ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రచండ నిష్క్రమణ!

ABN, Publish Date - Jul 13 , 2024 | 04:01 AM

నేపాల్‌ ప్రధానిగా ఉన్న గత ఏడాదిన్నరకాలంలో నాలుగుసార్లు అవిశ్వాసం ఎదుర్కొని పదవిని కాపాడుకోగలిగిన పుష్పకుమార్‌ దహల్‌ అలియాస్‌ ప్రచండ, శుక్రవారం నాటి అవిశ్వాసతీర్మానంలో ఘోరంగా ఓడిపోయి రాజీనామా చేయాల్సివచ్చింది.

పుష్పకుమార్‌ దహల్‌ అలియాస్‌ ప్రచండ

నేపాల్‌ ప్రధానిగా ఉన్న గత ఏడాదిన్నరకాలంలో నాలుగుసార్లు అవిశ్వాసం ఎదుర్కొని పదవిని కాపాడుకోగలిగిన పుష్పకుమార్‌ దహల్‌ అలియాస్‌ ప్రచండ, శుక్రవారం నాటి అవిశ్వాసతీర్మానంలో ఘోరంగా ఓడిపోయి రాజీనామా చేయాల్సివచ్చింది. అరవైతొమ్మిదేళ్ళ ప్రచండకు అనుకూలంగా అరవైమూడు ఓట్లు వస్తే, వ్యతిరేకంగా 194 ఓట్లు పడ్డాయి. మొన్న మూడోతేదీ పరిణామం తరువాత ఆయన నిష్క్రమణ ఖాయమైపోయింది. ఇంతకాలమూ ఆయనను ప్రధాని పదవిలో కూచోబెట్టిన కేపీ శర్మ ఓలి మళ్ళీ తాను ప్రధాని కావడం కోసం సభలో అతిపెద్ద పార్టీగా ఉన్న నేపాలీ కాంగ్రెస్‌తో ఒప్పందం కుదర్చుకున్నారు. నేపాలీ కాంగ్రెస్‌కు 89స్థానాలు, శర్మ నేతృత్వంలోని సీపీఎన్‌–యుఎంఎల్‌కు 78సీట్లు ఉన్నందున, 138స్థానాల కనీస బలాన్ని ఈ కూటమి గట్టిగానే దాటింది. ఓలి కాబోయే ప్రధాని అని నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్‌ బహదూర్‌ దేవ్‌బా వారం క్రితమే తేల్చేశారు.

ఈ రెండు ప్రధాన పార్టీల మధ్యా ఏడుసూత్రాల ఒప్పందం కుదరడంతో కలసికట్టుగా ప్రచండను దించేశాయి, ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని దేశాధ్యక్షుడికి విజ్ఞప్తిచేసుకున్నాయి. ఇంకా కొన్ని కీలకమైనశాఖల పంపకం దగ్గర లెక్కలు తేల్చుకోవాల్సి ఉన్నదనీ, మిత్రపక్షం నుంచి డిప్యూటీ పీఎంను పెట్టుకోవడం శర్మకు ససేమిరా ఇష్టం లేదనీ వార్తలు వస్తున్నాయి. ఇక, కనీస ఉమ్మడి కార్యాచరణ వంటి మాటలు ప్రజలకు అర్థంకానివేమీ కావు. ఈ కొత్తకూటమితో తమకు ఒరిగేదేమీ ఉండదనీ, ఈ పరిణామం తమకు సంబంధించింది కాదని వారికి తెలుసు. తొలి ఏడాదిన్నర డెబ్బైరెండేళ్ళ ఖడ్గప్రసాద్‌ శర్మ ఓలీ ప్రధానిగా ఉండి, ఆ తరువాత డెబ్బయ్‌ఎనిమిదేళ్ళ దేవ్‌బా ఆ పదవిని అలంకరిస్తారన్నది ఈ ఒప్పందంలోని ప్రధానమైన అంశం. అంటే, ప్రచండ ఏడాదిన్నర ప్రధానిగా ఉన్నారు కనుక, ఆయనను దించేసి మిగతాకాలాన్ని వీరిద్దరూ పంచుకున్నారు. వీరి కలయికని అక్రమం, అనైతికం అంటున్నారు ప్రచండ.


ఈ రెండుపార్టీలతో పోల్చితే తక్కువ బలంతో, కేవలం ముప్పైరెండు సీట్లతో సభలో మూడోస్థానంలో ఉన్న ప్రచండ ఇంతకాలం ప్రధానిగా ఉండగలగడం విశేషం. 2022 నవంబరు ఎన్నికల తరువాత ఆయన అటు నేపాలీ కాంగ్రెస్‌, ఇటు సీపీఎన్‌–యుఎంఎల్‌ రెండింటినీ మార్చిమార్చి వాడుకొని పదవిలో కొనసాగారు. యుఎంఎల్‌ మద్దతుతో ప్రధాని అయిన ఆయన ఆ తరువాత దేవ్‌బాతో కలిశారు. నేపాలీ కాంగ్రెస్‌కు చెందిన వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా సమర్థించి శర్మకు పొగబెట్టేశారు. ఆ తరువాత నేపాలీ కాంగ్రెస్‌తో విభేదాలు వచ్చి మొన్నమార్చిలో మళ్ళీ కేపీశర్మ ఓలీతో చేతులు కలిపారు. నడిరోడ్డుమీద బిచ్చమైనా ఎత్తుకుంటాను కానీ, ఓలీతో చేతులు కలిపేది లేదని ప్రచండ గతంలో చేసిన ప్రతిజ్ఞ ఆ సందర్భంగా చాలామందికి గుర్తుకు వచ్చింది. ఆ వెంటనే ఉపప్రధాని నారాయణ్‌ కాజీ శ్రేష్ట చైనా వెళ్ళి, బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఐ) ప్రాజెక్టుల విషయంలో తిరిగి కాస్తంత కదలిక తెచ్చారు. కేపీశర్మ ఓలి చైనాకు సన్నిహితుడు కావడం, రెండు కమ్యూనిస్టు పార్టీలూ చేతులు కలిపిన ఈ సందర్భంలో చైనాను సంతోషపెట్టడం ఆ పర్యటన లక్ష్యం. ఇప్పుడు కూడా పదవినుంచి దిగిపోయేముందు ప్రచండ బీఆర్‌ఐకు సంబంధించి కొన్ని మంత్రివర్గ నిర్ణయాలు తీసుకున్నారని, ఇది కొత్త కూటమిని ఇరకాటంలో పెట్టడం లక్ష్యంగా జరిగిందని వార్తలు వస్తున్నాయి.

ఏ పార్టీకీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల బలం లేని త్రిశంకుస్థితిలో ప్రచండ మిగతా రెండుపెద్ద పార్టీలను వరుసగా వాడుకొని ఇంతకాలం పదవిలో కొనసాగగలిగారు. ఆయనను ఇలా మార్చిమార్చి మోసేకంటే, తామే అధికారాన్ని పంచుకోవడం ఉత్తమమని ఆ రెండు పార్టీలు ఇప్పుడు నిర్ణయించుకున్నాయి. గత పదహారు సంవత్సరాల్లో నేపాల్‌ పదమూడు ప్రభుత్వాలను చూసింది. ఎన్నికల విధానంలో సంస్కరణలతో ఈ అస్థిరతను పరిష్కరించాలని కొత్తకూటమి భావిస్తోందట. ఈ పొత్తు ఎంతకాలం అన్నది అసలు ప్రశ్న. రాబోయే ఏడాదిన్నర చక్కగా నిలిచినా, ఆ తరువాత కేపీశర్మ ఓలీ ప్రధాని పదవిని నేపాలీ కాంగ్రెస్‌కు అప్పగిస్తారన్న నమ్మకమైతే లేదు. అధికారాన్ని పంచుకొనే విషయంలో గతంలో ప్రచండతో ఈయన అన్యాయంగా వ్యవహరించిన చరిత్ర అందరికీ తెలిసిందే.

Updated Date - Jul 13 , 2024 | 04:01 AM

Advertising
Advertising
<