South Korean Politics : నియంతపై తిరుగుబాటు
ABN, Publish Date - Dec 07 , 2024 | 12:32 AM
దక్షిణకొరియా అధ్యక్షుడు తనకుతానుగా తప్పుకోవడమో, మిగతావారంతా ఆయనను దించేయడమో రేపోమాపో ఖాయం. ఆయనను అభిశంసించే ప్రయత్నం మరింత వేగం పుంజుకుంది. ఎంత పాపిష్టిపనిచేసినా అధినాయకుడి నిర్ణయాలను గుడ్డిగా సమర్థించే దిగువస్థాయి నేతలను చూస్తున్న మనకు దక్షిణకొరియా పరిణామాలు ఆశ్చర్యం కలిగించేవే. అప్రజాస్వామిక వైఖరులను, నిరంకుశ
దక్షిణకొరియా అధ్యక్షుడు తనకుతానుగా తప్పుకోవడమో, మిగతావారంతా ఆయనను దించేయడమో రేపోమాపో ఖాయం. ఆయనను అభిశంసించే ప్రయత్నం మరింత వేగం పుంజుకుంది. ఎంత పాపిష్టిపనిచేసినా అధినాయకుడి నిర్ణయాలను గుడ్డిగా సమర్థించే దిగువస్థాయి నేతలను చూస్తున్న మనకు దక్షిణకొరియా పరిణామాలు ఆశ్చర్యం కలిగించేవే. అప్రజాస్వామిక వైఖరులను, నిరంకుశ నిర్ణయాలను కేవలం నిరసనలతోనూ, ధర్నాలతోనూ జనం వ్యతిరేకిస్తే కూడా సహించలేని పాలకులు మన మధ్య ఉన్నారు. లాఠీ దెబ్బలతోనూ, తూటాలతోనూ అణచివేయడం తప్ప, ప్రజాభీష్టాన్ని గౌరవించడం, ప్రజాస్వామికంగా వ్యవహరించడం మన నాయకులకు తెలియనివిద్య. అవినీతి ఆరోపణలతో పరువుపోగొట్టుకొని, అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం సైనికపాలనను ప్రకటించిన ఆరుగంటల్లోనే జనానికి జడిసి ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న దక్షిణకొరియా అధ్యక్షుడిని విమర్శించాలో, ప్రశంసించాలో తెలియని స్థితి.
అధ్యక్షభవనాలను వేలాదిమంది చుట్టుముట్టినా కాల్చిపారేయడం తప్ప, గద్దెదిగిరాని నియంతలను మనం చూశాం. సైనికపాలన నిర్ణయాన్ని కొద్దిగంటల్లోనే వెనక్కుతీసుకోవడానికి అధ్యక్షుడు యూన్ సెక్‌యోల్ మీద వచ్చిన ఒత్తిడి చిన్నదేమీ కాదు. దానిని బేఖాతరు చేసి, ఆఖరు నిముషం వరకూ ఆయన అంతే నిరంకుశంగా వ్యవహరించివుంటే, అంతకంతకూ మరింత మూర్ఖంగా వ్యవహరించి ఉంటే, పరిస్థితి పూర్తిభిన్నంగా ఉండేది, కథ ఇలా ముగిసేది కాదు. తప్పుటడుగువేసినా, వెనకడుగువేసినందుకు, విపక్షనేతల, ప్రజల ఒత్తిడికి తలొగ్గినందుకు ఆయనను మెచ్చుకోవాలి. ఇటువంటి వాడు దేశాధ్యక్షస్థానానికి పనికిరాడు, ఆయన తనకుతానుగా దిగితే సరి, లేదా కలసి దించేస్తామని విపక్షాలు ఏకకంఠంతో నిర్ణయాన్ని ప్రకటించాయి. ఆశ్చర్యమేమంటే, స్వపక్షంనుంచి కూడా అదే అభిప్రాయం వినబడుతూండటం. ఆయనను దేశాధ్యక్షుడిగా కూచోబెట్టిన పీపుల్ పవర్ పార్టీ (పీపీపీ) పెద్ద తలకాయలు కూడా ఇదేమాట అంటున్నారు. ఆయన మర్యాదగా తప్పుకోవడం కాదు, అంతలోగా మనమే దించేయకపోతే పార్టీ పరువు పోతుందన్న ఆ కాస్తంత ఇంగితజ్ఞానం వాళ్ళకు ఉన్నందుకు సంతోషించాలి. రాష్ట్రాలకు రాష్ట్రాలు కులం కార్చిచ్చుల్లోనో, మతం మంటల్లోనో తగలబడుతున్నప్పుడు నిమ్మకునీరెత్తినట్టుండే పాలకులను, అస్మదీయులను వెనకేసుకొచ్చే అధినాయకులనూ మనం చూస్తూనే ఉన్నాం.
అంతచైతన్యవంతంగా ఉన్నందుకు దక్షిణకొరియా ప్రజలను మెచ్చుకోవాలి. విపక్షనేతలు సరేసరి. అపఖ్యాతి పాలైన అధ్యక్షుడు నిరంకుశుడై, నిరవధికంగా దేశాన్ని ఏలాలని కుట్రపన్నుతున్నాడు కనుక, అతడితో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధపడ్డారు. రెండువందలమంది ఎంపీలు రాత్రికిరాత్రి గేట్లు దూకి, చట్టసభల్లోకి ప్రవేశించి అధ్యక్షుడి నిర్ణయాన్ని తిరగదోడటం మంచి పరిణామం. తాము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ఒక నాయకుడు, రాజ్యవ్యతిరేక శక్తుల్ని ఏరిపారేస్తానని, కల్లోలంగా ఉన్న దేశాన్ని చక్కదిద్దుతానని ఏవో బూటకపు మాటలు చెబుతూ మరో నియంతగా తయారైనాడని ప్రజలు ఇట్టే గ్రహించారు. ఎవరి ప్రోద్బలమూ, నాయకత్వమూ లేకుండా, అనతికాలంలో అన్నివేలమంది రోడ్లమీదకు వచ్చి, నినాదాలతో, నిరసనలతో అధినాయకుడిని గడగడలాడించడం ప్రశంసనీయమైనది. ఉత్త చేతులతో వీధుల్లోకి వచ్చి, సైన్యం చేతుల్లో ఉన్న తుపాకులు లాక్కోగలిగిన ఆ సాహసం మెచ్చుకోదగినది. పొరుగుదేశాలను, అక్కడి మతాలను, కార్చిచ్చులను, కల్లోలాలను చూపి, లేని కుట్రలన్నీ వాటికి ఆపాదించి హాయిగా అధికారంలో కొనసాగే పాలకులను మనం చూస్తున్నాం. కానీ, ఒక మహానియంత ఏలుబడిలో ప్రత్యర్థిదేశం పొరుగునే ఉండగా, నిత్యమూ నెత్తిన యుద్ధవిమానాలు తిరిగే వాతావరణంలో దశాబ్దాలుగా బతుకుతూన్నప్పటికీ దక్షిణకొరియా ప్రజలు తమ అధ్యక్షుడి వాదనలకు విలువ ఇవ్వకపోవడం ఆశ్చర్యం. పొరుగుదేశం ఎంత ప్రమాదకరమైనదో వారికి తెలియనిదేమీ కాదు. కానీ, తన తప్పుడు పనికి అధినాయకుడు ఉత్తరకొరియా బూచిని చూపడాన్ని వారు అంగీకరించలేదు, తీవ్రంగా ప్రతిఘటించారు కూడా. ఆదేశాలున్నాయి కదా అని జనాన్ని పిట్టల్లా కాల్చేయకుండా ప్రజాగ్రహానికి జడిసిన, వారి నిరసనలను గౌరవించిన సైన్యాన్ని సైతం మెచ్చుకోవాలి.
నాలుగుదశాబ్దాల క్రితం వరకూ అనుభవించిన సైనికపాలనను దక్షిణకొరియా ప్రజలు విస్మరించలేదు. ఆనాటి నియంతృత్వం తిరిగి తలెగరేయకుండా జాగ్రత్తపడ్డారు. అప్పటిపాలకులను ఘనంగా కీర్తించే ఇప్పటి దేశాధ్యక్షుడు ఆర్థికంగా ఎదిగిన దేశాన్ని ముంచేయకుండా కాపాడుకున్నారు. పొరుగుదేశాలను, కమ్యూనిస్టులను బూచిగా చూపే కుట్రలను ఛేదించారు. కష్టపడి సాధించిన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకున్నారు.
Updated Date - Dec 07 , 2024 | 12:32 AM