ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రాణాలతో చెలగాటం

ABN, Publish Date - Nov 22 , 2024 | 12:59 AM

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీజిల్లాలో ఉన్న ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నవజాత శిశువుల సంఖ్య పదిహేనుకు చేరింది. ఆ ప్రమాదంలో గాయపడి...

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీజిల్లాలో ఉన్న ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నవజాత శిశువుల సంఖ్య పదిహేనుకు చేరింది. ఆ ప్రమాదంలో గాయపడి, తీవ్ర అస్వస్థతతో ఉన్న మరో ముగ్గురు పిల్లలు కన్నుమూశారు. ఈ హృదయవిదారక ఘటన జరిగి అనేకరోజులు కావస్తున్నప్పటికీ, పిల్లల్లో ఇంకొందరు మరణం అంచున ఉన్నారు. ప్రమాదానికి దారితీసిన కారణాలు, ఒక్కటొక్కటిగా వెలుగుచూస్తున్న నిజాలు నిర్ఘాంతపరిచేట్టుగా ఉన్నాయి.

భారత ప్రభుత్వం ఈనెల 15నుంచి 21వరకూ నవజాత శిశువుల వారోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నప్పుడే ఈ దారుణం జరిగింది. మహారాణి లక్ష్మీబాయి మెడికల్‌ కాలేజీలోని నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఎన్‌ఐసీయూ)లో మంటలు రేగినప్పటికి అందులో 49మంది పసికందులు ఉన్నారు. తన ఇద్దరు పిల్లలనూ కోల్పోయినప్పటికీ, ఏడుగురు పసికందులను ఓ తండ్రి ఎంతో సాహసంగా రక్షించిన ఉదంతం చాలామందిని కుదిపివేసింది. తక్షణమే పదిమంది ప్రాణాలు తీసి, పదహారుమంది నవజాతశిశువులను తీవ్రంగా గాయపరచిన ఆ దుర్ఘటనకు షార్ట్‌సర్క్యుట్‌ కారణమని తేల్చారు. పసికందులంతా నిత్యం ఆక్సిజన్‌మీద ఉండేవార్డులో అగ్గిరాజుకున్నప్పుడు అది మరింత వేగంగా, తీవ్రంగా వ్యాపిస్తుందన్నమాట నిజం.


ఈ కారణంగానే విద్యుత్‌ ప్రమాదాలకు ఏ విధంగానూ అవకాశమివ్వనిరీతిలో ఐసీయూ, ఎన్‌ఐసీయూ వంటి సున్నితమైన, కీలకమైన యూనిట్ల నిర్మాణం జరుగుతుంది. ప్రమాదాన్ని నివారించడం, తీవ్రతను నిరోధించడం, వ్యాప్తిని అరికట్టడం ఇత్యాది చర్యల విషయంలో ఏ విధమైన లోటూ రాకుండా సదరు వ్యవస్థల రూపకల్పన ఉంటుంది. ఎన్‌ఐసీయూలో వార్మర్లు, వెంటిలేటర్లు, పంపులు, మానిటర్లు ఇలా ప్రతీపరికరమూ కరెంటుమీదే నడుస్తుంది కనుక లోడ్‌ ఎక్కువ ఉన్నా తట్టుకొనే రీతిలో ఏర్పాట్లు ఉంటాయి. పైపులద్వారా నిత్యం ఆక్సిజన్ సరఫరా అయ్యే ఇటువంటి చోట్ల ముందు జాగ్రత్తచర్యలు మరింత అవసరం. షార్ట్‌సర్క్యుట్‌కు ఓవర్‌లోడ్‌ కారణమైతే, పాతవైరింగ్‌ ప్రాణాలు తీసినమాట వాస్తవం. అధికశాతం అగ్నిప్రమాదాలకు విద్యుత్ లోపాలే కారణమనీ, ఆస్పత్రుల్లో ఆ అవకాశాలు మరింత అధికమనీ ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. ప్రభుత్వ ఆస్పత్రి కనుక, అక్కడకు వచ్చేదంతా నిరుపేదలే కనుక ఈ ఘోరం వెనుక నిధుల కొరతో, నిర్లక్ష్యమో ఉండటం సహజం. ప్రమాదానికి కారణం షార్ట్‌సర్క్యుట్‌ అని వెనువెంటనే నిర్థారించడం పెద్ద విషయమేమీ కాదు.


ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు వాటిని ఓ ప్రకృతివిపత్తులాగా, మానవమాత్రుల చేతిలో ఏమీ లేదన్నట్టుగా చిత్రీకరించడం సులభం. తప్పుచేసినవారిమీద చర్యలు తీసుకుంటామని అంటూనే, తప్పంతా కరెంటుమీదకు తోసేయడం కనిపిస్తూనే ఉంది. ఇక, ఈ ప్రభుత్వ ఆస్పత్రికి మొన్న ఫిబ్రవరిలో అగ్నిమాపకశాఖ నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌ ఇవ్వడానికి నిరాకరించినమాట నిజం. తమ ఆడిటింగ్‌లో ప్రభుత్వ ఆస్పత్రే కదా అని ఈ శాఖ తేలికగా తీసుకోనందుకు మెచ్చుకోవాలి. అగ్నిమాపకశాఖ ఇలా సర్టిఫికేట్‌ను కాదనడంతో, మెడికల్‌ కాలేజీ పెద్దలు ప్రభుత్వానికి లేఖరాశారట. నిధులు కేటాయించినపక్షంలో భవనాలకు, యూనిట్లకు అవసరమైన రిపేర్లు చేయించుకుంటామని, అగ్నిప్రమాదాల నివారణకు సరిపడా సామగ్రిని తెప్పించుకుంటామన్నది ఆ లేఖ సారాంశం. దీనికి ప్రభుత్వం ఏ విధంగా స్పందించిందో తెలియదు కానీ, ఈ ప్రమాదం జరిగేనాటికి సదరు భవనాలకు అగ్నిమాపకశాఖ అనుమతులు లేవు. నిజానికి ఈ మెడికల్‌ కాలేజీకి ఎప్పటినుంచో ఈ విధమైన పలురకాల అనుమతులు లేవని మరికొన్ని వార్తలు కూడా వినబడుతున్నాయి. నిజానిజాలు అటుంచితే, ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వమే నివాసయోగ్యం కాని చోట పసికందులను సైతం ఉంచి, వారి ప్రాణాలు పోవడానికి కారణమైందన్న విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ యూనిట్‌ నిర్మాణంలో ఉన్న లోటుపాట్లమీద కూడా ఇప్పుడు విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఈ ఏడాది మేనెలలో ఢిల్లీలో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఇటువంటి ప్రమాదమే జరిగి ఏడుగురు నవజాత శిశువులు మరణించిన విషయం తెలిసిందే. ఇటువంటి ఘటనలు ప్రతీ ఏటా, దేశమంతా ఎక్కడోక్కడ జరుగుతూనే ఉన్నందున, నవజాత శిశువులకు భద్రమైన, నాణ్యమైన ఆరోగ్యసంరక్షణ కల్పించే ఏర్పాట్లనూ, సదరు సంరక్షణ ప్రమాణాలను తనిఖీచేసే వ్యవస్థలనూ బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.

Updated Date - Nov 22 , 2024 | 12:59 AM