ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కాల్పులు – ప్రశ్నలు

ABN, Publish Date - Dec 05 , 2024 | 04:52 AM

స్వర్ణదేవాలయ ప్రాంగణంలో పంజాబ్‌ మాజీ ఉపముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ పైన జరిగిన హత్యాయత్నం దేశాన్ని నివ్వెరపరిచింది. ఘటనతో పాటు ఆ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి పుట్టుపూర్వోత్తరాలు కూడా నిర్ఘాంతపరుస్తున్నాయి....

స్వర్ణదేవాలయ ప్రాంగణంలో పంజాబ్‌ మాజీ ఉపముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ పైన జరిగిన హత్యాయత్నం దేశాన్ని నివ్వెరపరిచింది. ఘటనతో పాటు ఆ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి పుట్టుపూర్వోత్తరాలు కూడా నిర్ఘాంతపరుస్తున్నాయి. 2007–17 మధ్యకాలంలో శిరోమణీ అకాలీదళ్‌ నేతలు చేసిన పాపాలకు సిక్కుల అత్యున్నత మతపీఠం అకాల్‌తఖ్త్‌ సాహెబ్‌ శిక్షలు విధించిన సంగతి తెలిసిందే. అప్పట్లో అధికారాలు వెలగబెట్టినవారంతా ఇప్పుడు శిక్షలో భాగంగా స్వర్ణదేవాలయ ప్రాంగణంలో గిన్నెలు తోమడం, కంచాలు కడగడం, మూత్రశాలలు శుభ్రపరచడం వంటి సేవలు అందించి పాపప్రక్షాళన చేసుకుంటున్నారు. మతద్రోహానికీ, దుష్ప్రవర్తనకు పాల్పడిన దోషి (తంఖయ)గా ఆగస్టులోనే ఆకాల్‌తఖ్త్‌ ముద్రను పొంది, ఇప్పుడు శిక్షలు ఖరారైన సుఖ్‌బీర్‌సైతం ఇదేవిధమైన సేవలు అందించాల్సి ఉండగా, వార్థక్యం, వైకల్యం దృష్ట్యా ఆయనకు కొన్ని మినహాయింపులు దక్కాయి. నేను పాపిని, క్షమించండి అన్న బోర్డు ఒకటి మెడలో వేసుకొని, కట్టుకట్టిన కాలుని చాపుకొని, సేవాదార్‌గా స్వర్ణదేవాలయం ముందు వీల్‌చైర్లో వాలుగా కూచున్న ఈ ఆరుపదుల వృద్ధుడిని చూసి ఎంతమంది పంజాబీలు జాలిపడ్డారో తెలియదుకానీ, ఈ హత్యాయత్నం ఘటన మాత్రం ఆయనకూ, ఆయన పార్టీకీ రాజకీయంగా మేలుచేస్తుందని విశ్లేషకుల నమ్మకం.


పంజాబ్‌మీద దాదాపు నాలుగుదశాబ్దాలు సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన బాదల్‌ కుటుంబాన్ని మీడియా ఒకదశలో ఫస్ట్‌ఫ్యామిలీ ఆఫ్‌ పంజాబ్‌ అని ప్రస్తావించిన విషయం, పంజాబ్‌ను ఖలిస్తాన్‌ ఉద్యమం ఊపేస్తున్న కాలంలో ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ విశేష భూమిక తెలియనివేమీ కావు. పార్టీని, రాష్ట్రాన్ని కుమారుడికి తదనంతరం అందించేందుకు సీనియర్‌ బాదల్‌ చాలామంది సీనియర్లను తెలివిగా బయటకు నెట్టేశారు. కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ కాంగ్రెస్‌లో చేరి ఆ తరువాత బదులు తీర్చుకున్నారు కూడా. బీజేపీతో పొత్తుపెట్టుకొని, 2007, 2012 ఎన్నికలను వరుసగా నెగ్గుకొచ్చి, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కీలకపదవులు అందుకున్న పార్టీ ఆ తరువాత క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోయింది. కుటుంబం మీద వచ్చిన అవినీతి ఆరోపణలు, వ్యవసాయ సంక్షోభాలు, యువతను ముంచేసిన మాదకద్రవ్యాల వినియోగం ఇత్యాదివి ఆ పార్టీని, కుటుంబాన్ని ప్రజలకు దూరం చేశాయి. మరీముఖ్యంగా, ఇప్పుడు వీరంతా శిక్షలు అనుభవిస్తున్న మతవిద్రోహం ఘటనలన్నీ ఒక్కటొక్కటిగా మెడకు చుట్టుకున్నాయి. 2012లో సుఖ్‌బీర్‌ నేతృత్వంలో రెండోసారి కూడా అధికారంలోకి రాగలిగిన శిరోమణీ అకాలీదళ్‌ మరుసటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ దెబ్బకు కుప్పకూలిపోయింది. పార్టీ బలహీనంగా ఉన్న ఆ తరుణంలో, మూడువ్యవసాయ చట్టాలు తెచ్చి బీజేపీ తన మిత్రపక్షంమీద మరింతగా కోలుకోలేనంత దెబ్బకొట్టింది. కాంగ్రెస్‌నుంచి అధికారం కొత్తగా ఎన్నికలక్షేత్రంలోకి ప్రవేశించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ చేతుల్లోకి వెళ్ళిపోవడంతో సుఖ్‌బీర్‌ సింగ్‌ పార్టీ గతనెలలో జరిగిన ఉపఎన్నికల్లో నాలుగు అసెంబ్లీ స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టలేనిస్థితికి జారుకుంది. మొన్నటి సార్వత్రక ఎన్నికల్లో సుఖ్‌బీర్‌ భార్య తప్ప మరెవ్వరూ ఆ పార్టీనుంచి గెలవలేదు.


ఈ నేపథ్యంలోనే, జూలైలో అసమ్మతివర్గం సుఖ్‌బీర్‌ పాపాల చిట్టాను అకాల్‌తఖ్త్‌కు అందించి, పార్టీ ప్రక్షాళనకు ఆదేశించాల్సిందిగా కోరినట్టు వార్తలు వచ్చాయి. శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ (ఎస్జీపీసీ)లో అకాలీదళ్‌ ఆధిపత్యం ఉన్నందున, బాదల్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడానికి అకాల్‌తఖ్త్‌ వెనకడగువేస్తున్నదన్న విమర్శ ఎప్పటినుంచో ఉన్నది. ఇప్పుడు సుఖ్‌బీర్‌ సహా మరికొందరికి శిక్షలు వేయడం, పార్టీని ప్రక్షాళించమంటూ కొన్ని చర్యలు నిర్దేశించడం పార్టీకే కాక, ఆయనకు కూడా మేలు చేస్తుందని విశ్లేషకుల అభిప్రాయం. పంజాబ్‌, పంజాబీలు, పంజాబియత్‌ కోసం నిలబడిన పార్టీగా అకాలీదళ్‌ను పునరుద్ధరించుకోవడానికి సుఖ్‌బీర్‌కు ఇది అవకాశం ఇస్తుందని, ఎంతచీలినా, ఎందరు పోయినా ఆయన స్థాయి వారెవ్వరూ లేరని అంటారు. అకాల్‌తఖ్త్‌ముందు శిరస్సు వంచి, అన్ని తప్పులనూ అంగీకరించి, వేసిన శిక్షలన్నీ అనుభవించి, గురుద్వారా ద్వారాలముందు కావలికాస్తున్న ఆ దృశ్యం ప్రజల ఆగ్రహాన్ని ఉపశమింపచేయవచ్చు. బబ్బర్‌ఖల్సాకు చెందిన ఒక మాజీ మిలిటెంట్‌ ఏకంగా ఆయనపై హత్యాయత్నానికి ఒడిగట్టడం దీనికి అదనంగా పనిచేయవచ్చు. రాష్ట్ర ప్రజలు పార్టీని తిరిగి ఆదరిస్తారా లేదా అన్నది అటుంచితే, సుఖ్‌బీర్‌ నాయకత్వాన్ని పార్టీలో ఎందరు కోరుతున్నారో ముందుగానే సంస్థాగత ఎన్నికల్లో తేలిపోతుంది.

Updated Date - Dec 05 , 2024 | 04:52 AM