ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పీకే కొత్తపార్టీ

ABN, Publish Date - Oct 05 , 2024 | 04:01 AM

రాజకీయపక్షాలకు, నాయకులకు అద్దెబుర్రలుగా పనిచేస్తూ, ఎన్నికల్లో విజయానికి నానా సలహాలూ ఇచ్చే వ్యూహకర్తలే స్వయంగా ఎన్నికలరంగంలోకి దిగితే విజయం వరిస్తుందా?

రాజకీయపక్షాలకు, నాయకులకు అద్దెబుర్రలుగా పనిచేస్తూ, ఎన్నికల్లో విజయానికి నానా సలహాలూ ఇచ్చే వ్యూహకర్తలే స్వయంగా ఎన్నికలరంగంలోకి దిగితే విజయం వరిస్తుందా? ప్రచారకర్తలుగా, సలహాదారులుగా తెరవెనుకే మిగిలిపోకుండా, తామే స్వయంగా ఏలికలు కావాలన్న ఆశతో వచ్చే ఆ వ్యూహాత్మక నిపుణులను ప్రజలు ఆదరిస్తారా? ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఒక రాజకీయపార్టీని ఆరంభించి బిహార్‌ ఎన్నికల బరిలోకి దిగారు. ఎన్నో రాజకీయపక్షాలను గద్దెనెక్కించిన తాను, ‌ప్రజల హృదయాలను గెలవలేనా? అన్న విశ్వాసంతో అక్టోబర్‌ 2 గాంధీజయంతినాడు ‘జన్‌ సురాజ్‌’ పార్టీని ప్రకటించారు. వచ్చే ఏడాది బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో, అన్ని స్థానాల్లోనూ పోటీచేసి, అధికం గెలిచి, అధికారాన్ని కైవసం చేసుకోగలనన్నది ఆయన విశ్వాసం. తనమీదతనకు అంత నమ్మకంతోపాటు, బిహార్‌ ప్రజలమీద ఆయనకు అంత విశ్వాసం ఉన్నందుకు సంతోషించాల్సిందే కానీ, పార్టీ ప్రభావంమీద మాత్రం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

గాంధీ జయంతినాడు ఆయన మద్యనిషేధం గురించి కాక, ఇప్పటికే ఉన్న నిషేధాన్ని తొలగించి మద్యాన్ని ప్రవహింపచేస్తానని ఆయన ప్రకటించాడు. బిహార్‌లో మద్యనిషేధం అమలు, విజయం మీద భిన్నాభిప్రాయాలున్నాయి. ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ తన నిర్ణయం సూపర్‌ హిట్‌ అని ఎలాగూ చెప్పుకుంటారు. మహిళలు నితీశ్‌ఫోటోను ఆరాధిస్తున్నారని, నిరుపేదల కుటుంబాలు బాగుపడి, కాస్తంత దాచుకుంటున్నాయని ఆయన పార్టీ ప్రచారం చేసుకుంటుంది. మిగతా రాజకీయపక్షాలు ఏవో విమర్శలు చేస్తుంటాయి కానీ, నిషేధం అట్టర్‌ఫ్లాప్‌ అయినందున దానిని ఎత్తేయాలని అనడానకి మాత్రం సంకోచిస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో, తాను బిహార్‌లో అధికారంలోకి వచ్చిన పావుగంటలో మద్యనిషేధాన్ని ఎత్తేస్తానని, రాష్ట్రంలో కుప్పకూలిన విద్యారంగాన్ని ఉద్ధరించడానికి ఆ సొమ్మును ఖర్చుచేస్తానని పీకే ప్రకటించారు. మద్యం అమ్మకాలద్వారా వచ్చే రాబడి ఎంత, విద్యారంగాన్ని బాగుచేయడానికి ఐదేళ్ళకాలంలో ఎంతకావాలన్న జమాఖర్చులు ఆయన ప్రజలకు విప్పిచెప్పారు.


బిహార్‌కు రావాల్సిన డబ్బును మోదీ తన గుజరాత్‌కు తరలించుకుపోతున్నాడని, కేంద్రం నుంచి బిహార్‌కు రావ్వాల్సినదాన్ని రాష్ట్రనేతలు సాధించడం లేదని కొన్ని రాజకీయవ్యాఖ్యలు విమర్శలు సైతం పీకే చేశారు. ప్రజాకర్షణవ్యాఖ్యలు, మిగతాపక్షాలపై విమర్శలను అటుంచితే, పార్టీ నిర్మాణం, ఎమ్మెల్యేలు, ఎంపీలు తదితర ప్రజాప్రతినిధుల ఎంపిక ప్రక్రియల విషయంలో ‘జన్‌ సురాజ్‌’ అనుసరించబోయే విధానం భిన్నంగానైతే ఉంది. అమెరికా తరహాలో ఆర్నెల్లముందే అభ్యర్థులను ఎంపిక చేయడం, నెగ్గినవారు నచ్చకపోతే వెనక్కురమ్మనడం వంటి ఆసక్తికరమైన ప్రతిపాదనలున్నాయి. పార్టీ వ్యవస్థాగత నిర్మాణంలోనూ, రేపు ప్రభుత్వంలోనూ ఆయా కులాల జనాభా దామాషా ప్రాతిపదికన పదవుల పంపకాలు ఉంటాయని, ఇటీవలి కులగణనను అందుకు ఆధారంగా చేసుకుంటామని ఆయన ప్రకటించాడు. కమ్యూనిస్టులనుంచి ఆరెస్సె్స్‌ కార్యకర్తలవరకూ అందరూ తనవారేనంటూ, గాంధీ, అంబేడ్కర్‌ ప్రవచించిన మానవత్వమే తన పార్టీ ఐడియాలజీ అనీ ఆయన చెప్పుకున్నాడు. తాను పదవులకు దూరంగా ఉండటం, పార్టీ అత్యున్నతస్థానాలకు దళితులు, ఓబీసీలు, మైనారిటీలు ఇత్యాది వర్గాలు నాయకత్వం వహించడం, నిర్ణయాలు, విధానాలన్నీ అట్టడుగుస్థాయిలో జరగడం వంటివి మాటలకు మాత్రమే పరిమితమా, రేపు ఆచరణలో కనిపిస్తాయా అన్నది వేరే విషయం.


మహాత్ముడు తొలి సత్యాగ్రహాన్ని ఆరంభించిన చంపారణ్‌నుంచి ప్రశాంత్‌ కిశోర్‌ రెండేళ్ళక్రితం తన పాదయాత్ర మొదలుపెట్టి, మూడువేల కిలోమీటర్ల ప్రయాణంలో ప్రజలతో మమేకం కావడమే కాక, పార్టీకి పునాదులు కూడా వేసుకున్నాడు. ప్రధానంగా వ్యవసాయ, భూసంస్కరణలకు కూడా హామీ పడ్డాడు. రాష్ట్రం నుంచి బ్యాంకులకు సమకూరుతున్నదానిలో నాలుగోవంతు మాత్రమే తిరిగి రుణంగా అందుతున్న తీరును మార్చి, రెట్టింపు వ్యాపార, వ్యవసాయ రుణాలు ఎలా తేగలనో కొన్ని లెక్కలు కూడా చెప్పాడు. కాస్తంత పేరున్న రాజకీయ నాయకులు, ఉన్నతస్థాయి మాజీ అధికారులు కొందరు ఇప్పటికైతే ఆయన చుట్టూచేరినమాట నిజం. దశాబ్దాలుగా వెనుకబడిన బిహార్‌ను ఒకటిరెండు దశాబ్దాల్లో ఉద్ధరించడానికి జెఎస్పీకి నిర్దిష్టమైన ఆచరణమార్గాలు ఉన్నాయని వారంతా చెబుతున్నారు. బిహార్‌ రాజకీయరంగంలో మరోపక్షానికి తగినంత జాగా ఉన్నమాట నిజమే కానీ, పీకే అధికారంలోకి రావడం మాత్రం కల్ల అని కొందరు తీసిపారేస్తున్నారు. ఓ పాతికముప్పై స్థానాలు రాకపోవా అని మరికొందరు లెక్కలు వేస్తున్నారు. ఇంతవరకూ ఎంతోమందికి అద్దెబుర్రగా వ్యవహరించిన ప్రశాంత్‌కిశోర్‌ ఆరంభించిన ఈ పొలిటికల్‌ స్టార్టప్‌ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.

Updated Date - Oct 06 , 2024 | 03:25 AM