేకం చేసారు. ఇంకేముంది అన్ని బాధలు తీరినట్టే అనుకున్నారు.

గత ప్రభుత్వం కోర్టు స్టేకి వ్యతిరేకంగా, ఆన్‌లైన్‌లోంచి రైతుల పేర్లు తీసేసి, రైతులకి రైతు బంధు, క్రాప్ లోన్లు రాకుండా వారి భూములని నిషేధిత జాబితాలో పెట్టింది. కాంగ్రెస్ నాయకులందరూ అప్పట్లో ‘‘ఇది అన్యాయం, మేం అధికారంలోకి రాగానే, మీ పేర్లు ఆన్‌లైన్‌కి ఎక్కించి మీకు అన్ని హక్కులూ వచ్చేలా చేస్తాం,’’ అన్నారు. డిసెంబర్‌లో ఫార్మా సిటీ రద్దు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులు ఎన్నిసార్లు అడిగినా, ‘‘ఏవో సాంకేతిక కారణాలు ఉన్నాయి’’ అని కొన్ని నెలలు చెప్పుకుంటూ వచ్చి, ఆ తర్వాత ‘‘ఎలక్షన్ కోడ్ ఉంది, ఎంపీ ఎలక్షన్ అవ్వగానే మీకు రైతుబంధు పడుతుంది, మీ భూములను నిషేధిత జాబితా నుంచి తీసివేస్తాం’’ అన్నారు. జూన్ నెలలో ఎలక్షన్ కోడ్ అయిపొయింది. ‘‘సీఎం గారు మంచి ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు, ఈ ప్రాంతం రూపు రేఖలు మారిపోతాయి, బోల్డంత అభివృద్ధి జరుగుతుంది. కాకపొతే, మధ్యలో ఉన్న రైతులు నష్టపోవాల్సి ఉంటుంది, మీకు మంచి పరిహారం ఇప్పిస్తాము’’ అంటూ స్థానిక నాయకులు, కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ముదిరెడ్డి కోదండరెడ్డి రైతులతో చర్చలు మొదలుపెట్టారు. ‘‘అదేంటి, ఇన్ని ఏండ్లు మీరు మా భూములు కాపాడతామని చెప్పి ఇప్పుడు ఇలా అంటారేమిటి?’’ అని అడిగితే, ‘‘మీకు ఫార్మా సిటీ రద్దు చేసాం కదా, ఇంకేం కావాలి?’’ అని జవాబు. ‘‘మా భూములు పోయాక, ఏమొస్తే, మాకేంటి? అప్పుడేమో భూములు కాపాడతాం అన్నారు, ఇప్పుడు ఇదేంటి?’’ అని అడిగితె, నయా నగరికి రైతులు సహకరించాలి, మేము మీకు అండగా ఉంటాం, మీ విషయాలు ముఖ్యమంత్రి గారికి తెలియచేస్తాం అంటున్నారు. కాని పరిస్థితిలో మార్పు లేదు.


ఎందుకు మార్పు జరగటం లేదో, ఇప్పుడిప్పుడే రైతులకి అర్థం అవుతోంది: కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, ఇచ్చిన మాట ప్రకారం భూసేకరణ రద్దు చెయ్యాలన్న ఉద్దేశం ఎప్పుడూ లేదు. అందుకే పార్టీ మేనిఫెస్టోలో ఆ విషయం రాయలేదు. ఒక పక్కన ఎలక్షన్ కోడ్ ఉంది, టెక్నికల్ సమస్యలు ఉన్నాయి అంటూ స్థానిక నాయకులు కోదండరెడ్డి ద్వారా రైతులు మళ్ళీ ఉద్యమబాట పట్టకుండా జాగ్రత్తపడుతూ, ఫార్మా సిటీ భూసేకరణ చట్ట ప్రకారం చెల్లదని, భూసేకరణలో ఇచ్చిన అవార్డులని రద్దు చేస్తూ గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనది కాదని, ఏప్రిల్ 2024 లోనే ఆ తీర్పుపై అప్పీల్ వేయడానికి చర్యలు చేపట్టారు. అంటే, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన ఏ భూసేకరణ అన్యాయం అన్నారో, హైకోర్టు కూడా తప్పు పట్టిందో, ఈ రోజు అదే భూసేకరణను సమర్థిస్తూ రైతుల భూములని తీసుకునేందుకు మాకు తీర్పు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టుని కోరుతోంది.

ఫార్మా సిటీ రద్దు డిమాండ్, కాంగ్రెస్ వాళ్లకి తంతే బూరెల గంపలో పడినట్టు అయ్యింది. ఫార్మా సిటీ రద్దు అనగానే, కొన్ని విమర్శలు వెల్లువెత్తాయి. దానికి రేవంత్‌రెడ్డి గారు వివరణ ఇస్తూ, ‘‘నేను ఫార్మా సిటీ రద్దు అన్నా, కాని దానికి బదులు ఫార్మా విలేజ్‌లు అంటున్నా. హైదరాబాద్‌కి కూతవేటు దూరంలో ఇన్ని ఫార్మా కంపెనీలు ఉంటే, ఆ కాలుష్యం భరించలేం, కాబట్టి ఔటర్ రింగ్ రోడ్‌కి దగ్గరగా పది చోట్ల ఫార్మా విలేజ్‌లు పెడతాం’’ అని చెప్పి, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, పది జిల్లాల్లో కలిపి ఇంకో 20,000 ఎకరాలు భూసేకరణ చెయ్యటానికి రంగం సిద్ధం చేసారు. అంటే ఇక్కడ ఫార్మా సిటీ కోసం సేకరించిన భూమితో పాటు ఇంకో 20,000 ఎకరాలకి ఎసరు పెడుతున్నారు.

ఇప్పటికే వికారాబాద్ జిల్లా దుద్యాల గ్రామంలో ఈ భూసేకరణకి 2017 భూసేకరణ చట్టం ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసారు. తమ యూపీఏ–-2 ప్రభుత్వం చేసిన 2013 భూసేకరణ చట్టానికి బీఆర్‌ఎస్‌ – బీజేపీ ప్రభుత్వాలు కలిసి తెచ్చిన సవరణలను ఆ రోజు వ్యతిరేకించి, నేడు అధికారంలోకి వచ్చిన తరువాత ఆ సవరణ చట్టమే వారికి ముద్దవ్వడం ప్రజలను వంచించడమే! అప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పుని హర్షించిన కాంగ్రెస్ నాయకత్వం, నేడు ఆ తీర్పునే ప్రశ్నిస్తూ రైతులకి వ్యతిరేకంగా అప్పీల్ చేసింది. ఇంకో విషయం, అప్పుడు పేదల భూములు కంపెనీలకి ఇస్తే అది భూ దందా అవుతుంది, ‘‘రాష్ట్ర ముఖ్యమంత్రివా, రియల్ ఎస్టేట్ బ్రోకర్‌వా’’ అని తిట్టినవాళ్లు ఈ రోజు రైతులు సహకరించాలి, మంచి కంపెనీలు వస్తున్నాయి, రైతుల త్యాగాలతోనే అభివృద్ధి జరుగుతుంది’’ అంటున్నారు! చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. అదే రాజకీయం. రైతు రాజ్యం అని చెప్పే నాయకులందరూ రైతులే భూములని త్యాగాలు చెయ్యాలని అంటారు. నేత ఎవరైనా పాలసీ మాత్రం ఒక్కటే!

కవుల సరస్వతి

Updated Date - Aug 22 , 2024 | 05:50 AM

Advertising
Advertising
<