కోటా తీర్పును తక్షణమే సమీక్షించాలి
ABN, Publish Date - Aug 17 , 2024 | 05:32 AM
భారత స్వాతంత్రోద్యమానికి సమాంతరంగా డాక్టర్ అంబేడ్కర్ నిర్వహించిన సామాజికోద్యమ ఫలితంగా వచ్చిన ఎస్సీ రిజర్వేషన్లు ఇప్పుడు అంతర్గత వివాదంలో చిక్కుకున్నాయి. రాజ్యాంగ మౌలికస్వరూపాన్ని మార్చకూడదన్న 1973 కేశవానంద భారతి కేసు తీర్పులో రాజ్యసంక్షేమం కూడా
భారత స్వాతంత్రోద్యమానికి సమాంతరంగా డాక్టర్ అంబేడ్కర్ నిర్వహించిన సామాజికోద్యమ ఫలితంగా వచ్చిన ఎస్సీ రిజర్వేషన్లు ఇప్పుడు అంతర్గత వివాదంలో చిక్కుకున్నాయి. రాజ్యాంగ మౌలికస్వరూపాన్ని మార్చకూడదన్న 1973 కేశవానంద భారతి కేసు తీర్పులో రాజ్యసంక్షేమం కూడా ఒక ప్రధాన అంశం. ఈ సందర్భంలో వర్గీకరణ పేరిట ఏబీసీడీ అనే అడ్డకోతకు, క్రిమీలేయర్ అనే నిలువుకోతకు గురి చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడాన్ని వీరంతా నిరసిస్తున్నారు. చరిత్రాత్మక రిజర్వేషన్లను సంక్షేమ పథకాల్లా పరిగణించడం రాజ్యాంగ స్ఫూర్తిని అవమానించడమేనని అంబేద్కరీయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ విదేశాల్లో ఏ భారతీయుడు సాధించనన్ని డిగ్రీలు సాధించిన అంబేడ్కర్‌ని ఆయన మరణం వరకు అంటరానితనం వెంటాడిన సంగతిని గుర్తు చేస్తున్నారు. రాజ్యాంగ రచనాసంఘం అధ్యక్షుడైన అంబేడ్కర్‌ని ఇప్పటికీ జాతినేతగా కాకుండా దళితనేతగా వివక్ష చూపడాన్ని ఖండిస్తున్నారు. జాతీయ కాంగ్రెస్ రాజకీయాల నుంచి ఉపప్రధానిగా ఎదిగిన బాబూజగజ్జీవన్‌రామ్ కూడా కులవివక్ష ఎదుర్కొన్న విషయాన్ని ఆయన కుమార్తె, మాజీ లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ బహిరంగంగా అనేక సమావేశాల్లో ప్రకటించారు.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఎన్నికల ముందుగానే ఎన్డీఏ మద్దతు ప్రకటించింది. అధికారం చేజిక్కిన రెండు నెలల్లోనే ఈ తీర్పు వెలువడటం రిజర్వేషన్ల స్ఫూర్తిని రాజకీయంగా మంటగలపడమేననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిజర్వేషన్ల మీద నిర్ణయం తీసుకునే హక్కు ఒక్క భారత పార్లమెంటుకే వుందని గతంలో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును గుర్తు చేసుకుంటున్నారు. అధికారంలో వున్న రాజకీయపార్టీల ఎజెండాలకు అనుగుణంగా తీర్పులు వెలువడటాన్ని నిరసిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు కేవలం వర్గీకరణ చేయడానికి రాష్ట్రాలకు అధికారాన్ని ఇచ్చిన సంగతిని మరచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఆర్డినెన్స్ తీసుకొస్తామని, ఇప్పటివరకు వచ్చిన ఉద్యోగప్రకటనల్లో కూడా అమలు చేస్తామని అసెంబ్లీలోనే ఆడంబరంగా ప్రకటించారు. ఇంకా జరగాల్సిన రాజ్యాంగ ప్రక్రియ చాలానే వుంది. అయినా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కంగారు పడటం తెలంగాణ మాదిగేతర అంబేడ్కరీయ సంఘాలు ఖండించాయి. వర్గీకరణ విషయంలో అందరూ ఆలోచనతో అడుగులు వేసి అంబేడ్కర్ సామాజిక ఉద్యమాన్ని కాపాడవలసి వుందని జాతీయస్థాయి నాయకుల్లో కదలిక వచ్చింది.
సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తితో సహా ఈ కేసును పరిశీలించిన ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో జస్టిస్ బేలా త్రివేది వర్గీకరణ తీర్పు మీద అసమ్మతి తెలియజేశారు. 341 అధికరణ మీద మిగతా ఆరుగురు న్యాయమూర్తుల వివరణ సరికాదన్నారు. 2004లో ఈవీ చిన్నయ్యకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య నడిచిన కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఎస్సీ రిజర్వేషన్ల స్వరూపాన్ని మార్చడానికి పార్లమెంటుకు మాత్రమే హక్కుందని తెలియజేసిన సంగతిని గుర్తు చేశారు. ఈ వర్గీకరణను అనుమతించే తీర్పు సమయంలోనే, మరో ప్రమాదాన్ని కూడా ఎస్సీ వర్గాలకు ఉద్దేశించిన రిజర్వేషన్ ప్రయోజనాల నుంచి ‘క్రీమీలేయర్’ని మినహాయించాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. ఈ తీర్పులో జస్టిస్ బీఆర్ గవాయ్ ఈ అభిప్రాయాన్ని చాలా బలంగా చెప్పారు. మండల్ కమిషన్ సిఫార్సులతో వచ్చిన ఓబీసీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ ఇప్పటికే అమల్లో వుంది. ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటుపరం అయిపోతున్న నేపథ్యంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరిగి ప్రయోజనం ఏమిటని దళిత సామాజికవేత్తలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. పదోన్నతుల్లో రిజర్వేషన్లు మీద నిరంతరం ప్రభుత్వాల అభిప్రాయాలు మారిపోతున్నాయి. ఇంతవరకు ఎస్సీలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సుస్థిర స్థానం దక్కనేలేదు. ఈ విషయాన్ని ప్రశ్నిస్తున్నవారి మీద నలువైపుల నుంచి దాడులు జరుగుతూనే వున్నాయి. అంతేగాక ఎస్సీ కులాల నుంచి రాజ్యాధికారానికి పోటీ పడుతున్న ఉపకులాలను అణచివేయడానికి వర్గీకరణను ఒక ఆయుధంగా పాలకపక్షాలు గట్టిగా పట్టుకున్నాయి. ఈ పరిశీలన నుంచే దళిత నాయకులు వర్గీకరణ మీద తీర్పును కుట్రగా భావించవలసి వచ్చింది.
ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు తీర్పును దళితుల రాజ్యాధికార పయనం మీద జరుగుతున్న కుట్రగా దళితనేతలు పేర్కొంటున్నారు. అందుకే ఈ తీర్పును సమీక్షించవలసి వుందంటున్నారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ మాలమహాసభ నాయకుడు మల్లెల వెంకటరావు (35466/2024) సుప్రీంకోర్టులో సమీక్ష కోసం కేసు నమోదు చేశారు. మిగతా సంఘాలు ఇప్పటికే సమీక్ష కోసం పిటీషన్లు వేశారు. అంటరానితనం దాని స్వభావం ఇప్పటికీ భారతదేశంలో ప్రబలంగా ఉందని నేషనల్ క్రైమ్ రికార్డ్‌్స బ్యూరో గణాంకాలు చెప్తున్నాయి. ఆధిపత్య కులాలు అంటరానితనం, సామాజిక, సాంస్కృతిక, మత, రాజకీయ, ఆర్థిక రంగాలలో వివక్ష కొనసాగిస్తున్నాయి. ఈ రంగాలలో సమాన భాగస్వామ్యం సాధించడానికి ప్రయత్నించినప్పుడల్లా ఆ వర్గం భౌతికంగాను, ఇతర మార్గాల్లో హింసకు గురిచేస్తున్నారని మాజీ యూజీసీ ఛైర్మన్ ప్రొఫెసర్ సుఖ్‌దేవ్ థోరట్ ఆధారాలతో పాటు ఇప్పటికే ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదిక సమర్పించారు. అంటరానితనం, వివక్ష, దౌర్జన్యాలు విస్తృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో రిజర్వేషన్ల వర్గీకరణతో మాత్రమే సామాజిక న్యాయం ముడిపడివుందనే న్యాయమూర్తుల అభిప్రాయాల్ని మెజారిటీ దళిత ప్రజానీకం విశ్వసించడం లేదు. ఒక్క ఉపకులమే మొత్తం అవకాశాల్ని లాగేసుకుందనే నిందలు సరికాదంటున్నారు. వీటిలో నిజమెంతుందో తేల్చేందుకు తగిన గణనతో పాటు సామాజిక స్థితిగతుల అధ్యయనాన్ని చేపట్టాల్సిన అవసరం వుంది. ఇలాంటి సందర్భాలకు తగినట్టు న్యాయమూర్తుల వ్యాఖ్యానాల్లో నిజమెంతుందో సమీక్ష జరగాలి. వర్గీకరణను రాజకీయంగా ఎన్నికల అస్త్రంగా వాడుకున్న ప్రభుత్వం పారదర్శక గణాంకాలతో సహా న్యాయస్థానాల ముందు ఉంచవలసి ఉంటుంది. ఇవన్నీ జరగకుండా గతంలో కేంద్రప్రభుత్వం వేసిన ఉషామెహ్రా కమిషన్ ఆధారంగానో లేక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఆధారంగానో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోను తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం అంగీకరించడం సాధ్యం కాదు. రాష్ట్రాల వర్గీకరణ ప్రక్రియలో ప్రతి చిన్న విషయం న్యాయస్థానాల మెట్లు ఎక్కితీరుతుంది. చివరికి ఎస్సీ రిజర్వేషన్లు అంతర్గత వివాదాల్లో కూరుకుపోయే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు మీద ఖచ్చితమైన సమీక్షను యావత్ దేశ ఎస్సీ ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారు.
డాక్టర్ జీకేడీ ప్రసాద్
Updated Date - Aug 17 , 2024 | 05:32 AM