ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రిజర్వేషన్ల సుడిలో భారత ప్రజాస్వామ్యం

ABN, Publish Date - Sep 03 , 2024 | 05:01 AM

ప్రజాస్వామిక రాజకీయాలలో దిగువ సామాజిక వర్గాల అభ్యున్నతికి ఒక ప్రధాన ఆలంబన రిజర్వేషన్లు. రిజర్వేషన్ల ద్వారా మాత్రమే అధికారాన్ని సాధించుకోవాలని రిజర్వేషన్‌ సదుపాయం ఉన్న కులాలు అభిలషిస్తున్నాయి.

ప్రజాస్వామిక రాజకీయాలలో దిగువ సామాజిక వర్గాల అభ్యున్నతికి ఒక ప్రధాన ఆలంబన రిజర్వేషన్లు. రిజర్వేషన్ల ద్వారా మాత్రమే అధికారాన్ని సాధించుకోవాలని రిజర్వేషన్‌ సదుపాయం ఉన్న కులాలు అభిలషిస్తున్నాయి. భారత రాజ్యాంగం ఆశించిన విధంగా ప్రత్యామ్నాయ న్యాయరాజకీయాలను అభివృద్ధిపరిచేందుకుగాను ఆ కులాలవారు తమకు తాము విశాల సమాజ అంతర్భాగాలుగా సంఘటితం కావడం లేదు. తత్కారణంగా ఆ సామాజిక సమూహాలు సరైన రాజకీయదృక్పథాన్ని పెంపొందించుకోలేకపోతున్నాయి. రాజకీయదృష్టి లేకుండాపోవడంతో కీలుబొమ్మ రాజకీయవేత్తలుగా మిగిలిపోతున్నాయి. రిజర్వేషన్ల భావన జ్యోతిబా ఫూలే స్ఫూర్తితో ప్రభవించిందని అంటారు. అయితే ఆయన ఎప్పుడూ రిజర్వేషన్లను కోరలేదు.

భారత జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భవించిన సందర్భంలో మహాత్మా ఫూలే కోరిందేమిటి? తన గురువు మహదేవ్‌ గోవింద్ రణడేను ఆయన వ్యతిరేకించారు, కాంగ్రెస్‌ ఆవిర్భావ కారణాలు, దాని లక్ష్యాలను విమర్శించారు. వలసపాలన ప్రవేశపెడుతున్న ఆధునికత బ్రాహ్మణీకరణ అవడాన్ని తొట్టతొలుతనే గుర్తించిన మేధావి ఫూలే. దిగువ నుంచి ప్రజల (శూద్ర, అతి–శూద్ర, గులాం) అనుకూల, ప్రభావిత ఆధునికతను ఆయన ఆశించారు. వలసపాలకులు అమలుపరుస్తున్న ఆధునికీకరణకు ఆ సామాజిక వర్గాలు లబ్ధిదారులు కావాలనేది ఫూలే ఆకాంక్ష. బ్రిటిష్‌ పాలకులు కల్పిస్తున్న ఆధునిక విద్యావకాశాలను వినియోగించుకుని ఆ సామాజికులు పాలనావ్యవస్థలో ఉద్యోగులు కావాలని ఫూలే అభిలషించారు. కాంగ్రెస్‌ భారత్‌ భావనకు ఒక సమాంతర భారతీయ సమాజాన్ని రూపొందించాలనేది ఫూలే ధ్యేయంగా ఉండేది. ఆ అణగారిన సామాజిక వర్గాల భారతదేశాన్ని ఆయన నిరంతరం బ్రిటిష్‌ అధికార వర్గం దృష్టికి తీసుకువెళ్లేవారు. నిజానికి ఆంగ్లేయులు ఆయన నుంచే నిజమైన భారతదేశం గురించి తెలుసుకున్నారు.


కాంగ్రెస్‌ అచిర కాలంలోనే ఒక అఖిల భారత సంస్థగా రూపొందింది. బ్రిటిష్‌ పాలన ఆర్థిక పర్యవసానాల విశ్లేషణ ప్రాతిపదికన తన రాజకీయ వ్యూహాన్ని రూపొందించుకుంది. తొలినాటి కాంగ్రెస్‌ ఆర్థిక జాతీయవాదాన్ని ఎలుగెత్తి చాటింది. ఇది అంతిమంగా భారత జాతీయవాదంగా పరిణమించింది. భారత్‌ను ఒక జాతిగా అభివృద్ధిపరచడమే జాతీయ రాజకీయాల లక్ష్యమని ఆ భావజాలం ప్రకటించింది. అణగారిన వర్గాల వారిని తన జాతీయవాద స్రవంతిలో భాగం చేసుకుంది. ఉదాహరణకు కింది కులాల వారి మతపరమైన హక్కుల– దేవాలయ ప్రవేశం మొదలైనవి– విషయాలలో నారాయణ గురు ఉద్యమ లక్ష్యాలను కాంగ్రెస్‌ తన కార్యక్రమంలో భాగంగా చేసుకున్నది. సమస్త భారతీయులను ఒకే జాతి ప్రజలుగా కాంగ్రెస్‌ సంఘటిత పరుస్తున్నప్పుడు కాంగ్రెస్‌ ఉద్యమాన్ని పెరియార్‌ రామస్వామి సవాల్‌ చేశారు. రాజకీయాలలో బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని కాంగ్రెస్‌ లక్ష్యాలు, కార్యక్రమాలు కాపాడతాయని విమర్శించారు. మూలవాసులయిన ద్రావిడులు ఎల్లప్పటికీ అప్రధానంగా ఉండిపోతారని ఆయన భావించారు. ఈ కారణంగా బ్రాహ్మణుల ఆధిపత్యం నుంచి బయటపడేందుకు దిగువ కులాలకు ప్రాధాన్యముండే ద్రావిడోద్యమాన్ని ఆయన నిర్మించారు.

ఈ భిన్న భావజాలాల ఘర్షణ నేపథ్యంలో భారతీయులు అంతా ఒకే జాతి అన్న జాగృతిని అడ్డుకునేందుకు బ్రిటిష్‌ పాలకులు తొలుత నిర్దిష్ట మతవర్గాలకు రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. భారత్‌లో తమ ఆధిత్యాన్ని సుస్థిరపరచుకోవడానికి తమకు పూర్వం దేశ పాలకులుగా ఉన్న ముస్లింలకు 1909 చట్టం ద్వారా చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించారు. 1857 తిరుగుబాటు అనంతరం తాము అధికారాన్ని కోల్పోయామనే భావన ముస్లింలలో తీవ్రంగా ఉండేది. తదనంతరం సిక్కులు, ఆంగ్లో ఇండియన్లు, ఆ తరువాత భూస్వాములు, సంస్థానాధీశుల కుటుంబాల వారికి కూడా రిజర్వేషన్లు కల్పించారు.


పూలే ఆలోచనా క్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోయే రీతిలో భారత చరిత్రను నిర్మించేందుకు అంబేడ్కర్‌ తొలుత కృషి చేశారు. అదే సమయంలో ఆయన జాతీయవాదులతో ఎడతెగని రాజకీయ, సైద్ధాంతిక పోరాటాలు కూడా చేశారు. భారతీయ సమాజం ప్రధానంగా కులాల సమాజమని, అట్టడుగు కులాలవారు తమ ప్రాథమిక అవసరాలను కూడా తీర్చుకోలేని విధంగా అణచివేయబడ్డారనేది అంబేడ్కర్‌ వాదన. 1920వ దశకంలో కాంగ్రెస్‌ పూర్తిగా గాంధీ అధిపత్యంలోకి వెళ్లిన తరువాత అణగారిన వర్గాల అభ్యున్నతికై ఆయన రిజర్వేషన్ల మార్గాన్ని అనుసరించారు. ఆ విధంగా కుల రిజర్వేషన్ల భావనకు ఆయనే ఆద్యుడు. సమాజంలోని దిగువ స్థాయి సామాజిక వర్గాల అభివృద్ధి రిజర్వేషన్ల లక్ష్యంగా ఉండాలని ఆయన ఆశించారు. అణగారిన వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించాలన్న అంబేడ్కర్‌ డిమండ్‌ జాతీయవాద రాజకీయాలకు సవాల్‌గా పరిణమించింది. అంబేడ్కర్‌ అప్పటివరకు కులాల ప్రత్యామ్నాయ చరిత్రను, పర్యవసాన ఘర్షణలను భారతదేశ చరిత్రగా నిర్మించేందుకు కృషి చేశారు. రిజర్వేషన్ల అంశాన్ని ఆయన కాంగ్రెస్‌ వ్యతిరేక రాజకీయాలుగా మార్చారు. కులపరమైన రిజర్వేషన్లే ప్రాదేశిక రిజర్వేషన్లకు ప్రధానకారణం. రాజ్యాంగ సభలో ఆయన సభ్యుడు కావడంతో రిజర్వేషన్ల అంశానికి ఎనలేని ప్రాధాన్యం లభించింది. రాజ్యాంగ నిర్మాతలు అందరూ ఆ అంశానికి ప్రాధాన్యమిచ్చారు. దీంతో రిజర్వేషన్ల సాధన అణగారిన సామాజిక వర్గాల ప్రధాన లక్ష్యమయింది.

ప్రభుత్వంలో అప్రధాన పౌరులుగా భాగమయ్యేందుకు దిగువ కులాలవారికి రిజర్వేషన్లు ప్రేరణ అయ్యాయి. అవి కీలుబొమ్మ రాజకీయవేత్తలను మాత్రమే సృష్టించాయి. స్వాతంత్ర్యానంతరం అణగారిన కుల సమూహాలు రాజకీయ దృష్టిని కోల్పోయాయి. తమ సమస్యలు అన్నిటికీ రిజర్వేషన్లే సమగ్ర పరిష్కారమనే భావన వారిలో నెలకొన్నది. రిజర్వేషన్ల ఉద్యమం దిగువ స్థాయి కులాలవారిని విధేయ సమూహాలుగా మార్చివేశాయి. ఈ పరిణామాన్ని అంబేడ్కర్‌ 1955లోనే గుర్తించారు. ఫూలే, పెరియార్‌ ఆశించిన ప్రత్యామ్నాయ జాతీయవాదాన్ని పెంపొందించడానికి కీలుబొమ్మ రాజకీయవేత్తలు కృషిచేయలేదు. రిజర్వుడు కులాల నాయకులు ప్రాబల్య కులాల అధికార రాజకీయాలలో భాగమయ్యారు. నిజమైన ప్రజల ప్రజాస్వామ్యం ఆవిర్భావాన్ని వ్యవస్థాపిత ప్రజాస్వామ్యం అడ్డుకున్నది. పర్యవసానంగా ప్రాబల్య కులాలే అధికారాన్ని స్వాయత్తం చేసుకున్నాయి. గత 70 ఏళ్లుగా సమాజంలో ఆర్థిక అసమానతలు బాగా పెరిగిపోయాయి. స్వాతంత్ర్య సాధకులు, రిపబ్లిక్‌ నిర్మాతలు ఆశించిన మార్పును మన ప్రజాస్వామ్యం తీసుకురాలేదు. ప్రజల ప్రజాస్వామ్యాన్ని నిర్మించేందుకు దోహదం చేసే ప్రత్యామ్నాయ రాజకీయాలను రిజర్వేషన్‌వాదులు అభివృద్ధిపరచలేదు.


ఆ వైఫల్యమే మతరాజకీయాలను తీసుకువచ్చింది. ఆ సంకుచిత రాజకీయాలు హైందవీకరణ అయ్యాయి. అసమానతలను స్థిరపరిచాయి. అవి సహజ సిద్ధాలన్న భావనను ప్రజల మనస్సుల్లో పాదుకొల్పాయి. రాజ్యాంగంలో పొందుపరిచిన సామాజిక న్యాయం అన్న ఆదర్శం ప్రాతిపదికన ప్రజాస్వామ్యం మనాలని 21వ శతాబ్ది రాజకీయాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కుల అంతరాలు, ఆర్థిక అసమానతలు మొదలైన సమస్యల పరిష్కారానికి ఆ మహోన్నత లక్ష్య ప్రేరిత రాజకీయాలు తప్పనిసరి. రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన కొత్త ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేందుకు రాజకీయ అధికారాన్ని, పాలనను ప్రజాస్వామ్యీకరించాల్సి ఉన్నది.

స్వాతంత్ర్య సాధకులు, రిపబ్లిక్‌ నిర్మాతలు ఆశించిన మార్పును మన ప్రజాస్వామ్యం తీసుకురాలేదు. ప్రజల ప్రజాస్వామ్యాన్ని నిర్మించేందుకు దోహదం చేసే ప్రత్యామ్నాయ రాజకీయాలను రిజర్వేషన్‌ వాదులు అభివృద్ధిపరచలేదు.

l ఇనుకొండ తిరుమలి

చరిత్రకారుడు

Updated Date - Sep 03 , 2024 | 05:03 AM

Advertising
Advertising