ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సమగ్రాభివృద్ధికి జీడీపీ కొలమానం కాదు

ABN, Publish Date - Jul 20 , 2024 | 04:51 AM

ఒక దేశ జీడీపీ పెరిగినంత మాత్రాన అక్కడి పేదరికం, నిరుద్యోగం తొలగిపోయి ఆ దేశం సమగ్రాభివృద్ధి చెందినట్టు భావించకూడదు. పెరిగిన అభివృద్ధి ఫలాలు అట్టడుగు స్థాయిలో ఉన్న పేదలకు,

ఒక దేశ జీడీపీ పెరిగినంత మాత్రాన అక్కడి పేదరికం, నిరుద్యోగం తొలగిపోయి ఆ దేశం సమగ్రాభివృద్ధి చెందినట్టు భావించకూడదు. పెరిగిన అభివృద్ధి ఫలాలు అట్టడుగు స్థాయిలో ఉన్న పేదలకు, సామాన్యులకు అందినప్పుడే వారి ఆదాయాలు పెరిగి, తద్వారా కొనుగోలు శక్తి పెరిగి, జీవన ప్రమాణాలు పెరుగుతాయి.

భారతదేశంలో కానీ, ఇతర అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, జపాన్, జర్మనీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, కెనడా దేశాలలో గానీ, ఆదాయ సంపదలు కొద్ది శాతం పెట్టుబడిదారులు, వ్యాపారస్థుల చేతిలో కేంద్రీకృతమైపోయాయి. అందువల్ల ఆ దేశాలలో మౌలిక సమస్యలైన పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, అనారోగ్యం, ఆర్థిక అసమానతలు పూర్తిగా తొలగిపోలేదు.

మన భారతదేశంలో వివిధ సంస్థల అధ్యయనం ప్రకారం 5 శాతం జనాభా చేతిలో సుమారు 65శాతం దేశ సంపద కేంద్రీకృతమై ఉంది. మిగతా 95 శాతం మంది చేతిలో సుమారు 35 శాతం సంపద మాత్రమే ఉన్నది. అందువల్ల మన దేశంలో 90 శాతం ప్రజలు ప్రతి నిత్యం కనీస మౌలిక సదుపాయలైన గృహవసతి, విద్య, వైద్యం, పోషకాహారం, మెరుగైన జీవన ప్రమాణాల కోసం ఇబ్బంది పడుతూ జీవనం సాగిస్తున్నారు.


మనకు స్వాతంత్ర్యం వచ్చిన 77 ఏళ్లలో మన దేశం వ్యవసాయ, పారిశ్రామిక, శాస్త్ర సాంకేతిక సేవా రంగాలలో గణనీయమైన అభివృద్ధి సాధించినప్పటికీ, మన జీడీపీ గతంలో ఎన్నోసార్లు 6 నుంచి 8 శాతం చేరుకున్నప్పటికీ దేశంలో నిరుద్యోగ సమస్య ప్రతి ఏటా పెరుగుతున్నది. మన దేశంలోని జనాభాలో 35 సంవత్సరాల లోపు యువకులు దాదాపు 50 శాతం ఉన్నప్పటికీ వారికి స్థానికంగా ఉద్యోగాలు లభించక ప్రతి ఏటా కొన్ని లక్షలమంది యువకులు ఉద్యోగాలు వెతుక్కుంటూ అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, జపాన్‌, జర్మన్‌, గల్ఫ్ దేశాలకు వలస పోతున్నారు.

మన దేశంలో పుష్కలమైన సహజ వనరులు, సారవంతమైన వ్యవసాయ భూములు, జీవనదులు, అటవీ సంపద, ఖనిజ సంపద, సమర్థవంతమైన మానవ వనరులు, శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు, డాక్టర్లు, సాంకేతిక నిపుణులు, ఉన్నత విద్యావంతులు ఉన్నప్పటికీ దేశ ప్రజలు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. జీఎస్టీ, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు సుమారు 80లక్షల కోట్ల దాకా ప్రతి ఏటా రాబడి వస్తున్నది. అయినప్పటికీ చెప్పుకోతగ్గ అభివృద్ధి సాధించలేకపోతున్నాం. ప్రభుత్వాలు రెవెన్యూ రాబడికి అదనంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక సంస్థలు, బ్యాంకుల ద్వారా అప్పుల రూపంలో సమీకరించి అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతులకు ఖర్చు పెడుతున్నప్పటికీ దేశంలో ప్రజల ఆదాయాలు ప్రభుత్వ ఖర్చులకు అనుగుణంగా పెరగటం లేదు.


ప్రభుత్వానికి ప్రజల పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని సమర్థవంతంగా వినియోగించుకున్నట్లయితే దేశం అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకెళ్ళగలదు. పన్నుల ఎగవేతను, నిధుల దుర్వినియోగాన్ని అవినీతిని నిర్మూలించగలగాలి. బినామీ ఆస్తుల నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చెయ్యడంతో పాటు భూముల నిజ విలువ (మార్కెట్) ఆధారంగా స్టాంప్‌ డ్యూటీ రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు విధించటం, నల్లధనాన్ని పూర్తిగా అరికట్టి 90 శాతం డిజిటల్‌ లావాదేవీలు ప్రోత్సహించటం ద్వారా ఆదనపు ఆదాయాన్ని రాబట్టి తద్వారా ఆర్థికాభివృద్ధి సాధించవచ్చును. ఇందులో భాగంగా 500 రూపాయల నోట్లు రద్దు చెయ్యాలి. విద్య, వైద్యం, గృహ నిర్మాణం, రోడ్లు, రైల్వేలు, నౌకయానం, ప్రజా రవాణ, విద్యుత్‌శక్తి మొదలైన మౌలిక వసతుల రంగాలలో మూలధన పెట్టుబడి పెంచాలి. ప్రభుత్వ సబ్సిడీలు, సంక్షేమ కార్యక్రమాలు సమాజంలో పేదలు, అర్హులు, సామాన్యులకు మాత్రమే ఇవ్వడం ద్వారా వృథా ఖర్చులు అరికట్టి బడ్జెట్‌లో మిగులు సాధించి పేదల సంక్షేమానికి అదనంగా ఖర్చు పెట్టవచ్చు.

అంతే కాకుండా ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో 60 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి వయోవృద్ధునికి ప్రభుత్వమే పెన్షన్‌ అందజేస్తుంది. మన దేశంలో కూడా ఎలాంటి పెన్షన్‌ పొందని 60 ఏళ్ళు నిండిన వృద్ధులందరికీ ప్రతి నెలా కనీసం రూ.5000 పెన్షన్‌ అందజేయాలి. ప్రఖ్యాత నోబెల్‌ అవార్డు గ్రహీత అమర్త్య సేన్ అభిప్రాయం ప్రకారం పేద ప్రజలు, రైతులు, కూలీలు, సామాన్యులు, అన్ని వర్గాల ప్రజల ఆదాయాలు రెట్టింపు అయినట్లయితే ప్రజల కొనుగోలు శక్తి పెరిగి వస్తువు సేవలకు డిమాండ్‌ పెరుగుతుంది. తద్వారా పారిశ్రామిక, సేవా రంగాలు అభివృద్ధి చెంది మొత్తం ఆర్థిక వ్యవస్థలలోని అన్ని రంగాలు సమతుల్యంగా అభివృద్ధి చెందుతాయి. ఆ విధంగా పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు తొలగిపోగలవు. దేశంలోని ప్రతి పౌరునికి ఆర్థిక, సామాజిక భద్రత లభించినప్పుడే దేశం నిజంగా అభివృద్ధి చెందినట్లుగా భావించాలి.

కోట విద్యాసాగర్‌ రెడ్డి

న్యాయవాది

Updated Date - Jul 20 , 2024 | 04:51 AM

Advertising
Advertising
<