కృష్ణాతీరంలో సాహితీ తపస్వి
ABN, Publish Date - Nov 17 , 2024 | 12:49 AM
పోలవరపు కోటేశ్వరరావు (1929–2008) కవి, కథకుడు, నవలా రచయిత, నాటకకర్త, వ్యాసకర్త, గేయకర్త, పరిశోధకుడు, భాషా సైనికుడు, సాహిత్య సంస్కృతీ వికాస శ్రామికుడు,
పోలవరపు కోటేశ్వరరావు (1929–2008) కవి, కథకుడు, నవలా రచయిత, నాటకకర్త, వ్యాసకర్త, గేయకర్త, పరిశోధకుడు, భాషా సైనికుడు, సాహిత్య సంస్కృతీ వికాస శ్రామికుడు, స్వాతంత్రోద్యమకారుడు, ఆదర్శ రైతు, పారిశ్రామికవేత్త, వితరణశీలి, వెరసి ‘మంచి మనిషి’. కృష్ణానదిపై ఆయన వ్రాసిన ‘కృష్ణవేణి’ సంగీత రూపకానికి అఖిలభారత స్థాయిలో ఆకాశవాణి ప్రథమ బహుమతి లభించింది. స్వీయచరిత్ర ‘నా రచనా మార్గం – అక్షరాన్వేషణ’, ఆ కీర్తిశేషుడి సాహితీమూర్తిని సంపూర్ణంగా ఆవిష్కరించింది.
తెలుగు నేల నాలుగు చెరగులా వివిధ మాండలికాల్లో రచనలు చేసిన రచయితలు, కవులు ఎందరో ఉన్నారు. అన్ని మాండలికాలు మధురమైనవే. ‘వచ్చిండన్నా, వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా’ అని జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సి. నారాయణరెడ్డి ఎలుగెత్తారు. వివిధ మాండలికాలలో రచనలు చేసిన వారిలో కృష్ణా జిల్లా గ్రామీణ మాండలికంలో రచనలు చేసి ‘నేటి శ్రీనాధుడు’, ‘కథాహాలిక’, ‘కథా కథన సవ్యసాచి’గా బిరుదాంకితుడైన సాహితీ తపస్వి పోలవరపు కోటేశ్వరరావు.
ఈ కీర్తిశేషుడు (1929–2008) కవి, కథకుడు, నవలా రచయిత, నాటకకర్త, వ్యాసకర్త, గేయకర్త, పరిశోధకుడు, సాంఘిక ఉద్యమాల నాయకుడు, భాషా సైనికుడు, సాహిత్య సంస్కృతీ వికాస శ్రామికుడు, పర్యాటకుడు, స్వాతంత్రోద్యమకారుడు, ఆదర్శ రైతు, పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత, వితరణశీలి, వెరసి ‘మంచి మనిషి’. ముగ్గురు పద్మశ్రీలు ఉన్న సభలో యిచ్చిన ‘సాహిత్య తపస్వి’, ఆయనకు చక్కగా అతికిన బిరుదు.
తెలుగు సాహిత్యంలో ఉన్న అన్ని ప్రక్రియలలోను ‘వాసి’ ప్రధానంగా, సుమారు 50 సంవత్సరాల అక్షర సేద్యంలో ‘55’కు పైగా సృజనాత్మక రచనలు చేసారు. అయన కృతులు 3 వేల పేజీల పర్యంతం విస్తరించాయి.
1929లో కృష్ణానదికి పడమరగా ఉన్న గుంటూరు జిల్లా, అనంతవరంలో లక్ష్మయ్య – శ్రీవేణమ్మలకు కోటేశ్వరరావు జన్మించారు. నదికి తూర్పున ఉన్న కృష్ణాజిల్లా, వీరమాచనేనివారి పాలెంలో ఆయన బాల్యం అంతా గడిచింది. అలా కృష్ణా నదికి ఇరువైపులా, ఆ నదితో పెనవేసుకుపోయిన జనన – బాల్యాల వల్ల, కమ్మని కృష్ణమ్మ నీరు త్రాగుతూ, అందాలను ఆస్వాదిస్తూ, ప్రేమిస్తూ, పరవశిస్తూ, తన చదువు, వ్యవసాయం సాగించారు.
చిన్ననాడే మహాత్మాగాంధీని దర్శించుకున్న ప్రభావంతో, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. గోడలపై నినాదాలు వ్రాసి, వ్రాయించారు. తన 21వ ఏటనే ఆంధ్రోద్యమం, నందికొండ ప్రాజెక్టు ఉద్యమాలలో, నాయకత్వం వహించారు. చుట్టూ ఉన్న గ్రామాలలోని విద్యార్థులను, యువకులను తాను వ్రాసిన ‘ఎన్నికల పోరాటం’ వంటి పాటలతో, ‘ఆంధ్రభాగోతం’ అనే యక్షగానంతో సమీకరించి, రాత్రి పాఠశాలలు – గ్రామీణ ఆటల నిర్వహణ – గ్రామసేవ శిక్షణ – దళిత జనోద్ధరణలలో పాల్గొనేలా చేసారు. ‘దీపిక’ పేరుతో వ్రాత పత్రిక నిర్వహించారు. ద్వితీయ ప్రపంచ సంగ్రామంపై పరిశోధన వ్యాసాలు, కథలు వ్రాసారు. ‘సీతమ్మ’, ‘రిక్షావాలా’ మొదలైన నవలలు వ్రాసారు. యువజనోత్సవాలు నిర్వహించి, జానపదగేయాలు, దేశభక్తిని పెంపొందించే నాటకాలు స్వయంగా వ్రాసి, ప్రదర్శించారు. స్వాతంత్య్రానంతరం తన ఆలోచనలు – ఆచరణలు, యువజన వికాసానికి, గ్రామ అభ్యుదయానికి వినియోగించారు.
సహకారోద్యమ స్ఫూర్తితో ‘ఆంధ్రనాయక విశాల పరపతి సంఘం’ స్థాపించారు. వివిధ విషయాలలో జిజ్ఞాస, క్రమశిక్షణ, అధ్యయనాలు ఆయన ఆలోచనా పరిధిని, అవగాహనా విస్తృతిని పెంచాయి. స్థానిక, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ మార్పుల పట్ల ప్రశంసనీయమైన పరిజ్ఞానం సంపాదించారు. విశాలాంధ్ర రాష్ట్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు.
తదనంతరం, విజయవాడ వచ్చి ఆటోమొబైల్ వ్యాపారం చేస్తూ, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమికి సారథ్యం వహిస్తూ, వందలాది సాహిత్య – సాంస్కృతిక కార్యక్రమాలు రూపొందించి, నిర్వహించి, కళారంగానికి తలమానికమైన సేవ చేసారు. కృష్ణా – గోదావరీ బేసిన్ ఓఎన్‌జీసీ ప్రాంతీయ కార్యాలయం ఆంధ్రలోనే ఉండాలనే ఉద్యమంలో ప్రధాన భూమిక వహించారు.
కృష్ణానదిపై వ్రాసిన ‘కృష్ణవేణి’ సంగీత రూపకానికి అఖిలభారత స్థాయిలో ఆకాశవాణి ప్రథమ బహుమతి అందుకున్నారు. ఆయన రాసిన ‘కృష్ణవేణి’ సంగీత రూపకం గత మూడు కృష్ణా పుష్కరాల సందర్భంగా ఢిల్లీ, హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాలలోనే కాక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పట్టణాలలో ప్రదర్శించారు. ప్రదర్శిస్తున్నారు. ‘దక్షిణ గంగ గోదావరి’ అనే టీవీ సీరియల్, రచన – నిర్మాణం చేసి దూరదర్శన్‌లో ప్రసారం చేశారు. ఆయన రేడియో నాటికలు, ప్రసంగాలు అసంఖ్యాకం.
1980లో వ్యాపార వ్యాపకాలకు విరామం ప్రకటించి, పూర్తి స్థాయిలో రచనా వ్యాసంగంలో, సాంస్కృతిక – సామాజిక సేవలో నిమగ్నమయ్యారు. సి. ధర్మారావు గారి స్నేహంతో తెలుగు భాషోద్యమ సమాఖ్యలో ప్రవేశించి, ఇబ్బడిముబ్బడిగా అద్భుతమైన 100కు పైగా కథలు (లచ్చుమయ్య కథలు, కృష్ణా తరంగాలు కాకుళయ్య కథలు మా ఊరి మనుషులు); మహాత్మా జిందాబాద్, శ్రీనాథుల వారొచ్చారు, రాయలు రంగన్న, రథయాత్ర వంటి నాటికలు; మనము– మన నృత్యాలు, నృత్య పూజ వంటి పరిశోధనాత్మక రచనలు; నృత్యారాధన, గౌతమబుద్ధ, యయాతి, విశాలాంధ్ర వైభవం వంటి నృత్య రూపకాలు; చినబాబు – రాజముద్రిక వంటి బాలల నవలలు; భర్తృహరి – గాధాసప్తశతి – చాటువులపై కథలు; మొదలైనవి పోలవరపు కలం నుండి జాలువారాయి. స్వీయచరిత్ర ‘నా రచనా మార్గం – అక్షరాన్వేషణ’, పోలవరపు కోటేశ్వరరావు సాహితీమూర్తిని సంపూర్ణంగా ఆవిష్కరించింది.
పోలవరపు కుటుంబసభ్యులు తెలుగు భాషను పల్లకీలో మోస్తున్న ఉత్తమ కవులు, రచయితలకు ‘సాహితీ తపస్వి పోలవరపు కోటేశ్వరరావు’ పురస్కారం ఏర్పాటు చేసారు. అందుకున్న వారిలో శ్రీ విరించి, విహారి, ఆచార్య కొలకలూరి ఇనాక్, శ్రీమతి జలంధర, కన్నెగంటి అనసూయ, శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మీదేవి, వివినమూర్తి, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, పతంజలి శాస్త్రి, సింగమనేని నారాయణ మొదలైన ప్రముఖులు ఉన్నారు.
విజయవాడ, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో త్రిపురనేని రామస్వామి, చలం వంటి ఎందరో వైతాళికుల, మార్గదర్శకుల విగ్రహాలను పోలవరపు ప్రతిష్ఠింపచేసారు. 2008లో ఆయన తిరిగిరాని ప్రయాణం పెట్టుకున్నారు. నేనాయనకు పెద్ద అల్లుడిననీ, నా భార్య మొదటి కుమార్తె అని మనఃస్ఫూర్తిగా నన్ను ప్రేమిస్తూ ఉండేవారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వున్న ఆయన కాంస్య విగ్రహాన్ని ఎప్పుడూ తలుచుకుంటూ వుంటాను.
పోలవరపు రచనల సంకలనం మూడు భాగాలుగా మా ‘లోకనాయక్ ఫౌండేషన్’ ద్వారా తీసుకురావడం నా అదృష్టం. మొదటి, రెండవ భాగాలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. మూడవ భాగాన్ని మిత్రులు వేమూరి రాధాకృష్ణ ఆవిష్కరించడం ఎంతో ఆనందదాయకం.
l ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
జాతీయ అధ్యక్షులు, విశ్వ హిందీ పరిషత్
(నవంబర్ 18వ తేదీ సాయంత్రం 5గం.లకు హైదరాబాద్ దసపల్లా హోటల్లో ‘పోలవరపు కోటేశ్వరరావు సాహిత్య సర్వస్వం’ 3వ భాగం ఆవిష్కరణ)
Updated Date - Nov 17 , 2024 | 12:49 AM