ప్రభుత్వాలు మారినా అదే పోలీసు క్రౌర్యం!
ABN, Publish Date - Nov 16 , 2024 | 05:18 AM
గత ప్రభుత్వ పాలకుల హయాంలో పోలీసు శాఖ ప్రజాకంటకంగా మారిపోయింది. అందుకే నేడు కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ పోలీసు శాఖను స్వయంగా తన ఆధీనంలో ఉంచుకున్నారని
గత ప్రభుత్వ పాలకుల హయాంలో పోలీసు శాఖ ప్రజాకంటకంగా మారిపోయింది. అందుకే నేడు కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ పోలీసు శాఖను స్వయంగా తన ఆధీనంలో ఉంచుకున్నారని ప్రజలు భావించారు. కాని క్షేత్రస్థాయిలో ఈ పది నెలల కాలంలో పోలీసుల పనితీరు వీసమెత్తు మారలేదు. ఎవరు మారినా, ఏది మారినా పోలీసు వ్యవస్థ మాత్రం మారదని ఈ పది నెలల కాలంలో క్షేత్రస్థాయిలో వరుసగా జరుగుతున్న ఘటనలు తేటతెల్లం చేస్తున్నాయి.
ఈ ఏడాది అక్టోబర్ 13న నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రంలో ముగ్గురు యువకులను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి శిరోముండనం చేయించి పంపారు. చట్టాలను బేఖాతరు చేసి, సంపన్నులను సంతుష్టపరచేందుకు అమాయకులను అవమానపరచిన లింగాల పోలీసు సబ్-ఇన్స్‌పెక్టర్‌కు అందుకు దండన ఏమిటో తెలుసా– కేవలం అక్కడి నుంచి హెడ్ క్వార్టర్‌కు అనుసంధానించడం! ఆయన చేసిన అనాగరిక శిరోముండన నేరానికి ఈ బదిలీ చర్య సరిపోతుందా!
అక్టోబరు 13న లింగాలకు చెందిన వినీత్ (20), అఖిల్ (18), నిఖిల్ (18) బైక్‌పై పెట్రోలు బంకుకు వెళ్ళి రూ.20 పెట్రోల్ పోయాలని బంక్ ఆపరేటర్‌ను కోరారు. ఆపరేటర్ హేళన చేస్తూ పెట్రోలు పోయనన్నాడు. ఆ తర్వాత వచ్చిన బైక్‌లో పెట్రోలు పోశాడు. ఈ నిర్లక్ష్య ధోరణి ఘర్షణకు దారితీసింది. పెట్రోల్ బంక్ ఆపరేటర్ యువకులను బూతులు తిట్టాడు. యువకులు ఆపరేటర్‌పై చేయి చేసుకున్నారు. రంగప్రవేశం చేసిన పోలీసులు యువకులను వారి ఇళ్ళ నుంచి అక్టోబర్ 13న పట్టుకుపోయారు. నిందితులకు 41ఎ ప్రకారం నోటీసులు ఇచ్చి పిలవాలనే జ్ఞానం పోలీసులకు ఉన్నా ఇలా ఎందుకు వ్యవహరించారు? ఎందుకంటే నిందితులు సామాజికంగా కింది కులాలకు చెందినవారు కాబట్టి, ఆ పెట్రోలు బంకు సంపన్న వర్గాలకు చెందినది కాబట్టి. ‘నా పెట్రోలు బంకు ఉద్యోగిపైన కింద కులాలకు చెందిన యువకులు చేయి చేసుకునే ధైర్యం చేస్తారా’ అని దీన్ని పరువుకు సంబంధించిన విషయంగా భావించిన యజమాని పోలీసులను ఉసిగొల్పాడు. అఖిల్ కుటుంబం షెడ్యూల్డు తెగల ఎరుకల జాతికి చెందినది. నిఖిల్, వినీత్ కుటుంబాలు కొన్నేళ్ళ క్రితం ఇక్కడికి వలస వచ్చి ఎరుకల కులంతో వివాహ సంబంధాలు ఏర్పర్చుకొని షెడ్యూల్డు తెగలుగా మారిపోయారు. కింది కులాలంటే పోలీసులకు లెక్కలేనితనం ఎక్కువ.
యువకులు ముగ్గురిని మూడు రోజులు స్టేషన్‌లో నిర్భందించారు. కేవలం రాత్రిపూట మాత్రమే ఇంటికి పంపించేవారు. ఈ మూడు రోజుల నిర్భందం వారిని మరింత అవమానానికి గురి చేసింది. అయినా సరే ముగ్గురూ వెళ్ళి పెట్రోల్ బంకు ఉద్యోగికి క్షమాపణలు చెప్పుకున్నారు. దీంతోనైనా పోలీసులు తగ్గలేదు. మూడు రోజులు నిర్భందించి వారిచేత స్టేషన్‌లో వారు ఎన్నడూ చేయని వివిధ రకాల పనులు చేయించారు. ప్రత్యేకంగా తెప్పించిన రబ్బరు బెల్టుతో విపరీతంగా చితకబాదారు. అన్నం పెట్టక అర్ధాకలితో అలమటింపజేశారు. చివరికి మూడవ రోజు స్టేషన్‌కు మంగలిని పిలిపించి ముగ్గురికీ గుండు గీయించారు. అప్పుడు గాని పోలీసుల ఆకలి చల్లారలేదు.
నిందితులను 24 గంటలకు మించి పోలీసు స్టేషన్‌లో నిర్భందించరాదని, దెబ్బలు కొట్టరాదని, చిత్రహింసలకు గురిచేయరాదని, థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని పౌర హక్కుల సంఘం ప్రశ్నించినప్పుడల్లా పోలీసులు చెబుతున్న సమాధానం ‘‘రెండు అంటిస్తే తప్ప నేరం ఒప్పుకోరని!’’ ఇది ఏ కాలం నాటి న్యాయం!
లింగాల సమాజానికి ముఖం చూపలేక, అవమానం భరించలేక అఖిల్, నిఖిల్ హైదరాబాద్‌కు పారిపోయారు. వినీత్ అవమానం తట్టుకోలేక ఈ ప్రపంచం నుంచే నిష్క్రమించాలనుకున్నాడు. ఈ నిర్ణయం తీసుకోవడానికి మూడు రోజులు మానసిక క్షోభను అనుభవించాడు. చివరికి అక్టోబర్ 18న గదిలోనే ఉరి వేసుకున్నాడు. శబ్దం విన్న తల్లిదండ్రులు తలుపులు బద్దలు కొట్టి ఉరితాడుకు వేళాడుతున్న వినీత్‌ను కిందికి దించి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ముక్కులోంచి రక్తం వచ్చింది. మెడ వెనక ఎముక విరిగింది. వినీత్ తల్లి ‘నా కొడుకు చనిపోతే లింగాల సబ్ -ఇన్‌స్పెక్టర్ బాధ్యత వహించాలి’ అని మీడియాతో మాట్లాడింది. మొత్తానికి నాగర్‌కర్నూలు డాక్టర్లు వినీత్‌ను బ్రతికించగలిగారు. ఈలోగా సదరు సబ్ ఇన్‌స్పెక్టర్‌ను వనపర్తి హెడ్‌క్వార్టర్‌కు బదలాయించారు. అయినా గానీ వినీత్ తల్లిదండ్రులను కలిసి నయానా భయానా దారిలోకి తెచ్చుకుని, ‘నా కొడుకు ఎస్‌ఐ వేధింపులతో ఆత్మహత్య ప్రయత్నం చేసుకోలేదు. ఆత్మహత్య ప్రయత్నానికి తామే కారణం’ అని మీడియాకు చెప్పించాడు. అదే విషయం పౌరహక్కుల సంఘానికి కూడా చెప్పారు. అయితే వినీత్ మాత్రం పోలీసులు చేసిన అవమానం వల్లనే ఆత్మహత్యా ప్రయత్నం చేశానని నిర్భయంగా వెల్లడించాడు. నేను ఈ ఊరిలో ఉండలేను, హైదరాబాద్ వెళ్ళిపోయి డిగ్రీ పూర్తి చేస్తానని ఆ మార్గం చూపించడని పౌరహక్కుల సంఘాన్ని ప్రాథేయపడ్డాడు. వినీత్‌ను బతికించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంది. పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎస్‌ఐని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపైన ఉంది. సామాజికంగా, ఆర్థికంగా, బలహీనులైనవారిని కాటేయడానికి కాచుకుని కూర్చున్న సర్పాల్లా ప్రవర్తిస్తున్నారు పోలీసులు. వీరి కోరలు పీకాల్సింది అయితే ప్రభుత్వాలు, కాకపోతే ప్రజలే. గుండు కొట్టించే, మూత్రాలు తాగించే సంస్కృతి నుంచి పోలీసులు భయటపడాలి.
తెలంగాణలో పోలీసు శాఖ ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఉన్నప్పటికిని సవాళ్ళు ఎదురౌతూనే వున్నాయి. తెలంగాణలో కాంగ్రెసు ప్రభుత్వం కొలువైన మూడు రోజులకే నల్గొండ జిల్లా పాలెం తాండ గిరిజన తెగకు చెందిన నేనావత్ సూర్యనాయక్‌ను భూవివాదం కేసులో చింతపల్లి పోలీసులు స్టేషన్‌కు తీసుకువచ్చి కొట్టి చంపారు. పౌరహక్కుల సంఘం సీసీ టీవీ ఫుటేజ్ చూపించమని నిలదీస్తే అవి పనిచేయక చాలా కాలం అయిందన్నారు.
2024 ఆగస్టు 30న రాత్రి 8:30 గంటలకు షాద్‌నగర్ పోలీసులు ఇండ్లల్లో పని చేసుకొని బ్రతికే దళిత కులానికి చెందిన సునీతను పట్టుకుపోయి రాత్రి 2 గంటల వరకు చిత్రహింసలకు గురి చేశారు. బంగారం దొంగతనం కేసు ఒప్పుకొమ్మని చితకబాదారు. రక్తస్రావం జరిగి సునీత విలవిలా కొట్టుకుంది. ఒక దళిత మహిళను ఇలా మగ పోలీసులు రాత్రిపూట హింసించి పైశాచిక ఆనందం పొందారు. 2024 అక్టోబరు 11న గద్వాల జిల్లా బిజ్వారం గ్రామానికి చెందిన పనిపిల్ల రాజేశ్వరి (16)ని మల్దకల్ పోలీసులు అరెస్టు చేసి పట్టుకపోతే అవమానాన్ని భరించలేక మరుసటి రోజు పురుగుల మందు తాగి చనిపోయింది.
పోలీసులు మైనర్ బాలబాలికల పట్ల ఎంత సున్నితంగా వ్యవహరించాలో తెలుసుకోలేకపోతున్నారు. అందరి పట్ల ఒకే దండన నీతిని అనుసరిస్తున్నారు. ఇలాంటి ఘటనలను నిలువరించాలంటే ప్రజలు చైతన్యం పెంచుకొని హక్కుల సాధన కోసం నిరంతర పోరాటం చేయాలి. రాజ్యాంగం 21వ అధికరణ ద్వారా సంక్రమించిన గౌరవప్రదంగా జీవించే హక్కు కోసం ఉద్యమించాలి.
సామాజికంగా, ఆర్థికంగా, బలహీనులైనవారిని కాటేయడానికి కాచుకుని కూర్చున్న సర్పాల్లా ప్రవర్తిస్తున్నారు పోలీసులు. వీరి కోరలు పీకాల్సింది అయితే ప్రభుత్వాలు, కాకపోతే ప్రజలే. గుండు కొట్టించే, మూత్రాలు తాగించే సంస్కృతిని పోలీసులు విడనాడాలి.
లక్ష్మణ్ గడ్డం
అధ్యక్షులు, పౌర హక్కుల సంఘం
Updated Date - Nov 16 , 2024 | 05:19 AM