ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాజకీయ హింస!

ABN, Publish Date - Jul 16 , 2024 | 05:32 AM

మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌మీద శనివారం జరిగిన హత్యాయత్నం అక్కడి రాజకీయాన్ని మరింత వేడెక్కించింది, మిగతా ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది...

మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌మీద శనివారం జరిగిన హత్యాయత్నం అక్కడి రాజకీయాన్ని మరింత వేడెక్కించింది, మిగతా ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. నలుగురు దేశాధ్యక్షులహత్య సహా ఈ తరహా హత్యాయత్నాలు అనేకం చూసిన అమెరికాకు రాజకీయ హింస కొత్తేమీ కాదు. కానీ, ట్రంప్‌ రాజకీయ ప్రవేశం తరువాత మరింతగా చీలిన అమెరికా సమాజాన్ని ఈ హత్యాయత్నం తీవ్రంగా ప్రభావితం చేస్తుంది, విద్వేషాలు పెంచుతుంది.

ఏవో కుట్రసిద్ధాంతాలు తెరమీదకు వస్తున్నాయి, భద్రతాసిబ్బంది వైఫల్యంమీద కూడా అనుమానాలు, ఆరోపణలు వినవస్తున్నాయి. వాటిని అటుంచితే, ఒక భయానకమైన హత్యాయత్నంనుంచి తృటిలో తప్పించుకున్న నాయకుడి పట్ల ప్రజల్లో సానుభూతి కలగడం సహజం. పైగా, తూటా తాకిన వెంటనే కిందకు వంగిన ఆయన ఆ తరువాత లేచి పిడికిలి బిగించాడు. ఫైట్‌ ఫైట్‌ ఫైట్‌ అంటూ ముమ్మారు నినదించాడు. చెవి పైభాగం చిట్లిపోగా మొఖమీదకు చిమ్మిన ఆ రక్తం, ఆయన వెనుక ఉన్న అమెరికా జెండా, చుట్టుముట్టివున్న సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లతో కూడిన ఆ దృశ్యం అమెరికన్ల మనస్సుల్లో బలంగా నిలిచిపోతుంది. భద్రతాసిబ్బంది ఎలా అనుమతించారో తెలియదు కానీ, బుల్లెట్‌ తగిలిన క్షణంనుంచి వాహనం ఎక్కేవరకూ పలుమార్లు ట్రంప్‌ ఆ రక్తమోడుతున్న మొఖాన్ని ప్రజలకు చూపించాడు, లొంగేది లేదంటూ నినాదాలు చేశాడు, తాను బెదిరిపోలేదని చాటిచెప్పాడు. మనకు కావాల్సింది ఇటువంటి యోధుడూ ధీరుడేనంటూ రిపబ్లికన్లు సాగిస్తున్న ప్రచారం కూడా తోడై ఈ హత్యాయత్నం ఆయనకు రాజకీయంగా మేలు చేయవచ్చు. ఆయనమీద ఉన్న కేసులు సైతం ఇక కదలకపోవచ్చునని అంటున్నారు. ఇప్పటికే జో బైడెన్‌ వెనుకబడి ఉన్నారని సర్వేలు చెబుతున్న తరుణంలో మొన్నటి తొలి అధ్యక్ష అభ్యర్థుల ముఖాముఖి చర్చలో సైతం బైడెన్‌ తడబడ్డారు, తప్పటడుగులు వేశారు. బైడెన్‌ తప్పుకోవాలంటూ ఆయన పార్టీలోనే ఒత్తిడి పెరుగుతోంది, కమలాహారిస్‌ సహా కొన్ని పేర్లు ముందుకు వచ్చాయి కూడా.


తటస్థ ఓటర్లు ట్రంప్‌ వైపు తిరిగిపోతున్నారనీ, బైడెన్‌ తప్పుకోవాలని అత్యధికశాతం డెమోక్రాట్‌ ఓటర్లు సైతం కోరుకుంటున్నారని వార్తలు వస్తున్న తరుణంలో ట్రంప్‌మీద ఈ హత్యాయత్నం జరిగింది. ఇప్పుడు అధ్యక్ష రేసునుంచి బైడెన్‌ను తప్పించినా కూడా ఫలితం ఏకపక్షంగానే ఉంటుందన్న విశ్లేషణలు కొట్టిపారేయలేనివి. అమెరికాని ‘గ్రేట్‌ ఎగైన్‌’ చేయడానికి సంకల్పించిన వ్యక్తిని చట్టసభలూ, న్యాయస్థానాలూ వేధిస్తున్నాయని ఇంతకాలం భావించినవారు, ఇప్పుడు భౌతికంగా అంతం చేయడానికి ప్రయత్నించారన్న ఆరోపణను ట్రంప్‌ అభిమానులతో పాటు తటస్థులు కూడా నమ్మవచ్చు. ఘటన జరిగిన తరువాత ట్రంప్‌ కుమారుడు ఇచ్చిన సందేశం పరమార్థం ఇదే.

తన పదవీకాలంలో మూడోమారు బైడెన్‌ ఓవల్ ఆఫీసునుంచి జాతినుద్దేశించి చేసిన ప్రసంగం ఉన్నతంగా ఉంది. దేశంలో రాజకీయ హింస పెరుగుతోందని, చల్లార్చుకోవాలని, ఎన్నికల వేడి శృతిమించకూడదని, విభేదాలు పరిష్కరించుకోవాల్సింది బ్యాలెట్‌తోనే కానీ, బుల్లెట్‌తో కాదనీ చాలామంచిమాటలు చెప్పారాయన. ఈ సందర్భంగా ట్రంప్‌ ఏలుబడిలో దేశం చవిచూసిన ఉద్రిక్త ఘట్టాలను, తిరుగుబాట్లను కూడా గుర్తుచేశారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓడినప్పటికీ, అధికారం అప్పగించడానికి నిరాకరించి, తన అభిమానులను రెచ్చగొట్టి, అమెరికన్ కాంగ్రెస్‌ భవనాలపై దాడులను ప్రోత్సహించి, ప్రపంచంముందు ట్రంప్‌ దేశం పరువుతీసిన విషయం తెలిసిందే.


ట్రంప్‌మీద హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తికి నేరచరిత్ర ఏమీ లేదు. ఫలానాపార్టీతో బలమైన అనుబంధం ఉన్నదని చెప్పడానికి కానీ ఇప్పటివరకూ ఏ ఆధారాలు లేవు. అతడిని వెంటనే కాల్చిచంపేయడం వల్ల కొన్ని విషయాలు వెలుగులోకి రాకపోవచ్చు కూడా. అతడు శ్వేతజాతీయుడు కావడం ఒక విధంగా అమెరికా సమాజాన్ని కాపాడింది. అతడి రంగు వేరయి ఉంటే, ఇప్పటికీ పలురకాల వివక్షలతో రగులుతున్న దేశానికి విషం చిమ్మడానికి మరో అవకాశం వచ్చివుండేది. ఇక, ఈ రాజకీయ హింసకు ఆయుధంగా ఉపకరిస్తున్న ‘గన్‌కల్చర్‌’ మీద ఇప్పటికైనా పాలకులు దృష్టిసారించడం అవసరం. తుపాకులను నియంత్రించాలన్న బైడెన్‌ ప్రయత్నాలకు రిపబ్లికన్లు గతంలో ఎంతగా అడ్డుపడ్డారో తెలుసు. తుపాకులను నియంత్రించాలన్న ఉద్యమాలకు కేంద్రబిందువుగా ఉండే అత్యంత ప్రమాదకరమైన సామూహిక జనహనన ఆయుధం ఎఆర్‌–15 రైఫిల్‌ను ఓ సాదాసీదా వ్యక్తి ఇలా సులువుగా సంపాదించి, ప్రాణాలు తీయబోయిన నేపథ్యంలో, రేపు డోనాల్డ్‌ ట్రంప్‌, ఆయన పార్టీ అధికారంలోకి వస్తే గన్‌కల్చర్‌ మీద దృష్టిపెట్టడం అవసరం.

Updated Date - Jul 16 , 2024 | 05:32 AM

Advertising
Advertising
<