ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సాయిబాబా

ABN, Publish Date - Oct 15 , 2024 | 12:31 AM

జి.ఎన్. సాయిబాబా హఠాన్మరణం దేశంలోని ప్రజాస్వామికవాదులందరినీ విషాదంలో, విచారంలో ముంచెత్తింది. దాదాపు పదేళ్ల జైలు జీవితంలో, తన నిర్బంధాన్ని, దేశంలోని హక్కుల అణచివేతను...

జి.ఎన్. సాయిబాబా హఠాన్మరణం దేశంలోని ప్రజాస్వామికవాదులందరినీ విషాదంలో, విచారంలో ముంచెత్తింది. దాదాపు పదేళ్ల జైలు జీవితంలో, తన నిర్బంధాన్ని, దేశంలోని హక్కుల అణచివేతను నిర్విరామంగా వ్యతిరేకిస్తూ, స్వేచ్ఛ కోసం పోరాడిన సాయిబాబా, నిర్దోషిగా విడుదలైన ఏడునెలలకే, ఆ స్వేచ్ఛను కనీసంగా కూడా అనుభవించకముందే కన్నుమూయడం పెద్ద విషాదం. ఈ మరణం కేవలం ఆకస్మికమో, అనారోగ్య ఫలితమో కాదని నిస్సందేహంగా తెలిసిపోతున్నప్పుడు, ఇంతటి కర్కశత్వాన్ని, క్రూరచట్టాలను ప్రయోగించే ప్రభుత్వాల ముందు నిస్సహాయంగా, బాధితంగా మాత్రమే భారత సమాజం మిగిలిపోవడం, మానవీయత నానాటికి కొత్త పతనాలకు చేరుకోవడం అందరినీ ఆవరిస్తున్న పెను విచారం.

కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ 2 ప్రభుత్వం అవసాన కాలంలోనే సాయిబాబాపై మొదలైన వేధింపులు, బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తీవ్రమయ్యాయి. ప్రజాస్వామిక, ఉదారవాద, వామపక్ష, పర్యావరణ వాద తదితర పౌరసమాజ శక్తులన్నిటినీ అశక్తులను చేయడం, వారి నైతిక బలాన్ని దెబ్బతీయడం, వారిని దేశవ్యతిరేక శ్రేణులుగా పరిగణించడం, వంటి ప్రణాళికను అనుసరించిన నరేంద్రమోదీ ప్రభుత్వం, వాటి అమలులో అనుసరించిన నిర్దాక్షిణ్యవైఖరికి సహజ ప్రతిక్రియగా రూపొందిన ప్రతిఘటనా ప్రతీక సాయిబాబా.


మత భావోద్వేగాలతో సమాజాన్ని మైమరిపింపజేయగలిగినప్పుడు, రాజకీయ విధాన నిర్ణయాలకు ఏ నైతిక సమర్థనలూ అవసరం లేదన్న బలాదూర్ ధోరణి పాలకులలో ఏర్పడుతుంది. పదేళ్లుగా, పాలకశ్రేణుల్లోని రాజకీయ ప్రత్యర్థుల మీద, ప్రజా ఉద్యమాల నాయకుల మీద, కార్యకర్తల మీద అనుసరిస్తున్న నిర్బంధ విధానాలు కనీస రాజ్యాంగ ప్రాతిపదికలను కూడా ఖాతరు చేయని స్థితి చూశాము. సాయిబాబా కేసు తరువాత, బీమా కోరేగావ్ కుట్ర కేసు.


అధ్యాపకుడు, అట్టడుగు వర్గాల కోసం ఆలోచించి, ఆచరించే బుద్ధిజీవి, సుదీర్ఘంగా ప్రజా ఉద్యమాల అనుభవశాలి అయిన సాయిబాబాను ‘ఊపా’ కింద, ఇంకా అనేక చట్టాల కింద అభియోగాలను మోపి, యావజ్జీవ శిక్ష విధింపజేసి నాగపూర్ జైల్‌లో నిర్బంధించారు. విచారణ కాలంలో బెయిల్ ఇవ్వలేదు. నిర్బంధ కాలంలో సరైన వైద్య సహాయం అందించలేదు. 90 శాతం వైకల్యం ఉన్న సాయిబాబాకు నేర పరిశోధన, న్యాయ పాలన రంగాలు చేసిన అన్యాయంతో పాటు, కారాగార అధికారుల నియమోల్లంఘన, నిరాదరణ వల్ల ఆరోగ్యం శిథిలమవుతూ వచ్చింది. ఆయన సహచరి వసంత నిరంతరం జైలులో సాయిబాబా స్థితిగతులను బయటి ప్రపంచానికి నివేదిస్తూ వచ్చారు. చిన్నపాటి కనీస వసతికి కూడా విజ్ఞప్తులు, సంతకాల సేకరణలు కావలసి వచ్చేది. ప్రభుత్వ విధానంలో ముఖ్యమైనది స్పందనారాహిత్యం. కోవిడ్ వచ్చినప్పుడూ, ఇతర ఆరోగ్య సమస్యల కాలంలోనూ ఆస్పత్రికి తరలించడానికి కూడా అంగీకరించని కాఠిన్యం అధికారులది. అతని నిర్బంధం విషయంలో ప్రభుత్వం పట్టింపుకు అతి దారుణమైన ఉదాహరణ, తల్లి మరణించినప్పుడు పెరోల్ అనుమతించకపోవడం, కనీసంగా వీడియో చూపులకు కూడా ఒప్పుకోకపోవడం.

బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయడంలో, వారికి పెరోళ్లు ఇవ్వడంలో అత్యుత్సాహం చూపిన ప్రభుత్వం, సాయిబాబా జైలు దాటకుండా చేయడానికి మాత్రం, చరిత్రలో మునుపెన్నడూ వినని ఆత్రుత చూపింది. 2022లో బొంబాయి హైకోర్టు మొదటిసారి, నేరాభియోగం సరైన పద్ధతులలో జరగలేదన్న కారణాలతో కేసును కొట్టివేసినప్పుడు, సాయిబాబాను విడుదల కాకుండా చూడడానికి రాత్రికి రాత్రి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. మరుసటి రోజు పొద్దునే కేసు వినేట్టు చేసుకోవడం, నిర్దోషిత్వ తీర్పు మీద స్టే తెచ్చుకోవడం ఆశ్చర్యకరమైన రీతిలో జరిగిపోయాయి. ఎందుకు ఆయన నిర్బంధం మీద అంతటి పట్టుదల? అప్పటికి సాయిబాబా నిర్బంధాన్ని పొడిగించగలిగారు కానీ, ప్రజల దృష్టికి ప్రభుత్వ కార్పణ్యం ప్రస్ఫుటమయింది! జైలులో స్టాన్ స్వామి మరణం, పాలకులకు ఏ తృప్తి కలిగించిందో కానీ, వ్యవస్థ క్రౌర్యం మీద ప్రజలకు ఏవగింపే కలిగించి ఉంటుంది కదా? తెలుగు విప్లవకవి వరవరరావును అనారోగ్యంలో ఎంతటి ఇబ్బంది పెట్టారు? బెయిల్‌ను కూడా ఆంక్షలతో బంధించి బొంబాయి దాటి కదలకుండా చేశారు! ప్రభుత్వాలపై ప్రజాస్వామికమైన ఒత్తిడి తేవడానికి, ప్రజలలో విమర్శనాత్మక చైతన్యం కలిగించడానికి, ప్రత్యామ్నాయ వ్యవస్థలను రూపొందించడానికి చిత్తశుద్ధితో, అంకితభావంతో జరిగే ప్రయత్నాలను దెబ్బతీయడం కోసమే కాకపోతే, ఈ నిర్బంధ విధానాలకు అర్థం ఏమిటి? ప్రజలను చైతన్యపరుస్తారన్నది మినహాయిస్తే, ఈ ప్రజాకార్యకర్తలు రాజ్యం మీద యుద్ధమో, అందుకు కుట్రనో చేస్తున్నారన్నది ఏ రకంగా వాస్తవం? నిర్దోషిగా న్యాయస్థానం అంగీకరించడానికి ముందు పదేళ్ల యాతన కొనసాగింపే సాయిబాబా మరణం. ప్రజాస్వామ్యం నాలుగు స్తంభాలూ ఈ అన్యాయంలో భాగస్వాములే.


కఠినచట్టాలు, జాతీయ ఏజెన్సీలు, వినయవిధేయ న్యాయస్థానాలు, ఎంతగా నిరంకుశత్వానికి వేదికలయినా, ఆ ప్రయత్నాలన్నీ నైతికంగా నిస్సారమైనవి. దీర్ఘకాలం జైళ్లలో మగ్గినా, వారి నిర్బంధం వల్ల బంధుమిత్రులూ, సమాజమూ ఎన్ని అష్టకష్టాలు పడినా ప్రజాకార్యకర్తలే నైతికంగా బలశాలురుగా నిలబడతారనడానికి సాయిబాబా ఒక ఉదాహరణ. నిర్బంధంలో ఆయన గొప్ప కవిగా గొంతు సవరించుకున్నారు. కబీరులో తాత్వికప్రతిబింబాన్ని చూసుకున్నారు. తనతో, సమాజంతో కొత్త సంభాషణ మొదలుపెట్టారు. తీక్షణమైన చూపులు, మొహం మీద స్థిరపడిన సన్నటి నవ్వు, ఎక్కడా దైన్యం కనబడని కవళికలు, పరిమితిగాకాక, తన శరీరంలో ఒక భాగంగా ఒదిగిపోయిన వీల్ చెయిర్, సాయిబాబా మీద ఆరాధనతో కూడిన గౌరవాన్ని కలిగిస్తాయి. తీవ్రమైన హింసను, వేదనను తట్టుకోగలిన సహిష్ణుత, అదే సమయంలో సడలింపు లేని వ్యక్తిత్వం, ఈ రెండూ కలిసి, ఆయనను ఒక మహాబలశాలి అయిన ప్రతీకను చేశాయి. నైతిక ఆధిక్యం భారతీయ సమాజంలో తిరుగులేని రాజకీయ ఆయుధమని చరిత్ర చెబుతుంది.

సాయిబాబా భారతీయ ఉద్యమాల చరిత్రలో ఒక అధ్యయన అంశంగా నిలిచిపోతారు. భవిష్యత్ కార్యాచరణలకు ప్రేరణగా కొనసాగుతారు. ఆయన ఒక్కరు కాదు. ఒక ప్రత్యేక కాలంలో, సామాజిక, సాంస్కృతిక జాతీయవాదాలు, భావోద్వేగాలు ప్రగతిశీల చైతన్యాన్ని వెనుకపట్టు పడవేసినప్పుడు, ప్రజాస్వామ్యమన్న మాటే అపచారంగా మారుతున్నప్పుడు, సమాజానికి అంతటికీ హెచ్చరికలవలె సాగిన నిర్బంధాల బాధితులందరికీ సాయిబాబా ఒక పర్యాయపదం, సర్వనామం.

Updated Date - Oct 15 , 2024 | 12:31 AM