Ramoji Rao : రామోజీరావు
ABN, Publish Date - Jun 11 , 2024 | 05:27 AM
తెలుగువారికి చెందిన సామాజికార్థిక రంగాలలో, రాజకీయాలలో, సాంస్కృతిక జీవనంలో ఐదు దశాబ్దాల పాటు బలమైన ముద్ర వేసిన ప్రభావశాలి చెరుకూరి రామోజీరావు. పత్రికా, ప్రసార రంగాల బాహుబలిగా
తెలుగువారికి చెందిన సామాజికార్థిక రంగాలలో, రాజకీయాలలో, సాంస్కృతిక జీవనంలో ఐదు దశాబ్దాల పాటు బలమైన ముద్ర వేసిన ప్రభావశాలి చెరుకూరి రామోజీరావు. పత్రికా, ప్రసార రంగాల బాహుబలిగా ఆయనను దేశవ్యాప్తంగా అంతా గుర్తు చేసుకుంటున్నారు. నిండు జీవితాన్ని క్రియాశీలంగా గడిపి గత శనివారం నిష్ర్కమించిన రామోజీరావు ప్రస్థానాన్ని, ఆచరించిన విలువలను చర్చించుకుంటున్నారు.
మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి, పెద్ద చదువులు లేకుండానే, చిన్న చిన్న ఉద్యోగాలతో వ్యాపారాలతో జీవితం ప్రారంభించిన రామోజీరావు, వ్యవసాయ పత్రిక నుంచి దినపత్రికకు, మేగజైన్లకు, సినిమాల నిర్మాణానికి, బహుభాషా టీవీచానెళ్లకు, అతిపెద్ద ఫిల్మ్ సిటీ ఏర్పాటు వరకు మీడియా రంగంలో విస్తరించారు. పచ్చళ్లు, కూల్‌డ్రింక్‌ల తయారీ, హోటళ్ల, వస్త్రాల షోరూమ్‌ల నిర్వహణ మొదలైన వ్యాపారాలు చేశారు. ఆయన చేసిన అన్ని వ్యాపారాలూ విజయవంతం అయ్యాయని, ఆయనతోనే కొనసాగాయని చెప్పలేము. కానీ, రామోజీరావు అంటే వెంటనే స్ఫురించే సంస్థలు మాత్రం ఆయనతోనే విజయవంతంగా కొనసాగుతూ వచ్చాయి. చిట్ ఫండ్, దాని అనుబంధ ఆర్థిక వ్యాపారాలు రామోజీరావు సామ్రాజ్యానికి వెన్నెముకగా నిలిచాయి.
‘ఈనాడు’ అవతరణతో పత్రికారంగంలో వచ్చిన మార్పులు చెప్పుకోవాలి. అప్పటికి కొంతకాలంగా తెలుగు పత్రికలలో ఒకరకమైన జడత్వం ఏర్పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించి రెండు దశాబ్దాలు అవుతున్నా, తెలుగుపత్రికల ప్రధాన కార్యాలయాలు మద్రాస్‌లోనో, విజయవాడలోనో ఉంటున్నాయి. ఆదివారం సంచికలు ఇంకా సారస్వత అనుబంధాలుగానే కొనసాగుతున్నాయి. దినపత్రికలలో మార్పునకు పెద్ద సుముఖత కనిపించేది కాదు. ఆధునిక, ప్రగతిభావాలు కలిగిన సంపాదకవర్గంతో కలసి, రామోజీరావు ‘ఈనాడు’ను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. అప్పటికి అభివృద్ధిపటంలో పెద్దగా చోటుచేసుకోని విశాఖపట్నంలో మొదటి ప్రచురణ కేంద్రాన్ని ప్రారంభించారు. వార్తలను, వార్తేతర పఠనాంశాలను కొత్తరకంగా ఇవ్వడం మొదలుపెట్టారు. మార్కెటింగ్ వ్యూహాలకు, సంపాదక కర్తవ్యాలను అనుసంధానం చేశారు. పాఠకుల పఠనాసక్తిని పెంచడానికి జీవనశైలి అంశాలను ఫీచర్లుగా ప్రవేశపెట్టారు. వింతలు విశేషాలు, నేరవార్తలు ఆ పత్రికలో పాఠకులను ఆకర్షించేవి. లైంగికవిజ్ఞానాంశాలను ప్రధానస్రవంతి పత్రికలోకి తీసుకువచ్చింది ఆ పత్రికే. తెలుగునాట మూలమూలలకు పత్రిక సకాలంలో చేరడానికి నెట్‌వర్క్ ఏర్పాటు చేశారు. అనేక గ్రామాల అభివృద్ధి, ఆ పత్రిక వృద్ధి సమన్వయంతో నడిచాయనడంలో అతిశయోక్తి లేదు.
పత్రిక వేయగలిగే గట్టి ప్రభావాన్ని రామోజీరావు రాజకీయ ఆశయాల కోసం మళ్లించారని ఆయన విమర్శకులే కాదు, అభిమానులు కూడా అంగీకరిస్తారు. ప్రభుత్వాల మీద గట్టి ప్రభావం వేయగలిగిన శక్తిగా ఆయనను పేర్కొనడం రివాజుగా మారింది కూడా. కొన్ని ప్రజాస్వామిక అవసరాలకు, సామాజిక అవసరాలకు కూడా పత్రికాశక్తిని ఆయన సంధించారు. పరువునష్టం బిల్లుకు వ్యతిరేకంగా, సారా వ్యతిరేక ఉద్యమానికి అనుకూలంగా ఆ పత్రిక చేసిన ప్రచారం తెలిసిందే. అట్లాగే కొన్ని ప్రజా ఉద్యమాలను వ్యతిరేకించడమో, సమర్థన ఇవ్వకపోవడమో కూడా ఆయన మీద విమర్శలకు కారణం అయింది. పత్రిక ద్వారా ఆయన తీసుకున్న వైఖరుల కారణంగా, ఆయన వ్యాపారాలకు ఇబ్బందులు కూడా వచ్చాయి.
పత్రికే కాదు, ఏ వ్యాపారంలో అయినా పూర్తి స్థాయి పాటవం ఉండాలని ఆయన నమ్మేవారు. విశ్వసనీయత అన్నది ఆయనకు ముఖ్యమైన వ్యాపార విలువ. పత్రిక రాజకీయ వైఖరుల మీద అభ్యంతరాలు ఉండవచ్చును కానీ, వివిధ రంగాల సమాచారాన్ని పూర్తి ఖచ్చితత్వంతో, వేగంగా అందించడం పాఠకులకు విశ్వాసం కలిగించింది. అట్లాగే, ఆర్థిక వ్యాపారాల మీద నియమపరమైన వివాదాలు, వేధింపులు ఎదురయ్యాయి కానీ, చందాదారుల నుంచి అపనమ్మకం ఎదురుకాలేదు. ఆయన చాలా విజయవంతమైన సినిమాలు తీసినప్పటికీ, భారీ తారాగణంతో ఎప్పుడూ నిర్మించలేదు. కథాప్రాధాన్యం ఉన్న మధ్యతరగతి జీవితాల సినిమాలు ఉషాకిరణ్ మూవీస్ ప్రత్యేకత. ఇటీవలి కాలంలో రియాల్టీషోలలో అదుపుతప్పిన అసభ్యత కనిపిస్తోంది కానీ, మొత్తం మీద శుభ్రమైన భాష, సన్నివేశాలతోనే ఆ సినిమాలు, ఈటీవీ సీరియళ్లు ఉండేవి. రామోజీ ప్రారంభించిన 24 గంటల వార్తాచానెల్ ఈటీవీ2, ఇప్పటికీ, విపరీతపోకడలేవీ లేకుండా, గంభీరంగా కొనసాగడం ఒక విశేషం. కొంతకాలం ఆయన నిర్వహించిన ఇంగ్లీషు పత్రిక ‘న్యూస్ టైమ్’ ఉన్నత ప్రమాణాలతో, దేశవిదేశాల కాలమిస్టులతో పరిణత పాఠకులకు విందులాగా ఉండేది.
పత్రికాభాష మీద సొంత, సంస్థాగత ముద్ర వేయడానికి రామోజీరావు ప్రయత్నించారు. వ్యక్తిగత శైలి అంటూ లేకుండా పత్రిక అంతా ఒకేరకమైన భాషాప్రయోగం కనిపించేది. అది కొంతకాలానికి ఒక ఫిర్యాదుగా కూడా మారింది. తెలుగులో సాంకేతిక పరిభాష సృష్టికి తనదైన ప్రయత్నం ఆయన ఉధృతంగా చేశారు. తెలుగులో సమగ్రమైన ఆధునిక నిఘంటువు రూపకల్పన కోసం తమ సంస్థ నుంచి చొరవ చూపారు. విపుల, చతుర వంటి విశిష్టపత్రికలు కొనసాగలేకపోయినట్టే, ఆ ప్రాజెక్టు కూడా తొలిదశలోనే ఆగిపోయింది.
పట్టుదలతో, కఠోర పరిశ్రమతో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన రామోజీరావు, తను నిర్వహించిన సంస్థల ద్వారా తెలుగుసమాజానికి కూడా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చారు. మీడియా రంగం నుంచి సమాజంలో ఇంతటి ప్రాబల్యం పొందిన వ్యక్తులు అరుదు.
Updated Date - Jun 11 , 2024 | 05:27 AM